telugudanam.com

      telugudanam.com

   

నిస్సహాయులను బలపరుస్తాడు

జీసస్

సర్వం కోల్పోయిన వ్యక్తి అలోచనా విధానం ఎలా ఉంటుంది? తాను బ్రతికి ఉండటం వేస్ట్ అనుకుంటాడు.ఆ బాధనుండి విముక్తి అయ్యేందుకు తనకుతానే మరణశాసనాన్ని రాసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ వీటన్నింటినుండి తప్పించే దేవుడు ఉన్నాడని గ్రహించలేరు. ఒక నిస్సహాయ స్థితి దేవుడి వైపుకు తిప్పగలదు. ఆయనపై ఆధారపడేలా చేస్తుంది. దేవుడి శక్తి ఏమిటో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. అందుకేనేమో తనకుతానుగా ఎలాంటి విమోచనా పొందలేని వ్యక్తి దయనీయ స్థితిని చూసిన దేవుడు తన ఒక్కడైన క్రీస్తును పంపేందుకు వెనుకంజ వేయలేదు. తన స్వరూపంలో ఉన్న మానవుడిని ఉన్నత స్థితిలో ఉంచేందుకు క్రీస్తు హీనస్థితిని అనుభవించాడు. తన ముఖంపై ఉమ్మివేసేవారిని ఆయన ఉరిమి చూడలేదు. చెంపపై కొట్టేవారిని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించలేదు. ఆలాంటి వారిని మరింతగా ప్రేమించాడు. తన రాజ్యంలో చేర్చుకునేందుకు ఇష్టపడ్డాడు.


ఏలియాను ఓదార్చాడు:

ఏలియా అనే దైవజనుడిని అహాబు అనే రాజు భార్య అయిన యెజెబెలు ఏలియాను చంపేస్తానని సవాలు విసిరింది. దీంతో ఏలియా ప్రాణభయంతో బెయేర్షెబాకు వెళ్ళి, అక్కడి నుంచి ఒక దినమంత దూరం ప్రయాణించి ఒక బదరీ చెట్టు క్రింద కూర్చున్నాడు. ఒంటరిగా ఉన్న ఏలియా తన దీనస్థితిని చూసుకొని కృంగిపోయాడు. బ్రతకడంకంటె చనిపోవడం మేలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే "యెహోవా, నా పితరులకంటె నేను గొప్పవాడను కాను, చాలు ఈ జీవితం, నా ప్రాణం తీసుకో" (మొదటి రాజులు 19:4) అని ప్రార్థించాడు. ఇలా ప్రార్థించిన తర్వాత ఆకలి, నిరాశతో అలసిపోయి అదమరచి నిద్రపోయాడు. దేవుడు ఏలియా స్థితిని చూసి ఓదార్చేందుకు తన దూతను పంపాడు.ఆ దూత ఏలియాకు భోజనం సిద్దం చేసింది. ఏలియాను లేపి తినమని కోరింది. ఆ భోజనపు బలంతో ఏలియా 40 రాత్రిపగలు నడిచాడు. అంతటి శక్తి ఏలియాకు దేవుడు ఇచ్చాడు. ఏలియా చనిపోవాలనుకున్నాడు కానీ దేవుడు ఏలియాను మరణం చూపకుండానే పరలోకానికి తీసుకొనిపోయాడు. చరిత్రలో గొప్ప ప్రవక్తగా మిగిలాడు. పరిస్థితులు ఏవైనా ప్రార్థన ద్వారా దేవుడిపై ఆధారపడితే వాటిలో విజయం ఇస్తాడనేందుకు ఈ సంఘటన ఒక ఉదహరణ.


దావీదును సమకూర్చాడు:

దావీదు తన సొంత కుమారుడైన అబ్షాలోముకు భయపడి తన ఇంటివారినందర్ని తీసుకుని పారిపోయాడు. దావీదు, అతడితో ఉన్నవారంతా ఏడుస్తూ కృంగిపోయారు. ఈ కుట్రలో అహీతోపేలు కూడా భాగస్తుడని తెలుసుకున్న దావీదు "యెహోవా అహీతోపేలు ఆలోచనను చెడగొట్టమని" (రెండు సమూయేలు 15:31) ప్రార్థించాడు. దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. దావీదును అంతం చేయాలనే కుట్రపడ్డ అహీతోపేలును, అబ్షాలోము ఇద్దర్ని చంపాడు. దావీదు రాజు అయినా పరిస్థితులు తనకు అనుకూలంగా లేని సమయంలో దేవునిపై ఆధారపడ్డాడు. తద్వారా దావీదు తాను కోల్పోయినదంతాను తిరిగి పొందాడు.


పేతురును వెనక్కి రప్పించాడు:

యేసు ప్రభువు శిష్యులలో పేతురు ఒకడు. క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత పేతురు తన వృత్తి అయిన జాలరిగా తిరిగి వెళ్ళిపోయాడు. తనతో పాటు మిగిలిన శిష్యులను కూడా వెంటపెట్టుకుని వెళ్ళాడు. వారి స్థితిని చూసిన దేవుడు మహిమ శరీరంతో వారి వద్దకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు వారికి భోజనం చేసి పెట్టాడు. వెనక్కి వెళ్ళిపోయిన పేతురును రెండంతల బాధ్యతను అప్పగించాడు. "నా గొర్రెలను మేపు" (యోహాను 21:13) అన్నాడు. నా ప్రభువే చనిపోయాడు. ఇక నేనెందుకు దేవుడి సేవ చేయాలని నిరాశలో ఉన్న పేతురును దేవుడు విడిచిపెట్టలేదు. ఏలియా, దావీదు, పేతురు వీరంతా సమస్యలు వచ్చినప్పుడు మిక్కిలి వేదనకు గురయ్యారు. ఆ సమయంలో చనిపోతే బాగుంటుంది అనుకున్నారు. కానీ దేవుడు వారి వద్దకు వచ్చి బలపరిచాడు. వారి ప్రార్థన విన్నాడు. ఆలస్యం చేయకుండా సాయం చేశాడు. వీరిని బలపరచి, సాయం చేసిన దేవుడు మనల్ని బలపరుస్తాడు. వారిలా దేవుడ్ని ఆశ్రయించే వారికి ఆయన తన ముఖాన్ని చాటు చేయడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: