telugudanam.com

      telugudanam.com

   

దేహమే దేవాలయం

ఋషి "దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి "జ్ఞాన హీనః పశుభిస్సమానః" అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము (1) "అహం బ్రహ్మాస్మి"=నేనే పరబ్రహ్మమును (2) "అయమాత్మాబ్రహ్మ"=నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు(3) "ప్రజ్ఞానం బ్రహ్మ"= విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ (4) "తత్వమసి"=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు.

పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా "సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా" మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు 'సుఖం ' లేదు 'శాంతి ' లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం అంటే మన నుండి ఉద్భవించిన సుఖం అవే జ్ఞానం మనం మరచిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత తద్వారా ఇన్ని అనర్ధాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి (1)వేదవాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూతస్థితిలో ఉండుట (2) శ్రుతి ప్రమాణాన్ని ఆచరించి అనుభూతి పొందిన మహాత్ముల 'పాదాలు ' ఆశ్రయించడమే.

పై మార్గములలో (1)వ మార్గము కొంత ప్రయాసతో కూడుకొనినటువంటిది. (2)వ మార్గాన్ని గూర్చి కొంత విచారణ అవసరం.అసలు మహాత్ములు, ఋషులు అంటే ఎవరు? సృష్టి ఆరంభంలో తొలుత దేహధారణ చేసి తద్వారా ఈ ప్రపంచ రూపకల్పనకు మూల పురుషులు ఋషులే. అందుకే ఇది ఋషి పరంపర మనమంతా వారి సంతతి వారమే కావున మన పేరున అర్చన చేసుకొనేటప్పుడు మన గోత్రం అడుగుతారు పూజారి, అప్పుడు మనం అంగీరస మహాముని గోత్ర, గౌతమ ఋషి గోత్రమని చెపుతుంటాం. అంటే ఇక్కడ మనం వాడే పేర్లు ఋషులవే. మానవజాతి అంతా ఋషి సంతతే ఇదే మన భారతీయ సంస్కృతి.

'శృతి ' చెప్పినట్లు (వేదం చెప్పినట్లు) నడిచేవాడు 'మానవుడు ' 'మతి ' చెప్పినట్లు నడిచేవాడు 'వానరుడు '. శృతి మాత చెప్పినట్లు మహర్షులు మంచిని ఆచరించి తన స్వార్ధానికి కాకుండా వారి జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి లోక కల్యాణ నిమిత్తం వారి జీవితాల్ని గడపడం మనం చూస్తూనే ఉన్నాం. వారు పొందే ఆనందాన్ని అందరూ పొందాలనేదే వారి కోరిక. అందుకే కాబోలు ప్రవచనాల ద్వారా, హొమాల ద్వారా, యాగాల ద్వారా, సంకీర్తనల ద్వారా, నిస్వార్ధ విగ్రహ ప్రతిష్ఠనల ద్వారా, క్రియా యోగము ద్వారా శాంతిని మనకు అందజేస్తున్నారు. అసలు మహర్షిని గుర్తించడం ఎలా? ఒక వ్యక్తి ఏ కులస్థుడైనా, మతస్థుడైనా, ఉచ్చ జాతి వారైనా లేక నీచజాతి వారైనా అతని వద్దకు మనం వెళితే మనకు తెలియకుండానే మనం అతని వద్ద ఉన్నంత సేపు ఒత్తిడిలో నుండి విముక్తులమై శాంతంగా ఉండగలిగితే అతను నిస్వార్ధ జీవన విధానావలంబుడై ఉంటే, అతడే మహర్షి, మహాత్ముడు, సాధువు, భగవంతుడు, అల్లా, యేసు, గురునానక్, అహర్మీస్థా అలాంటి సాధువుల చేతులు మంచి పనులే చేస్తాయి, కాళ్ళు లోక కళ్యాణ నిమిత్తమే నడుస్తాయి, కనుల ద్వారా చల్లని చూపు. అంతెందుకు శరీరంలోని ప్రతి అంగము పరిశుద్ధంగావింపబడి ఉంటాయి. "ప్రతి జీవిని తనవలె" చూచె ఉత్తమోత్తమ ఆలోచన వారి మనస్సులో నిరంతరం కదలాడుతుంది. ఇదే అసలైన మన భారతీయ సంస్కృతి. పవిత్ర భారత దేశంలో, నివురు గప్పిన నిప్పుల్లా ప్రపంచ శాంతి కోసం ఎందరో మహర్షులు వారి జీవితాలను, తృణ ప్రాయంగా పెట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి (1) మౌనం (2) పయోహారం (గోవు పాలు) మాత్రమే ఆహారంగా తీసుకొని (3) ఏకాంతవాసం చేసి (4) దిగంబరత్వం ఉండి గడుపుతున్నారు.

"సాధూనాం దర్షనం పుణ్యం స్పర్షనం పాపనాషనం"

అందుకే సాధువును దర్షించుకొంటే పుణ్యమనీ, వారి పాదాలను స్పృషించడం ద్వారా పాపాలు నాశన వుతాయని పెద్దల మాట. జ్ఞానస్థితిలో ఉన్న సాధువుల పాదాలలో సమస్త తీర్ధ క్షేత్రాలు ఉంటాయి. జ్ఞాన సహిత సాధువు దేహమే పవిత్ర దేవాలయం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: