telugudanam.com

      telugudanam.com

   

సమస్త ఆరాధనల మూల కేంద్రం - కాబా గృహం

ఆరాధనలకే ప్రాణం

కబ ఇస్లామ్ ధార్మిక భవనానికి అతి ముఖ్యమైన మూలస్తంభం హజ్. మనిషి మనస్సును దుర్నడతల నుండి కట్టడి చేసేందుకు, ప్రక్షాళన చేసేందుకు నిర్ణయింపబడ్డ అతి ముఖ్య ఆరాధనయే హజ్. ఇస్లాం లోని వేరువేరు ఆరాధనలన్నింటికీ ప్రాణం ఈ హజ్. వివిధ ఆరాధనలన్నీ హజ్ అనే ఈ చట్రంలో బిగించ బడ్డాయి. ఇవన్నీ సరియైన రీతిలో అమలు చేసినప్పుడే హజ్ పరమార్థం సఫలీకృతమవుతుంది.
ఉత్తమ జీవన సరళి

ఇస్లామ్ మౌలిక అంశాలలో ఒకటయిన నమాజ్ చెడుల నుండి మరల్చి క్రమశిక్షణాయుత జీవన సరళిని నిర్దేశిస్తుంది. ఋజుమార్గాన్ని చూపుతుంది. జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేస్తుంది. నిత్య జీవితంలో మనకు తారసపడే స్వార్థం, మోసం, అసత్యం, దురాశ, దుర్నడత, ద్వంద్వ నీతి మొదలైన చెడ్డ గుణాలను అరికట్టి నీతి, నిజాయితీ, సత్యసంధత, త్యాగభావం, దైవ భక్తి, పరోపకార పరాయణత్వం వంటి ఉన్నతమైన ప్రమాణాలతో జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. నమాజ్ మాదిరే ఉపవాస వ్రతాలు మనిషిలో దైవభీతిని కలుగజేస్తాయి. మనిషి ఆలోచనల్లో, చేతల్లో, అతని శరీరంలోని ప్రతి అంగంలో దైవ భీతిని తొణికసలాడేలా చెస్తాయి. ఇస్లామీయ నాగరికత, సంసృతి, నైతికతో కూడిన సంపూర్ణ మూర్తిమత్వం ప్రస్పుటమౌతుంది.


ఆరాధనల కేంద్రం

కబ మక్కా యాత్ర ( హజ్ ) సమస్త నమాజ్‌ల, ప్రపంచ మస్జిద్‌ల కేంద్రం. ప్రపంచ వ్యాప్త ముస్లిములు ఏకేశ్వరుణ్ణి ఆరాధించుటకు మొట్టమొదట నిర్మించిన ప్రార్ధన మందిరం కాబా గృహం అని దివ్య ఖుర్ఆన్ తెలియజేస్తున్నది. కాబా గృహ నిర్మాత ఎవరైనప్పటికి హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గృహాన్ని తన చేతులతో నిర్మించారని దివ్య ఖుర్ఆన్ ద్వారా తెలుస్తూ ఉంది. ఈ కాబా మస్జిద్ ప్రపంచంలోని మొత్తం మస్జిద్‌లకే మస్జిద్. ఈ హజ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే- ఇస్లాం ఏ ఏ ఆరాధనలను ప్రత్యేకించిందో, ఆ ఆరాధనలన్నింటికి ఊపిరిగా పరిగణింపబడుతోంది. ఇంటి నుండి హజ్ కోసం బయలుదేరిన వ్యక్తి ఏ కేంద్రం వైపు తిరిగి నమాజ్ చేశాడో, తన జీవితాంతమూ ఆ వైపే తిరిగి నమాజ్ ‌చేస్తున్నాడు. హజీ 'నేను ప్రపంచానికే కేంద్రమైన కాబెతుల్లాలో నమాజ్ చేస్తున్నాను' అనే అనుభూతి పొంది తరిస్తున్నాడు.


హజ్ కార్యక్రమాలు

కబ ఈ హజ్‌లో వివిధ రకాలైన నమాజ్‌లన్నీ మిళితమైనాయి. ఈ నమాజులన్నీ నిర్వర్తించడం కేవలం ఒక హజ్‌లో మాత్రమే సాధ్యమవుతాయి తప్ప మరే ఇతర సమయాల్లో వీలుపడవు. దివ్య ఖుర్ఆన్ మరియ హదీసుల్లో ' తవాఫ్ ' చేయడం నిజంగా నమాజ్ చేయడంతో సమానమే. ఈ నమాజ్ కేవలం ఖానా కాబా సమీపంలో మాత్రమే నిర్వహింపబడుతుంది. అంతకంటే మించి ఈ ప్రపంచంలో మరెక్కడ నిర్వహింపబడదు. ఈ నమాజ్‌లో దైవదాసుడు దేనినైతే అల్లాహ్ హస్తంగా పరిగణిస్తున్నాడో ఆ ' హజ్రె అస్వద్ 'ను చుంబించో, లేక చేతితో స్పర్శించో మాటిమాటికి తన రబ్ ( ప్రభువు )ను స్మరించు కొంటూ మైమరిచిపోతూ ఉంటాడు. తన్మయత్వంతో, అల్లాహ్‌లో లీనమయ్యానా అన్నట్లుగా అనుభూతి చెందుతాడు. ఇలా ' ఖానాకాబా 'లో వివిధములైన ప్రార్థనలను ప్రార్థిస్తూ దీపం చుట్టూ తిరుగు దీపం పురుగువలె పలుమార్లు ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. ఏ మాత్రం స్థిర చిత్తం, నిలకడ లేని వ్యక్తి సైతమూ మనస్సులో అనిర్వచనీయమైన అనందాన్ని పొందుతాడు. ఆ సమయంలో ఆ విశ్వాసి స్థితిని మాటలలో వర్ణించలేము. ఈ హజ్‌లో శరీరంతోపాటు ఆత్మ కూడా పాల్గొంటుంది. మనస్సు దైవ ప్రేమలో లీనమయిపోతుంది. బుద్ధీ, జ్ఞానాలు దైన సన్నిధిలో మోరిల్లుతాయి. కళ్ళనుండి అశ్రుధారలు ప్రవహిస్తాయి. నోరు దేవనామాన్ని పాప క్షమాపణ వాక్యాలను జపిస్తుంటుంది. గతంలో తను చేసిన పాపాలను, పొరపాట్లను గుర్తు చేసుకొని సిగ్గుతో కుంచించుకుపోతాడు. వాటిని మన్నించుమని దీనాతి దీనంగా దైవాన్ని వేడుకుంటాడు. ఇలా నిండైన హృదయంతో దైవ గృహం యాత్ర చేసేవారు దేవుని అతిధులుగా పరిగణింపబడతారు అని దైవ ప్రవక్త(స) సెల విచ్చారు.

అంతర్జాతీయ ఏకేశ్వరోపానసా కేంద్రంగా, ప్రబోధనా నిలయంగా వాసికెక్కిన కాబా గృహాన్ని గురించి దివ్య ఖుర్ఆన్‌లోని ఆలి ఇమ్రాన్ నూరా: 96వ వాక్యాన్ని చూడగలరు.

" ప్రప్రథమంగా మానవులకొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నది. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ ఇది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహిమ్ ప్రార్థనా స్థలం. దానిలో ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు "

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: