telugudanam.com

      telugudanam.com

   

నిరంతర దైవచింతన

జైన శాస్త్రములో ఒక చక్కనిగాధ కలదు. పూర్వము శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరము పట్టాభిషేకము పూర్తి ఆయినపిదప ఆనందముగా రాజ్యమును పరిపాలించుచుండెను. యుద్దమున శ్రీరామునకు సాయమొనర్చిన పలువురు ఆ సమయమున శ్రీ రామచంద్రుని సమీపించి "మహాత్మా యుద్దకాలమున మేము తమకు ఆనేక విధముల తోడ్పడి తమ సేవలొ పాలుపంచుకొంటిమి. మహత్తర పుణ్యమును తద్వారా మేము సముపార్జించుకొనగలిగితిమి. అయితే శాంతి కాలమున కూడ తమ సేవా భాగ్యమును బడస ధన్యులము కాగోరుచున్నము. కావున అట్టి అవకాశమును మాకు దయచేయు ప్రార్ధన, తమకున్న పనులలో కొన్నిటినైన మాకు అప్పగించుడు. మేము వానిని చక్కగ నిర్వహించి పుణ్యభాగులము కాగలము".

ప్రజలు ఆ వాక్యములను వినగానే రామచంద్రుడు కరుణాపూరిత హృదయాంతరంగుడై తక్షణమే మంత్రివర్యుని పిలిపించి "అమాత్యశేఖరా ! నాకున్న పనులన్నిటిని వరుసగా వ్రాసిపెట్టి ఈ వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒసంగివేయుడు. వారు వానిని నిర్వహింప కుతూహలురై ఉన్నారు అనెను. వెంటనే మంత్రి లోనికేగి రామచంద్రునకు సంబంధించిన పనులన్నిటి పట్టిక తయారుచేసి బయట ఉత్సుకతతో నిరీక్షించుచున్న భక్తావళికి ఆయా పనులను అప్పగించివేసెను. రామచంద్రుని గృహమునకు శుభ్రపఱచుపని ఒకరికి, వారికి ఆసనము వేయుపని ఒకరికి, వారికి విసరునట్టిపని ఒకరికి ఈ ప్రకారముగా అందఱికి ఒక్కొక్క పని పంచివేసెను. వారు ఆయా పనులను చేస్తూ తమ జన్మ ధన్యమైనదని భావించుచుండిరి.

అందరికిని పనులు పంచిపెట్టుట పూర్తికాగానే అచ్చోటికి పరుగెత్తుకోని ఒక వ్యక్తి ఏతెంచెను. అతడే ఆంజనేయుడు. అతడు శ్రీరామచంద్రునకు వినమ్రతతో సాష్టాంగవందనమాచరించి "మహత్మా! తమ సేవా కార్యములను మంత్రిగారు పంచిపెట్టుచున్నట్లు కర్ణాకర్ణిగా విని పరుగెత్తుకొని వచ్చితిని. దేవా! నాకు కూడ తమ సేవా భాగ్యము లభించినట్లు చేయు ప్రార్దన. ఎంత చిన్నపనియైనను సరియై నాకొసంగుడు. దానినే మహాద్భాగ్యముగా పరిగణించి ఆచరించుకొనుచు, తమ సేవలో పాలుపంచుకొని కృతార్థుడను కాగలను. యుద్దకాలమున తమ కేంతయో సేవచేసితిని, శాంతికాలమున కూడ అట్టి సౌభాగ్యము నాకు కలుగునట్లు అనుగ్రహింపుడు".

ఆంజనేయుని ప్రార్ధనాపూర్వక వచనముల నాలకించి రామచంద్రుడు "ఆంజనేయా! ఏమి ఇంత ఆలస్యముగ వచ్చితివి? అన్ని పనులు ఇప్పుడే వారు వారు పంచుకొని వేసెరే ! బహుశా అన్నియు పూర్తైయుండును. అయినను మంత్రివర్యునితో సంప్రదించి చూచెదను" అని చెప్పి అమాత్యునకు తోడనే కబురంపెను. మంత్రివరుడేతెంచగనే శ్రీరాముడాతనితో "ఆంజనేయుడు రణరంగమున పెక్కువిధముల మనకు తోడ్పడినాడు. ఇప్పుడు శాంతికాలమున కూడా కావించుట సిద్దపడుచున్నాడు. పనులన్నిటిని ఇప్పుడే మీరు అందరికి పంచివేసియున్నారు. అయినను ఆంజనేయుడు అతిముఖ్యుడు కాబట్టి ఏదైన ఒక పని వారిని ఒప్పజెప్పుట ధర్మము కావున, ఏపనియైనను మిగిలియున్నదేమో పలికింపగోరెదను". అమాత్యుడు తక్షణమే పనుల పట్టికను ఏకాగ్రచిత్తముతో పరిశీలించి రామునితో నిట్లనియె "దేవా, చూచెదను పూర్తి ఆయిపోయినవి. కాని ఒక్క చిన్న పని మాత్రము మిగిలిఉన్నది. లోకములో ఎవరైనా ఆవలించినచో ప్రక్కనున్నవారు చిటికెవేయుట ఆచారముగనున్నది. కాబట్టి రామచంద్రా! మీరెపుడైన ఆవలించినచో ఆంజనేయుడు చిటికె వేసినచో సరిపోవును. ఈ ఒక్క పని తప్ప ఇక ఏమియు మిగిలియుండలేదు. మహా ప్రభూ!" మంత్రివాక్యములను విని రామచంద్రుడు ఆంజనేయుడుతో "వాయుపుత్రా! మంత్రి చెప్పిన ఈ చిన్న పని తీసికొనుటకు నీకు ఇష్టమేనా? అని అడుగగా ఆంజనేయుడు మహత్మ! పనులలో చిన్నదా పెద్దదా అనూ విచక్షణ నాకు లేదు. నాకు కావలసినది రామ సేవ. అది చిన్నది కాని, పెద్దది కాని అదియే నాకు పదివేలు. తమ సేవ దోరికినది. అదియే నాకు చాలు. ఈ చిన్న పని దొరికినందులకు నా అదృష్టమును నేను కొనియాడుచున్నాను మహత్మ! సెలవు" అని వచించి ఆంజనేయుడు ఆనందముతో చిందుల త్రొక్కుచు అచ్చోటు వీడి చనెను.

ఇక శ్రీ రామచంద్రుడు ఆంజనేయుని పై గల వాత్సల్యాతిశయుముచే తన మనంబున ఈ ప్రకారము చింతన జేసికొనేను "నేను ఆవలించినచో ఆంజనేయుడు చిటికేవేయునుగదా! ఆంజనేయుడు పరమభక్తుడు కావున ఆంజనేయుడు ఎపుడైన చిటికివేసినచో నేనున్ను ఆవులించెదను". ఈ నిశ్చయము రామచంద్రునకు తప్ప మఱియొకనికి తెలియనే తెలియదు. ఇక ఆంజనేయుడు రాముని వీడి దూరముగ చని ఒకానొక విజిన ప్రదేశమును ఒక చెట్టు క్రింద కూర్చొని "రామచంద్రుడు ఆవలించినచో నేను చిటికె వేయవలెను కార్యము నా కొసంగబడినదికదా! ఆ కార్యమును నేను ఏమాత్రము పొరపాటు జరగకుండ ఆచరించవలసియున్నది. తన విధ్యుక్త ధర్మమును తాను చక్కగ ఆచరించువాడే లోకములో ధన్యుడుగ పరిగణింపబచుండును. రామచంద్రుడు ఆవలించినపుడు నేను చిటికె వేయవలెను గదా! మఱి రామచంద్రుడు ఎపుడు ఆవలించినచో నాకేమి తెలియును? భుజించినపుడుగాని నిద్రపొవునపుడుగాని, వాహ్యాళికి వెళ్లునపుడుగాని ఎప్పుడైన ఆవలించవచ్చునుగదా! మఱి ఆ విషయము నాకెట్లు తెలియగలదు? కాబట్టి నేనొక ఉపాయమును అవలంబించెదను. దానిచే నాకొసంగబడిన రామసేవ కార్యము నిర్దుష్టముగ జరిగిపోగలదు. అది యేదనగా ..ఇది మొదలుకొని నిరంతరము రాత్రింబగళ్లు విరామము లేకుండ చిటెకె వాయుంచుచునే ఉందును. ఈలోగా రామచంద్రుడు ఎపుడైనను ఆవలించుకొనుగాక! నాకేమియు పరవాలేదు" అని నిశ్చయించి హనుమంతుడు సుదూరవ్రుక్షచ్ఛయయం దాసీనుడై నిరంతరము నిర్విరామముగా చిటికె వాయించుచునుండెను.

అచట రాజభవనములో శ్రీ రామచంద్రుడు తాను గావించుకొనిన నిశ్చయము ప్రకారము అనగా హనుమంతుడు చిటికె వాయించినచో తాను ఆవులించెదనను నియమము ప్రకారము, నిరంతరము ఆవలించుచు నోరు తెరుచుకొనియే యుండెను. ఆంజనేయుడు చిటికె ఆపినచో రాముని నోరు మూతవడును. కాని ఆంజనేయుడు చిటికె వాయించుచునేయిండెను. రామచంద్రుడు సదా నోరు తెరచుకొనియుండుట చూచి మంత్రులకు, జనులకు ఏమియు తోచక అదియేదియో వ్యాధియని తలంచి గొప్ప గొప్ప వైద్యులను రప్పించిరి. వారు పరీక్షించి రాముని ఆరొగ్యములో ఏకొరత లేదనియు కాని నోరు ఎందులకు తెరచుకొనినారో తెలియకున్నదనియు చెప్పిరి. ఇక కర్తవ్యము తోచక మంత్రులు, పౌరులు అందఱును గురువగు వశిష్ఠ మహర్షి యొద్దకుపోయి రామచంద్రుడు సదా నోరు తెరచుకొని యున్నాడని వచింప, సర్వజ్ఞడగు ఆ మహనీయుడు దానికి కారణము ఆంజనేయుడే యనియు, ఆంజనేయుడు చిటికె వాయుంచుట ఆపినచో రాముడు తన నోరు మూయుననియు చెప్పెను. తోడనే అందఱు కలిసిపోయి చెట్టుక్రింద ఊపిరి తిరగకుండ చిటికె వాయించుచు కుర్చొనియున్న ఆంజనేయునితో 'మహాత్మా! చిటికెవేయుట ఆపుడు! దానివలన గొప్ప ప్రమాదమేర్పడినది" అని వచింప వెంటనే ఆంజనేయుడు "నేను ఆపను ఇది నాకొసంగబడిన సేవా కార్యక్రమము, ఇది రామ సేవ. నా ధర్మమును, నా కర్తవ్యమును, నేను నిర్దుష్టముగ చేయవలసియున్నాను" అని ప్రత్యుత్తరమిచ్చెను. అపుడందఱును ఆలోచించి, చిటికెవేయు పనిని వేఱొకనికి మార్పించిరి. తోడనే రామచంద్రుడు యధా స్థితికి వచ్చెను.

కధలో ఆంజనేయుడు ఏక్షణమున రాముడు ఆవలించునో తెలియక నిరంతరము చిటికెవేయుటకు నిశ్చయించుకొనెను, అట్లే ఏక్షణమున మృత్యువాసన్నమగునో మానవునకు తెలియనందున అతడు నిరంతరము దైవచింతన, ధ్యానము, ఆత్మవిచారణ సలుపుచుండినచో, ఇక మృత్యువు ఎపుడు తటస్ధించినను ఏమియు చిక్కు లేదు. జీవిత పరమార్దము నెరవేరినట్లెయుగును. కాబట్టి ముముక్షవగువాడు నిరంతరము పరమాత్మను చింతనచేయును, మాయకు, అజ్ఞానమునకు ఏమాత్రము తావొసంగక నుండవలెను. అతనికి ఏ ఆటంకములు వచ్చినప్పటికిని జీవిత లక్ష్యమగు దైవానుభూతి పొందబడియేయుండుట వలన అతనికేమియు హానియుండదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: