telugudanam.com

      telugudanam.com

   

చింతలు తీర్చే చింత

చింత ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం.

ఇది ఇప్పుడు ఉష్ణ ప్రదేశాలలో అనేక చోట్ల ప్రవృద్ధి పొందుతూంది. వృక్ష శాస్త్రంలో దీన్ని టామరిండస్ ఇండీకా అంటారు. తెలుగులో చింత, కన్నడంలో హుళి, తమిళంలో పుళి, హిందీలో ఇంలి, మరాటీలో చించి, సంస్కృతంలో తింత్రిణీ అని వివిధ పేర్లతో ఇది పిలవబడుతుంది.

పండిన చింతకాయలలో చింతపండు గుజ్జుతో అనేక విధాలైన చల్లని పానీయాలను తయారుచేస్తారు. నూరు గ్రాముల గింజలు, ఉట్టెలు లేని శుభ్రమైన చింతపండు 283 కాలొరీల శక్తిని ఇస్తుంది. చింతపండు తియ్యగా పుల్లగా ఉంటుంది. చింతపండు కొద్దిగా క్షార గుణం కలిగి ఉంటుంది. కాబట్టి పులిత్రేనుపులకు, కడుపు ఉబ్బరంతో కూడిన జ్వరం, వికారం, విదాహము మొదలైన రోగాలకు ఔషధంగా వాడుతారు. ఆరుచెంచాల చింతపండురసం ఉదయమే సేవిస్తే ఆకలి కలిగిస్తుంది. వాపులకు, నొప్పులకు చింతపండు రసం, ఉప్పు కలిపి మర్దనచేస్తారు. బెణుకులకు, వాపులకు చిక్కటి చింతపండు రసం ఉడికించి పూస్తే నొప్పి తగ్గుతుంది. నోటిలో చిగుళ్ళు వాచి నెత్తురు కారుతూంటే చింతపండు నోటిలో పెట్టుకుంటారు. ప్రతీసారి బోజనం అయిన తరువాత బాగా పండిన చింతపండు కొద్దిగా తింటే మంచి జీర్ణకారిగా ఉపయోగపడుతుంది.

అజీర్ణ రోగాలగు, ఆకలి మందానికి చింతపండు చికిత్స ఉపకరిస్తుంది. నాలుగైదు చుక్కలు చింతపండు రసం ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలలో కలిపితే పాలు విరిగి నీళ్ళు పైన తేరతాయి.పాలు విరగ గొట్టగా వచ్చిన తేటనీరు రోజుకు మూడు పూటలు పుచ్చుకోవాలి. ఈ పాల తేటనీటిలో పాలలో లభించే ప్రోటీనులు అన్నీ లభిస్తాయి; సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకునేటప్పుడు తేలికగా అన్నం తింటూండాలి.

భారతదేశంలో దక్షిణాత్యులు ప్రతిరోజు చింతపండుతో తయారుచేసుకున్న చారు, సాంబర ు(పప్పుపులుసు) తింటారు కాబట్టి వారికి గుండెపోటు జబ్బులు, మూత్రకోశపు సమస్యలు, మూత్రకోశంలో రాళ్ళు పెరగడం మొదలైన రోగాలు చాలా అరుదు అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

చింతగింజల పొడికి అపూర్వ ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి శుభ్రమైయిన నీటితో రోజుకు మూడు పర్యాయాలు పుచ్చుకుంటే ఆమశంక, జిగట విరేచనాలు నివారింపబడతాయి. అర్ధ పెద్ద చెంచాడు చింతగింజల పొడి రోజుకు రెండుసార్లు తేనే అనుపానంతో సేవిస్తే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి రుచికి కావలసినంత పంచదార కలిపి రాత్రిపూట భోజనానికి ముందు రెండు వారాలపాటు తీసుకుంటే వీర్యస్ధలనాన్ని నివారిస్తుంది.

చింత చిగురుతో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటారు. దీనియందు విటమినులు ఎ సిలు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి.

చింతకర్ర కాల్చగా వచ్చిన చింతబొగ్గు పొడి, తగినంత ఉప్పుపటిక, పిప్పరమెంటు పూవు చేర్చి పండ్లపొడి తయారుచేస్తారు. నువ్వుల నూనెలో చింతబొగ్గుల పొడిచేర్చిన ముద్ద కాలిన పుళ్ళను శీఘ్రంగా మాంచుతుంది.

పులిత్రేపులకు, అజీర్తివల్ల కలిగే వాంతులకు ,ఇతర మత్తులకు, అజీర్ణానికి చింతపండు దివ్యౌషధము.

విషపదార్ధాలు జఠరకోశంలో చేరినప్పుడు చింతపండు రసాన్ని అనేకసార్లు తాగించి కృత్రిమ వమనం చేయిస్తారు.

అన్నకోశము వాచినప్పుడు చింతపండు రసంలో లవంగాలు, దాల్చిన చెక్క (లవంగపట్ట) నూరి ఆముద్దను కలిపి త్రాగిస్తారు. 10 మిల్లీలీటర్ల శుబ్రమైన నీటిలో6 గ్రాముల చింతపండు రెండుగంటలసేపు నానబెట్టి ఆ నీటిని నాలగేసి గంటలకొకసారి పుచ్చుకుంటేతాజాగా ఈ మందును చేసుకుంటూండాలి.

25 గ్రాముల చింతపండు 120 మిల్లిలీటర్ల నీటిలో ఒకగంటసేపు నానబెట్టి 6 గ్రాముల పంచదార చేర్చి ఇస్తే తలతిరగడం తగ్గుతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: