telugudanam.com

      telugudanam.com

   

పాలు

పాలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ప్రతి ఇంటిలోనూ అత్యంతావశ్యకత కలిగిన ఏకైక ఆహారం పాలు. పాలతో అవసరం ఉండని మనిషి ఉండడు. పసి బిడ్డ మొదలు పండు ముదుసలి వరకు టీ, కాఫీ రూపాలలో పాలు తీసుకోకుండా ఉండరు. సగటు మానవుడికి అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు జన జీవన సామాన్యంలో ఓ అంతర్భాగం. ఇది ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం. పాలు సేవించకుండా జీవించే క్షీరదం ఉండదు. మానవుడు తీసుకునే మొట్టమొదటి ఆహారం పాలు. ఈ ఆహారం చివరి వరకు మానవుడిని అంటిపెట్టుకునే ఉంటుంది. అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఈ ఆహారం ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. అందుకే పాలు నిత్య సంజీవని. ప్రకృతిలో లభించే ఉత్కృష్టమైన ఆహారం పాలు.

పశువుల స్తన భాగంలో పాలను ఉత్పత్తి చేసే మామరీ గ్రంధులు ఉంటాయి. నాలుగు మొనలు గల ఈ భాగాన్ని పొదుగు అంటారు. చూడుతో ఉన్న పశువు ఈదటానికి కొద్ది సమయం ముందుగానే ఈ మామరీ గ్రంధులు తమ పనిని ప్రారంభిస్తాయి. మామరీ గ్రంధులకు చేరే రక్త నాళాలు ఆగారం కలిసిన రక్తాన్ని ఇక్కడికి చేరదీస్తాయి. ఈ చేరిన రక్తంలో ఆహారాన్ని ఉపయోగించుకుని గ్రంధులు పాలను తయారుచేస్తాయి. స్తన్య జీవుల క్షీర గ్రంధులలో ఉత్పత్తి అయిన పాలు మొనల దగ్గర చేరతాయి. దీనినే పాలు చేపడం అంటారు.

పాలలో ఉండే కెసిన్ అనే ప్రొటీన్ వల్ల పాలు తెల్లగా ఉంటాయి. సాధారణంగా పాలు నీటికంటే కొంచెం చిక్కగా (ఘనంగా) ఉంటాయి. పాలలో 87 శాతం నీరు ఉంటుంది. అయినా ఈ పాలలో దేహానికి కావలసిన పోషకాంశాలు చాలావరకు లభిస్తాయి. పాలలో 4 శాతం క్రొవు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో క్రొవ్వు పాలపైన చిన్న చిన్న కణాలుగా తేలుతూ ఉంటుంది. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. ఇది కంటికి కనిపించదు.

మానవ శరీరంలో వివిధ ఎముకలు, నోటిలో దంతాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెంది వాటి పెరుగుదలకు అవసరమైన కాల్షియం, పొటాషియం పాలలో లభిస్తుంది. అంతేకాక ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయి. వివిధ స్తన్య జీవులలో లభించే పాలలో పోషకాంశాలు విభిన్నంగా ఉంటాయి. ఒకే ప్రాణి పాల గుణాలు కాలాన్నిబట్టి మార్పు చెందుతుంటాయి. కొన్ని జంతువులలో వాటి ఆహారాన్నిబట్టి క్షీర గుణాలు కూడా మారుతుంటాయి. అప్పుడే ఈనిన పశువు పాలలో నీరు తక్కువగా ఉంటుంది. పాల పరిమాణం అధికంగా ఉంటుంది. క్రమేణా ఇది తగ్గుతూ వస్తుంది. పాలల్లో అనేక పోషకాంశాలు ఉన్నా ఇది సంపూర్ణమైన ఆహారం అని చెప్పడానికి వీల్లేదు.

ఇనుము, రాగి మొదలిన ఖనిజాంశాలు, విటమిన్-సి పాలలో లభించవు. కాబట్టి పాలతోబాటు పై పోషకాంశాలు ఉండే ధాన్యాదులను, ఆకు కూరలను ఉపయోగించాలి. శాకాహారులకు పాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. పసిపిల్లలకు సుమారు 3-4 గ్లాసులు, పెరిగే పిల్లలకు నాలుగు పైనా, పెద్ద వారికి 2 గ్లాసుల పాలు రోజూ ఉండి తీరాలి. పాలతో మనకు ఇతర పదార్ధాలు పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి మొదలైనవి అనేకం లభిస్తున్నాయి. ఐస్ క్రీములు, చాక్లేటులు తయారీలో కూడా పాలను ఉపయోగిస్తారు. పాలు కాచి సుమారు 23.9 సెల్సియస్ డిగ్రీలు నుండి 32.2 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణంలో తోడు వేసి కలిపితే దానిలో సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది పెరుగుగా తయారవుతుంది. తోడుకున్న పాలలోని క్రొవ్వును ఒక ముద్దగా చేరదీసినచఒ వెన్న వస్తుంది. గేదె వెన్న తెల్లగా ఉంటుంది. ఆవు వెన్నలో కెరోటిన్ ఉంటుంది. కాబట్టి పసుపుపచ్చగా ఉంటుంది. ఇటువంటి వెన్నని ఫ్రిజ్‌లో ఉంచితే రుచి, వాసన, ఆహార యోగ్యత కొన్ని రోజుల వరకు చెడదు. ఫ్రిజ్ లేనప్పుడు నీటిలోగానీ, మజ్జిగలోగానీ ఉంచి ప్రతిరోజూ ఆ నీటిని, మజ్జిగను మారుస్తుంటే వెన్న చెడదు.

దేశవాళి పద్ధతిలో పెరుగు నుండి తీసిన వెన్న కాచి నేయి తయారుచేస్తారు. బాగా పక్వంగా కాచిన నేయి దుర్వాసన లేకుండా చెయ్యాలంటే వెన్న కాచేటప్పుడు మజ్జిగలో ముంచిన కరివేపాకుగానీ, ములగ ఆకునుగానీ వేయాలి. నేయి రుచి, పౌష్టికత చాలా కాలం నిల్వ ఉంటాయి. నేయి పూసలు పూసలుగా కావాలంటే వెన్న కాచేటప్పుడు కొద్దిగా ఉప్పువేస్తే నెయ్యి పూసలు పూసలుగా గట్టిగా పేరుకుంటుంది. పాలతో పాల పొడిని తయారుచేస్తారు. దీనితో అతి శీఘ్రంగా ఎప్పుడుబడితే అప్పుడు మంచి పాలు పొందవచ్చు. పాలతో పాలకోవా, జున్ను మొదలైనవి తయారుచేస్తారు. డెన్మార్కు, హాలండు, ఆస్ట్రేలియా, న్యూజేలాండు, కెనడా, అమెరికా రాష్ట్రాలు పాలను అధికంగా తయారుచేస్తాయి.

ప్రాచీన కాలంనుండి మానవులు పాల కోసం పశువులను, వివిధ జాతి జంతువులను పెంచడం అలవాటు. అధికంగా పాలు ఆవులు, గేదెలు, మేకల వల్ల లభిస్తాయి. అమెరికాలో లామా అనే ఒంటెలను పెంచి పాటి పాలను ఉపయోగిస్తారు. ఆసియా, ఆఫ్రికా ఎడారి ప్రదేశాల్లో ఒంటె పాలను ఉపయోగిస్తారు. టిబెట్, మంగోలియాలలో గుర్రం, గాడిద పాలను విస్తారంగా ఉపయోగిస్తారు.

పాలలో బాక్టీరియా వృద్ధి పొందుతుంది. దీనివల్ల పాలు పులుస్తాయి. హానికరమైన బాక్టీరియా కూడా ఉంటుంది. కాబట్టి పాడి కోసం పశువులను పెంచేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో చేతితో ముట్టకుండా పాలు యంత్ర సహాయంతోఅ పితుకుతారు. పాలు కాచినప్పుడు బాక్టీరియా నశిస్తుంది. నిలువ ఉంటాయి. సులభంగా చెడిపోవు. త్రాగడానికి ముఖ్యంగా పాలలో హానికరమైన సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: