telugudanam.com

      telugudanam.com

   

మారేడు పండు

మారేడు పండుని సంస్కృతంలో 'బిల్వఫలం' అంటారు. హిందీలో దీనిని 'చెల్‌ బిల్‌' అంటారు. ఆంగ్లంలో దీనికి పొడవైన పేరుంది - Aegle Narmelas Alarge Spiny Tree. దీని జన్మభూమి భారతదేశం. ఇది ఈశ్వర ప్రీతికరమైన ఫలవృక్షం. మారేడు దళాలతో, బిల్వ పత్రాలతో ఈశ్వరుడిని పూజించటం జరుగుతూ ఉంటుంది. మారేడు చెట్టు ఆకులు, పండ్లు అన్నీ ఔషధగుణం గలవే.

మారేడు పండులో ఈ క్రింది పోషక విలువలున్నాయి.


తేమ - 74 శాతం
పిండి పదార్ధాలు - 16.2 శాతం
మాంసకృత్తులు - 0.7 శాతం
క్రొవ్వులు - 0.7 శాతం
సేంద్రియ లవణాలు - 1.4 శాతం
పీచు పదార్ధం - 7 శాతం

దీనిలో విటమిన్‌ 'సి' ఎక్కువగ ఉంది. దీని గుజ్జులో 'టానిన్‌' 9 శాతం ఉంటుంది. మారేడు పండు గుజ్జును షర్బత్తుగా చేసి త్రాగితే కలరా, విరేచనాలు తగ్గుతాయి. మారేడు పై పెంకును బ్రద్దలు కొట్టి, లోపలి మెత్తని భాగాన్ని చక్రాలుగా తరగాలి. దానిలోని గింజలని, పీచుపదార్ధాన్ని వేరుచేసి గుజ్జును బాగా పిసకాలి. ఈ గుజ్జును పాలలోగానీ, నీటిలోగానీ, తేనెతో గానీ కలిపి షర్బత్‌ తయారుచేయాలి. మారేడు పండు దొరకని పక్షంలో పచ్చికాయలతోనైనా షర్బత్‌ తయారుచేయవచ్చు. గింజలని, పీచును తీసి చేసిన గుజ్జును నీటిలో ఉడికించి, అందులో తేనె కలిపి స్వీకరించవచ్చు. ఫలితం పై దానివలెనే ఉంటుంది. ఈ మారేడు షర్బత్‌ రక్తగ్రహణి, విరేచనాలలో మంచి మేలు చేస్తుంది. మూలవ్యాధి, అజీర్ణం, మలబద్ధకానికి ఇదెంతో పనికి వస్తుంది. పచ్చి మారేడు కాయ వగరుగా ఉంటుంది. అది విరేచనాలను అరికడుతుంది. ప్రతిరోజు ఈ ఫలాన్ని గ్రహించకూడదు.

బిల్వపత్రాలు నీటిని, గాలిని శుభ్రపరుస్తాయి. దీని గాలి సోకితే చాలు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గర్భగుడిలో పూజ చేసిన బిల్వపత్రాల కారణంగా, అక్కడున్న దుర్వాసన నశిస్తుంది. మారేడు త్రిదోషాలను హరిస్తుంది. ఇది వగరు మరియు కారంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. ముదిరిన మారేడు శుక్లాన్ని వృద్ధి చేస్తుంది. మారేడు ముండ్లను దండగా గ్రుచ్చి చంటిపిల్లల మెడలో వేస్తే, వారికున్న గ్ర్రహదోషం నివారిస్తుంది (సుశ్రుతం). బిల్వలేహ్యం సేవిస్తే వాంతులు, ఎక్కిల్లు, ఉర్ధ్వవాతం, అజీర్ణం, శ్వాసకాసలు, గుండెనొప్పులు, అరుచి, అపస్మారం తగ్గుతాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: