telugudanam.com

      telugudanam.com

   

ఆత్మ సౌందర్యము

సుందరమైన వస్తువు ఆనందమును గొల్పును, చక్కని పుష్పము జనులకు ఆహ్లాదమును గలుగజేయును. అట్లే సుంధర భవనము, సుందర చిత్రము, సుందర దేహము జనుల హృదయ సీమలందు ఆనందము యొక్క సంచారమునకు హేతుభూతములగుచున్నవి.

A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము. అయితే సుందరమైన వస్తువేది? చపలమై, క్షణికమై నేడో రేపో నశించిపోవు పదార్ధము సుందరమైన దెట్లగును? అది యెంత రమణీయముగ గంపట్టినప్పటికిని దాని సౌందర్యము సౌందర్యము కానేరదు.

నేడు మహాసుందరముగ నగుపించిన గులాబిపువ్వు సాయంత్రమునకు వాడిపోయి, రేపటికి నశించి పోవుచున్నది. ఈనాడు అత్యంత రమణీయముగ కనుపించిన మహాభవనము కొద్ది సంవత్సరములకు శిధిలమై పోవుచున్నది, నేడు లోకైక సుందరి అని ఖ్యాతివడసిన మగువ కొలది వత్సరములకు వృద్ధాప్యమునకు బలియై కురూపిణియై మరణించుచున్నది. ఇక ఆ క్షణిక సౌందర్యమునకు ఏమి విలువ?

సంతి రమ్యతరాద్రమ్యా? సుస్థిరాదపి సుస్థిరా?

చిన్తా పర్యవాసానేయం పదార్ధశ్రీ: కిమీహనే.

ప్రపంచంలో అతిరమణీయమైన పదార్ధము లెన్నియో కలవు. కొంతకాలము స్థిరముగనుండు పదార్ధములు ఎన్నియో కలవు. కాని కాలగర్భమున అవియన్నియు ఎట్టకేలకు నశించిపోవుట వలన చింతనే అవి కలుగజేయుచున్నవి. అందువలన వాని నాశ్రయింపవలదు, అని శ్రీవసిష్ఠమహర్షి శ్రీరామచంద్రునకు భోధించెను.

That which is permanent is really beautiful

నాశములేని వస్తువే వాస్తవముగ సుందరమైనది. అట్లు నాశములేని వస్తువు ప్రపంచములో ఏది కలదు? ఒక్క దైవము తప్ప తదితరమైన ప్రతివస్తువును కాలప్రవాహమున గొట్టుకొని పోవలసినదే. ఆత్మవస్తు వొకటి తప్ప తక్కిన దృశ్యపదార్ధములన్నియు కాలగర్భమున అంతరించి పోవలసినవే. దీనినిబట్టి అన్నిటికంటె గొప్ప సౌందర్యము దైవమునకే, ఆత్మకే కలదని స్పష్టమగుచున్నది. కావున దానినే జీవులు ఆశ్రయింపవలసియున్నారు. అదియే జనులకు పరమానందమును గలుగజేయును జూచి మోసాపోరాదు. తాత్కాలిక సౌందర్యములకు, పైపై తళుకు బెళుకులకు ఎన్నడును లోనుకాగూడదు.

ఈ మధ్య ఒక యువకుడు ఒకానొక జ్యోతిష్కుని యొద్దకేగి తనచేయి చూపించుకొని తన భవిష్యజ్జీవితవిషయమై ప్రశ్నించెను. జ్యొతిష్కు డాతని చేతిని చక్కగా పరిశీలించి ఈవిధముగా చెప్పెను 'నాయనా! నీ ధనరేఖ అద్భుతముగా నున్నది ' ఆ వాక్యము వినగానే ఆవ్యక్తి పరమ సంతోషమును బొందెను. తదుపరి జ్యొతిష్కుడు 'నీ విద్యారేఖ ఇంకను పొడుగుగా ఉన్నది. కాబట్టి గొప్ప గొప్ప డిగ్రీలను నీవు పొందెదవు. నీకీర్తిరేఖ ఆ రెండిటికీర్తినికూడ పొందెదవు అని చెప్పుచుండగా యువకుని మనస్సు ఆనందముతో చిందులు ద్రొక్కసాగెను. తదుపరి ఆ దైవాజ్ఞుడు తన భాషణము కొనసాగించుచు 'నాయనా! అన్ని రేఖలు ఎన్నియుండిననేమి, ఎంత కీర్తియుండిననేమి, ఎన్ని ప్రాపంచిక విద్యలను గడించినేమి, ఎంత సంతానముండిన నేమి, బ్రతికే ఆశయే లేనపుడు వాటికే పాటివిలువ? ఆయురేఖ లేనపుడు తక్కిన రేఖలు ఎన్నియుండిన ఏమి ప్రయోజనము? అట్లే ప్రపంచ వస్తువులు ఎంత సుందరముగా తోచినను, అవి ఆశాశ్వతములు కాబట్టి వాని సౌందర్యమునకు ఏమాత్రమును విలువలేదు. పూర్వము బుద్ధదేవు డీవిధముగనే ప్రపంచ స్థినిగూర్చి తీవ్రముగ విచారించి, తనరాజ్యముయొక్కయు, పరిజనముయొక్కయు, సతీసుతులయొక్కయు లావణ్యమును గొప్పగా తలంచక, వాని యన్నిటికంటెను మహాసుందరమైనట్టి నిర్వాణ పదవినిగూర్చి అన్వేషించి ధన్యుడయ్యెను.

కావున విజ్ఞులగువారు ప్రపంచములోని పదార్ధములను చక్కగ వివేచించి, వాని ఆపాత సౌందర్యములకు మురిసిపోక, వానిపై ఆసక్తిని తగ్గించుకొని, శాశ్వతమై, స్థిరమై, సనాతనమైనట్టి పరమాత్మయందు అనన్యభ క్తిగలిగి, హృదయగుహయందట్టి లోకోత్తరసౌందర్యమును సదా వీక్షించుచు బ్రహ్మనుభూతిని బడసి జీవితమును చరితార్ధ మొనర్చుకొందురుగాక!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: