telugudanam.com

      telugudanam.com

   

ఎందుకు, ఏమిటి, ఎలా ...

బార్ కోడ్స్

మనం నిత్యం వాడుకొనే రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్ లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను చూస్తూ ఉంటాం. ఆ నల్లని గీతలు ఏంటి, ఎలా వస్తాయి, ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.హిప్నాటిజం

హిప్నాటిజం అంటే ఏమిటి, దీనిని ఎవరు కల్పించారు, ఎలా పని చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం.

హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆదీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్తుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. దీన్నే 'మెస్మరిజం' అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది.

డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్లవైద్యుడు భారతదేశంలో హిప్నాటిజం వ్యాప్తికి కృషిచేశాడు. ఆయన 19వ శతాబ్దంలో మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసే విధానం కనిపెట్టని సమయంలో రోగులను హిప్నాటైజ్ చేసి, వారికి ఏమాత్రం నొప్పిలేని విధంగా శస్త్ర చికిత్సలు, అంటే ఆపరేషన్‌లు చేసేవాడు. ఆపరేషన్ పూర్తయిన తరువాత రోగులను ప్రశ్నించగా, వారు తమకు ఏ నొప్పి కలుగలేదని చెప్పారట. ఆ పద్దతిలో డా.ఎన్ ‌డైలే ఆకాలంలో ప్రపంచవ్యాప్తంగా 300 ఆపరేషన్లు నొప్పి తెలియకుండా చేసి సంచలనం సృష్టించాడు. హిప్నాటిస్ట్ నేరాలు చేయదలచుకుంటే వశీకరణకు లోబడిన వారిని దీర్ఘసుషుప్తిలోకి తీసుకుపోయి తన ఇష్టం వచ్చినట్లు చేయించగలడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1952లో హిప్నాటిజం చట్టం రూపొందించింది. దీని ప్రకారం శాస్త్రీయ ప్రయోజనాలకోసమో, లేక రోగులకు వైద్యం చేయడానికో తప్ప హిప్నాటిజాన్ని వాడకూడదు. ప్రస్తుతం అనేకమంది హిప్నాటిజాన్ని వృత్తిగా స్వీకరించి, అనేక మ్యాజిక్కులు చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు.


చాప్ స్టిక్స్

జీవన విధానాలు రోజురోజుకూ మారుతున్న రోజులివి. హొటళ్ళలో పార్టీలు, విందులు నేటి తరం వారికి సాధారణమవుతున్నాయి. ఇన్నాళ్ళూ, అలవాటు లేకపోయినా రేపు ఏ బహుళజాతి సంస్థలోనో ఉద్యోగం వస్తే మెట్రో నగరంలో నివసించాల్సి వస్తే అన్నీ తెలుసుకుని ఉండటం అవసరం కదా? చాప్‌స్టిక్స్ ఎందుకువాడతారు, ఎలా ఉపయోగిస్తారు తెలుసుకుని ఉండటం అవసరం. చాప్‌స్టిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చైనా, జపాను వారి భోజన పద్దతుల్లో చాప్‌స్టిక్స్ ప్రధానపాత్ర వహిస్తాయి. వీటిని వెదురు, మామూలు కలప, బంగారం, వెండి, ప్లాస్టిక్ లాంటి పలురకాల పదార్థాలతో తయారుచేస్తారు. సాధారణంగా ఒకవైపు కాస్త వెడల్పుగా మరో వైపు కొనదేరి ఉండే ఈ చాప్‌స్టిక్స్ కొన్నిటిపై చక్కని నగిషీలు చెక్కుతారు. చైనీయుల నిత్యం ఇళ్ళలో వాడే చాప్‌స్టిక్స్ వెదురుతో చేసినవే. ధనవంతులు మాత్రమే దంతం, వెండి, బంగారు చాప్‌స్టిక్స్‌ని వాడతారు. చైనీయుల చాప్‌స్టిక్స్ కాస్త పొడుగ్గా ఉంటాయి. జపానీయులవి మధ్యస్తంగా ఉంటాయి. వీళ్ళు చేపల్లాటి ఆహారం ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి అందుకు అనుకూలంగా వీటి చివర్లు కొనదేరి ఉంటాయి. కలపతో చేసి లక్కతో డిజైన్లు వేసినవై ఉంటాయి. కొరియా వాళ్ళు, వియత్నాం వాళ్ళు చాప్‌స్టిక్స్ వాడతారు. కానీ ఎక్కువగా స్టీలువే అయివుంటాయి. చైనా భాషలో చాప్‌స్టిక్స్ సూచించే పదానికి అర్థం 'క్విక్ లిటిల్ ఫెలోస్' అని అర్థం. వాళ్ళు వాటిని వాడేటప్పుడు చూస్తే అది సరైన అర్థమేననిపిస్తుంది. అసలీ రెండు పుల్లలతో ఆహారం ఎలా తింటారా అన్నది మీ సందేహం కదూ? ఆ సందేహానీ తీర్చుకుందాం రండి.

చెప్పడం తేలికే కానీ సాధన చాలా అవసరం. ఒకదాన్ని అరచేతిలో బొటనవేలి కిందనుంచీ పట్టుకోవాలి. ఉంగరం వేలితో దానికి సపోర్టు ఇవ్వాలి. ఇది కదలకుండా చూడాలి. రెండో పుల్లను పట్టుకోవడానికి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు ఉపయోగించాలి. ఒకవిధంగా పెన్ను పట్టుకున్నట్లనుకోండి ఒక రెండిటి అంచులు ఒక దగ్గర వచ్చేలా పట్టుకోవాలి. ఇవి ప్రాధమిక విషయాలు మాత్రమే. నేర్చుకొని దాన్ని సాధన చేయడం అవసరం.

చాప్‌స్టిక్స్‌తో చేయకూడని వేంటంటేఓ చిన్నమాట...

చాప్‌స్టిక్స్ వాడటం మీకు పూర్తిగా తెలిసాకే నలుగురిలో ఆ ధైర్యం చేయండి. ఉన్న ఆహార పదార్థాలను చూసి వాటిలో చాప్‌స్టిక్స్‌తో తినగలిగేవి ఉంటేనే వాటిని తీసుకోండి.


మూలం : 20-8-2006 ఈనాడు పత్రిక, వసుంధర.


సీతాకోక చిలుక

రంగు రంగు రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుకను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది కదూ. అంతకు ముందు అది నల్లటి, పొడవైన వెంట్రుకలతో ఉన్న గొంగళిపురుగే అంటే అసలే నమ్మబుద్దికాదు. అదే మరి విచిత్రమంటే. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా ఎలా మారుతుంది అనేది మనం తెలుసుకుందాం.

సీతాకోకచిలుకగా మారడానికి ముందు గొంగళిపురుగు ప్యూపా దశకు చేరుకుంటుంది. ఈ దశకు చేరుకోవడానికి గొంగళిపురుగు ఒక చెట్టు లేక మొక్కలోని అనువైన ఆకు కాండాన్ని ఎంచుకొని, తలను కిందికి తిప్పి, శరీరం వెనుక భాగంతో దానిని పెనవేసుకుంటుంది. తల కింది భాగం నుంచి అతి సన్నని పట్టుదారాల్లాంటి పోగులను ఉత్పత్తి చేసి, వాటితో చిన్న దిండును చేసుకుంటుంది. దాని ఆధారంగా గొంగళిపురుగు కాండానికి అతుక్కుపోతుంది. ఆపై అది తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ, తలను అటూ ఇటూ కదిలిస్తూ, ఆ దారాల్లాంటి పోగులతో తన దేహం చుట్టూ ఒక ఒడ్డాణాన్ని రూపొందించుకుంటుంది. కొన్ని రోజులు పోయాక గొంగళిపురుగు చర్మం లోపల మరొక సున్నితమైన చర్మపు పొర ఏర్పడటం మొదలవుతుంది. అప్పుడు అది తన శక్తినంతా ఉపయోగించి గిజగిజలాడడంతో పై చర్మం చీలి, విడిపోతుంది. దాంతో లోపల ఉన్న కొత్త చర్మం పైకి తేలి వాతావరణంలోని గాలి సోకడంతో గట్టి పడుతుంది. ఈ దశనే ప్యూపా అంటారు.

ప్యూపా తన తోక చివర ఉన్న కొక్కాలను గొంగళిపురుగుగా ఉన్నప్పుడు చేసుకున్న దిండుకు తగిలిస్తుంది. ఈ దశలో, చర్మం లోపల ఉత్పన్నమైన హార్మోన్ల వల్ల చాలా మార్పులు వస్తాయి. సంపూర్ణంగా పరివర్తన చెందిన తర్వాత తనలో ఉత్పన్నమైన ద్రవాలను తలతో పాటు దేహమంతా ప్రసరింపజేస్తుంది. దాంతో కొత్తగా ఏర్పడిన పై చర్మం కూడా చీలి, విడిపోతుంది. ఈ చర్మం విడిపోవడానికి కొన్ని వారాలు పడుతుంది.

ఆ తర్వాత అది గాలి పీలుస్తూ తల, తలపైన స్పర్శ శృంగం, తలలోని నోరు మొదలైన చిన్న భాగాలతో పురుగురూపంలో బయటకు వచ్చి, ఆకుకు అంటుకుపోయి స్వేచ్చగా వేలాడుతుంది. మెత్తని దాని శరీర భాగాలు ఇంకా పెరగడం మొదలవుతాయి. రెక్కలోనికి రక్తం ప్రసరించి, అవి నెమ్మదిగా విచ్చుకొని పెరుగుతాయి. తర్వాత హార్మోన్ల ప్రభావంతో రెక్కల్లో అనేక రంగులు ఏర్పడి, తడిలేకుండా ఆరి బాగా విప్పారి గట్టిపడతాయి. ఈ దశనే సీతాకోకచిలుక అంటాం. సీతాకోక చిలుక తన సున్నితమైన అందమైన రెక్కలను మొదట్లో నిదానంగా ముడూస్తూ, తెరుస్తూ కొంత అలవాటు పడిన తరవాత ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అంతవరకు తను పట్టుకొని వేలాడుతున్న ఆకు నుంచి ఎగిరి, ఆహారం కోసం మరో చెట్టు పూవు పై వాలుతుంది.


మూలం : 21-5-2006 ఈనాడు పత్రిక, వసుంధర.


యాసిడ్

మలినాలను తొలగించే శక్తి యాసిడ్‌కు ఎలా వచ్చిందో, ఎందుకు దానిని ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జిడ్డులాగా పేరుకునే మురికికి కారణం ప్రొటీన్లు లేదా కార్బోహైడ్రేటు మలినాలే. చాలా బండలు, నేల మీద పై పొరలో ఉండే రసాయనిక పదార్థం కాల్షియం కార్బనేటు మనం మురికిని వదిలించడానికి వాడే యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంకు కాల్షియం కార్బనేట్‌తో చర్య జరిపి కార్బన్‌డయాక్సైడును, కాల్షియం క్లోరైడును, నీటిని ఇచ్చే ధర్మం ఉంది. కొద్దిగా పొరలాగా ఆసిడ్ ను వేసినప్పుడు అది వెంటనే పై పొరతో రసాయనిక చర్య జరిపి ఆ పొరను తొలగిస్తుంది. ఆ పొరతో పాటే దానికి అంటుకొనివున్న మలినాలు కూడా తొలగిపోతాయి. అలాగే యాసిడ్ కి నీటి సమక్షంలో కార్బోహైడ్రేట్లను, ప్రొటీన్లను మెల్లమెల్లగా ధ్వంసం చేసే గుణం కూడా ఉంది. అందుకే దాన్ని శుభ్రపరచే పదార్థంగా వాడతారు.


మూలం : 4-6-2006 ఈనాడు పత్రిక, వసుంధర.


చల్లని ఏసీ (ఎయిర్ కండిషనర్)

చల్లని ఏసీ ఎలా పుట్టిందో ఏసీని ఎవరు కనిపెట్టారు, ఎందుకు పనికి వస్తుందో తెలుసుకుందాం.

చల్లటి గాలిని ఇచ్చే ఏసీ (కండిషనర్ )అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? కానీ, ఈ ఏసీ మొదట్లో కేవలం పరిశ్రమల కోసమే పుట్టిందంటే నమ్ముతారా? ఏసీ మొదట్లో ఒక ముద్రణ (ప్రింటింగ్) పరిశ్రమ కోసమే పుట్టింది. అమెరికాలోని బ్రూక్‌లీన్ ప్రింటింగ్ సంస్థలో వేడి, తేమల మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడేవి. ముద్రించిన తర్వాత రంగులు అల్లుకుపోవడం లాంటివి జరిగేవి. దీనిని అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక యువకుడు గమనించాడు. గాలిని చల్లబరిచే ఒక పరికరాన్ని చేసి యజమానికి చూపించాడు దాంతో ప్రింటింగ్ త్వరగా పూర్తి కావడమే కాదు నాణ్యత కూడా పెరగడంతో ఆయన బోలెడు సంతోషించాడు. అదే మన మొట్టమొదటి ఏసీ అన్నమాట. ఆ ఉద్యోగి పేరు విల్లిస్ హావిల్యాండ్ క్యారియర్. 'ఫాదర్ ఆఫ్ ఏసీ'గా పేరు తెచ్చుకున్న క్యారియర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే ఏసీని కనిపెట్టాడు. అప్పట్లో ఆయన జీతం వారానికి 10 డాలర్లు మాత్రమే!

క్యారియర్ 1906లో ఏసీ మీద పేటెంట్ సాధించాడు. అప్పటి నుంచి రకరకాల పరిశోధనలు చేసి మరింత మెరుగు పరచాలని చూస్తుండేవాడు. రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఒక కొత్త సూత్రాన్ని రూపొందించి 1911 లో అమెరికాలోని ఇంజనీరింగ్ సొసైటీకి అందించాడు. ఇప్పటికీ ఈ సూత్రమే ఏసీల తయారీకి ప్రధానమైన ఆధారం. ఈ ఆలోచన ఆయన చాలా చిత్రంగా వచ్చింది. క్యారియర్ ఒకసారి రాత్రిపూట రైలు కోసం చూస్తున్నాడు. అప్పుడు బాగా మంచు కురుస్తుంది. ఇంతలో రైలు రావడంతో మంచు స్థానాన్ని వేడిగాలి ఆక్రమించింది. వేడి, తేమ, మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు. వేడిగాలి మూలంగా మంచు చెదిరినప్పుడు. చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడిని తగ్గించవచ్చని గ్రహించాడు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

పరిశ్రమల్లో ఏసీ బాగా ప్రాచుర్యం పొందడంతో క్యారియర్ ఒక కంపెనీని ఏర్పాటుచేశాడు. రకరకాల పరిశోధనలు చేసి ఆరోగ్యానికి హాని కలిగించని 'సెంట్రిప్యుగల్ రిఫ్రిజిరేషన్' యంత్రాన్ని తయారుచేశాడు. దీంతో విశాలమైన ప్రాంతాల్లో కూడా చల్లదనాన్ని కలిగించడానికి అవకాశం ఏర్పడింది. దాంతో వాణిజ్య సముదాయాలు, థియేటర్లలో వాడకం మొదలైంది. ఆతర్వాత చిన్న చిన్న ఏసీల తయారీకి గిరాకి పెరగడంతో 1928 లో ఇంట్లో వాడుకునే 'వెదర్ మేకర్ ' ని సృష్టించాడు. అదే ఇప్పుడు రకరకాల మార్పులతో ప్రపంచమంతా వ్యాపించింది అన్నమాట.


మూలం : 4-6-2006 ఈనాడు పత్రిక, వసుంధర.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: