telugudanam.com

      telugudanam.com

   

ఆంధ్రులు ఎవరు? ఎక్కడి వారు?

మహాభారతంలో ఆంధ్రులు రాజ్యాధిపతులనీ, ధర్మరాజును సేవించారనీ ఒక సందర్భంలో ప్రస్తావనకు వస్తుంది. మయ సభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓఢ్ర రాజులతోపాటు ఆంధ్ర రాజులు కూడా ధర్మరాజుని కొలిచారని సభా పర్వంలో చెప్పబడింది.

క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన భరతుని నాట్య శాస్త్ర గ్రంధంలో పాత్రోచిత భాష గురించిన సందర్భంలో ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తూ నబర్బర కిరాతాంధ్ర దమిలాది జాతుల విషయంలో ప్రాక్రుతాలను వాడరాదనీ, వారి వారి మాండలికాలనే వాడాలని తెలిపాడు.

వ్యాస భారతంలో అనేక సందర్భాలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రులు ద్రౌపది స్వయంవరానికి విచ్చేసినవారిలో ఉన్నారనీ, కురుక్షేత్ర సంగ్రామంలో వీరు కౌరవుల పక్షాన పోరాడారని వివరించబడింది.

వాయు పురాణంలో ఆంధ్ర రాజులైన ఆంధ్ర భ్రుత్యుల పేర్లు, వారి పరిపాలనా కాలం సూచించబడ్డాయి. ఆంధ్ర భ్రుత్యులే శాతవాహన రాజులు. వారు క్రీ.పూ. 230-క్రీ.శ.225 మధ్య ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు.

మెగస్తనీస్ (క్రీ.పూ.400) మౌర్యుల తరువాత చతురంగ బలంలో ఎన్నదగినవారు ఆంధ్రులే అని ప్రశంసించాడు.

అంధ్రులు అందగత్తెల్నీ, యుద్ధరంగాన్నీ సమానంగా ప్రేమిస్తారనీ, అందమైన శరీరాలున్నవారనీ, తిండిలో దిట్టలనీ ఉద్యోతనుడు (క్రీ.శ.9వ శతావ్దం) కువలయిమాల అను ప్రాక్రుత గ్రంధంలో వివరించాడు.

ఆంధ్ర అంటే అజేయమైన, ఓటమి చెందని అనే అర్ధముండడంతో ఓటమినెరుగని వీరిని ఆంధ్రులు అనేవారని కొందరి అభిప్రాయం.

ఆర్యావర్త వాసులకు దక్షిణ హిందూ దేశం గురించి తెలియదు. దాంతో వారు మన తెలుగు ప్రాంతాన్ని అంధ్ర దేశమని పిలిచేవారు. అంధ్ర దేశమంటే చీకటి దేశమని అర్ధము.అంధ్ర శబ్దమే ఉచ్చారణలో కాలక్రమేణ ఆంధ్ర శబ్దంగా మారింది అని కొందరి అభిప్రాయం.మరికొందరు ఆంధ్ర అనే పదం వీరు వేటకాండ్రు కావడంవల్ల వేటలో జీవించేవారు కావడంవల్ల వచ్చిందని చెబుతారు. ఆంధ్రులు వేటాడి జీవించేవారని "మను స్మ్రుతి" గ్రంధంలో చెప్పబడింది.

శత్రువుల్ని అంధులుగా చేసేవారు కాబట్టి వీరిని అంధకులు అనేవారని, అంధకులు అనే పదం తర్వాత్తర్వాత ఆంధ్రులుగా మారిందనీ చెబుతారు.

రుగ్వేదంలో ఆంధ్ర పదముంది. కాబట్టి ఆంధ్ర జాతి అప్పటికే (అంటే క్రీ.పూ.600 సం.) ఉందని తెలుస్తోంది.

ఆంధ్ర అనే పదం వీరు వేటకాండ్రు కావడంవల్ల, వేటలో జీవించేవారు కావడంవల్ల వచ్చిందని చెబుతారు. ఆంధ్ర శబ్దానికి వేటగాడు అనే అర్ధముంది. సంగం యుగానికి సంబంధించిన తమిళ గ్రంధాలలో తెలుగువారిని "వడుగర్" అని పేర్కొంటూ, వారు వేట కుక్కలతో సంచరిస్తారని వర్ణించడం గమనిస్తే ఆంధ్రులకు వేట చాలా ప్రాచీనమైన వేడుక అని చెప్పవచ్చు.

భాగవతం ప్రకారం బలి చక్రవర్తి కుమారులు ఆరుగురూ తమ తమ పేర్లతో రాజ్యాలు స్థాపించారనీ, వారిలో ఆంధ్రుడు అనే అతను ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించినట్లు చెపబడింది.

భారతీయ వాంగ్మయంలో "ఆంధ్ర" పదాన్ని "అస్థ్ర", "అంధక", "ఆంధక" పర్యాపదంగా వాడేవారు. వాస్తవానికి ఆంధ్రము అనేది సంస్ర్కుత పదము.

ఆంధ్ర పదాన్ని మొట్టమొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో (క్రీ.పూ.600) వాడారు. ఈ బ్రాహ్మణంలో ఈ పదాన్ని జాతిపరంగా వాడారు.ఐతే బ్రుహత్సమ్హితలోనూ, సంస్ర్కుత భారతం లోనూ, హుయన్సాంగ్ రచనలలోనూ అంధ్ర శబ్దం ఒక దేశ శబ్దంగా వాడబడింది. ఆంధ్ర పదాన్ని తెలుపుతూ పలు శాసనాలు లభ్యమయ్యాయి. వీటిలో అశోక చక్రవర్తి వేయించిన 13వ ధర్మ శిలా శాశనము ఒకటి. శివస్కంధవర్మ వేయించిన మైదవోలు తామ్ర శాసనంలో ఆంధ్ర పదాన్ని దేశపరంగా వాడారు.

ఆంధ్ర శబ్దాన్ని జాతిపరంగా వాడిన వారు మెగస్తనీస్. ఆంధ్రులు వేటాడి జీవించేవారని "మను స్మ్రుతి" గ్రంధంలో చెప్పబడింది.

బౌద్ధ వాంగ్మయంలో ఆంధ్ర రాష్ర్టాన్ని అంధకరట్టి అని పేర్కొన్నారు.

నాట్య శాస్త్రం గ్రంధంలో ఆంధ్ర శబ్దం మొట్టమొదటిసారిగా భాషాపరంగా ప్రయోగించబడింది.

ఆంధ్ర శబ్దం భాషాపరంగా వాడిన మొదటి రచన "ఆంధ్ర శబ్ద చింతామణి".

ఆంధ్ర అనే పదం ఏవిధంగా ఉద్భవించిందో తెలుసుకున్నారుగా? ఐతే ఈ విషయంపై ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. పరిశోధనలో ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తాయో?

మరో గొప్ప విషయంతో ఇక్కడితో ముగిద్దాం.

అదేంటంటే : దక్షిణ భారత దేశంలోకి ఖడ్గాన్ని ప్రవేశపెట్టిన వారు ఆంధ్రులు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: