telugudanam.com

      telugudanam.com

   

స్తుతి వైభవం

జీసెస్‌

మీరు శ్రమలో ఉంటే ప్రార్థించండి, సంతోషంలో ఉంటే కీర్తనలు పాడండి" అని యాకోబు తన పత్రికలో రాశాడు. దేవుడిని ఎప్పుడు స్తుతించగలం? మనకు ఎలాంటి సమస్యలు, కష్టాలు, భాధలు లేనప్పుడు మాత్రమే ఆరాధించగలం.ఈ మూడు మన జీవితాలతో పెనవేసుకొని మనతో నడిచేవే. మరి దేవుడిని ఆరాధించలేమా?నిజం చెప్పాలంటే వీటిలో నుంచే మనం దేవుడిని స్తుతించగలం.ఒక వ్యక్తి తనకున్న సమస్యను బట్టే దేవుడికి దగ్గర కాగలడు. అది అనారోగ్యం కావచ్చు. ఆర్థిక ఇబ్బంది కావచ్చు. లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. వీటికి పరిష్కారం దేవుడి వద్దనే దొరుకుతుంది. కాబట్టి మనం ఆయనను ఆశ్రయిస్తాం. ఏ అనుమానం లేదు. వీటన్నింటి నుంచి ఆయన విడిపిస్తాడు. అప్పుడు మన బాధ సంతోషంగా మారిపోయింది. ఆ సంతోషంలో దేవుడిని కీర్తిస్తాం. సమస్య మనల్ని భయపెడుతున్న కొద్దీ మనం మరింతగా దేవుడిని వేడుకుంటాం. అ బాధ, వేదన, కన్నీరు, నిరాశ, నిర్వేదం, శూన్యం వీటన్నింటిలోనుంచి బయటపడిన వారి మానసిక స్థితి ఉల్లాసంగాను, తుఫాను తర్వాత వెలిసే ప్రశాంతతను వారు పొందుకుంటారు. దీంతో హృదయం నిండా దేవుడి ప్రేమతో నింపబడి ఆయనను కీర్తిస్తారు.


మోషే కీర్తించాడు

దేవుడు ఇజ్రాయేలీయులను కాపాడేందుకు ఎర్రసముద్రాన్ని పాయలుగా చేశాడు.ఈజిప్టు సైన్యాన్ని ఆ నీటిలో ముంచి, వారందరిని చంపేసి ఇజ్రాయేలీయులను రక్షించాడు. అందుకు కృతజ్ఞతగా మోషే దేవుడిని కీర్తిస్తూ పాటలను రాశాడు. మోషే దేవుడి ప్రేమకంటే ఆయన కృప, దయను ఎక్కువగా రుచి చూశాడు. అందుకే దేవుడి కోపాన్ని మోషే ఆపగల్గాడు. ఇజ్రాయేలీయులు చాలాసార్లు దేవుడిని విసిగించినందుకు దేవుడు వారిని నాశనం చేయాలనుకుంటాడు.ఆ సమయంలో మోషే దేవుడు దయగలవాడని అనుభవపూర్వకంగా ఎరిగినవాడై ఆయనను బ్రతిమలాడేందుకు భయపడలేదు. దేవుడి కోపాన్ని చూసిన మోషే వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ఆయన సన్నిధిలో నిలబడి ఈ ప్రజలను నాశనం చేయవద్దని వేడుకున్నాడు. అందుకు దేవుడు సరేనని, వారిని నాశనం చేయలేదు. ఆ అనుభవమే మోషేను దేవుడిని కీర్తిస్తూ పాటలను రాయించింది.


హన్నా పొగిడింది

హన్నా అనే మహిళ ఉండేది. ఆమె ఒక దైవభక్తురాలు. కానీ ఆమె గొడ్రాలు .అయితే పిల్లల కోసం ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు ఒక కుమారుడిని ఇచ్చాడు. తన ప్రార్థనను దేవుడు విని, సంతానాన్ని ఇవ్వబోతున్నందుకు ఆమె దేవుడిని పొగుడుతూ కీర్తన రాసింది. "గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది. ఆయన పేదలకు ఆహారాన్ని ఇస్తాడని" కొనియాడుతూ దేవుడిని స్తుతించింది.ఆమె ఏదైతే విశ్వసించి, కీర్తనలు రాసిందో దేవుడు దాన్ని చేశాడు .ఆమె గొడ్రాలు కానీ ఆరుగురి పిల్లల్ని కన్నది. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళను దేవుడు ఆమెకు ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఇచ్చిన మొదటి సంతానమైన సమూయేలును తిరిగి దేవుడి సేవకై అంకితం చేసింది. ఆ విధంగా హన్నా దేవుడిని కీర్తించింది.


స్తుతులపై సింహాసనాసీనుడు ఆయనే

యేసు గాడిదపై వస్తుంటే ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాకని వీధి ప్రజలంతా ఆయనను పాటలతో స్తుతించారు.వారంతా పేదలైనా కొందరు యేసు కూర్చున్న గాడిద పాదాల కింద వారు తమ వస్త్రాలను పరిచారు. మరి కొందరు చెట్ల కొమ్మలు, ఆకులను తీసుకొని పరిచారు .గట్టిగా పాటలు పాడుతూ, నాట్యం వేస్తూ సంతోషంతో ఆయనను పొగిడారు.వారిలో స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. చిన్నా, పెద్దా, స్త్రీపురుషులు అనే తేడా లేకుండా అందరూ ఏక మనస్సుతో యేసును కీర్తిస్తూ, పాటలు పాడారు. కాబట్టి మన జీవితం ఎలాగున్నా నిరంతరం దేవుడిని స్తుతించడం మంచిది. ఆ విధంగా చేస్తే భాధలను మరచిపోయి, మనస్సు ఉల్లాసంతో ఉంటుంది. అటు ఆరోగ్యం బాగుంటుంది. ఇటు సమస్య తీరిపోతుంది. తద్వారా దేవుడికి చేరువలో ఉంటాం. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు శత్రువు ఎవరుంటారు? గట్టిగా కీర్తిస్తే సాతాను కూడా పారిపోతాడు. శత్రువు మనకు దూరంగా ఉంటాడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: