telugudanam.com

      telugudanam.com

   

తులసీదాస్

మొగల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో (16వ శతాబ్ది) తులసిదాస్ నామధేయం గల ఒక పుణ్యపురుషుడు.ఇట్టా జిల్లా (ప్రసుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది) అలీగంజ్ పరగణాకు చెందిన సోరోన్ గ్రామ వాస్తవ్యుడు - ప్రస్తుతం రాజపూర్ నెలకొన్న జమునా నదీ తీరంలోని అరణ్య ప్రాంతానికి వచ్చినట్లు సంప్రదాయ సిద్దంగా చెప్పబడుతున్నది. తులసీదాస్ రాజపూర్ స్థాపించి, ఒక దేవాలయాన్ని నిర్మించి,అనేకమంది అనుచరుల్ని ఆకర్షించాడు.ఇట్టా జిల్లాలోని సోరోన్‌కు తూర్పున దాదాపు రెండు మైళ్ళ దూరంలో గల రాంపూర్‌లో తులసీదాస్ పూర్వీకులు నివసించారు. పరిస్థితుల ప్రభావం వల్ల అతడి తండ్రి ఆత్మారాం శుక్లా తన వృద్దురాలైన తల్లిని, భార్య హులసిని తీసుకొని సోరోన్‌కు చెందిన యోగమార్గ మొహల్లాకు చేరుకోవలసి వచ్చింది.

అతడు జన్మించిన కొన్ని మాసాల తరువాత తులసీదాస్ తన తల్లిని కోల్పోయాడు.అచిరకాలంలో తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు.అతని పోషణ బాధ్యత వృద్దురాలైన నాయనమ్మ భుజాలపై పడింది. బాలుడుగా అతడు రామబోలా లేక రమోలా అని పిలువబడ్డాడు.తులసి దృడమైన ఆరోగ్యం,చక్కని ఛాయ,మంచి నడవడి గల యువకుడు.అతడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ పాండిత్యంలోని వివిధ శాఖలలో ప్రావీణ్యం సంపాదించాడు.దీనబంధు వధకుని పుత్రిక రత్నావళిని వివాహం చేసుకున్నాడు. తులసి పురాణ పఠనం తన వృత్తిగా స్వీకరించి,పేరు గడించాడు. ఈ దంపతులకు "తారావతి" అనే కుమారుడు కలిగాడు కానీ వారికి తీవ్ర దు:ఖాన్ని కలిగిస్తూ - ఎక్కువకాలం జీవించకుండానే - మృతి చెందాడు.

1547 ఏ.డి.లో వివాహానంతరం 15 ఏళ్ళకు రత్నావళి బదరిలోని తన సోదరుల ఇంటికి రక్షాబంధనం కోసం వెళ్ళవలసి వచ్చింది.తులసి కూడా తొమ్మిది రోజుల పాటు తన వృత్తిపరమైన పర్యటనకు వెళ్ళాడు. అయితే అతడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. వరదల్లో ఉన్న గంగానదిని ఈది అతడు అర్ధరాత్రికి మామగారి ఇల్లు చేరుకున్నాడు. అటువంటి అసాధారణ సమయంలో అతణ్ణి కలుసుకున్నందుకు దిగ్ర్బాంతి చెందిన రత్నావళి తన భర్తను వరద నీటిని ఏ విధంగా దాటగలిగారని అడిగింది. తనపై అతనికి గల తీవ్ర ప్రేమను గురించి తెలుసుకున్న ఆమె ఇలా చెప్పింది. "నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానది దాటేటట్లు చేసింది. కనుక కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఎవరికైనా ఈ బౌతిక ప్రపంచం అధిగమించేందుకు సహాయపడుతుంది.

ఈ మాటలు విన్న తులసీదాస్ మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది.వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్యప్రేమగా రూపంతరం చెందింది.అతడు తక్షణమే బదరీనీ,సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు. అతడు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఎంత వెదకినా అతని జాడ దొరకలేదు.ప్రేమ విశ్వాసాలు గలది,దిక్కులేనిది అయిన రత్నావళి అన్ని సుఖాలను విసర్జించి చివరి వరకు ఒక వైరాగ్య జీవితాన్ని గడిపింది.బదరి నుండి తులసీదాస్ విస్తృతంగా పర్యటించాడు. దేశ దిమ్మరి అయిన ఒక సంగీత పాటకునిగా, కొన్ని సమయాల్లో అద్భుత క్రియలు చేస్తూ జీవితం కొనసాగించాడు. అతడు చిత్రకూటంలో, అయోధ్యలో నివసించాడు. రాజపూర్‌ను నిర్మించాడు. ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే 1623 ఏ.డి.లో తన తనువు చాలించాడు.

తులసీదాస్ రచించిన అనేక రచనలలో "రామ చరిత మానస" - విశేష శాస్త్ర పరిజ్ఞానం గల గొప్ప విద్వాంసులలోనూ,సామాన్యలలో కూడా ప్రత్యేక ఆసక్తి రేకెత్తించింది. ప్రపంచ సాహిత్యంలోని అత్యంత ఉత్తమ కృతుల శ్రేణిలోకి నిస్సందేహంగా చేర్చదగిన ఒక మహాకావ్యంగా అది రూపొందింది. సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు "రామ చరిత మానస" ద్వారా రామకథ సుపరిచితమైనది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: