telugudanam.com

      telugudanam.com

   

తులసి

తులసి మొక్కను భూలోక కల్పవృక్షం అంటారు. ఏ చెట్టుకూ లేని పూజ్యత, భారతీయులు ఈ తులసి మొక్కకు ఇచ్చారు. ప్రతి ఇంట్లో తులసి బృందావనాలుంటాయి. దేవతను పూజించినట్లుగా, తులసి మాతను పూజిస్తుంటారు. దీనికి కారణం తులసి మొక్కలో నున్న విశిష్ట ఔషధ గుణాలే. తులసి ఆకురసం - అల్సర్‌, గుండెపోటు, రక్తపుపోటు, ఆస్త్మా వంటి దీర్ఘ రోగాలను సైతం నిశ్శేషంగా ఫోగొట్టకలదు. తులసి పొడితో చేసిన టీ కూడా చాలా ఆరోగ్యకరమైనది.


తులసి ఉపయోగాలు

ఔషధ గుణాల గురించి, కింగ్‌ జార్జి మెడికల్‌ కాలేజీ డాక్టర్లు పరిశోధనలు జరిపి పై విషయాలు తెలియజేశారు. తులసి ఆకును నమిలి తిన్నా, టీ కాచుకు తాగినా అన్ని రకాల ఒత్తిళ్ళ నుంచి శరీరాన్ని దూరంగా ఉంచి భద్రంగా కాపాడుతుందని వారు కనుగొన్నారు. కాబట్టి మామూలు టీ, కాఫీలు త్రాగేకన్నా, తులసి టీని త్రాగటం మంచిది కదా! తులసి ఆకులు తీసుకుని, చక్కెరలో కలిపి, టీ కాచుకుని త్రాగితే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. శరీరంలో సహజంగా పుట్టుకుని వచ్చే పుండ్లను, రసాయనికంగా, ఇతరత్రా ఒత్తిళ్ళ వల్ల పుట్టే కురుపులను తులసి అద్భుతంగా రూపుమాపుతుంది. తులసి ఒక టానిక్‌లా పనిచేస్తూ, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

క్రీ.పూ.2700 నాడే తులసి మహిమను గుర్తించారు. ఇది అమృతం లాంటి ఔషధమని కనుగొన్నారు. వైరస్‌ రోగాలు, ఒళ్ళునొప్పులు కూడ తులసీ సేవనం వల్ల తగ్గుతాయి. అందుకే మన దేవాలయాల్లో తులసి తీర్ధం ఇస్తుంటారు. తులసిని నిత్యం వాడుతుంటే, మందుల ఖర్చులుండవు. తులసి చెట్టు గాలి కూడ ఆరోగ్యదాయకం. అందుకే తులసి మొక్కలను ఇంటి పరిసరాలలో ఎక్కువగా పెంచుకోవాలి. తులసి మొక్కలనుండి వచ్చే వాసనకూడ సువాసనగా ఉంటుంది. వాయువులోని రోగక్రిములను అది హరిస్తూ ఉంటుంది. తులసి మొక్కల మధ్య గడిపేవారికి, ఆరోగ్యానికి లోటుండదు.

చర్మవ్యాధులను, మలేరియా, మూత్రకోశవ్యాధులను, కీళ్ళవాతం, రక్తపుపోటు, మూలశంక, లివరు జబ్బులు, పిల్లల జబ్బులను, తులసి వైద్యంతో నయం చేస్తున్నారు. క్యాన్సరు, గుండె జబ్బులు, మూత్ర పిండ వ్యాధులు, ఉబ్బసం, పాండురోగం వంటి మొండి జబ్బు కూడా తులసి వైద్యంతో నయం చేయవచ్చునని వైద్యులు చెబుతారు. తులసికి యింత అమోఘమైన ఔషధశక్తి ఉంది కనుకనే దానికి మన ఋషులు దేవతా స్దానం ఇచ్చి ఆరాధిస్తున్నారు. తల్లి తర్వాత తల్లిలాంటిది తులసి. కాబట్టి తులసిని అందరూ ఆరాధిస్తూ, దానివల్ల ఆరోగ్యాన్ని పొందుతూ ఉండగలరు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: