telugudanam.com

      telugudanam.com

   

టీ.వి. (టెలివిజను) కొనేముందు ...

టీవి కొంటే కారు బహుమతి అంటూ షోరూములు తాయిలాలతో ఊరిస్తుంటాయ్. శబ్ధం ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే.

అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే. కలర్ టీవీలు అయిదు విభిన్న రకాల్లో లభ్యం అవుతున్నాయి. ప్రాధమిక మోడల్, ఫ్లాట్ స్క్రీన్, ప్రొజెక్షన్, ప్లాస్మా, ఎల్‌సీడీ. నిన్న మొన్నటి వరకూ పద్నాలుగు అంగుళాల కలర్ టీవీలదే రాజ్యం. ఆ తర్వాత 20 అంగుళాల టీవీలను కొనేవారి సంఖ్య పెరిగింది. వంద వాట్లకంటే తక్కువ సౌండ్ ఉండి దృశ్య నాణ్యత ఫర్వాలేదనిపించేవి. స్టీరియో ఎఫెక్టులు పెద్దగా ఉండేవి కావు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తోంది ఫ్లాట్ టీవీ. దీని ప్రత్యేకత ఏమిటంటే.. టీవీని హాల్‌లో పెట్టి ఇంట్లోని ఏమూలనుంచి చూసినా దృశ్యం అంతా స్పష్టంగా కనబడుతుంది. అంటే సినిమా తెరలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్ని 21 అంగుళాల టీవీల్లో దృశ్య నాణ్యత దాదాపు ఒకటిగానే ఉంటుంది.

ప్రొజెక్షన్ టీవీలు కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. వీటి ప్రత్యేకత ఏమిటంటే సినిమా ధియేటర్‌లో స్క్రీన్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. దీనికి హొం ధియేటర్ సిస్టం తోడయితే డీటీఏస్ ధియేటర్‌లో సినిమా చూసిన అనూభూతి కలుగుతుంది. అయితే ప్రొజెక్షన్ టీవీల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు.

ఎల్‌సీడీ, ప్లాస్మాలకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ప్లాస్మా టీవీలను గోడలకు లేదా సీలింగులకు బిగించుకోవచ్చు. ఆశ్చర్య పోకండి. విదేశాల్లో బెడ్‌రూముల్లో సీలింగ్‌కు పెట్టుకుని టీవీ చూడటం కొత్తేమీ కాదు. మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మొదలవుతోంది. ఎల్‌సీడీలు రూ. 36,500 నుంచి దొరుకుతాయి. ప్లాస్మా టీవి కావాలంటే కనీసం లక్షా నలబై వేలు భరించాల్సిందే.


ఇలా ఎంచుకోండి

మీరు కొనబోయే టీవీని హాల్ లో పెడతారా? బెడ్ రూం లో ఉంచుతారా? అన్నది ముందుగా తేల్చుకోండి. బెడ్ రూం అయితే 14 లేదా 15 అంగుళాలు, హాల్ లో అయితే 20, 21 అంగుళాలవి కొనండి టీవీని తొమ్మిది అడుగుల దూరం నుంచి చూసే వీలుంటే 21 అంగుళాలది తీసుకోండి. కనీసం 12 అడుగుల దూరం నుంచి చూసే వీలుంటేనే 29 అంగుళాలది ఎంచుకోండి. ఎంపికలో ఇలా జాగ్రత్త పడితే భవిష్యత్తులో కళ్ళకు శ్రమ ఉండదు.

మీ ఇంట్లో మ్యూజిక్ సిస్టం ఉన్నా. యాంప్లిఫయర్ తో పాటు స్పీకర్లున్నా సౌండ్ ఎక్కువుండే టీవీల జోలికి వెళ్ళొదు. వీటి వల్ల సొమ్ము వృధా తప్ప ప్రయోజనం శూన్యం. ప్రస్తుతం మార్కెట్లో లభించే టీవీలకు మ్యూజిక్ సిస్టం ను అమర్చుకునే సౌకర్యం ఉంటుంది.

ఏ చిన్న సమస్య వచ్చినా ఆటోలో టీవీని వేసుకుని మెకానిక్ ల వద్దకు పరుగులెట్టలేం కదా? కాబట్టి మన ఇంటికొచ్చి సర్వీస్ చేసే కంపెనీలకు ప్రాధాన్యమివ్వాలి. ఆధీకృత డీలర్ల వద్ద కొంటే ఎలాంటి సమస్య వచ్చినా మెకానిక్ లు ఇంటికొచ్చి మరీ మరమ్మతు చేస్తారు.

ప్రతి టీవిలో అంతర్గతంగా స్టెబిలైజర్ ఉంటుందని సేల్స్ సిబ్బంది చెప్పేవన్ని నిజం కాకపోవచ్చు. కొన్నింటిలో స్టెబిలైజర్లు ఉంటే మరి కొన్నింటిలో ఉండకపోవచ్చు. కాబట్టి విడిగా స్టెబిలైజర్ కొనటం మంచిది. పదివేలు పెట్టి టీవీ కొనేటప్పుడు వెయ్యి రూపాయల లోపునకు లభించే స్టెబిలైజర్ కొనటానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

టీవి కొనాలన్న నిర్ణయానికి రాగానే నాలుగైదు షాపుల్లో ధరల్ని విచారించండి. ఎందుకంటే టీవీ అన్నది ఏడాదికోసారి మార్చే వస్తువు కాదు. ఒక్కసారి కొన్నామంటే అయిదు నుంచి పదేళ్లు వాడతాం.

నాలుగు షాపులు తిరిగారు కాబట్టి ఎవరెక్కువ తగ్గిస్తున్నారో అర్ధమవుతుంది. డిస్కౌంట్లు ఇచ్చేవారికే ప్రాధాన్యమివ్వండి. కొన్ని షోరూముల్లో గరిష్ఠ చిల్లర ధర (ఎం ర్ పి)తో పోల్చుకుంటే డిస్కౌంట్ల తక్కువిచ్చి ప్రత్యేక బహుమతులిస్తారు. కాబట్టి, ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగేయండి.

కలర్ టీవీ ల్లోనూ నకిలీలదే రాజ్యం. కంపెనీ డీలర్ వద్ద రూ. 10,000 ఖరీదు చేసే టీవీ నకిలీ మార్కెట్లో రూ. 6000 దొరకవచ్చు. చూట్టానికి కంపెనీ టీవీలా ఉన్నా లోపల మాత్రం నకిలీ విడి భాగాలుంటాయి. తక్కువ ధరకు వస్తుందన్న ఆనందంలో ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. వీలైనంత వరకూ కంపెనీ డీలర్ల వద్ద కలర్ టీవీలు కొనటం శ్రేయస్కరం.

టీవి పిక్చర్ ట్యూబ్ నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో సమానమైన వేడి విడుదల అవుతుంది. కాబట్టి మీరు టీవీ పెట్టే గదిలో గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేసుకోండి. టీవీని గోడకు మరి దగ్గరగా పెట్టొద్దు. దీని వల్ల టీవీ చల్లబడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.


మూలం - ఈనాడు దినపత్రిక (సిరి) ఫిబ్రవరి 3, 2006.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: