telugudanam.com

      telugudanam.com

   

ఎందుకు, ఏమిటి, ఎలా ...

ఎస్కలేటర్

మనం రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో, పెద్ద పెద్ద షాప్ లలో ఇంకా ఎన్నోచోట్ల మనం మెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడతాం. రైల్వే స్టేషన్ లో కొంతమందైతే ఆ మెట్లు ఎక్కలేక ట్రాక్ లను దాటుతూ ఉంటారు. అలా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలను వదిలేసేవారిగా ఉంటారు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్‌ను పెట్టి ఆ శ్రమ తగ్గించారు. దీని వలన అనేకమందికి మెట్లేక్కే శ్రమ తగ్గింది. ఎస్కలేటర్ అంటే ఏమిటి, ఎస్కలేటర్ ఎలా పని చేస్తుంది, దానిని ఎవరు కనిపెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనం ఎక్కే అవసరం లేకుండా మెట్లే రయ్యి మంటూ పైకి వెళుతూ మనల్ను మోసుకెళ్ళే 'ఎస్కలేటర్' ను 1881 లో కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వ్యక్తి పేరు 'జెస్ డబ్ల్యు రెనో'. ఇతను ఓడ కళాసి. పెద్ద పెద్ద స్తంభాలు, నిచ్చెనలు చకచకా ఎక్కి దిగే జెస్‌కు అసలు మనం కదలకుండా మెట్లే పైకి కిందకి కదులుతూంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే కష్టపడి, ఏళ్ళతరబడి ఆలోచించి 'ఎస్కలేటర్' ప్రాథమిక యంత్రవ్యవస్థకు 'ఎస్కలేటర్' అనే మాట 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఎగ్జిబిషన్ లో వచ్చింది. ప్రపంచంలోనే 'లిఫ్టు' లు తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన 'ఓటిస్' సంస్థ తొలి ఆధునిక ఎస్కలేటర్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఎస్కలేటర్ పుట్టి వందేళ్ళు దాటిపోతున్నా ఇప్పుడిప్పుడే భారత దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థ కనిపిస్తుంది. మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కలిగే ధ్రిల్లు చెప్పనలవికానిది.


మూలం : 22-4-2006 ఆంధ్రజ్యోతి, లిటిల్స్.


పాప్‌కార్న్

మనం బస్‌స్టేషన్‌లో, సినిమా హాల్స్‌లో, రైల్వే స్టేషన్‌లలోకి వెళ్ళినప్పుడు మనకి మొదట కనిపించేది, వినిపించేది పాప్‌కార్న్ పేరు. పాప్‌కార్న్ ఎలా తయారవుతుంది, పాప్‌కార్న్ ఎప్పుడు తయారుచేశారు, ఎక్కడ కనిపెట్టారు అనేది మనం తెలుసుకుందాం.

అందరికీ ఇష్టమైన మొక్కజొన్న పుట్టింది మెక్సికోలో అని అందరు అంటారు. క్రీ.పూ. 2500లోనే అక్కడ నివసించిన కాచైజ్ ఇండియన్లు మొక్కజొన్నను పండించి ఆహారంగా తీసుకొనే వారని తెలుస్తుంది. 'పెరూ' దేశంలో తూర్పు తీరంలో దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి మొక్కజొన్న గింజలు దొరికాయి. అన్నేళ్ళ తరువాత కూడా అవి వేయించి తినే స్థాయిలో ఉండటం విశేషం. మెక్సికో నుంచి బ్రిటన్‌కు చేరిన మొక్కజొన్నకు పంచదార జోడించి బ్రేక్‌ఫాస్ట్‌గా తినడాన్ని ఇంగ్లీషువారు మొదలుపెట్టారు. మొదట్లో మంట మీద కాల్చి నేరుగా కంకుల్ని తినేవారు. అయితే 18వ శతాబ్దం తరువాతనే ఇప్పుడు మనం తింటున్న పేలాలు లేదా పాప్‌కార్న్ వాడుకలోకి వచ్చాయి.

గింజల నుంచి పాప్‌కార్న్ ఎలా వస్తుందంటే ప్రతి మొక్కజొన్న గింజలోనూ చిన్న నీటి బిందువు ఉంటుంది. ఇది గింజలో ఉన్న మెత్తటి పిండిపదార్థంలో నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే గింజల్ని వేడి చేస్తామో అప్పుడు ఆ నీరు వ్యాకోచిస్తుంది. దాంతో పీడనం పెరిగి గింజ టప్‌మని పేలి పొరలుగా విచ్చుకుంటుంది. పూర్వం ఈ ప్రక్రియను చూసి అమెరికన్ తెగలు చాలా భయపడేవి. గింజలో ఆత్మ ఉంటుందనీ దానిని వేడి చేస్తే బయటకు వచ్చి చిటపటమని గోల చేస్తుందని నమ్మేవారు. తిండిలోనే కాకుండా పూజావ్యవహారాలలో కూడా అమెరికన్ తెగలు పాప్‌కార్న్‌కు విశేష ప్రాధాన్యం ఇచ్చేవి. స్త్రీలు మొక్కజొన్న కంకుల్ని తలలపై ధరించేవారు. గింజలను మాలగా గుచ్చి మెడలో ధరించే వారు. ఇప్పుడు పాప్‌కార్న్ లేనిదే మనం సినిమా చూడలేని పరిస్థితికొచ్చాం. వేడివేడి పాప్‌కార్న్ నములుతూ సినిమా చూస్తుంటే ఆ మజానే వేరు.


మూలం : 25-3-2006 ఆంధ్రజ్యోతి, లిటిల్స్


ఫౌంటెన్ పెన్

మనకు ఏది వ్రాయాలన్న మనం ఉపయోగించేది మొదట పెన్ను. కాని మనకు ఆ పెన్ను గురించి వివరాలు ఏమి తెలయవు కనుక ఇప్పుడు ఆ పెన్ను ఎలా పుట్టినదో అసలు ఎవరు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవ్వాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ ఇలా పెన్నును ఈ షేప్‌లో చూడడం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్ళీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది. ఈ తలనొప్పిని పరిహరించిన వ్యక్తి పేరు 'లూయిస్ ఇ.వాటర్‌మెన్'. ఈయన అమెరికన్. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసేవాడు. ఒకసారి పాలసీ తీసుకోవడానికి వచ్చిన పెద్దమనిషి సంతకం చేయడానికి కలంను సిరాలో ముంచగా అది కాస్తా ఒలికి పేపర్లు పాడయ్యాయి. ఇది అపశకునం గా భావించిన ఆ పెద్ద మనిషి పాలసీ చేయకుండానే వెళ్ళి పోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాటర్‌మెన్ అసలు సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంకు రిజర్వాయర్ ఉండేలా పెన్ను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి 'ఫౌంటెన్ పెన్' ను 1884 లో తయారు చేశాడు. ఇతడిలాగే మరికొందరు కూడా పెన్నులు తయారు చేసినా ప్రపంచానికి ఫౌంటెన్ పెన్ సృష్టికర్తగా పరిచయమైంది వాటర్‌మెన్ మాత్రమే. పెన్నును జేబులో పెట్టుకునే వీలుగా క్లిప్‌ను తయారు చేసింది కూడా ఇతడే.


మూలం : 14-1-2006 ఆంధ్రజ్యోతి, లిటిల్స్.


కోకో కోలా

మంచి నీళ్ళు కూడా తాగడం మానేసి కోకోలా తాగుతున్నాం మనం. అంత పిచ్చి పట్టుకుంది మనకు కోకో కోలా మీద. ఈ కూల్ డ్రింక్ లో రసాయన ఎరువులు ఉన్నాయనీ అందువల్ల ఇది తాగితే ప్రమాదమని గతంలో పెద్దస్థాయిలో వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజాలున్నప్పటికీ మనం దీనిని తాగడం మానలేదు. ప్రపంచం మొత్తాన్ని ఇంత తీవ్రంగా బానిసలుగా చేసుకున్న ఈ శీతలపానియాన్ని డాక్టర్ జాన్ స్టిత్ పెంబర్‌టన్ (1830-1888) అనే ఆయన కనిపెట్టాడు. ఈయనది అమెరికాలోని అట్లాంటాలో ఉన్న జార్జియా టౌను. ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుండిన పెంబర్‌టన్ రకరకాల పానియాలను తయారు చేస్తుండేవాడు. కోకా ఆకులను ఉపయోగించి అతడు తయారు చేసిన ఫ్రెంచ్ వైన్ ఆ రోజుల్లో చాలా ఆదరణ పొందింది. అయితే 1885లో అట్లాంటాలో ఫ్రెంచ్ వైన్ వంటి మత్తుపానియాలను నిషేధించారు. దాంతో పెంబర్‌టన్ రాబడిపోయింది. అప్పుడతడు మత్తు స్వభావం లేని కొత్త పానియాన్ని కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అతడు కోకా ఆకులకు, కోల నట్‌ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ ఆసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జత చేసి మే 8, 1886 న కోకో కోలా ను తయారు చేసి అమ్మడం మొదలెట్టాడు. ఎంతో ప్రసిద్ది పొందిన ఈ పానియాన్ని అతడు ఫ్రాంక్ రాబిన్ సన్, డేవిడ్‌రో అనే మిత్రులతో తయారు చేసి అమ్మడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆ మిత్రులతో గొడవ రావడంతో కోకా కోలా ఫార్ములాను వాళ్ళకు అమ్మేశాడు. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలాకు, పెంబర్‌టన్ ఒరిజినల్ కోకో కోలాకు రుచిలో ఎంతో మార్పు వచ్చింది. కాలానుగుణంగా కోకో కోలా రుచి మార్చుకున్నా దాని 'ఫార్ములా' ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది.


మూలం : 21-1-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం

మనకు ఏ కాస్త దెబ్బ తగిలినా, బ్లేడుకోసుకున్నా, రక్తం వచ్చినా వెంటనే బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటుంటాం.

బ్యాండ్ ఎయిడ్‌ను సృష్టించిన వ్యక్తి పేరు 'ఎర్లే డిక్సన్' ఈయన 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ ( అమెరికా) లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈయన భార్య ఇంట్లో వంట చేసేటప్పుడు తరచుగా చేయి కోసుకోవడం, కాల్చుకోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేది. అప్పట్లో తెగిన, కాలిన గాయాలకు దూదితో కట్టు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చాలా టైము పట్టే తతంగం. డిక్సన్ తన భార్యకు పదే పదే కట్టు కట్టలేక సులభంగా ఉండే 'బ్యాండ్ ఎయిడ్' ను 1920 లో కనిపెట్టాడు. నడిమధ్యలో దూది ఉండి, సులభంగా అంటుకుపోయే ఈ టేప్‌ను తయారు చేశాక డిక్సన్‌కు ఇంట్లో కష్టాలు తీరాయి. ఈ సంగతి 'జాన్సన్ అండ్ జాన్సన్' వాళ్ళతో డిక్సన్ చర్చించాడు. ఇతని ఆలోచనను మెచ్చిన ఆ సంస్థ 'బ్యాండ్ ఎయిడ్' తయారు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బ్యాండ్ ఎయిడ్ ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. చూశారా! ఒక చిన్న ఆలోచన డిక్సన్‌తో పాటు అందరికీ ఎంత మేలు చేసిందో...


మూలం : 7-1-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


రోబో

దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే, మనిషి తన ప్రతి సృష్టి ద్వారా 'మరమనిషి' ని పుట్టించాడు. ఆ మరమనిషినే ఇంగ్లీషులో 'రోబో' అంటున్నారు. 1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ తొలి "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసినా అంతకు ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేశారు. క్రీ.పూ 450 సంవత్సరంలోనే గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ ఒక 'మరపక్షి' ని తయారుచేసి (ఆవిరి ద్వారా) ఎగరేశాడట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్‌లో కూడా రోబో ప్రత్యక్షమయింది. మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించాడు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్ అట. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది. మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు (బాంబ్ డిప్యూజింగ్), లేదంటే మనిషితో అవసరం లేని పనులకు (ఫ్యాక్టరీల్లో కార్మికుల్లా) రోబోలను ఉపయోగించసాగారు. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చాయి. అభివృద్ది చెందిన దేశాల్లో పని మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది. కాని రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి. వీటిని "టినీ రోబోట్స్" అంటున్నారు. ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాని టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి, ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటున్నాడట. మొత్తం మీద 2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు తయారవుతాయని ఒక అంచనా. ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది. అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. రోదసిలో, సముద్ర గర్భంలో... ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయకారిగా పని చేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొంత కాలానికి రోబోలే మనిషి మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు. లేదంటే కొన్ని సైన్స్ ఫిక్షన్‌లలో జరిగినట్టుగా మనిషి అదుపు తప్పిన రోబోలు సర్వనాశనానికి ఒడిగట్టవచ్చు సైన్స్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది. రోబోల వల్ల మంచే జరగాలని కోరుకుందాం.


మూలం : 8-7-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


హార్లిక్స్

ఉదయం లేస్తే టీవీలో ఏపాంగ్ జపాంగ్ ఒపాంగ్ అంటూ హార్లిక్స్ ఒక్కసారైనా కనిపిస్తుంటుంది. 'మంచి పుస్టికరమైనది' అనీ, 'నేను హార్లిక్స్ తాగను తింటాను' అని చిన్నారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రకటనలు. ఆ ప్రకటనలు చూసి హార్లిక్స్ తెప్పించుకుంటాం. పాలల్లో కలుపుకొని రుచిగా తాగేస్తాం. కాని ఈ రుచికి కారకులైన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించం. వారి గురించి ఇప్పుడు ఆలోచిద్దాం.

హార్లిక్స్‌ను కనిపెట్టింది ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ పేర్లు విలియం హార్లిక్స్, జేమ్స్ హార్లిక్స్. విలియం పెద్దవాడు. జేమ్స్ చిన్నవాడు. వీళ్ళది ఇంగ్లాండ్. కానీ పని వెతుక్కుంటూ అమెరికా వెళ్ళారు. ఇద్దరూ ఆహారపదార్థాల తయారీలో ప్రయోగాలు చేసేవారే. 1873 ప్రాంతంలో విలియం హార్లిక్స్ చంటిపాపల కోసం హార్లిక్స్ ను తయారుచేశాడు. అప్పట్లో వాళ్ళూ దానికి మాలెడ్ మిల్క్ అనే పేరు పెట్టారు. వేడి నీళ్ళలో ఈ పొడి కలుపుకొని తాగితే బాగుంటుంది. అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం, హార్లిక్స్ రుచి అందరికీ నచ్చింది. అన్నదమ్ములు వెంటనే చికాగోలో ఫ్యాక్టరీ స్థాపించారు. 1908లో అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకొని హార్లిక్స్ వ్యాపారాన్ని మొదలెట్టారు. పసిపిల్లలే కాదు పర్వతారోహకులు కూడా హార్లిక్స్ తమ వెంట ఉంచుకొని దానికి ప్రచారం కల్పించడంతో హార్లిక్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 1960లో హార్లిక్స్ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచంలో హార్లిక్స్ అత్యధికంగా అమ్ముడు పోయేది ఇంగ్లాండ్, ఇండియా.


మూలం : 8-7-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


కార్టూన్ కథ

ఇప్పుడు మన దేశంలో ఎన్నో కార్టూన్లు చూస్తున్నాం కానీ అసలు ఈ కళ మనది కాదు. యూరప్ వారిది. అందుకే మన లలిత కళల్లో దీనికి చోటు లేదు. అయినప్పటికీ మిగతా కళలన్నిటికంటే భిన్నమైనది కనుక అందరినీ రంజింప చేసే కళగా ఈ ప్రక్రియ ఎదిగింది. రంగులు, కుంచెలు, కాన్వాస్‌లతో రోజుల తరబడి వేసిన పెద్ద పెయింటింగ్ కంటే ఇండియన్ ఇంక్‌తో పేపర్ పై నాలుగు గీతల్లో వేసిన కార్టూన్‌కి అందరూ స్పందిస్తారు. అందుకే ప్రపంచదేశాలన్నీ దీనిని ఆదరిస్తున్నాయి రాజకీయనాయకులపై వ్యంగ్యచిత్రాలు గీసే సంప్రదాయం బ్రిటీషు కార్టూనిస్ట్ డేవిడ్‌లో మొదలుపెట్టాడు. మనదేశంలో తొలి కార్టూనిస్ట్ కేరళకు చెందిన శంకర్ పిళ్లై. ఈయన 'శంకర్స్ వీక్లీ' అనే కార్టూన్ పత్రిక చాలా కాలం నిర్వహించారు. చిన్నారులకోసం ఢిల్లీలో ఓ కార్టూన్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. శంకర్ తర్వాత ఎందరో కార్టూనిస్టులు ఇప్పుడు పత్రికల్లో కనిపిస్తున్నారు.


కదలిన కార్టూన్లు

మనుషుల్లో కోపం, విషాదం మనకు తెలుస్తుంది. మరి జంతువులు నవ్వుతాయా? వాటి సంతోషం, విచారం మనకెలా తెలుస్తాయి? అందుకే వాల్‌డిస్నీ అనే అమెరికన్ కార్టూనిస్టు జంతువులను వ్యంగ్యంగా గీసి చూపించారు. చిట్టెలుకను అనేక రకాలుగా గీసి చిన్నారుల మనసు దోచుకున్నాడు. ఇదే 'మిక్కీ మౌజ్' గా అందరికీ నేస్తం అయింది. డిస్నీ కార్టూన్లు అందరికీ నచ్చడంతో అక్కడితో ఆగకుండా వాటిని కదిలించే పని మొదలు పెట్టాడు. దానికి యానిమేషన్ అని పేరు పెట్టాడు. ఆడే పాడే జంతువులతో యానిమేషన్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జంతువుల నడుమ పుట్టి పెరిగి వాటిని కాపాడే పిల్లవాడి కథతో జంగిల్‌బుక్, అడవిలో అల్లకల్లోలం చేసే లయన్ కింగ్ లాంటి యానిమేషన్ సినిమాలు వాల్డ్‌డిస్నీ రూపొందించినవే! అవి ప్రపంచమంతా సూపర్ హిట్. డిస్నీ తన కార్టూన్ క్యారెక్టర్లతో ఓ అందాల పార్క్‌ని నిర్మించాడు, అది డిస్నీ ల్యాండ్. దీనిని బాలల స్వర్గం అంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇక్కడకు వస్తుంటారు. రెండవ ప్రపంచ యుద్దం జరుగుతున్నప్పుడు హిట్లర్ మీద కార్టూన్ వేసిన డేవిడ్‌లో అనే బ్రిటీష్ కార్టూనిస్ట్ ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. జర్మనీ నుంచి రష్యా పారిపోయి బతకాల్సి వచ్చింది. కొన్నేళ్ళ క్రితం యూరప్‌లో ఓ మతసంప్రదాయం మీద కార్టున్ వేసినందుకు ఆ కార్టూనిస్ట్‌ని జైల్లో పెట్టారు. ఎమర్జన్సీ సమయంలో మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కేలక్ష్మణ్ కార్టూన్లు సెన్సార్ చేశారు.

కొంచెం బొమ్మలు గీయడం వస్తే కార్టూన్లు వేయడం చాలా ఈజీ. అయితే బొమ్మలు గీయడానికి కొంచెం శ్రద్ద, మరికొంచెం నిశిత పరిశీలన కావాలి. అప్పుడూ మీరు గీసిన కార్టూన్ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.


మూలం : 25-2-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


కరాటే

పూర్వం చదువుల్లో యుద్ద విద్యలు కూడా ఒక భాగంగా ఉండేవి. కేవలం టెక్స్ట్ బుక్కులను బట్టీ కొట్టడమే కాకుండా, శరీర ధారుఢ్యం పెంచుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా యుద్ద విద్యలు అక్కరకొచ్చేవి. కర్రసాము, కత్తిసాము, మల్లయుద్దము, విలువిద్య... ఇవన్నీ మన యుద్దవిద్యలు, అయితే కాలక్రమంలో ఈ 'కరాటే' విద్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించింది లేదు. 'కరాటే' అనే మాటకు అర్థమే 'ఖాళీ చేతులు' అని అర్థం.

జపాన్ దేశంలో పుట్టి చైనాలో విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ యుద్ధ విద్యను మొదటగా సాధన చేసింది బౌద్ధభిక్షవులు అహింసను ఆచరించే ఈ భిక్షవులు, బౌద్ధ ప్రచారం కోసం అడవుల్లో ప్రయాణించే సమయాన దొంగలను ఎదిరించడానికి ఈ యుద్ధకళను నేర్చుకున్నారు. కరాటేలో అనేక స్టయిల్స్ ఉన్నాయి. ఒక్కో ‌స్టయిల్‌కు ఒక్కో విధమైన సాధన అవసరం. అలాగే కరాటే వీరులకు ర్యాంకులు ఉంటాయి. ఒక్కో ర్యాంకును ఒక్కో బెల్టుతో సూచిస్తాయి. ప్రాథమిక స్థాయిలో వైట్ బెల్ట్, ద్వితీయ స్థాయిలో బ్రౌన్ బెల్ట్, సర్వోన్నత స్థాయిలో బ్లాక్ బెల్ట్ ఇస్తారు. బ్లాక్ బెల్ట్ నడుముకు చుట్టుకొని గోదాలో దిగాడంటే అతడు మాస్టర్ కింద లెక్క.

కరాటేలో జగమంతా తెలిసిన వీరుడు బ్రూస్-లీ. చైనాలో జన్మించిన బ్రూస్-లీ ఖాళీ చేతులతో ముప్పై, నలభై మందిని సులభంగా మట్టి కరిపించే సత్తా కలిగి ఉండేవాడు. ఆయన నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా ఇప్పటికీ టీవీలో ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. కుంగ్‌ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి జాకీ చాన్. మనుషుల్లో తొంభై శాతం మంచివాళ్ళే ఉన్నా పది శాతం దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. ఎదుటివాళ్ళకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అటుమంటి వాళ్ళకు బుద్ది చెప్పాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఉత్తమం. చిన్నప్పటి నుండి కరాటే నేర్చుకుంటే సులభంగా వంటపడుతుందని అంటారు. మన రాష్ట్రంలో అనేక ముఖ్యపట్టణాల్లో కరాటే అకాడెమీలు ఉన్నాయి.


మూలం : 13-5-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్


పుల్ల ఐసు - బొంబాయి మిఠాయి

చల్లగా, తియ్యగా, పుల్లగా రకరకాల రుచులలో ఉండే పుల్ల ఐసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్కూలుకు వెళ్ళేప్పుడో స్కూలు నుంచి వచ్చేప్పుడో బండి వాడు అమ్ముతున్న ఐస్ ను కొనుక్కోకుండా ఎవరు ఉంటారు? పాలైసు, ద్రాక్షా ఐసు, ఆరెంజ్ ఐసు, సేమ్యా ఐసు, డబుల్ ఐసు... అబ్బా ఎంత బాగుంటాయో. మరి ఈ పుల్ల ఐసు ఎలా వచ్చింది అనంటే అనుకోకుండా వచ్చిందని చెప్పాలి. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'ఫ్రాంక్ ఎవర్‌సన్' తన 11 ఏళ్ళ వయసులో 1905లో అనుకోకుండా దీనిని కనిపెట్టాడు. ఫ్రూట్ జ్యూస్‌ను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోయిన ఎవర్సన్ మరుసటిరోజు ఉదయం దానిని తీసి చూస్తే గడ్డ కట్టి కనిపించింది. టేస్ట్ చూస్తే చాలా బాగుందనిపించింది. అప్పటి నుంచి అతడు ఫ్రూట్ జ్యూస్ లో పుల్ల గుచ్చి, డీప్ ఫఫ్రిజ్‌లో పెట్టి పుల్ల ఐసు తయారుచేయడం మొదలెట్టాడు. దానికి 'పాప్సికల్' అనే పేరు పెట్టాడు. అలా అలా అది అ దేశం నుంచి అన్ని దేశాలకు చేరింది. అలాగే ఎగ్జిబిషన్‌లోనో, షాపింగ్ మాల్స్‌లోనో కనిపించే పింక్ కలర్ బొంబాయి మిఠాయి (కాటన్ కాండీ) ని 1897 లో 'విలియం మొరిసన్, జాన్ సి వార్టన్' అనే అమెరికా వ్యక్తులు తయారు చేశారు. కలర్ చక్కెరను మిషన్ తిరగలిలో వేసి దూదిపొరల్లాంటి బొంబాయి మిఠాయిని వాళ్ళు తయారు చేశారు. 1904లో ఒక ట్రేడ్ ఫెయిర్‌లో దీనిని మొదటిసారిగా అమ్మారు. అప్పటి నుంచి ప్రతి ఎగ్జిబిషన్‌లో అది కనిపిస్తూనే ఉంది.


మూలం : 11-2-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: