telugudanam.com

      telugudanam.com

   

శరణుఘోష ప్రియుడు

అయ్యప్ప

'ఓంస్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవునే శరణమయ్యప్ప!' అంటూ అయ్యప్ప భక్తులు భగవంతుని శరణుకోరే విధానాన్నే శరణు ఘోష అని వ్యవహరిస్తారు. అడవులలో కొండలలో నడచి వెళ్ళే స్వాములకు (భక్తులకు) శరణు ఘోష రక్ష. యాత్రచేసే బృందం అందరూ ఒక్కసారి స్వామివారి శరణు ఘోష చెప్పి అడవిని దద్దరిల్లజేస్తారు. ఒక రకంగా అడవిలో రాళ్ళు, ముళ్ళు కాళ్ళకు గుచ్చుకున్నా బాధ తెలియకుండా అయ్యప్పస్వామిపైనే మనసు లగ్నం చేసి నడవడం ఒక ఎత్తయితే బిగ్గరగా చేసే శరణుఘోషకి భయపడి అడవిలో తిరిగే క్రూరమృగాలు దూరంగా పారిపోతాయి. నెత్తిపైన ఇరుముడి వుండడం వలన దిక్కులు చూడడానికి, ఇష్టం వచ్చినట్లు నడవడానికి కుదరదు. ఒక వైపు ఇరుముడిని కాపాడుకుంటూ నేలవైపు చూస్తూ భక్తి శ్రద్దలతో స్వామివారి శరణు ఘోష చెబుతూ ప్రయాణించడమే యాత్రలో విశేషం. వ్యర్థ ప్రసంగాలకు యాత్రలో సమయం చిక్కదు. శబరిమల యాత్రలో విశిష్టత అదే!

అయ్యప్ప కులం, మతం, అంతస్తు, హోదా అనీ మరచి అయ్యప్పస్వామి వారి ముందు అంతా సమానమేనని తెలియజేసే యాత్ర, సర్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థం తొలిసారిగా శబరిమల యాత్రలోనే తెలుస్తుంది. ముక్కు ముఖం తెలియకపోయినా, అడవిలో సాటి అయ్యప్ప భక్తునికి చేతిని అందించి సాయం చేస్తారు. నడవలేని స్వాములకు చేయూత అందించి నడిపిస్తారు. ఒక్కొక్కసారి ఇద్దరు స్వాములు కలిసి నడవలేని స్వామి రెండుచేతులను వారి భుజాల పై వేసుకొని అతన్ని మోస్తూ నడిపిస్తారు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతున్నా శబరిమల యాత్ర చేసే అయ్యప్ప భక్తులకు హాని చేయకుండా వుండడానికి (ఎరుమేలి నుండి వనయాత్ర 70 కిలోమీటర్లు) యాత్ర ప్రారంభంలో మంత్రించి నీళ్ళు జల్లుతారని చెబుతారు. అదికాక అడవిలో అక్కడక్కడ 'వడివడివాడు ' పేర మందు గుండు సామాగ్రితో అడవి దద్దరిల్లేలా ఔట్లు పేలుస్తారు. యాత్ర చేసే స్వాములు ఒక రూపాయి ఇస్తే వారి పేరు మైకులో చెప్పి ఔట్లు పేల్చే పద్దతి అక్కడ వుంది. కేరళలో చాలా దేవాలయాలలో ఇప్పటికీ అడవులలో లేకపోయినా ఔట్లు పేల్చే సాంప్రదాయం వుంది.

శబరిమల యాత్ర చేయించడానికి, అయ్యప్ప దీక్ష సక్రమంగా కొనసాగించడానికి గురుస్వామి నావకు చుక్కానివంటివాడు. మిలట్రీ కమేండరు సైనికులకు శిక్షణ ఇచ్చి యుద్దానికి తయారు చేసినట్లు గురుస్వామి బృందంలో వెంట వచ్చే స్వాములకు భక్తి శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో యాత్రను జరిపిస్తారు. గురుస్వామి బృందంలో ఉన్న స్వాములను ప్రోత్సహించి అడవి మధ్యలో వారి పేర ఔట్లు పేల్చేటట్లు చేస్తారు. యాత్రలో ఇది ఒక తీయని అనుభవం. మంచి గురుస్వామి దొరికితే దీక్ష, యాత్ర నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగుతుంది. గురుస్వామి నిస్వార్థపరుడై, ఆధ్యాత్మిక భావం కలిగి అయ్యప్ప దీక్ష, శబరిమలయాత్ర చాలాసార్లు చేసి అక్కడ జరిగే పూజలు, పద్దతులు తెలుసుకొని తన వెంట వచ్చే స్వాములకు పూజలు, భజనలు శ్రద్దగా చేయించి, మెడలో మాల విసర్జన చేసే వరకు బృందంలో వెంటవచ్చే అందరు స్వాములకు బాధ్యత వహించి యాత్ర నుండి సురక్షితంగా ఇంటికి చేర్చాలి. అలా సేవాభావం, అంకితభావంతో చేసే వాడే నిజమైన గురుస్వామి. అటువంటి గురుస్వామి వెంట వెళ్తేనే శబరిమల యాత్రాలక్ష్యం నెరవేరుతుంది. సద్గురునాథనే శరణుమయ్యప్ప!

స్వామి శరణు ఘోషప్రియుడు కాబట్టే యాత్రలోనే కాకుండా నిత్యం చేసే పూజలు, భజనలలో కూడా శరణుఘోషకే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చి, స్వాములందరి చేత శరణాలు చెప్పించి గురుస్వామి పూజలు జరిపిస్తారు. మండల కాలం (నలభై ఒక్క రోజుల) పూజ, భజన సమయంలో శరణు ఘోష చెప్పడం వలన దీక్షలో యాత్రలో నిద్రపోతున్నా నోటి నేంట స్వామివారి శరణాలే పలుకుతాయి. ' అహం బ్రహ్మస్మి, తత్వమసి ' సిద్ధాంతంతో అయ్యప్ప దీక్ష ముడిపడి ఉంది. తనలో అయ్యప్పని దర్శించుకొని ఇతరులలో కూడా అయ్యప్పను దర్శించాలి. ఆ భావనతోనే దీక్షలో ఎవరైనా స్వామి కనిపించగానే శరణం అని చెప్పి నమస్కరించడం, ఒక్కొక్కసారి పాదాభివందనం చేయడం అయ్యప్ప దీక్షలో శరణాగతికి నిదర్శనం. మానవ సేవే మాధవ సేవగా చెప్పేది కూడా అయ్యప్ప దీక్ష అవడం వలన విరివిగా దాన ధర్మాలు చేస్తూ, అన్నదానం జరిపిస్తారు. సాటి మనిషికి సాయం చేసే అహంకారాన్ని వదుకుకొంటారు. బ్రహ్మచర్య వ్రతం, చన్నీటి స్నానం, నేలపై పడక, మితాహారం, సాత్వికాహారం, ఒంటిపూట భోజనం, దీపారాధన, పూ భజనలు రోజూ చేయడం వలన మంచి క్రమశిక్షణ అలవడి ఆధ్యాత్మికంగా ఎదగడానికి బాగా తోడ్పడుతుంది.


స్వామి ఆరాధనే ధ్యేయంగా భక్తి యాత్ర

అయ్యప్ప

భక్త ప్రహ్లాద,కన్నప్పల కథలు మనం చదివాం.కానీ ఇప్పుడు భక్త అయ్యప్పలను స్వయంగా చూస్తున్నాం.కానీ అదే రకమైన అకుంఠిత దీక్ష,దృఢత్వం గలవారు లేకపోలేదు.నియమ,నిబంధనలను గాలికి వదిలేసి,పేరుకు మాత్రమే భక్తులయ్యేవారు లెక్కలోకి రారు.నిజమైన ఆరాధనలో నిండా మునిగిపోయే స్వాముల గురించే ఇప్పుడు ప్రస్తావించేది.ఒక నిజమైన ఆధ్యాత్మిక దృష్టిపరులకు అది అసాధ్యమేమీ కాదు.స్వామి ఆరాధనే ధ్యేయంగా గలవారికి నలబై ఒక్క రోజులు ఒక్క లెక్కకాదు.నిష్కల్మష,సహసోపేత భక్తి భావనే అంతటి ఉన్నత స్థానానికి ఎవరినైనా తీసుకెళుతుంది. అటువంటి అసలైన అయ్యప్పలకు దైనందిన జీవనంలోని సుఖాలు,సౌఖర్యాలు గుర్తుకురావు.ఏడాది పొడువున చైన్ స్మోకింగ్, మద్యపానం,ఇతరత్రా దురలవాట్లతో కాలం గడిపేవారు సైతం ఆ సమయంలో వాటికి దూరం కావడం చూస్తే ఎంతటి కార్యమైనా మనిషికి సాధ్యమే అనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఉండవలసింది,ఆ మేరకు దృడమైన సంకల్పం మాత్రమే అన్నది స్పష్టమవుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకోవాలన్న తలంపే చాలామందికి రాదు. వచ్చిన వారిలో దానిని ఆచరణలోకి తెచ్చేవారు మరీ తక్కువ. ఆచరించే ప్రతి ఒక్కరిలో ధృడ చిత్తం ఉంటేనే అది సాధ్యం.అలా అని దీక్ష తీసుకుంటున్న అయ్యప్పల సంఖ్య తక్కువేమీ లేదు.ఏడాది కేడాది కొత్తగా దీక్ష స్వీకరిస్తున్న కన్నెస్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సంవత్సరంలో జోరుగా సాగే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి-మూడు నెలల్లో అయ్యప్ప వ్రతదీక్ష స్వీకరించి,కేరళలోని శబరిమలకు వెళ్ళి వస్తున్న వారి సంఖ్య ఒక అంచనా ప్రకారం సుమారు యాబై లక్షలు.


ఎందుకు భయం?

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలామంది ముందుకు రారు.ఎందువల్ల? ఈ ప్రశ్నకు చాలామందికి తెలిసిన జవాబు "అది అత్యంత కఠినతరమని". ఇదొక్కటి మాత్రమే కాదు,వారు "శబరిమల యాత్ర" తప్పనిసరిగా చేయాలి.నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని,శబరిమల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలామందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది. దైవం వల్ల పరిపూర్ణ విశ్వాసం,ప్రేమతో ముందుకు వస్తే అలాంటి భయాలేవీ ఉండవు.


యాత్ర అంత కష్టమా?

నిజానికి "శబరిమల"యాత్ర అంత కష్టమా?ఎందరు దీక్ష కష్టాలు లేకుండా సివిల్ డ్రెస్సులో అక్కడికి వెళ్ళి రావడం లేదు? పిల్లలు, వృద్ధ స్త్రీలు,వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాలకు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడకన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలైన కారణం "సంకల్ప లోపం". వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించుకుంటూ వెళుతుంది. దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీదే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరినీ వదిలి అడవి మార్గంలో బయలుదేరుతారు. నియమాలు,నిష్టల విషయంలో ఏ మేరకు క్రమశిక్షణను పాటిస్తామన్న దానిపైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి సారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండానే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయపడే వారు భయపడుతున్నా,ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్నవారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.


"పెద పాద" మార్గమంతా చిట్టడవి!

అయ్యప్ప

ఇరుమేలి నుండి పంబదాకా ఉన్న పెదపాదం మార్గం మొత్తం చిట్టడవి. అసాధారణంగా పెరిగిన వృక్షాలు, కొండలు, లోయలగుండా ప్రయాణం సాగుతుంది. ఎరుమేలి వరకు బస్సులో వెళ్ళవచ్చు.అక్కడ్నించి యాత్రికులు పంబమీదుగా శబరిమల దాకా కాలి నడకన వెళ్తారు. తలపై ఇరుముడులు పెట్టుకొని,పాదరక్షలు లేకుండా కీకారణ్యంలో రాళ్ళు రప్పల మీదుగా, అస్త వ్యస్తమైన మార్గం గుండా రాత్రింబవళ్ళు సాగుతారు.నిజానికి అది దేశంలోని మొత్తం 27 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఒకటి. అయ్యప్పలు సంచరించేకాలంలో వనంలోని క్రూరమృగాలు దూర ప్రాంతానికి వలస పోతాయని చెబుతారు. ఇన్నేళ్ళుగా సాగుతున్న ఈ యత్రలో ఒక్క పెద్ద వన్యమృగమైనా స్వాములను ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు.


"మకర జ్యోతి"దర్శన భాగ్యం

ప్రతి సంవత్సరం జనవరి 15 సంక్రాంతి పర్వ దినాన దర్శనమిచ్చే "మకరజ్యోతి"ని దర్శనం చేసుకోవడం ప్రతి ఒక్క స్వామికీ పెద్ద పరీక్ష అనాలి. ఆ రోజు అయ్యప్ప జ్యోతిరూపంలో ప్రత్యక్షమౌతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆ అద్భుతాన్ని కళ్ళారా చూడాలన్న కాంక్ష ప్రగాఢంగా ఉంటుంది. లక్షలాది స్వాముల శరణుఘోషుల మధ్య, కర్పూర హారతుల ధూపకాంతుల నడుమ ఆకాశంలో మకర నక్షత్రం మిలమిలా మెరుస్తుంది.


ఎక్కడ ఉంది?

దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య శబరిమల నెలకొని ఉంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం (ట్రివేండ్రం)కు 180 కి.మీ.దూరంలో ఉంటుంది. రైలులో వెళ్ళే యాత్రికులకు కొట్టాయం లేదా ఎర్నాకులం (కొచ్చి) అనుకూలమైన కూడళ్ళు. రోడ్డు మార్గంలో అయితే ఎరుమేలికి 64 కి.మీ.దూరం, పంబ నుండి 5 కి.మీ.దూరం ఉంటుంది.శబరిమల వరకూ వాహన సౌకర్యం లేదు. పంబ వరకు వాహనంలోనో లేదా కాలినడకనో వెళ్ళి,అక్కడ్నించి తప్పనిసరిగా కాలినడకన కానీ, లేదా డోలీలో కానీ వెళ్ళాల్సిందే.


ఎవరైనా వెళ్ళవచ్చు!

శబరిమలకు ఎవరైనా,ఎప్పుడైనా వెళ్ళవచ్చు.కాకపోతే అక్కడ అయ్యప్పస్వామి దేవాలయం తెరచే కాలం మాత్రం సంవత్సరంలో ఆయా నిర్థిష్ట సమయాలలోనే. అటు దైవభక్తి, ఇటు ప్రకృతి ఆరాధన రెండూ ఏకకాలంలో కావాలనుకునే వారికి శబరిమల ఒక అద్భుతమైన యాత్ర.కాబట్టి, దీక్ష తీసుకోని వారి సైతం అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు.కాకపోతే ఆలయం ముందున్న పరమ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను మాత్రం కేవలం దీక్షపరులైన "అయ్యప్ప"లు మాత్రమే అధిరోహిస్తారు.


వార్త సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: