telugudanam.com

      telugudanam.com

   

ఆహార పదార్థాల తయారీలో వాటి ప్రయోజనాలు, విధులు

ఆహారాన్ని వండేటప్పుడు, తయారు చేసేటప్పుడు రకరకాల దినుసులను, పదార్థాలను కలుపుతుంటాం. కొన్నిటిని కేవలం ఆకర్షణ కోసం కలిపితే కొన్నిటిని పోషక విలువల కోసం కలుపుతాం. మరికొన్నిటిని కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించి కలుపుతాం. ఇలాంటి పదార్థాలను ఆయుర్వేదంలో ప్రక్షేప ద్రవ్యాలంటారు. ఏ పదార్థాన్ని ఎందుకు కలుపుతున్నామో, అసలు ఆయా పదార్థాల ప్రయోజనం ఏమిటో తెలిస్తే ఆహారం తయారు చేసే విధానంలో, వంటల్లో నూతన పద్దతులను ఆవిష్కరించవచ్చు.


వంటషోడా లేదా బేకింగ్ షోడా

దీనిని ఏదైనా ఆమ్ల పదార్థంతో కలిపి నీళ్ళు చేర్చితే రసాయన చర్య జరుగుతుంది. దీనితో కార్బన్‌డై ఆక్సైడ్ వాయువు విడుదలై పిండిని లేదా ఆహారపదార్థాన్ని పొంగేలా చేస్తుంది. బేకింగ్ షోడాకు ద్రవపదార్థం తగిలిన వెంటనే రసాయన చర్య ప్రారంభమవుతుంది. కనుక పదార్థాలను కలిపిన తరువాత ఎక్కువసేపు ఆలస్యం చేయకూడదు. ఒక వేళ ఎక్కువసేపు ఉంచితే విడుదలైన వాయువు పోయి పదార్థం పొంగదు.


బేకింగ్ పౌడర్

ఇది బేకింగ్ సోడా వంటిదే. కాకపోతే, దీనిలో వంటసోడాతో పాటు ఆమ్ల పదార్థాన్ని, నీటితేమను గ్రహించే మరో రసాయన పదార్థాన్ని కలుపుతారు. దీన్ని తడిగ ఉండే పదార్థానికి కలపడంతోనే రసాయన చర్యప్రారంభమై కార్బన్‌డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఫలితంగా కలిపిన పదార్థం పొంగి చిద్రయుక్తంగా తయారవుతుంది.


బ్రెడ్ ముక్కల పొడి

ఆహార పదార్థాలకు మృదుత్వాన్ని, కొంత నిండుతనాన్ని కలిగించడం కోసం బ్రెడ్ ముక్కల పొడిని వాడతారు. దీనిని ఇతర పదార్థాలతో కలిపిగాని, లేదా విడిగా మాంసం మొదలైన వాటికి కోటింగ్ ఇవ్వటంకోసంగాని వాడతారు.


మొక్కజొన్న పిండి

దీనికి కార్న్‌మీల్ లేదా కార్న్‌ఫ్లోర్ అని పేరు. దీనికి జిగురుగా ఉండే తత్వం బాగా తక్కువ. మొక్కజొన్నపిండిని చేర్చి తయారుచేసిన ఆహారపదార్థాలు దళసరిగా, తుంపితే తునిగిపోయేటట్లు పెళుసుగా ఉంటాయి. కాగా, మొక్కజొన్న గింజల మధ్యభాగంతో తయారైన మెత్తని పిండిని కార్న్‌స్టార్చ్ అంటారు. సాస్, గ్రేవి, సూప్, డెసర్ట్స్ వంటి ఆహారపదార్థాల చిక్కదనాన్ని పెంచడానికి దీనిని వాడతారు.


పంచదార

టీపొడి మరిగేటప్పుడు పంచదారవేస్తే టీకి మంచి రంగు వస్తుంది. ఈస్ట్‌తో బ్రెడ్‌ను తయారు చేసేటప్పుడు కలిపితే ఈస్ట్ నుంచి గ్యాస్ విడుదలవటానికి సహకరిస్తుంది. పంచదార కలపటం వల్ల బ్రెడ్ లేదా రొట్టెలకు స్నిగ్థత్వం, తేమ, మృదుత్వం వంటివి ఏర్పడతాయి. సాధారణంగా మనం వాడే పంచదారను గ్రాన్యులేటెడ్ లేదా వైట్ షుగర్ అంటారు.


మసాలా దినుసులు

మసాలా దినుసులు, లేదా మూలికలంటే సువాసనలు వెదజల్లే ఆకులు, కాయలు, పండ్లు, బెరడు, కాండం, మొగ్గలు, మెదలైనవి. ఆహారానికి తాలింపు వెయ్యడానికి వీటిని వాడుతుంటారు. మసాలా దినుసులను, మూలికలను తాజాగా, పచ్చిగా ఉన్నవిగాని లేదా ఎండబెట్టినవిగాని వాడవచ్చు. ఏరూపంలో వాడుతున్నారనే దానిని బట్టి మోతాదును నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కరివేపాకు, పుదీనా, మెంతికూర, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, బిర్యాని ఆకు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మూలికలే. వీటిల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. వీటిలో పోషకతత్వాలకంటే ఔషధతత్వాలు, రుచి, రంగు వంటి ఇతర లక్షణాలే ఎక్కువ.


ఉప్పు

ఉప్పు, పదార్థాల రుచిని, సువాసనను పెంచుతుంది. ఒక వేళ ఏదైనా కారణం చేత ఉప్పును ఆహారాల్లో తగ్గించాల్సి వస్తే దాని నష్టాన్ని భర్తీ చేయడానికి ఇతర సుగంధ ద్రవ్యాల మోతాదును పెంచాల్సి ఉంటుంది. ఆహారపదార్థాల తీపిదనం సైతం పెరుగుతుంది. ఉప్పును చేర్చడం వల్ల ఈస్ట్ చర్యైన పులిసే ప్రక్రియ వేగం తగ్గిపోతుంది. అందుకే పులియబెట్టాల్సిన ఆహారాలకు ముందుగానే ఉప్పును కలపకూడదు. మనం సాధారణంగా రోజువారీగా వాడేది మెత్తటి ఉప్పు దీనినే టేబుల్ సాల్ట్ అంటాం.


అటుకులు

బియ్యాన్ని 45 నిమిషాలు వేడినీళ్ళలో నానబెట్టి, తడి ఆరిపోయేలాగా ఆరబెట్టి యంత్రాలలో రోస్ట్ చేసి తాలికలుగా మారిస్తే అటుకులు ఇన్‌స్టంట్ ఆహారంగా పనిచేస్తాయి. వేడినీళ్ళలో చాలాసేపు నాని ఉండటం, పల్చని పొరమాదిరిగా ఉండడం వల్ల వీటిని ఆహారపదార్థంగా మార్చటం చాలా తేలిక. దీనిని పాలు మొదలైన వాటిల్లో నానబెట్టి అల్పాహారంగా తీసుకోవచ్చు. లేదా నీళ్ళు చిలకరించి కొద్దిగా వేడిచేసి వేడిగాకూడా తీసుకోవచ్చు. తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారు అటుకులు పథ్యంగా తీసుకోవచ్చు.


ఓట్‌మీల్

ఓట్స్‌ని ఆయుర్వేదంలో యవగోధుమలు అంటారు. ఇవి చూడ్డానికి దాదాపు గోధుమల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే, గోధుమలతో పోలిస్తే పోషకతత్వాలు తక్కువ, పీచుపదార్థం ఎక్కువ. అందుకే స్థూలకాయంతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. మధుమేహం వ్యాధి ఉన్నవారు కూడా వాడవచ్చు. అటుకుల మాదిరిగానే ఓట్స్‌ని చితకకొట్టి ఓట్ మీల్స్ తయారుచేస్తారు. దీనిని ఇన్‌స్టంట్ ఆహారంగా, పాలలో నానేసి తీసుకోవచ్చు. ఆహారపదార్థంగా వండాలనుకుంటే నీరు చేర్చి ఉడికిస్తే 5 నిమిషాల్లో వంటకం సిద్దమవుతుంది.


మెంతులు

ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకొనే పదార్థాలు మనకు తెలియకుండానే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో మెంతులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనవి. మెంతులను కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్యసమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని లాభాలను పొందవచ్చు.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: