telugudanam.com

      telugudanam.com

   

ఉదయపు అల్పాహారంతో అధిక ఆరోగ్యం

కారణమేదైనా సరే పొద్దుటిపూట అల్పాహారం తినడం మానేసేవారు చాలామందే ఉంటారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గృహిణుల గురించే. ఉదయాన్నే ఇంటిపనుల్లో తీరికలేకుండా ఉండడం, ఇంట్లోనే ఉంటాంకదా పొద్దుట పూట తినడం దేనికి అని వీరు పొద్దున తినడం మానేస్తుంటారు. పిల్లలు స్కూలు టైమవుతుందని, ఆకలి వేయడంలేదని టిఫిన్ తినడం మానేస్తుంటారు. ఇక ఆఫీసులకు వెళ్ళేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారూ ఈ విషయంలో ముందు వరుసలోనే ఉంటారు. అయితే పొద్దుట పూట అల్పాహారాన్ని మానేయడం వల్ల చాలా నష్టమే జరుగుతుందంటున్నారు పరిశోధకులు. ఆ నష్టమేటిటో తెలుసుకొని జాగ్రత్తగా ఉందామా.

రోజు మొత్తంలో ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఆకలి వేయకపోయినా శరీరం తనకు కావల్సిన శక్తి అవసరం గురించి ఏదో ఒక రూపంలో సంకేతాలు పంపిస్తూనే ఉంటుంది. ఈ విషయంగా 9-11 సంవత్సరాల వయసుగల విద్యార్థులలో జరిపిన పరిశోధనల్లో ఇలా ఉదయాన్నే అల్పాహారాన్ని మానేసిన పిల్లలు అల్పాహారం తీసుకొనే పిల్లల కంటే ఆటల్లో వెనకబడి ఉన్నారని, వీరిలో వెంటనే స్పందించే గుణం కూడా తక్కువ ఉందని తేలింది.

రాతపరీక్షల్లో కూడా ఇలాంటి పిల్లలు చాలా తక్కువ మార్కులే తెచ్చుకుంటున్నట్లు వెల్లడయ్యింది. అలాగే వీరిలో మెదడును చురుకుగా ఉంచే ప్రోటీన్లు లోపించడం వల్ల టీచర్ల దృష్టిలో వీరెప్పుడూ చురుకైన విద్యార్థులుగా ఉండలేరు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకుండా భోజనం వేళ వరకు టీలు, కాఫీలతో గడిపే వారు గుర్తించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. రాత్రంతా తినకుండా ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీని పూరించడానికి ప్రోటీన్లు అవసరం. కానీ శరీరానికి కావలసిన ప్రోటీన్లను అందించకుండా టీలు, కాఫీల ద్వారా నేరుగా చక్కెరలను అందించడం వల్ల అవి ఈ ఖాళీని భర్తీ చేయలేవని వీరు అంటున్నారు.

ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకోని ఉద్యోగస్తులు చురుకుగా ఉండాలని, ఆకలిని దరిచేరనీయవద్దని ఎక్కువగా కాఫీలు, టీలు తాగుతుంటారు. వీరి అంచనా వీరి అంచనా తప్పని పరిశోధకులు అంటున్నారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోని ఉద్యోగస్థులు తీసుకున్న వారితో పోలిస్తే పనిమీద ఏకాగ్రత నిలపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, పని విషయంలోనూ అంత నైపుణ్యాన్ని చూపించలేరని వీరు చెబుతున్నారు. వీరు పని చేస్తున్న సమయంలో చికాకు ప్రదర్శిస్తూ, అసహనంగా ఉంటుంటారు. పొద్దుటి నుండి తినకపోవడం వల్ల పదే పదే గడియారం వంక చూస్తూ భోజనం వేళ ఎపుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు. అసహం, ఆందోళన, మతిమరుపు, గందరగోళంలాంటి లక్షణాలన్నీ రక్తంలోని చక్కెర శాతం తక్కువగా ఉండడంవల్లే కలుగుతాయి. ఈ పరిస్థితి మామూలుగా ఆకలివల్లే ఏర్పడుతుంది.

ప్రోటీన్లు, కాల్షియంలాంటి పోషకాలు కొద్దిమొత్తంలో తీసుకుంటేనే పూర్తి స్థాయిలో శరీరానికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని రోజు మొత్తంలో తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకుంటుండాలి. ఉదయపు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి ఏర్పడే పోషకలేమి మధ్యాహ్నం పూట చేసే భోజనంతోగానీ, రాత్రిపూట కడుపుపగిలేలా తినే తిండితో కానీ భర్తీకాదు.

అందుకే రోజంతా చురుకుగా ఉండడానికి పనిచేసుకొనే సామర్థ్యం కోసం ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కొద్దిమొత్తంలో కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వాటిని ఎక్కువగా తీసుకోకుండా జిహ్వను అదుపులో పెట్టుకోవడం అన్నింటికంటే ముఖ్యం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: