telugudanam.com

      telugudanam.com

   

ఆరోగ్యం - ప్రాముఖ్యత

ఆపిల్సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆర్ధిక ఉన్నతి అదృష్టం మీదనఒ, కష్టానికి తగిన ఫలితం మీదనో ఆధారపడి ఉండగా ఆరోగ్యం మాత్రం వారి వారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ మహద్భాగ్యాన్ని పొందడం కోసం అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు యోగాను ఆశ్రయిస్తే, మరికొందరు ఇతర వ్యాయామాలను, మరికొందరు ప్రాణాయామాన్ని, ఆరోగ్య నియంత్రణ సూత్రాలను పాటిస్తుంటారు. జాతిపిత మహాత్మా గాంధి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో విలువైనవి బంగారు, వెండి ఆభరణాలు కాదు, అరోగ్యం మాత్రమే అన్నారు. ఈ మాటని అంగీకరించకుండా ఉండడం అసాధ్యం. అయితే నేడు ఎంతమంది ఈ సత్యానికి దగ్గరగా ఉంటున్నారు? ఎందరు ఆరోగ్యంపట్ల నిజమైన శ్రద్ధ కనబరుస్తున్నారు? అని అలోచిస్తే సమాధానం అంత ఆశాజనకంగా కనిపించదు. స్పీడు యుగంలో ఆహారాన్ని కూడా అంతే స్పీడుగా అదేదో మొక్కుబడి వ్యవహారంగా భావిస్తూ ఎందరో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడే తొందర, చింత, ఒత్తిడిలతో సతమతమవుతూ తీసుకునే ఆహారంపట్ల ఏమాత్రం ఆసక్తి చూపించలేకపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ పట్ల మక్కువ చూపుతూ కలుషితమైన ఆహారం తీసుకుంటున్నాడు. నేడు కల్తీ లేని ఆహారంగానీ, కలుషితం కాని వాతావరణం గానీ కనిపించదు. ఇటివంటి పరిస్థితుల్లోఅ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించడం అవసరం.

గ్రామీణ ప్రాంతాల్లో.ఉన్న ఆరోగ్యంగ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలకంటే మెరుగైన ఆరోగ్యనికి అవకాశమున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు కారణం కలుషితం కాని వాతావరణమే. వాతావరణం కలుషితం కాకపోవడానికి కారణం అక్కడి పర్యావరణమే. పర్యావరణం పచ్చగా ఉండడమే పల్లెటూళ్ళు ఆరోగ్య కేంద్రాలై పల్లె ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా జీవించగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో పర్యావరణంకంటే కూడా కార్పొరేట్ ఆసుపత్రులపట్ల దృష్టి సారిస్తుండడమే పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడానికి కారణాలవుతున్నాయి. రోగం వచ్చిన తర్వాత చేయించుకునే చికిత్సకంటే అసలు రోగం రాకుండా జాగ్రత్త పడడం అవసరమనే భావన పట్టణ ప్రజల్లో లోపిస్తోంది. సంప్రదాయసిద్ధమైన ఆహారపు అలవాట్లు, పరిశుభ్రమైన గాలి, వెలుతురు పల్లె ప్రజలను రోగాలపాలు కాకుండా చేస్తుంది. ఇందుకు వారు స్వయంగా శ్రద్ధవహించడం కూడా ఒక కారణం. వారు తినే ఆహారం ఖరీదుగా ఉండకపోయినా ఖనిజ లవణాలతో కూడి ఉంటుంది. తాజా కూరగాయలు వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ తాజాదనం పట్టణాలు, నగరాల్లో కూడా సాధ్యమే కానీ వారు దీనిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమే ఈ అనారోగ్యాలకు హేతువవుతోంది. దానికి వారు చెప్పే కారణాలు సవాలక్ష ఉన్నా ఏ ఒక్క కారణమూ బలమైనదిగా తోచదు. కారణాలెన్నున్నా, ఏవైనా సరే కాలుష్యాన్ని నివారించుకోవడమనేది కనీస బాధ్యత.

మార్నింగ్ వాకింగ్వైద్య విధానం ఆరోగ్యం విషయంలో ప్రధాన పాత్రవహిస్తుంది కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు సరైన చికిత్స తీసుకోవడంపట్ల తగు జాగ్రత్త అవసరం. నేడు వైద్య విజ్ఞానం ఎంత పురోగతి సాధిస్తున్నా సకాలంలో గుర్తించి ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే రోగం ముదిరి ప్రాణాంతకమయ్యే పరిస్థితి వస్తుంది. టీబీ, ఆస్త్మా, సైనుసైటిస్ వంటి రోగాలను మొదటగనే కనిపెట్టడం అవసరం. సరైన చికిత్స కూడా ఏ రోగికైనా అవసరం. ఏ రోగానికి ఏ మందు అనే కనీస జ్ఞానంతో ఆ వైద్యుడిని మాత్రమే సంప్రదించాలి ప్రతి రోగానికీ సొంత వైద్యం పనికిరాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.

ఆధ్యాత్మిక గ్రంధాలు అనిర్వచనీయమైన మానసిక విశ్రాంతినిస్తాయి కాబట్టి అటువంటి పుస్తకాలు తరచుగా చదువుతూ ఉండాలి. తోట పని చేయడం, మార్నింగ్ వాకింగ్ వంటి చిన్న చిన్న వ్యాయామాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి. ఈ సందర్భంలో "మదర్ గూస్ రైం" అనే ఓ చిన్న పద్యం కుదరని రోగాలతో బాధపడేవారికి ఎంతో ధైర్యాన్నీ, ఉత్సాహాన్నీ కలిగిస్తుందో తెలుసుకుందాం. "ప్రపంచంలో ఏ రోగానికైనా ఉండవచ్చు చికిత్స, లేకపోవచ్చు కూడా. ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నించండి, చికిత్స లేదా, చింతే లేదు". ఇదే విధంగా రెయిన్ హోల్డ్ నైబూర్ చెప్పిన మరో గొప్ప సందేశం "ఓ భగవంతుడా! మనశ్శాంతినీ, వివేకాన్నీ కలిగించు, మార్చుకోలేనివాటిని పరిగ్రహించేట్టు చేయి, మార్చుకోగలవాటిని మార్చుకోడానికి ధైర్యం కలిగించు, రెంటికీ భేదాన్ని గ్రహించగల వివేకాన్ని ప్రసాదించు". ఒక వైద్యుడు తన అనుభవంతో నైపుణ్యాన్ని అనుసరించి రోగికి సహకరించవచ్చు. ఒక బంధువు చేయగలిగినంత సపర్యలు చేయవచ్చు. కానీ మందులేని రోగంతో రోగి ధైర్యంగా జీవించడం అభ్యాసం చేసుకోవడం అతడు అవలంబించవలసిన ధర్మం. కుదరని రోగాలతో తమ తమ ఉద్యమాలు కొనసాగించి జీవించిన మేధావుల ఆదర్శ జీవితాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలి.

కూరగాయలుఏదేమైనా మెరుగైన వాతావరణం మెరుగైన ఆరోగ్యాన్నిస్తుందనే వాస్తవాన్నిప్రతి ఒక్కరూ గ్రహించాలి. గాలి, వెలుతురు సమృద్ధింగా ఉండే పర్యావరణాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. తాజా కూరగాయలనే భుజించేందుకు ప్రయత్నించాలి. ఆహరంలో పండ్లు, పాలు తీసుకుంటూ సమతౌల్యం పాటిస్తుండాలి. మంచి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడం చాలా సులువు కాబట్టి ఆహారపు అలవట్లను ఒకసారి సమీక్షించుకోని చక్కని క్రమశిక్షణతో మంచి అలవాట్ల ద్వారా వేళకు భుజిస్తూ, వేళకు నిద్రపోతూ ఎటువంటి మానసిక ఒత్తిళ్ళు లేకుండా జాగ్రత్త వహిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: