telugudanam.com

      telugudanam.com

   

అదనపు ఆహారం

ఒక్క క్షణం...

తల్లిపాలు - శిశువు పెరుగుదల, అభివృద్దికి సహజమైన, అసమానమైన ఆహారం. ఇవి ఎన్నో విశిష్టతలు కలిగినప్పటికీ శిశువుకు 4 నుండి 6 నెలల వయసు వచ్చాక వారు పెరుగుతున్న అవసరాలు తీర్చలేవు. తల్లిపాలపైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే ఆహారానికి మారే దశను 'వీనింగ్' అంటారు.

మనం భుజించే ఆహారంవల్ల పిల్లల కడుపునిండినా అందులో పోషక విలువలు తక్కువ. శిశువుకు గల ప్రత్యేక అవసరాలదృష్ట్యా మన ఆహారంలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లైతే అది శిశువు అవసరాలను తీర్చగలుగుతుంది. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు నమ్ముతున్నట్లుగా బజార్లో అమ్మే సెరిలాక్, ఫారెక్స్ లాంటివే ఇవ్వాల్సిన అవసరంలేదు. ఇంటివద్దనే తయారు చేసినవి ఇవ్వడంవల్ల అనవసరమైన ఖర్చు తగ్గడమేకాక సహజమైన ఆహారాన్ని తాజాగా ఇవ్వడానికి వీలౌతుంది.

తల్లిపాలతోపాటు అదనపు ఆహారం తినే వయసులోనే పిల్లలు ప్రాకడం నేర్చుకుంటారు. కనిపించిన ప్రతి వస్తువును నోట్లో ఉంచుకొని పరిశీలిస్తారు. దీనివల్ల వాతావరణంలోని సూక్ష్మజీవులు శిశువు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనితోపాటు శిశువుకు 4-5 నెలల వయసు వరకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సంక్రమించిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ రెండిటివల్ల అనుబంధాహారం ప్రారంభించే వయసులో నీటి విరోచనాలు కావడంకూడా ఎక్కువే. అదనపు ఆహారం ఇవ్వడంలో సరియైన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అతిసార వ్యాధి రాకుండా నివారించవచ్చు.

శిశువుకు ఇచ్చే ఆహారం ఎక్కువ పోషక విలువలు కలిగి సుళువుగా జీర్ణించుకోవడానికి వీలుగా ఉండాలి. సరియైన పెరుగుదల, అభివృద్దికి కేవలం పోషకాహారమే సరిపోతుందనుకోవడం పొరపాటు. వారి మానసికాభివృద్దికి కావలసిన ప్రేరణ, పిల్లలను పెంచడంలో మెలకువలు కూడా ఎంతో ముఖ్యమైనవి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: