telugudanam.com

      telugudanam.com

   

మహాకాళి

మహాకాళి "అర్థేందు మకుటాం దేవీం వందే వారిధి సంభవాం

అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం"

ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం.


సమస్త శక్తికి ప్రతీక

మహాకాళి వీరందరిలోనూ కాళి తొలి విభూతి విశేష అవతారం. ఈ తల్లి సృష్టిలోని సర్వబలానికి ప్రతీక. ఇంతకంటే బలవతియైన శక్తి లేదు. ఈమె శత్రు భయంకరురాలు. అతి త్వరగా ప్రవర్తించటం, ఉద్విగ్న స్వభావం ఈ తల్లి లక్షణం. సృష్టిలో ఉన్న మంద లక్షణం, జడత్వం, సోమరితనం ఇవేవి ఆమెకు పడవు. తన వీరత వల్ల అసమ లక్షణాన్ని తొలగించి అంతటినీ దివ్యభావ వాస యోగ్యంగా చేస్తుంది. కాళి అనుగ్రహం అగ్నిజ్వాలవలె జీవుణ్ణి ఆవరిస్తుంది.


పరిక్రమించే శక్తే కాళిక

ఈ జగత్తులో ప్రతి కదలిక, ప్రవృత్తి, సన్నివేశాలు ఒక క్రమగతిలో సాగిపోతుంటాయి. ఈ క్రమంలో వికసించే జీవుని కర్తృత్వం నుంచి కాలం పుడుతున్నది. వర్తమానంలో ఉండే స్థితి క్రమంగా భూతకాలంలోకి జారిపోతుంది. భవిష్యత్తు వర్తమానంలోకి చొచ్చుకుని వచ్చి, మళ్ళీ గడచిన కాలంగా రూపుదిద్దుకుంటుంది. ఈ కాల ప్రవాహం కల్పాలుగా, మన్వంతరాలుగా, యుగయుగాలుగా, సంవత్సరాలుగా మాస, దిన, యామ, మూహూర్త, లిప్తలుగా ఎడతెరిపి లేకుండా సాగిపోతుంది. దీనిని ఇలా పరిక్రమించే శక్తికి కాళిక అని పేరు. ఆ తత్త్వమే పురుషుడై మహాకాలుడవుతున్నాడు. కాలానికి విచ్చిన్న ప్రవాహ లక్షణం ఉన్నది. అయితే ఈ కాలాన్ని అనుభవించే ద్రష్ట ఉన్నంతకాలం ఇది నిత్యమవుతున్నట్లుగానే భాసిస్తుంది. కాలం అనుభావకుడు లేనప్పుడు అంతర్హితమవుతుంది.


అమృతత్త్వ విద్య

కాలం అంటే మృత్యువనీ అర్థం. ఈ మృత్యు జీర్ణమైన శరీరాన్ని విడిపించి, మరొక శరీరాన్ని చేరుతున్నది. స్వర్గనరకాల అనుభవం ఉన్నది. మళ్ళీ జన్మ ద్వారా, మరొక శరీరం ధరించటం ద్వారా ఈ లోకంలోనూ, ఇతర లోకవాసం వల్ల అవిచ్చిన్నంగా తానూ-జీవుడు-అనంత యాత్ర చేస్తున్నాడు. ఆ అనంత యాత్రా క్రమంలో జీవుడు పొందే అనుస్యూతి ఒక విధంగా అమరత్వం కలిగించేదే. అయితే మృత్యువు లేకుండా దాన్ని సచేతనంగా పొంది, జాగ్రత్ స్థితిలో, స్మృతి పరంపరను కోల్పోకుండా అమృతత్త్వం పొందే విద్య కఠోపనిషత్తులో చెప్పబడింది. ఇలాంటి జీవుడుని కాలం తన పరిమితుల్లోంచి విముక్తం చేసి కాలాతీతమైన స్థితిని కలిగిస్తుంది. ఈ సాధన కోసం కాళిని ఉపాసించాలి. కాళి ఉపాసన ద్వారా ఉపాసకుడు కాలము తానై, కాలాన్ని అతిక్రమించవలసి ఉంటుంది. సర్వజీవులకు ఆనాదిగా సాగివస్తున్న భయం మృత్యువునకు సంబంధించిందే. శిథిలమై, రోగగ్రస్తమయ్యే తన జీవుడు శాశ్వతంగా భావిస్తున్నాడు. మరణం ఆసన్నమైన క్షణంలో సర్వం కోల్పోతున్నట్లు, తన తనం అంతమైపోతున్నట్లు వాపోతున్నాడు. కాళీమాత ఆ భయాన్నించి సాధకుడిని రక్షిస్తుంది.


ఆమె రూపం భయంకరం

కాళికా దేవి రూపం భయంకరమైనది.ఆమె నివాసం మహాశ్మశానం.ఆమె అక్కడ శవం మీద నిలిచి, ఆట్టహాసం చేస్తూ, నాలుక బయటకు, చాచి పుర్రెల హారాన్ని ధరించి, నాట్యమాడుతూ ఉంటుంది. ఆమె నాలుగు హస్తాలలో ఖండితమైన దైత్య శిరస్సునూ, ఖడ్గాన్ని, వరదాభయ ముద్రలనూ కలిగి ఉంటుంది. ఆమె దిగంబరి. ఏ ఆచ్చాదన లేని సనాతన క్రోధశక్తి. కాళి శబ్దం నలుపును తెలియజేస్తుంది.


భద్రకాళి...సర్వశుభంకరి

కాళి మూర్తులలో దక్షిణకాళి, భద్రకాళి అనే రెండు మూర్తులు ఉన్నాయి. దక్షిణ అంటే అంతర్బోధ వల్ల కలిగే క్రియాశీలత. భద్రశబ్దం అందరికీ మేలు కలిగించే అంశం. దక్షిణకాళి చేసే సంహార కృతం ప్రణాళికా రహితమైనది కాదు.నిరర్థకమైందీ కాదు. అది నిర్దిష్టమైన విశ్వపురోగమన శీలమైన కార్య నిర్వహణం.భవిష్య సృష్టి పురోగామి లక్షణం కలది కావాలి. భద్ర శబ్దం శుభదాయకమైంది. సర్వులకు క్షేమం కలిగించేదీ అయివుంటుంది. కాలం అనే పాకశాలలో వ్యక్తమైన జగత్తును ఆమె వండి దాన్ని రుచికరమైన పదార్థంగా పరిణమింపజేస్తుంది. అందుకే ఆమె పాచక శక్తి అవుతుంది.


యోగసాధకులకు కాళి అనుగ్రహం

"నాయమాత్మా బలహీనేన లభ్య" అని వేదం అంటున్నది. బలం సాధించాలి. బలం ద్వారా పరమాత్మను సాధించాలి. మూలాన్ని ఎరుగటం కేవలం ధీరులకే సాధ్యం. కాళీ ఉపాసన వీరసాధన. శ్మశానంలో శవం మీద కూర్చుని, సామాన్యులకు భీతిని కలిగించే అస్థి కపాలము మొదలైన వాటిని ఉపకరణాలుగా సాధన చేసే విధానము ఉన్నది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు, భాధలు భరించాల్సి ఉంటుంది. బ్రహ్మాండంలో మహాశక్తిగా సాక్షాత్కారం పొందే శక్తి శరీరంలో మూలాధారంలో కుండలనీ శక్తిగా నిద్రాదశలో ఉంటుంది.ఈ సాధన దశలో ఆమె మేల్కొని చుట్టుకుని ఉన్న తనను చేరరాని అనంత స్థుతులు, అంతస్తులు సులభంగా సాధకులకు అందుతాయి.ఏ యోగమార్గంలో సాగేవారికైనా కాళిమాత అనుగ్రహం తప్పనిసరి.


సర్వం కాళీ రూపాలే

విశ్వకుండలినీ శక్తి కాళియే. అక్కడి ప్రాణశక్తి ఉన్మేష నిమేశాలు ఆమె రూపంలో ప్రాణ శక్తులను పరిపాలిస్తున్నది. మనలోని ఉద్రేకాలు, తలుపులతో అల్లుకునే ప్రేరణలు గాఢమైన అనుభవాలు అన్నీ కాళికాదేవి రూపాలే. మన మనస్సును, ఆస్మితను మన ఉచ్చ్వాస నిశ్వాసాలతో అనుబంధం చేసి ఈ సాధన కొనసాగించవలసి ఉంటుంది. ఈ దేవతార్చన కోసం, భావం కోసం ఉద్దిష్టమైన తత్త్వం క్రీం బీజాక్షరంలో నిక్షిప్తమై ఉన్నది.


రెండు రూపాలలో కాళి

కాళికా దేవియే ప్రధాన దేవత అనీ, అన్ని విద్యలు ఆమె నుంచి ఉద్భవించాయనేది ఒక సంప్రదాయం. ఆమె దక్షిణ వామ పార్శ్వాలలో, దక్షిణ వామ రూపాలలో ప్రకటితమయ్యింది. బృహన్నీలా తంత్రం ప్రకారం రక్త కృష్ణ భేదంతో కాళికాదేవి రెండు రూపాలలో ప్రకటితమయింది. రక్త రూపంలో ఆమె సుందరి. కృష్ణ రూపంలో దక్షిణ అని ఖ్యాతి నొందింది. దేవతలు మతంగముని ఆశ్రమం చేరి అక్కడ మహామాయా స్తోత్రం చేసారు. అక్కడ దేవి మతంగ స్త్రీ రూపంలో దర్శనం ఇచ్చింది. ఆమె దేవతలను మీరెవరిని స్తుతిస్తున్నారు అన్నది. ఆమె అప్పుడు కాటుక వంటి నీల వర్ణంలో ఉన్నది. అందుకే కాళి అయిందని కాళికా పురాణం చెప్పింది.


అష్టవిధ కాళికలు

మహాకాళి మరికొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల వర్ణనం ఉన్నది. 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక. ఇంకా సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి ఈమె మూర్తి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది. కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి. 22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది. పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం, షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం పేర్కొన్నది.ఈ మంత్రాల సాధనలో నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలు కుడా చెప్పబడ్డాయి.

దశ మహా విద్యలలో మొదటిది కాళి. సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. కాలాన్ని నడిపించేది, సాధకులజి మృత్యు భయాన్ని పోగొట్టేదీ ఆమే. ఆమెఉపాసన గొప్పానుభూతి. కఠినతరమైన ఆ ఉపాసన చేయగలిగితే అనంత శుభ ఫలాలు అందుతాయి.

శిధిలాలను తొలగించి నూతన నిర్మాణాన్ని చేపట్టిన విధం మహాకాళిక తత్వంలో ప్రకటితమవుతుంది. కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళ్ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు. తమో గర్భంలో దాగివున్న వెలుగుని, మృత్యు గర్భంలో దాగి వున్న చేతనను, ఆ విద్యలో బీజ భూతంగా నిద్రాణ స్థితిలో ఉన్న జ్!నానాన్ని మేల్కొలిపే ప్రాణ రూపమైన మహా ప్రచండాగ్ని కాళికా దేవి.


మూలం: ఆంధ్ర జ్యోతి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: