telugudanam.com

      telugudanam.com

   

మెడనొప్పి తగ్గించే మకరాసనం

మకరం అంటే మొసలి. నీటిలోని మొసలి రూపంలోని ఈ ఆసనం ఉంటుంది కనుక, దీనికి 'మకరాసనం ' అని పేరు వచ్చింది. దీనికే 'నిరాలంబాసనం ' అనే పేరుంది. బోర్లా పడుకుని భుజంగా ఆసనం వేయాలి. రెండు చేతులనూ చుబుకం కింద ఆనించి బుగ్గలను వొత్తుతూ ఉంచాలి. రెండు మోచేతులనూ జోడించి నేల పైన ఉంచాలి. శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడ మీద మనసును నిలపాలి. రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించాలి. మోకాళ్లను చాపి ఉంచాలి, మడవకూడదు. తరువాత రెండో బొమ్మలో చూపించినట్లుగా, శరీరం బరువు నంతటినీ భూమి మీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలనూ మరచిపోయి, అలాగే కాసేపు పడుకోవాలి.

అధికరక్తపుపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు.


లాభాలు:

మనస్సు శాంతపడుతుంది. శరీరమంతా శిథిలీకరణం చెందుతుంది. టైప్ చేసేవారు, ప్రెస్‌లో కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు రోజూ రాత్రి భోజనానికి ముందు, ఈ ఆసనం తప్పకుండా వేయాలి. దీని వల్ల స్పాండిలైటిస్, మెడ నొప్పులు తగ్గుతాయి.


కిడ్నీరాళ్లకు ఔషదం నారింజరసం

కిడ్నీలో రాళ్లు బాధపెడుతున్నాయా? రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు... రాళ్ల బాధ మాయమవుతుంది. ఇటీవలి పరిశోధనల్లో తేలిన నిజం ఇది.

ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ప్రతి రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు పరిశోధకులు. కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. కాని కొందరిలో ఇవి జీర్ణవ్యవస్ధకు సంబంధించిన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి ఈ సప్లిమెంట్ల కన్నా సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని సూచిస్తుంటారు వైద్యనిపుణులు. అయితే మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. మూత్రం ఆమ్లత్వాన్ని తగ్గించడం ద్వారా ఈ సిట్రేట్లు రాళ్లు ఏర్పడడాన్ని నివారిస్తాయి. అందువల్ల నిమ్మరసం కన్నా కూడా నారింజ పండ్లరసం తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం అని సూచిస్తున్నారు అధ్యయనకారులు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: