telugudanam.com

      telugudanam.com

   

భద్రాచల రామదాసు

భక్తరామదాసు అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ' అని చూపిస్తూ భద్రాచల వైభవాన్ని, సౌందర్యాన్ని వేనోళ్ళ పొగడుతూ అక్కడ రామచంద్రమూర్తి లక్షణునితో కూడి స్వర్ణప్రాకారాలతో గోపురాలతో విలసిల్లే దేవాలయంలో కొలువై భూలోక వైకుంఠంగా భద్రగిరిని శోభింపజేస్తున్నాడని, అక్కడ వెల్లువలై ప్రవహించే పవిత్రమైన గౌతమిలో స్నానంచేసి శ్రీరాముని కళ్లారా చూసి తరించమంటూ, స్థావర జంగమ రూపాలతో మన కళ్ళకు కనిపించేదంతా రామమయం అని, అంతరంగంలో ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపుతున్నాడు అని, భద్రాచలంలో నెలకొన్న శ్రీరామచంద్రుని సృష్టిలో అంతటా చూచి, ఆ మహాత్ముని కొనియాడి, తరించడమే ముక్తిమార్గమని బోధించే 'అంతా రామమయం బీజగమంతా రామమయం ' అనే కీర్తనలు వినని వారుండరు. తెలుగునాట కేవలం సంగీత జ్ఞానంలేని వారుకూడా ఆబాల గోపాలం 'ఎనగాను రామభజన కన్న మిక్కిలి ఉన్నదా', 'తారక మంత్రము కోరిన దొరికెను ', 'ఏ తీరుగ నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామ ', 'ఇక్ష్వొకుకులతిలక ఇకనైన పలుకవే ', 'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ', 'పలుకే బంగారమాయెనా కోదండపాణి మొదలైన కీర్తనలు ఆనంద పరవశంతో శ్రావ్యంగా పాడుకుంటారు. దాసరలు అనేవారు ప్రత్యేకంగా వీటిని పాడుతూ భజనలు చేసుకుంటూ దేశాటనం చేస్తారు.రామనామ భక్తిరసం పొంగిపొరలే ఈ కీర్తనలను రచించిన భక్తశిఖామణి వాగ్గ్తేయ కారకుడు రామదాసు. ఇతడే భద్రాచల రామదాసు. భద్రాద్రి రామదాసు గోపరాజు.

రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న 1620 ప్రాంతంలో తెలంగాణాలో నేలకొండపల్లి అనే గ్రామంలో జన్మించాడని నిర్ణయింపబడింది. గోపన్న తండ్రి లింగనమంత్రి. తల్లి కామాంబ. ఈ పుణ్యదంపతులకు రామానుగ్రహంవల్ల పుట్టిన ఏకైక పుత్రుడే గోపన్న. గోపన్న చిన్ననాటినుంచీ రామభక్తుడే. బాలరామాయణం మొదలగు గ్రంధాలను పఠించేవాడు. ఇతని ఇంట్లో ఎప్పుడూ భజన గోష్ఠులూ, భాగవత సత్కారాలు జరుగుతూండేవి. రఘునాధ భట్టాచార్యులనేవారు గోపన్న తాను రచించిన దాశరధీ శతకంలో చెప్పుకున్నాడు.

ఉత్తర హిందూస్థానంలో గొప్ప భక్తుడుగా వేదాంత కీర్తన రచయితగా ప్రసిద్ధి పొందిన కబీరుదాసు ఈ గ్రామానికి వచ్చినప్పుడు గోపన్నకు రామమంత్రం ఉపదేశించాడు. అప్పుడే గోపన్న 'తారకమంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా అనే కీర్తనను రచించాడు. గోపన్నకు వివాహమయింది. తల్లిదండ్రులు మరణించారు. కొంత కాలానికి ఒక పుత్రుడు పుట్టాడు. ఒకనాడు సంతర్పణ చేస్తుండగా ప్రమాద వశాత్తు గంజిగుంటలో మరణించిన కుమారుని రామసంకీర్తనంద్వారా బ్రతికించుకున్నాడు.

రామదాసు భక్తిమార్గంలో మునిగిపోయి ఉన్న డబ్బు, ఆస్థి హరిదాసులకు ఇచ్చి కట్టు బట్టలతో అష్టకష్టాలు అనుభవిస్తూ జీవిస్తూండేవాడు. సంసారపోషణ జరగడమే కష్టంగా ఉండేది. అప్పుడు ఇతడు గోల్కొండ రాజధాని అయిన హైదరాబాదు చేరుకున్నాడు. అక్కడ తన మేనమామలు అక్కన్న, మాదన్నలు గోల్కొండను పరిపాలించే కుతుబ్‌షా వంశస్థులైన అబ్దుల్లా, అబుల్‌హసన్ తానాషాలకు మంత్రులుగా ఉండేవారు. వారు అతనికి భద్రాచలానికి తహశీలుదారుగా ఉద్యోగం వేయించారు. రామదాసుకి స్వప్నంలో శ్రీరాముడు కనిపించి భద్రాచలంలో తన ఆలయాన్ని కట్టించి ప్రతిష్ఠ చేయించమని ఆనతిచ్చి అదృశ్యమైనాడు.

తహశీలుదారుగా ఉంటున్న రామదాసు అక్కడ ప్రజల ఆదరాభిమానాలను సంపాదించి పన్నులు వసూలుచేసి ఆ డబ్బుతో భద్రాచల రాముడికి కైంకర్యం చేస్తూండేవాడు. ఈ విధంగా వసూలు చేసిన పన్నులు ప్రభుత్వం ఖజానాకు రాకపోగా తానాషా శిస్తు పైకం చెల్లించమని రామదాసుకి కబురు పంపాడు. రామదాసు ఆ పైకాన్ని చెల్లించలేకపోగా ప్రభుత్వం సొమ్ము అపహరించారనే నేరంమీద రామదాసుని చెరసాలలో పెట్టి 12 సంవత్సరాలు నానాబాధలు పెట్టాడు. చెరసాలలో భక్త్యావేశంతోను దుఃఖావేశంతోను చెప్పిన కీర్తనలే రామదాసు కీర్తనలు. చెరసాలలో అనేక కష్టాలు అనుభవించి విసిగి ఒకరోజున విషంత్రాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూండగా శ్రీరామ లక్షణులు తానాషాకు అంతఃపురంలో బంట్రోతులవేషంలో కనపడి రామదాసు పంపినట్లుగా పైకాన్ని చెల్లించారు. రసీదు తీసుకుని రామదాసును విడిపించారు.ఆ తరువాత రామదాసు తానాషా సమ్మతితో భద్రాచలంలో రాములవారికి కైంకర్యాలుచేస్తూ పరమభక్తుడుగా ప్రసిద్ధిని పొందాడు. సహజభక్తి భావావేశంతో తన్మయత్వంతో అప్రయత్నంగా కీర్తనలను రచించడమేకాకుండా 'దాశరధీ కరుణాపయోనిదీ అనే మకుటంతో దాశరదీ శతకాన్ని కూడా రచించాడు.

రామభక్తి కారణంగా గోపన్నకి రామదాసు అనే పేరు స్థిరపడిపోయింది. ఆంద్రదేశంలో ప్రసిద్ధిపొందిన మహాభక్తులు పోతరాజు, గోపరాజు, త్యాగరాజు. పోతన ముముక్షువు, మహాయోగి. సహజ పాండిత్యుడు. వ్యవహార భాషను కావ్యంలో ఇష్టపూర్తిగా ఉపయోగించి రామభక్తిని ప్రదర్శించిన మహాకవి. త్యాగరాజు మహాపురుషుడు, గొప్ప పండితుడు మహా సంగీతవేత్త, భక్తుడు. ఇతడు నాదసుధారసమైన రామభక్తికి అమరత్వాన్ని కల్పించి త్యాగోపనిషత్తు ఆనదగిన కృతి రాజములను రచించాడు. ప్రహ్లాద, పరాకర, నారద, పుండరీకాదులతో సమానుడని రామదాసుని త్యాగరాజు కీర్తించి భాగవత శిఖామణి రామదాసుని యందు భక్తిని ప్రదర్శించాడు.

గోపరాజు సంగీతాన్ని, సాహిత్యాన్ని సరసంగా మేళవించి రామభక్తి బీజాలను దేశంలో నలుమూలలా వెదజల్లాడు. శ్రీరామ చంద్రునికి తెలుగుతనం కల్పించిన భక్తశిఖామణి రామదాసు. శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సీతమ్మని మనలోనివారిగా రూపొందించి, భక్తిమార్గంలో జ్ఞానమార్గాన్ని కూడా అవలంబిస్తూ వైరాగ్యాన్ని సిద్ధింపజేసుకున్న మహాయోగి రామదాసు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: