telugudanam.com

      telugudanam.com

   

పళ్ళు కాయగూరల ప్రత్యేకత

అన్నిరకాల పళ్ళు, కాయగూరలు ఆహారంగా సేవించడం శ్రేయస్కరం. వీటియందుండే నారవంటి పదార్ధం - సెల్యులోజ్ పేగులను శుభ్ర్రపరచి సక్రమ మలవిసర్జనకు సహకరిస్తుంది. ఈ నార పేగులకు వ్యాకోచం పొందించి ప్రేగులలో తడిని సంరక్షిస్తుంది. కాకరకాయలు వంటి కొన్ని చేదు కాయగూరలు బలవర్ధకమైన టానిక్ లాగా ఉపకరించి పేగులలో ప్రవద్ధి పొందే నులిపురుగులను నశింపజేస్తుంది. జీర్ణ శక్తి సమృద్ధమై ఆకలి కలిగిస్తుంది. ఎండు ఖర్జూరపు కాయలలో విస్తారంగా లభించే సెల్యులోజ్, టేనిక్ ఆసిడ్ విరేచనకారి. ద్రాక్షపళ్ళు, అత్తిపళ్ళు కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది.

సిట్రిక్, మాలిక్, ఆసిటిక్, టేనిక్, టార్టారిక్, వంటి అమూల్యమైన ఆమ్లపదార్ధాలు పళ్ళలోను, కాయగూరలలోను ఎక్కువగా లభిస్తాయి. ఈ సహజ ఆమ్లాలు అన్నాశయంలో జీర్ణ శక్తిని అభవృద్ధి పరచి ఆకలిని పుట్టిస్తాయి. దీనివల్ల జీర్ణ కారకములగు ఎంజైములు ఉద్భవించి కాలేయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఆమ్లాలు, లవణములు క్షారాలతో కలసి పిండి పదార్ధాలను సక్రమంగా జీర్ణిస్తాయి. కడుపు ఉబ్బరం, పులిత్రేపులు మొదలగునవి తగ్గుతాయి. టమోట, ఉల్లిపాయ, దోస, తాజా నిమ్మరసం, పుదీనా, కరివేపాకు మొదలగునవి దివ్య ఔషధాలుగా పనిచేసే ఆహారపదార్ధాలు. ఇవి ఆహారపదార్ధాలలో అపాయకరమైన సూక్ష్మజీవులను నశింపజేసి, జీర్ణ ప్రక్రియకు సహకరించి సహజమైన విటమిన్లను, లవణాలను, ఎంజైములను పుష్కలంగా లభింపజేస్తాయి.

పళ్ళు, కాయగూరలు వీటిలో సులభంగా కరిగి శరీరానికి వినియోగపడే కాల్షియం, పొటాషియం, ఇనుము, సోడియం, భాస్వరం, గంధకం, మెగ్నీషియం, క్లోరిన్, రాగి వగైర రసాయన పదార్ధాలు, ఖనిజాలు ధారాళంగా లభిస్తాయి.

అనేక రకాల మూత్రాశయ రోగాలకు పొటాషియం వినియోగపడి రక్తంలో చక్కెర స్థాయిని నిలబెట్టి హైపోగ్లైకేమియా (hypoglycaemia) ను నివారిస్తుంది. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ మొదలైనవి మూత్రవిసర్జనను క్రమబద్దంజేస్తాయి. అత్తిపళ్ళు, టమోటా, పుచ్చకాయ, మొదలైన వాటి యందు పొటాషియం విస్తారంగా లభిస్తుంది. మూత్రవిసర్జన సరిగా లేనప్పుడు మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడుతాయి. క్యారెట్ దుంపలు ఉపయోగించడం వల్ల మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడవు. దోస వంటి కాయగూరలలో లభించే క్షారాలు కూడా మూత్రాశయం మీద పనిచేసి మూత్రాశయం నిర్వర్తించవలసిన పనిని క్రమబద్దం చేస్తాయి.

భోజనం చేసిన తరువాత పచ్చిక్యారెట్ నమలడం వల్ల నోటియందుండే అపాయకరమైన సూక్ష్మ క్రిములు నసిస్తాయి. నోటిదుర్వాసన పోతుంది పళ్ళసందున ఇరుక్కొనిఉన్న ఆహారపదార్ధాలను శుభ్రముచేస్తుంది. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం కారుట నిలిపి వేసి, దంతాలకు బలం చేకూరుస్తుంది. దంతాల మీది ఎనామిల్ పింగాణి చెడిపోకుండా దంతాలు చాలాకాలం బలిష్టంగా ఉండాలంటే ప్రతిరోజూ భోజనం అయిన వెంటనే తోటకూర, మెంతికూర, పుదీనా వంటి ఆకులు నమలడం ఉత్తమం. దీనివల్ల దంత రోగాలు నశిస్తాయి. జామపళ్ళు కూడా దంతాలను శుభ్ర్రపరుస్తాయి. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే వైద్యుని అవసరం ఉండదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: