telugudanam.com

      telugudanam.com

   

దారితప్పిన వానికి గురూచ్చిష్టం

సాయిబాబా నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతునికి ఎలాంటి రూపము, గుణములు లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు, మనస్సుకూ గోచరించడు. అన్ని ఆరాధనలకంటే నిర్గుణోపాసనే అత్యుత్తమమైనదని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం, సామాన్య మానవులకు సగుణోపాసనే అతి సులువైన మార్గం. అందుకనే ఆ భగవంతుడు మానవాళిపై కరుణతో మానవాకారంలో ఈ భువిపై సద్గురువు రూపంలో అవతరిస్తూ ఉంటాడు. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంధకర్త హేమాద్రివంత్ చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే శ్రీ సాయినాధులే స్పురణకు వస్తారు. కుల, మత పేద, గొప్ప అనే భేదం కనబరచక తనకు శరణుజొచ్చిన ఒక సామాన్యునికి ఆధ్యాత్మికోన్నతి ఎలా ప్రసాదించి, అనుగ్రహించారో ఇప్పుడు తెలుసుకుందాం!

కుశాభావు అనే టీచర్ ఒక సాధువును ఆశ్రయించి శుశ్రూష చేశాడు. అందుకు సంతోషించిన ఆ సాధువు కుశాభావుకు ఒక మంత్రం నేర్పాడు. ఆ మంత్రం ప్రభావం వలన పండ్లు, మిఠాయలు వంటి పదార్ధాలను అతను సృష్టించగలిగేవాడు. ఈ సంగతి తెలుసుకున్న ప్రజలు కుశాభావు చుట్టూ చేరి విసిగించసాగారు. అంతేకాక అతనొక మంత్రగాడని విమర్శిస్తూ, తమ సమాజం నుండి వెలివేసారు. ఇందుకు ఖిన్నుడైన కుశాభావు తిరిగి ఆ సాధువును ఆశ్రయిస్తే 'నువ్వు తక్షణం శిరిడీ వెళ్ళి సాయిబాబాను శరణు పొందు, నీకు మేలు కలుగుతుంది!" అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే 1909వ సంవత్సరంలో కుశాభావు శిరిడీ చేరాడు కాని శ్రీ సాయి అతనిని మశీదులోనికి రానివ్వలేదు. ఇటువంటి శక్తులు గలవారు వేశ్యలతో సమానం. వీరికిక్కడ ప్రవేశం లేదు, గోదావరి నదిలో స్నానం చేసి, ఆ శక్తులను విడిచిరా!" అని సాయి ఖచ్చితంగా చెప్పేసారు. కుశాభావు ఆ ప్రకారమే చేసాక, శ్రీసాయి అతని చేత 'దాసబోధ ' అనే ఆధ్యాత్మిక గ్రంధాన్ని చదివించారు. ఆ తర్వాత 'శ్రీగురు చరిత్ర ' అనే గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. ఒక రోజు ఏకాదశీ పర్వదినాన కుశాభావు ఉపవాసం చేస్తున్నాడు. ప్రసంగవశాత్తూ బాబాతో పూర్వం ఋషులు కందమూలాలు తిని బ్రతికేవారని అన్నాడు. వెంటనే శ్రీసాయి తన వద్ద ఉన్న కొన్ని ఉల్లిగడ్డను ఇచ్చి తినమన్నారు. కుశాభావ్‌కు ఏం చెయ్యాలో తోచలేదు. చివరకు శ్రీసాయి తింటే తనూ తింటానన్నాడు. వెంటనే సాయి కొన్ని ఉల్లిగడ్డలను తిని, చుట్టూ ఉన్న భక్తులతో "ఈ బ్రాహ్మణుడిని చూడండి! ఏకాదశి పూట ఉల్లిపాయలు తింటున్నాడు" అని గెలిచేశారు. కుశాభావు వారితో శ్రీసాయి అదేశిస్తేనే నేను తిన్నాను అంతే తప్ప నేను ఆచారం తప్పలేదు" అని అన్నాడు. శ్రీసాయి అందుకు అంగీకరించక తాను తిన్నది కక్కిచూపారు. ఆశ్చర్యం! అందులో కందమూలాల ముక్కలు ఉన్నాయిగాని ఉల్లిగడ్డలు మచ్చుకైనా లేవు! కుశాభావు వెంటనే బాబా కక్కిన దానిని మహాప్రసాదంగా భావించి గబగబా తీనేసాడు. బాబా అతనిని తిట్టి, తన సటకాతో కొట్టి వివరించారు కాని కుశాభావు వినలేదు. గురూచ్చిష్టం అత్యంత పవిత్రమైనదని సకల వేదాలు ఘోషిస్తున్నాయి. ఇటువంటి అవకాశం మరిక రాదని కుశాభావుకు తెలుసు అతని భక్తి శ్రద్ధలకు బాబాకు ఆనందబాష్పాలు కారాయి. వెంటనే అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించారు. అంతేకాక "ఎప్పుడు నువ్వు నన్ను స్మరించినా ఈ ద్వారకామాయిలోని ఊదీ నీ చేతిలోనికి వస్తుంది. కష్టాల కడలిలో ఉన్నవారికి, రోగగ్రస్థులకు ఈ ఊదీని ప్రసాదంగా ఇచ్చి వారికి ఉపశమనం కలుగజేయి!" అన్న ఒక్క గొప్పవరం ఇచ్చారు. నాటి నుంచి కుశాభావు జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగిన అతడు శ్రీసాయి భక్తులలో అతి శ్రీఘృడయ్యాడు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగాడు. దేశమంతటా పర్యటిస్తూ, శ్రీ సాయి దివ్యలీలావైభవంపై ఉపన్యాసాలను ఇస్తూ దీనజనులకు, అభాగ్యులకు బాబా ఊదిని ఇస్తూ వారి వారి పాపాలను, కష్టాలను దూరం చేస్తూ చివరకు శ్రీసాయిలో ఐక్యం అయ్యాడు. ఒక సామాన్య టీచర్ కొన్ని క్షుద్ర విద్యలను అభ్యసించి, చెడు మార్గము పట్టినప్పుడు, వానిని పిచ్చుక కాలికి దూరం కట్టి లాగిన విధంగా తన వద్దకు రప్పించుకొని, సత్సంగ పఠనంతో దివ్య నామజపంతో పవిత్రమొనరించి అతనిని ఎవ్వరికీ దక్కని విధంగా తన గురూచ్చిష్టాన్ని ప్రసాదించి ఆద్యాత్మికోన్నతి ప్రసాదించి, సంస్కరించిన వైనం అద్భుతం, అపూర్వం, అద్వితీయం.


సాయిబాబాసాయిబాబాసాయిబాబాసాయిబాబాసాయిబాబాసాయిబాబాసాయిబాబా

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: