telugudanam.com

      telugudanam.com

   

గొప్ప గుణాల బొప్పాయి..

జీర్ణవ్యవస్థకు మేలు చేసే పళ్లలో ముందుండేది బొప్పాయి. మానవశరీరాలు ఆరోగ్యంతో ఉండేందుకు పని చేస్తుంది. ఓ పండుగా తినటం కోసమే కాకుండా బొప్పాయి ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది.

మిగతా పళ్లతో అంటే ఆపిల్, జామ, అరటి, అనాసలతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. అలాగే శరీరానికి కావలసిన పోషకతత్వాలూ దీంట్లో ఎక్కువ. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుకనే, దీన్ని ఆరోగ్యఫలాల కోవలోకి చేర్చారు. బొప్పాయిలో, క్యారట్లు, బీట్ రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకుల్లో కన్నా బొప్పాయిలో అస్కార్బిక్ ఆసిడ్ (విటమిన్‌ సి) ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొద్ది కొద్దిగా, కాల్షియం, ఐరన్, థయామిన్, రిబోప్లావిన్, నియాసిన్ కూడా ఉంటాయి. సోడియం, కేలరీలు తక్కువగానూ, పొటాసియం ఎక్కువగానూ ఉంటాయి. ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు కానీ మధుమేహవ్యాధిగ్రస్తులకూ, ఆదర్శభోజనం తీసుకునే వారికీ, ఇది మంచి ఆహారం, ప్రతీ రోజూ ఓ బొప్పాయి పండు తీంటే స్థూలకాయం బాగా తగ్గిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది.

మామూలుగా బొప్పాయికాయతో పప్పు, పులుసు, కూర, పచ్చడి, హల్వా చేసుకోవచ్చు. ఈ పళ్లు వేడి చేస్తాయి కనుక, గర్భవతులకు ఇస్తే గర్భస్రావం అవుతుందని మన దేశంలో చాలా చోట్ల విశ్వసిస్తారు. కానీ ఇది వట్టి అపోహ మాత్రమే. ఇందులోని పోషకతత్వాల వల్ల గర్భిణికే కాక, గర్భస్థశిశువుకూ మేలే జరుగుతుంది. కనుక అందరూ నిర్భయంగా మిగతా అన్ని పళ్లలాగే బొప్పాయినీ, అన్ని వేళల్లోనూ తీసుకోవచ్చు.

నేటి బజారులో లభిస్తున్న పలురకాల సౌందర్యసాధనాల్లో, ముఖ్యంగా ఫేషియల్ క్రీములు, షాంపూల, మూలంగా వాడేది బొప్పాయి పళ్ల గుజ్జునే, పచ్చి బొప్పాయి నుంచి తెల్లని పాల వంటి రసం స్రవిస్తుంది. 'పాపైన్ ' అనే పేరున్న ఈ ఎంజైమ్ వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. ఇది 'అనిమల్' ఎంజైమ్ అయిన పెప్సిన్‌ను పోలి ఉంటుంది. అజీర్ణం తగ్గించేందుకు తయారు చేసే పలు విధాల మందుల్లో ఈ రసాన్ని వాడుకుంటారు. మాంసాన్ని మెత్తబరిచేందుకూ ఇది ఉపయుక్తమవుతుంటుంది.

మయాన్ నాగరికతలో జనం, బొప్పాయిచెట్టును ఓపవిత్రవృక్షంగా భావించి, పూజించేవారు. అప్పట్లో దాని పేరు 'ద ట్రీ ఆఫ్ లైఫ్ ' యు ఎస్- ఏ లోని అత్యంతసంపన్నులు, ఉదయం పూట అల్పాహారానికి బొప్పాయిని వాడుకునేవారు. నడుము సన్నగా ఉండాలనుకునేవారు బొప్పాయిపండును తీసుకునేవారట. అంటే ఇది డైటింగ్ ఫ్రూట్‌గా పేరు పడింది. నేటికీ అంతే. పళ్ల సలాడ్లు, రసాలు, జామ్‌లలో బొప్పాయి సునాయాసంగా కలిసిపోతుంది. థాయిలాండ్‌లో బొప్పాయిని అత్యధికంగా వాడుకుంటారు. బొప్పాయిపండు ఆహారంగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదరంలోని ఆమ్ల స్థాయి బొప్పాయి వల్ల సంతులితంగా ఉంటుంది. జీర్ణానికి అత్యుత్తమఫలంగా పేరు పడింది. తినగానే శరీరంలోకి శక్తి చేరటాన్ని గుర్తించవచ్చు. బొప్పాయిపండు తొక్కలను ఫ్రిజ్‌లో పెట్టుకుని ముఖం కడుక్కునేందుకు వాడుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించేందుకూ, క్యాన్సర్ రాకుండా ఉండేందుకూ, బొప్పాయిపండు ఉపయోగపడుతుందని అత్యాధునికపరిశోధనలు తెలియచేస్తున్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: