telugudanam.com

      telugudanam.com

   

పెరుగు - ప్రయోజనాలు

వేసవి కాలంలో ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి పెరుగును మించిన వస్తువు మరొకటి లేదు. పెరుగున ఎక్కువగా వాడుతూండటం చేత పంజాబీలు అంత దిట్టంగా, బలంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారాలలో పెరుగు చాలా ముఖ్యమైనది. దీనిలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

మీగడ తీయని పాలనుంచే పెరుగు తయారు చేయడం మంచిది. మీగడ లేని పాలతో చేసిన పెరుగు త్వరగా పులిసి పోవడమేగాక విలువైన ఆహారానికి కావలసిన పదార్ధాలు తగ్గిపోతాయి ఉపయోగ పడదు. కాని పెరుగు చిలికి వెన్నతీసిన పుల్లటి మజ్జిగ వేసవికాలంలో మంచి పానీయం, దాహం కట్టేస్తుంది. అందుకే కాబోలు తక్రం శక్రే నాపి దుర్లభం అంటారు. భారతదెశంలో దక్షిణాదిని చాలా మంది పొద్దున్నే టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ త్రాగుతారు.

మన దేశంలో పెరుగు అనాదికాలంనుంచీ మంచి ఉపయోగ వస్తువుగా వాడబడుతూంది. ఆరోగ్యాన్ని అధికంచేసే గుణంవల్ల, సౌందర్యాన్ని హెచ్చించే గుణంవల్ల పెరుగును ఇప్పుడీప్పుడూ పశ్చిమదేశాలలో విరివిగా వాడుతున్నారు. పెరుగు అమోఘంగా చర్మాన్ని శుభపరుస్తుంది కాబట్టి సౌందర్య పోషకులు చాలామంది దీనిని అందాన్ని ఎక్కువ చేసుకోడానికి సౌందర్య వర్ధనిగా వాడతారు. శరీరంలో నరాలకు, శరీరపు చర్మానికి అందాన్ని అభివృద్ధిపరచే పదార్ధాలు దీనిలో చాలా ఉన్నాయి. ఎండదెబ్బతిని వాడిపోయిన చర్మానికి సహజ కాంతిని కలిగిస్తుంది. పెరుగులో ఉండే సూక్ష్మజీవులు మన శరీరానికి కాంతిని, నునుపును కలిగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. పంజాబులో చాలా మంది పిల్లలకి మొదట పెరుగును ఒంటినిండా పట్టించి మర్ధనాచేసి ఆ తరువాత స్నానం చేయిస్తారు. పెరుగును మర్ధనా చేయడంవల్ల శరీరానికి మంచి తెలుపు కూడా వస్తుంది.

ప్రాచీన కాలమ్నుంచీ కూడా శిరోజాల సంరక్షణకి పెరుగును ఉపయోగిస్తున్నారు. శిక్కులు శిరోజాలను శుభ్రం చేసుకోడానికి పెరుగును వాడతారు. పెరుగువల్ల జుత్తు బాగా గట్టిపడి మృదువుగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. స్నానం చేసే ముందు పెరుగును బాగా కుదుళ్ళకు తగిలేటట్టు తలకు పట్టించాలి. ప్రసిద్ధి చెందిన హెయిర్ షాంపూలకంటె పెరుగు ఉత్తమమైనది.

తలలో చుండ్రుతో బాధపడేవారు స్నానానికి ముందు అరగంటసేపు పెరుగును తలకు బాగా పట్టించి మర్ధనా చేయాలి. తల చుండ్రుకి ఇది చాలా అమోఘమైన ఔషధం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విష్యం పెరుగును ఫ్రిజ్‌లో పెట్టి ఉంచకూడదు. పెరుగును బయట మూడు రోజులపాటు గాలి తగిలేటట్టుగా ఉంచాలి. ఇటీవల పండ్ల రసాలు చేర్చిన పెరుగును ముఖాన్ని శుభ్రం చేయడానికి చాలామంది వాడుతున్నారు. ఒక కప్పు గాని కలపాలి. దీన్ని ముఖానికి, మెడకి బాగా పట్టించి ఐదు నిముషాలపాటు ఉంచి తరువాత మెత్తటి మెల్లిగా తుడిచి నీళ్ళతో కడిగి పొడి తువ్వలుతో మెల్లిగా అద్దాలి.

చర్మాన్ని చాలా మృదువుగా నిగనిగలాడుతూ అందంగా, తాజాగా ఉంచుకోడానికి ఓటు ధాన్యం పిండి పెరుగులో కలిపి ఉపయోగిస్తే చాలా బాగా పని చేస్తుంది. సాధారణంగా సౌందర్యపోషకులు దీనిని సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ రోటు పిండి, పెరుగు కలిపిన ముద్ద ముఖానికి పట్టించి, అర్ధగంటసేపు ఉంచి వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా సక్రమంగా కొన్ని రోజులు అనుసరించాలి.

ఓటు ధాన్యం పిండికి బదులుగా వరిపిండి వాడవచ్చు. వరిపిండి పెరుగులో కలిపి ఆ ముద్దని ముఖానికి, మెడకి, ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత స్నానం చేయడం మంచిది. దీనివల్ల చర్మం బాగా శుభ్రపడుతుంది పొడిగా ఆరిపోయి ఉండే ముఖమైనా సరే, జిడ్డుగా ఉండే ముఖమైనా సరే రెంటికీ ఇదే సధనం. కాని ముఖం ఎక్కువగా ఆరిపోయినట్టుండి మొటిమలు దేరి ఉంటే మాత్రం దీన్ని ఉపయోగించకూడదు.

ముఖం మీది మొటిమలు ఎక్కువగా ఉంటే పెరుగులో శనగపిండి కలిపి ఉపయోగిస్తే బాగా పని చేస్తుంది. శనగపిండి, పెరుగు కలిపిన ముద్ద ముఖానికి బాగా రాసి తరువాత నీటితో కడగాలి. మొటిమలు పోతాయి. ముఖం శుభ్రపడుతుంది, నిగారింపు వస్తుంది. ముఖం మీద మచ్చలుంటే సాధారణంగా ముల్లంగి రసం తీసి ఈ రసంతో మజ్జిగ చేర్చి ముఖానికి పట్టించి గంటసేపు అయిన తరువాత నీళ్ళతో కడిగి, పొడి గుడ్డతో తడిని అద్దాలి.

మస్లిన్ బట్ట మజ్జిగలో ముంచి ఆ బట్ట ముఖం మీద పెట్టాలి. ప్రతీ పదేసి నిముషాలకు ఒక్కొక్కసారి ఆ బట్టను మజ్జిగలో ముంచాలి.

నాలుగు అయిదుసార్లు ముఖం అద్దుకుని, తరువాత శుభ్రమైన పొడి బట్టతో తుడవాలి. చల్లని నీళ్ళు ఉపయోగించవద్దు. గోరు వెచ్చని నీటిలో తువ్వాలు ముంచి తుడుచుకుంటే మంచిది. ఇది అమోఘమైన సౌందర్య సాధన. రాత్రి పడుకునే ముందు ఉపయోగిస్తే బాగా పని చేస్తుంది.

కొన్ని చుక్కలు బాదం నూనె, పన్నీరు, ఒక చెంచా మజ్జిగ కలిపి ముఖానికీ, మెడకీ, శరీరానికి స్నానం ముందు పట్టించి అరగంట తరువాత తువ్వాలుతో తుడిచి స్నానం చేయాలి. మరో కొత్త సౌందర్య సాధన రెండు చెంచాల ఈస్ట్‌ను రెండు చెంచాల పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచి తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. పైవి సులభంగా దొరకనప్పుడు బాగా చిలికిన పెరుగు కొంచెం ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడిగితే చాలు. ఇది కూడా చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

మజ్జిగతో చాలా సౌందర్య సాధనలు చేయవచ్చు. చర్మం కనుక ఎండ దెబ్బకి బాగా వాడిపోతే 5 చెంచాల మజ్జిగలో 2 చెంచాల టిమాటో రసం కలిపి రాసుకుని అరగంట తరువాత కడిగేసుకుంటే మంచిది. అలసి పోయిన కాళ్ళకి కూడా పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. నాలుగు చెంచాల మజ్జిగలో కొంచెం వినిగరు కలిపి కాళ్ళకు పట్టిస్తే చర్మంలో నశించిన టిస్యూలను బాగుపరచి కాళ్ళలో బిరుసును లాగేస్తుంది. ఈ మిశ్రమాన్ని వారం రోజులదాకా ఫ్రిజ్‌లో ఉంచుకొని స్నానానికి ముందు కాళ్ళకు, పాదాలకు వాడవచ్చు.

తలలో వేడి పుట్టినప్పుడు, నిద్ర బాగా పట్టనప్పుడూ కొద్దిపాటి పెరుగు తలకు మర్ధనా చేయాలి. లేదా పెరుగును తలకు బాగా పట్టించి ఒక గుడ్డను తలకు కట్టుకోవాలి. దీని వల్ల తలలో పుట్టిన వేడి తగ్గుతుంది. బాగా నిద్రపడుతుంది.

ఆఫ్రికాలో కొన్ని జాతులవారు పెరుగు ఎక్కువగా వాడుతూండటంచేత వారికి గుండె జబ్బులు చాలా తక్కువని అంటారు. క్యాన్సర్ వ్యాధికి కూడా పెరుగు చాలా ఉపయోగిస్తూందని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: