telugudanam.com

      telugudanam.com

   

ఉసిరిపండు

ఆరోగ్యాన్ని ప్రసాదించే ఫలాల్లో ఉసిరి ఫలం ఉన్నత స్ధానంలో ఉంటుంది. భారతదేశంలో ఇది ఎప్పటినుండో పండుతూ ఉన్నది. దీని జన్మస్ధలం భారతదేశమే. ఇది గుండ్రంగా ఉంటుంది. అర అంగుళం నుండి ఒక అంగుళం వరకు వ్యాసం కలిగి ఉంటుంది. పచ్చని రంగుతో, గట్టిగా ఉంటుంది. దినిలో త్రికోణాకారంలో గింజ ఉంటుంది. ఉసిరి పండు పులుపు, వగరుగా ఉంటుంది.

ఉసిరికాయ(పండు)లో ఈ క్రింది పోషక విలువలు ఉన్నాయి.

తేమ - 81.2%
పిండి పదార్ధాలు - 14.1%
పీచు పదార్ధం - 3.4%
మాంసకృత్తులు - 0.5%
క్రొవ్వులు - 0.1%
సేంద్రియ లవణాలు - 0.7%


ఉసిరికాయలో 'సి' విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఇది ఎండినా, నిల్వ ఉన్నా, దీనిలోని 'సీ' విటమిన్‌ నష్టం కాదు. ఈ విటమిన్‌ మన దేహానికి ఎంతో అవసరము. అది తక్కువైతే పన్ను పుచ్చుట, నెప్పి, ఎముకలు దుర్బలమగుట, చిగుళ్ళు వాచుట, కీళ్ళవాతం మొదలగు వ్యాధులు కలుగుతాయి. ఉసిరికాయ ఔషధంగా చాలా ఉపకరిస్తుంది. ఉసిరికాయ రసం త్రాగితే, నీళ్ళవిరేచనాలు, రక్తగ్రహణి తగ్గుతాయి. గర్భాశయం నుండి రక్తస్రావం అధికంగా అవుతుంటే ఉసిరికాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ఇస్తే అది తగ్గిపోతుంది. శ్వేత కుసుమానికి కూడా ఉసిరికాయ అమోఘంగా పనిచేస్తుంది. ఉసిరికాయలో మూత్రావరోధాన్ని తొలగించి జారీచేసే గుణముంది. ఉసిరికాయ కామిలా, అజీర్ణం, మూలవ్యాధి, దగ్గు, దృష్టిదోషం మొదలగు వాటిని నివారించటంలో చాలా తోడ్పడుతుంది. అకాల వృద్ధాప్యం నుండి రక్షించటంలో ఉసిరికాయను మించిన ఔషధం లేదని ఆయుర్వేదశాస్త్రం తెలియపరుస్తుంది. మనిషి రోగాన్ని నివారించటానికి, ఆరోగ్యాన్ని పెంచటానికి, ఉసిరికాయ మేలైనదనీ సుశ్రుతుడు సెలవిస్తాడు.

ఉసిరిచెట్టు 20-25 అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. నవంబరు ప్రాంతంలో ఉసిరికాయలు మనకు లభిస్తూఉంటాయి. ఉసిరికాయలు దొరకని కాలంలో ఎండబెట్టిన ఉసిరిపప్పు లభిస్తుంది. ఇంటిలో స్ధలం ఉంటే, ఇలాంటి ఫలవృక్షాలను పెంచుకోవటం చాలా మంచిది. తాజా ఉసిరికాయలు లభించటమే కాక, ఆరోగ్యదాయకమైన గాలి కూడా దీనివల్ల లభిస్తూ ఉంటుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: