telugudanam.com

      telugudanam.com

   

కారు కొనేముందు...

ఒకప్పటి విలాసం ఇప్పటి అవసరం, ఏమిటది? కారు అంటే మీరేమంటారు. నిజమే అంటారు. కొత్త కారు కొనడానికి అందరూ చాలా ఆనందిస్తారు. అయితే ఒక్క నిమిషం కారు కొనేముందు ఏం గమనించాలో చూద్దామా!


మూలం: ఈనాడు దినపత్రిక (సిరి) శుక్రవారం, అక్టోబరు 20, 2006


నిర్వహణ

కారు కొనటం అందులో షికారు చేయటం ఎంత బాగున్నా నిర్వహణ విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్రోలు, డీజిలు కల్తీదైతే మొత్తం ఇంజనే దెబ్బతింటుంది. గాలి తగినంతగా లేకపోతే టైర్లు పాడైపోవచ్చు. బ్రేకులు సరిగ్గా పడకపోవచ్చు. బండి అదుపు తప్పి ప్రమాదాలకు దారితీయొచ్చు. ఇవన్నీ మనకు తెలియకుండా పుట్టుకొచ్చే సమస్యలే. వీటికి పరిష్కారం లభించాలంటే కొన్ని విడిభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేకపోతే నడిరోడ్డుపై కారు మొరాయించటం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి రావటం తప్పవు!

టైర్లను నిత్యం పరిశీలించాలి. ప్రతి వెయ్యి కిలోమీటర్ల కొకసారి టైర్ల సంతులనం (అలైన్‌మెంట్) సరిగా ఉందో లేదో చూసుకోవాలి. డీజిల్ కార్లయితే ప్రతి ఐదు వేల కిలోమీటర్ల కొకసారి ఈ పని తప్పనిసరి. అంబాసిడర్లయితే నాలుగు వేల కిలోమీటర్లు, స్కోడా వంటి కార్లకు ఏడున్నర వేల కిలోమీటర్లకోసారి టైర్లను సరి చేయించాల్సి ఉంటుంది.

పెట్రోల్ తాగెయ్యకుండా ఉండాలంటే టైర్లలో తగినంత గాలి ఉండాల్సిందే లేకపోతే పదిశాతం పెట్రోల్ వృధా ఖాయం.

ఒక్కోసారి బ్రేకులు పని చేయకుండా మొరాయిస్తాయి. లేదా మనం అనుకున్నంత వేగంగా బ్రేకులు పడకపోవచ్చు. ఈ సమస్య వద్దంటే బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్‌లోని ఆయిల్‌ను పరీక్షించాలి. బ్రేక్ పైపులో ఆయిల్ కారుతూ ఉంటే బ్రేక్ పైపు మార్చుకోవటమే పరిష్కారం. కార్లను బట్టి బ్రేక్ పైపుల ధర ఆధారపడుతుంది.

బ్యాటరీ గాడి తప్పకుండా ఉండాలంటే దాన్ని నిత్యం శుభ్రం చేయాలి. లేకపోతే బ్యాటరీ టెర్మినళ్లపై పొరలా పేరుకుంటుంది. విద్యుత్తు సరిగా ప్రవహించదు. బ్యాటరీ థర్మల్‌కు క్రమం తప్పకుండా తెల్లటి గ్రీజ్ పెడుతూ ఉంటే కార్బన్ పట్టదు. బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ స్ధాయి తగ్గితే యాసిడ్ పేరుకుని ప్లేట్లు పాడవుతాయి. ఇదే జరిగితే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది.

కారు లోపలి భాగం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దీని కోసం మార్కెట్లో ప్రత్యేకంగా కొన్ని ద్రవాలు దొరుకుతాయి. వీటి ధర రూ. 150 నుంచి రూ. 1,500 వరకూ ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసే వాటిని కారుకు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి.

కొన్ని కార్లను పరిశీలిస్తే లోపలి భాగమంతా అందంగా చర్మపు ఉత్పాదనలతో తీర్చిదిద్దుతారు. వీటిని శుభ్రం చేయటానికి ప్రత్యేకమైన రసాయనాలు వాడాల్సిందే. ఆల్కలాయిడ్లు ఉన్న క్లీనర్లను వడారంటే ఖరీదైన చర్మపు ఉత్పత్తుల రంగు వెలవెలబోతుంది.

బయటి నుంచి చూస్తే జిగేల్ మనిపించే కార్లకు పాత మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. కాబట్టి కారు బయటి భాగం కూడా అందంగా ఉండేట్లు చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ ప్రభావానికి లోనై కొన్ని భాగాలు తొందరగా తుప్పు పడతాయి. తుప్పు సమస్య తప్పాలంటే కారును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

విండ్ స్క్రీన్లను షాంపూతో కడిగాక మంచి నీరుతో శుభ్రం చేయాలి. ఎండిన భాగాన్ని ఓ మెత్తటి గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత అద్దాన్ని పాలిష్ చేయటం మరిచిపోవద్దు.


మూలం: శుక్రవారం మార్చి 31, 2006 ఈనాడు దినపత్రిక.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: