telugudanam.com

      telugudanam.com

   

ఎందుకు, ఏమిటి, ఎలా ...

స్వెటర్ల కథ

చలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాము.

ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలా కాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్టు నుంచి యూరప్‌కు ఉలెన్ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. బ్రిటీషువాళ్ళు ఉన్ని దుస్తులను ఎగుమతి చేసి డబ్బు సంపాదించడం కూడా మొదలెట్టారు. హాలెండ్, స్పెయిన్, జరనీ వంటి దేశాలలో అల్లిక బడులను తెరచి, పేదవాళ్ళకు పని కల్పించారు. స్కాట్‌ల్యాండ్‌లో ఈ పని కుటీర పరిశ్రమగా వర్ధిల్లింది. శీతాకాలంలో సైనికులు తొడగడానికి అనువుగా స్వెటర్లు, గ్లౌజులు తయారు చేయమని బ్రిటీషు రాణి ప్రజలను ప్రోత్సహించింది. పందొమ్మిదో శతాబ్దం తొలి నాళ్ళలో కూడా స్వెటర్లు, ఇతర ఉన్ని దుస్తులు సాధారణంగా సైనికుల దుస్తులుగా, శీతాకాలంలో ఉపయోగించే దుస్తులుగా వాడుకలో ఉండేవి. అయితే 1937 లో లానా టర్నర్ అనే హాలీవుడ్ తార 'దె డోంట్ ఫర్గెట్' అనే సినిమాలో టైట్ స్వెటర్ ధరించి కనిపించింది. అప్పటి నుంచి స్వెటర్లకు మంచి గ్లామర్ గాలి సోకింది. స్వెటర్ ఒక ఫ్యాషన్‌గా మారింది. స్వెటర్లు లేని చలికాలాన్ని ఊహించడం కష్టం. రంగురంగుల స్వెటర్లు మనల్ని కూడా రంగురంగుల పూలుగా మార్చేస్తాయి.


మూలం 17-12-2005 ఆంధ్రజ్యోతి, లిటిల్స్


టీ షర్ట్ ఎలా పుట్టిందో తెలుసుకుందాం

రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? అని తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదవాల్సిందే.

టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా టీ-షర్ట్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. చూడ్డానికి ఇంగ్లీషు 'టీ' ఆకారంలో ఉంటుంది. కనుక వీటికి టీ-షర్ట్స్ అనే పేరు వచ్చింది. 1960 నుంచి వీటి మీద డిజైన్లు, బొమ్మలు ముద్రించడం లేదంటే స్లోగన్స్ రాయడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని ఉద్యమాలప్పుడు అందరూ టీ-షర్ట్స్ మీద నినాదాలు రాసుకొని తిరుగుతుంటారు. అలా ఇవి ప్రచారానికి కూడా ఉపయోగపడే సాధనాలయ్యాయి. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు టీ-షర్ట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ-షర్ట్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్‌లో.

ఇప్పుడు తెలిసిందా రోజూ మనం వేసుకునే టీ-షర్ట్స్ ఎలా వెలుగులోకి వచ్చాయో. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు నచ్చే టీ-షర్ట్స్ మన హైదరాబాద్ నుంచి తయారవుతున్నాయంటే మన కెంతో గర్వకారణం కదా. ఎవరైనా అడిగితే మనం ఠక్కున చెప్పవచ్చు.


మూలం : 1-7-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


ఐస్ క్రీం

వేసవి కాలం వచ్చిందంటే మనం అంతా లొట్టలు వేస్తూ ఎగబడి తినేది ఐస్ క్రీంనే. అవునా? ఈ ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా? ఐస్ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి వదిలేసి మన ముందున్న ఐస్ క్రీంను ఓ పట్టుపడతాం. ఐస్ క్రీం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్నమాట. నాలుగువేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్రవర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌క్రీం క్రమంగా ఆదరణ పొందింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌క్రీం లాంటిదే. 1550లో జూలియస్‌విల్లే ఫ్రాంక్ అనే వైద్యుడు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉప్పు కలిపిన ఐసు ముక్కలు ఉపయోగిస్తే ఐస్‌క్రీం మెత్తగా త్వరగా తయారవుతుందని కనిపెట్టాడు. 1620లో ఫ్రాన్స్‌కు చెందిన గెరాల్డ్ టిసైన్ అనే వ్యక్తి ఇప్పుడు మనం తింటున్న ఐస్‌క్రీంకు తుది రూపం ఇచ్చాడు.

అయితే మొదటి ఐస్‌క్రీం ఫ్యాక్టరీ తయారు కావడానికి చాలాకాలం పట్టింది. 1852లో జాకబ్ ఫస్సెల్ అనే పాలవ్యాపారి, పాలు అమ్మగా మిగిలిన మీగడను సద్వినియోగం చేసుకోవడానికి తొలి ఐస్‌క్రీం ఫ్యాక్టరీని నిర్మించాడు. అతడి ఐస్‌క్రీంలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఇక ' కోన్ ఐస్‌క్రీం ' కూడా అనుకోకుండా రూపుదాల్చిందే. 1904 లో అమెరికాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ ఐస్‌క్రీం అమ్ముతుండగా కప్పులు అయిపోయాయి. జనం ఎగబడుతుండే సరికి ఐస్‌క్రీం అమ్ముతున్న పెద్దమనిషి ఆ పక్కనే ఉన్న రొట్టెలను తెచ్చి వాటిని చుట్టచుట్టి వాటి మధ్యలో ఐస్‌క్రీం పోసి అమ్మాడు. అలా ' కోన్ ' వ్యాప్తిలోకి వచ్చింది.

ఈ విధంగా మనం ఐస్ క్రీంను తినగలుగుతున్నాం.


మూలం : 8-4-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: