telugudanam.com

      telugudanam.com

   

బాబోయ్ కవి

{తెర తీయగానే రూం వాతావరణం కనబడుతుంది. రూంకి ఎడమవైపు మూలగా ఒక బల్ల మీద పుస్తకాలు, టైం పీస్, బల్లకి ఎదురుగా కుర్చీ, దాన్లో కూర్చుని గాంది పుస్తకం చదువుతూ ఉంటాడు. గోడకు వ్రేలాడుతూ శ్రీకృష్ణుడి కాలెండర్ ఉంటుంది. చాప మీద ముసుగుతన్ని మూర్తి పడుకుని ఉంటాడు. కాస్త దూరంగా ఒక కుర్చీ ఉంటుంది. అంజి బస్కీలు తీసూ ఉంటాడు}


అంజి : (బస్కీలు తీస్తూ) 95, 96, 97, 98, 99, 100... (అని బస్కీలు తీసి, అక్కణ్ణుంచి లేచి, రూంకి ఒక మూల పడేసున్న స్కిప్పింగ్ రోప్‌ని తీసుకుని కాసేపు స్కిప్పింగ్ చేసి, తాడుని దూరంగా విసిరేసి, చైర్ మీద ఆరేసున్న టవల్‌ని తీసుకుని మొహం తుడుచుకుని, క్రింద చాప మీద పడుకున్న మూర్తిని నిద్ర లేపుతూ) మూర్తీ! లేరా! (తట్టి) రేయ్ మూర్తీ! నిద్ర లేవరా! టైం ఎనిమిది దాటింది లే! లే!

మూర్తి : (గబుక్కున ముసుగు తీస్తూ) ఆ! ఎనిమిదైపోయిందా? (అని కళ్ళు తెరవకుండానే షూస్ విప్పి, లేచి నిలబడి భజన చేస్తున్నట్లుగా) హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే (అనుకుంటూ శ్రీకృష్ణుడి కాలెండర్ దగ్గరకెళ్ళి, భజన చేసుకుంటూనే ఆత్మ ప్రదక్షిణలు చేసి, కాలెండర్‌ని వెనక్కి తిప్పి, ఆ కాలెండర్ వెనకే అంటించి ఉన్న రమ్య కృష్ణ ఫోటొని చూస్తూ కళ్ళు తెరిచి) హరే కృష్ణ హరే కృష్ణ రమ్య క్ర్ష్ణ హరే హరే! గుడ్ మార్నింగ్ రమ్య కృష్ణా! గుడ్ మార్నింగ్‌రా అంజీ, గాంధీ!

అంజి : అదిసరేగానీ, రాత్రి ఇలా షూ మీదే పడుకున్నావా?

మూర్తి : ఏం చెయ్యమంటావురా మరి? నేను రూంకి వచ్చేటప్పటికే రాత్రి ఒంటిగంట దాటింది మరి.

అంజి : రాత్రంతా ఎక్కడెక్కడ తిరిగావ్?

మూర్తి : తిరగడమా? నేనా? ఎంత మాటన్నావురా? నీకంటికి నేను తిరుగుబోతోడిలాగా కనిపిస్తున్నాన్రా?

అంజి : మరైతే ఆలశ్యం ఎందుకయ్యింది?

మూర్తి : ఏమీ లేదురా. సాయంత్రం ఆరింటినుంచి తొమ్మిదింటిదాకా సావిత్రి వాళ్ళింటి ముందు కాపుకాశాను.

అంజి : ఎందుకు?

మూర్తి : ఎందుకేంట్రా? నా మనసులో మాట చెబుదామని.

అంజి : నీ మనసులో మాట ఇలా ఎంతమందికి చెబుతావురా?

మూర్తి : ఎవరో ఒకరి మనసులోకి ఎంటరయ్యేవరకు.

అంజి : ఐతే ఈసారి సావిత్రిని విసిగించబోతున్నావన్నమాట.

మూర్తి : విసిగించడం కాదురా, విరహంతో చచ్చిపోతున్నాను. అసలు సావిత్రంటే ఎవరనుకున్నావురా?

గాంధి : (పుస్తకంలోనుంచి తలెత్తకుండానే) మహా పతివ్రత.

మూర్తి : నువ్వు నోర్మూసుకోని చదువుకోరా.

అంజి : ఇంతకీ విషయం ఏమయ్యింది. కాయా? పండా?

మూర్తి : పుచ్చు.

అంజి : అనుకున్నాన్లే. ఆతరువాత ఏంచేశావ్?

మూర్తి : రూంకి రాబుద్ధి కాలేదు. మనసు పాడయ్యింది.

గాంధి : (తలెత్తకుండానే) పాడు మనసు కదా మరి.

మూర్తి : (గాంధికేసి ఒక్క క్షణం సీరియస్‌గా చూసి) ఫ్రెష్‌నెస్‌నెస్‌కోసం వెంకటేశ్వరా ధియేటర్‌లో ఇంగ్లీష్ సినిమాకెళ్ళాను. ఆ! అరేయ్! ఆ హాల్ దగ్గర స్టూడెంట్స్ రూం ఒకటి ఖాళ్ళీగా ఉందంట. అక్కడికి షిఫ్ట్ అయిపోదామా?

అంజి : ఈ లొకాలిటీలో ఉంటేనే మన చదువులు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఇంక ఆ హాల్ దగ్గరకెళ్తే హాల్‌లోనే రూం తీసుకున్నట్లవుతుంది, ఏమీ వద్దులే.

మూర్తి : అసలా రూంకి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? దానికి పెద్ద రెకమెండేషన్ కావాలోయ్.

అంజి : ఏమీ అవసరంలేదుగానీ, పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి ముందు వాటి సంగతి చూడు.

మూర్తి : వాటికంటే ముందు ఆకలి తరుముకుంటూ వచ్చేస్తుంది. టిఫిన్ తినాలి పదా (అని బయల్దేరబోతాడు)

అంజి : పళ్ళు తోముకోవా ఏంటి?

మూర్తి : నో. మనదంతా వెస్టెర్న్ స్టైల్. పళ్ళు తోముకోకుండానే పళ్ళు తింటాము. బట్టలేసుకోకుండానే బజార్లెంట తిరుగుతాము (అని వెళ్ళబోతాడు)

అంజి : కనీసం షర్టన్నా వేసుకోరా (అంటూ మూర్తి షర్ట్‌ని అతనికి అందిస్తాడు. మూర్తి వెనక్కి తిరక్కుండానే దాని అందుకుని వెళ్ళిపోతాడు.

గాంధి : (చదువుకుంటూనే ఉంటాడు)

అంజి : ఏరా! నువ్వు రావా టిఫిన్ చెయ్యడానికి?

గాంధి : నేను చదువుకోవాలి మీరు వెళ్ళి రండి.

అంజి : ఆలస్యంగా వెళ్తే అక్కడ మిగిలేది అంట్లే.

గాంధి : (వుసుగ్గా) అబ్బా! మీరు వెళ్లండ్రా.

అంజి : (నిట్టూర్చి) వాడు అతివృష్టిగాడు. వీడేమో అనావృష్టిగాడు. ఇద్దరి మధ్యా చచ్చిపోతున్నాను. ఏం చేస్తాం (అనుకుంటూ తను కూడా బయటికి వెళ్ళిపోతాడు).

గాంధి : (సీరియస్‌గా చదువుకుంటూంటాడు)

కవి : (ప్రవేశిస్తూ) శుభోదయమోయ్ గాంధీ! శుభోదయం!

గాంధి : (భయంగా) నువ్వా? ఏంటీ ఇలా వచ్చావ్?

కవి : కవులెందుకొస్తారోయ్ కవితలు వినిపించడానికి తప్ప?

గాంధి : రాత్రి వినిపించావుగా?

కవి : అవి నిన్నవి. ఇవి ఈ పూట రాసినవి. ఫ్రెష్.

గాంధి : ఉహు. ఇప్పుడు కాదు. నేను చదువుకోవాలి.

కవి : ఈ కవిత నీలాంటి చదువరులను దృష్టిలో ఉంచుకుని రాసిందేనోయ్. ఇందులో బోలెడంత సందేశం కూడా ఉంది.

గాంధి : (ఆశగా) అలాగా? ఏదీ చదువ్.

కవి : (లాల్చీ జేబులోనుచి చిన్న కాగితం స్లిప్పు తీసి చదువుతూ) "ఎందుకోయ్ నీకీ వానాకాలం చదువు? (రిపీట్) కాపీలు కొట్టడం నేర్చుకో దిగిపోతుంది కొండంత బరువు". వాహ్‌వా! వాహ్‌వా! ఎలా ఉంది?

గాంధి : (చిరాగా) ఇదా, నువ్విచ్చే సందేశం? ఏమన్నా బాగుందా అసలు?

కవి : బాగోలేదా? ఐతే మరో కవిత (మరో జేబులోనుంచి మరో కవిత తీసి) ఇది ఎడమ చేత్తో రాసిన కవిత "మనసు బాగోనప్పుడు తాగాలి మందు!"

గాంది : ఏదీ, ఎలకల మందా?

కవి : కాదోయ్. ఆ మందు. ఆ మందు.

గాంధి : ఆ ఆ అర్ధమై చచ్చిందిలే.

కవి : "మనసు బాగోనప్పుడు తాగాలి మందు - కిక్కు ఇచ్చాక అవుతాము భలే పసందు". ఇదెలా ఉంది?

గాంది : నా మొహంలా ఉంది.

కవి : చ! మరీ అంత చండాలంగా ఉందా? ఐతే ఈ దివ్యమైన కవిత విను. (జేబులోనుంచి మరో కవిత తీసి) ఇది బాత్ రూంలో రాసింది. "కూరల్లో దివ్యమైన కూర గోంగూర - ఆ సంగతి నీకు తెలుసట్రా?"

గాంధి : (ఏడుపు మొహంతో) తెలుసు మహాప్రభో!

కవి : (ఆశువుగా) తెలుసా? "ఏదీ తెలియకున్నా అన్నీ తెలుసనుట విద్య - అన్నీ తెలిసినా ఏమీ తెలీదనుట మిధ్య".

గాంధి : రేయ్ కవీ! నివ్విప్పుడు వెళ్తావా లేదా?

కవి : "ఎక్కడికెళ్ళినా ఆగేదా నా కవితా ప్రభంజనం - ఆ ప్రవాహపు వెల్లువలో కొట్ట్కుకుపోవాలి సకల జన సమూహం"

గాంధి : చదువుకునేవాణ్ణి ఇలా బాధపెట్టడం నీకు న్యాయంగా ఉన్నదట్రా?

కవి : "చదివితే ఏమొస్తుందిరా శుంఠా - దానికోసం ఎందుకు పడతావు తంట - బుద్ధిగా కూర్చుంటే నువ్వో గంట - వినిపిస్తాను నీకు నా కవితల పంట"

గాంది : పంట కాదు మంట. ఎందుకురా నన్నిలా బాధపెడతావ్?

కవి : బాధపెట్టడం కాదోయ్. భావాలతో చుట్టుముట్టడం.

గాంది : చుట్టుముట్టడం కాదు, నన్ను మట్టుబెట్టడం. నీకు పుణ్యముటుంది వెళ్ళిపోరా.

కవి : వెళ్ళను. ఈ కవితను నువ్వు విని తీరాల్సిందే. ఇందాక కూరగాయల మార్కెట్ మీదుగా వస్తుండగా అక్కడి వాతావరణానికి స్పందించి మరీ రాశాను. జాగ్రత్తగా విను (లాల్చీ చేతి మడతల్లోనుంచి ఒక స్లిప్పు తీసి, పద్య ధోరణిలో) "ఆకుపచ్చగా ఉంటే అరటికాయ - దోరగా ఉంటే దొండకాయ - పొడవుగా ఉంటే అది పొట్లకాయ - గుండ్రంగా ఉండేదే మరి గుమ్మడి కాయ". ఎలా ఉంది?

గాంధి : అసలు నీ కవిత్వానికి సమయ సందర్భాలనేవేమైనా ఉన్నాయా?

కవి : "సమయ సందర్భాలనేవి సంధి సమాసాలు - తెలుగు గ్రామర్‌కవి కొత్తిమీర సమోసాలు"

గాంధి : నీ ఉపమానం తగలడ్డట్టే ఉంది.

కవి : "తగలడ్డానికి ఎదేమన్నా కొంప - నీ బ్రైన్ ఏనాడో ఖాళ్ళీ అయిన కలగూర గంప"

గాంధి : (తనలో) ఓర్నాయనోయ్! వాళ్ళతోపాటు టిఫిన్‌కెళ్ళినా బాగుండేది. పొద్దున్నే వీడికి టిఫినయ్యాను.

కవి : గాంధీ! ఆలకించావుగా నా కవితా ప్రవాహపు వెల్లువను? అసలు నీకు వినిపించాలనుకున్న అసలు సిసలైన నిఖార్సైన కవిత ఒకటి వినిపిస్తాను (సంచీలో చెయ్యిపెట్టి వెదుకుతుంటాడు)

గాంది : అమ్మో! ఈ రోజు నాకు భూమ్మీద నూకలు చెల్లేట్లున్నాయ్. పారిపోక తప్పదు. యాహూ! (అని గట్టిగా అరిచి పారిపోబోయి కాలు జారి క్రిందపడతాడు)

కవి : ఆ! పారిపోవాలని చూస్తావా? నానుంచే? (అని గాంధిని గట్టిగా పట్టుకుని, కుర్చీలో బలవంతంగా కూర్చోబెట్టి, స్కిప్పింగ్ రోప్‌తో గట్టిగా కట్టేస్తాడు)

గాంధి : కవీ! ఏంటీ దౌర్జన్యం? వదిలిపెట్టు.

కవి : వదల్ను. లేకపోతే నా కవిత్వం వినకుండా తప్పించుకుందామని చూస్తావా?

గాంధి : (విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ) అబ్బా! వదులు. వదిలిపెట్టు.

కవి : వదల్ను.వదల్నంటే వదల్ను. ఈ రోజు నా జీవితంలో ఓ గొప్ప శుభదినం. దీన్ని నేను సద్వినియోగం చేసుకునే తీరతాను.

గాంధి : ఒరేయ్! నువ్వు గొప్ప కవివేరా. ఒప్పుకుంటాను. నీ పాండిత్యాన్ని నేనేనాడో గుర్తించాను. ఇంకా ఎందుకురా నాకీ శిక్ష? వదల్రా బాబూ.

కవి : ఉష్! ఒక మంచి కవిత ఎక్కడో ఉండాలి (జేబులన్నె వెతికి, చెవి వెనకనుంచి ఒక స్లిప్పు తీసి) ఆ.. ఇది విను. "పప్పులో వెయ్యకపోతే ఉప్పు - అది భగవంతుడు సైతం క్షమించలేని తప్పు - ఎప్పుడూ గుడి బయటే విడవాలి చెప్పు - అది పోతే మళ్ళీ చెయ్యక తప్పదు అప్పు" వా! జీ! వా! బాగుంది కదూ?

గాంధి : నీ మొహంలా ఉంది. అసలు దాన్ని కవిత్వమంటారా? కవిత్వంలో నలుగురిలో చైతన్యం తెచ్చే భావావేశం ఉండాలి తెలుసా?

కవి : అలాగా? నీక్కావలసింది భావావేశమేగా? ఐతే ఇది విను (సంచీలోనుంచి మరో స్లిప్పు తీసి, వెంటనే గొంతు బిగ్గరగా పెంచుతూ, వెర్రి ఆవేశంతో) "నరాల బిగువూ, కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ ధనికస్వామికి దాస్యం చేసే యంత్ర భూతముల కోరలు తోమే కార్మిక ధీరుల కన్నుల నిండా కణకణమండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్". ఇదెలా ఉంది? నిన్న ఒక ఫాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడి కార్మికుల శ్రమ శక్తికి స్పందించి రాశాను.

గాంధి : ఏంటీ ఈ కవిత నువ్వు రాశావా? శ్రీశ్రీ గారి కవితని నీ కవితగా చాటే నీ సాహసానికి చేతులెత్తి నమస్కరించాలి.

కవి : (ఆశ్చర్యంగా) ఏంటీ, ఇది శ్రీశ్రీ కూడా రాశారా? చూశావా, మా ఇద్దరి అభిపాయాలు ఎలా కలిసాయో? అంటే నేను బాగానే రాశానన్నమాట.

గాంధి : ఏంటి నువ్వు రాసేది చూచిరాత? రాసింది చాలు ఇక నన్ను వొదిలిపెట్టు.

కవి : అప్పుడేనా? (సంచిలోనుంచి ఒక పెద్ద పేపర్ రోల్ తీసి క్రింద పడేస్తాడు. దాన్నిండా కవితలు రాసుంటాయి)

గాంధి : (భయంగా) ఏంటీ, అవన్నీ కవితలే?!

కవి : ఆ..నీకోసమే.

గాంధి : (బెంబేలెత్తినట్లుగా) ఆ! అయ్యో! ఎవరక్కడ? అయ్యో! రక్షించండి! హెల్ప్! బచావ్! ఒక అమాయకుడి ప్రాణం పంచ భూతాల్లో కలిసిపోకముందే ఓ ముక్కోటి దేవతల్లారా! ఈ దీనుణ్ణి కాపాడలేరా?

కవి : (చిరాగ్గా) అహె. అరవకు.

గాంధి : (భయంగా) అయ్య బాబోయ్!

కవి : (రోల్ మొదటి ఎడ్జిని పట్టుకుని కవిత చదువుతూ) "నేను రాసేది కవిత్వమేనా?"

గాంది : కాదురా మరణ శాసనం.

కవి : "నేను రాసేది కవిత్వమేనా?" (ఇక్కడి నుంచి మైం స్టార్ట్ అవుతుంది. కవి పేపర్ రోల్‌ని పట్టుకుని ఒకదాని తరువాత ఒక కవిత చదువుతూ ఉంటాడు. గాంధి తప్పించుకోవడానికి విఫల యత్నం చేస్తుంటాడు. కాసేపయ్యాక గాంధి తల ప్రక్కకు వాల్చేస్తాడు. కవి అలసిపోయినట్లుగా తన లాల్చీని ఎత్తి మొహం తుడుచుకుని, గాంధికేసిపరీక్షగా చూసి, దగ్గర్లోనే ఉన్న కూజాలోని నీళ్ళు మొహం మీద చల్లి లేపుతాడు. గాంధి కళ్ళు తెరవగానే మళ్ళీ కవితలు చదవడం మొదలుపెడతాడు. గాంధి ఈసారి ఫిట్స్ వచ్చినవాడిలాగా కొట్టుకుని పడిపోతాడు. కవి గాంధీని లేపడానికి ప్రయత్నం చేస్తాడు. కాని ఈసారి గాంధి లేవడు. కవి భయపడి కంగారుగా బయటికి పారిపోతుండగా, మూర్తి, అంజి ప్రవేశిస్తారు. కవి వాళ్ళని దాటుకుంటూ పారిపోతాడు).

మూర్తి : (గాంధీని చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకెళ్ళి) గాంధీ! గాంధీ!

గాంధి : (ఉలకడు, పలకడు)

అంజి : (కట్లు ఊడదీసి, నీళ్ళు గాంధి మొహం మీద చల్లి) : రేయ్ గాంధీ! ఏం జరిగిందిరా?

మూర్తి : ఎవర్రా నిన్నిలా కట్టేసింది? ఆ కవిగాడలా పారిపోతున్నాడెందుకు?

గాంధి : (నీరసంగా) దాహం! దాహం!

అంజి : (నీళ్ళు త్రాగించి) ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది?

గాంధి : (నీరసంగా) కవి... కవి...

అంజి : ఆ... కవి?

గాంధి : కవిత్వం... కవిత్వం...

అంజి : ఓ! అర్ధమయ్యింది. అంటే మేములేని సమయంలో వచ్చి వాడి దిక్కుమాలిన కవిత్వంతో నిన్నిలా హింసించాడన్నమాట.

గాంధి : (నీరసంగా) ఇది మొదటిసారి కాదురా.

మూర్తి : మరి?

గాంధి : ఎన్నిసార్లో గుర్తులేదుగానీ వాడు చెప్పిన కవితలన్నీ గుర్తున్నాయి. చెప్పేదా?

అంజి : వద్దులేగానీ ఈ విషయాన్ని నువ్వు మాకింతవరకు నువ్వెందుకు చెప్పలేదు?

గాంధి : చెబితే నువ్వు వాడిని పచ్చడి చేస్తావేమోనని.

అంజి : ఆ! అందుకని వాడి కవిత్వానికి నువ్వు బలైపోవాలా?

మూర్తి : ఆహా! కవుల్లో ప్రేమ కవులు, భావ కవులు, అభ్యుదయ కవులు ఉంటారని విన్నానుగానీ, మరీ ఇంత ప్రమాదకరమైన కవులుంటారని ఇప్పుడే తెలుసుకున్నానురా. కుర్చీకి కట్టేసి మరీ మవిత్వాన్ని వినిపించాడంటే వాడు నిజంగా అసాధరణమైన కవేరా. ఐనా మన గాంధీని ఇంత దారుణంగా హింసించినవాడిని ఊరికే వదిలిపెట్టకూడదు.

గాంది : పోన్లెండ్రా. వాడికో గుర్తింపు రావాలన్నదే వాడి తపన.

అంజి : నోర్ముయ్. దేనికైనా హద్దుంటుంది.

మూర్తి : (సిగ్గుపడుతూ) హద్దా? రేయ్! మొన్న సాయంత్రం అమల నాతో హద్దు మీరి ప్రవర్తించకు అని వార్నింగ్ ఇచ్చింది. నువ్వు కూడా అలాగే అంటుంటే నాకదోలా ఉందిరా.

అంజి : సంతోషించాంగానీ, ముందా విషయాన్ని ప్రక్కనపెట్టి ప్రస్తుతం ఏం చెయ్యాలో ఆలోచించు.

మూర్తి : ప్రక్కన పెట్టకుండానే ఆలోచిస్తాను. ఏంచేస్తే బాగుంటుందంటావ్? ఏరా గాంధీ! ఏంచేద్దామంటావ్?

అంజి : (చిరాగ్గా) వాణ్ణడుగుతావేం? నువే బుర్రుపయోగించు. (మూర్తి, అంజి అటూఇటూ ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటారు)

గాంధి : మరీ అంత కౄరంగా ఆలోచించకండిరా. నాకేదో భయంగా ఉంది.

అంజి : కాసేపు మాట్లాడించకు.

మూర్తి : (గట్టిగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ) త్రిషా, జెనీలియా మీలో ఎవరైనా మంచి ఐడియా ఇవ్వరూ? ఏం చార్మీ అంత దూరంగా నిలబడ్డావ్? దగ్గరకొచ్చి ఓ ఉపాయం చెప్పొచ్చుకదా? ఏం మీనా మౌనంగా ఉన్నావ్? నువ్వైనా ఈ మూర్తికో సలహా ఇవ్వొచ్చుకదా? (చిలిపిగా) ఏయ్ ఇలియానా నిన్నే!

అంజి : అబ్బబ్బ! ఏంట్రా నీ పాడు ఆలోచనలు?

మూర్తి : ష్! డోంట్ డిస్టర్బ్. (చెవి దగ్గర చెయ్యిపెట్టి) రంభ ఏదో ఉపాయం చెబుతానంటోంది (కాసేపు ఊ కొడతాడు) ఊ! బాగుంది! ఆ తరువాత? ఊ! ఊ! అలా చెయ్యమంటావా? ఊ! ఊ! (అని పెద్దగా) యాహూ! వెరి గుడ్ ఐడియా. థాంక్యూ వెరీ మచ్! ఒరేయ్ అంజీ!

అంజి : నేను వినను. నాకేం చెప్పకు.

మూర్తి : ముందు విన్రా బాబూ! నీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. ఇలారా (అంజి చెవిలో ఏదో రహస్యాన్ని చెబుతాడు) ఎలా ఉంది ఐడియా?

అంజి : ఓ! మార్వలస్! ఫెంటాస్టిక్!

మూర్తి : మరింక ఆలస్యమెందుకు? ప్రొసీడ్.

అంజి : (వెంటనే నిష్క్రమిస్తాడు).

గాంధి : మూర్తీ! వాణ్ణేం చెయ్యకండ్రా, నాకేదో భయంగా ఉంది.

మూర్తి : వాడి ప్రాణానికి ఎటువంటి హామీ ఉండదుగానీ నువ్వెళ్ళి చదువుకో.

గాంధి : (మళ్ళీ ఎప్పట్లా పుస్తకం తీసుకుంటాడు).

మూర్తి : (కాసేపు అటూ ఇటూ పచార్లు చేస్తాడు. సమయం గడిచాక....)

అంజి : (హిప్నాటిస్టుతో ప్రవేశిస్తూ) రండి సార్! రండి.

మూర్తి : అరె! అంతలోనే హిప్నాటిస్టు గారిని ఎలా తెసుకొచ్చావ్?

అంజి : వెదకబోయిన వైరు వేలికి చుట్టుకోవడమంటే అదే మరి.

మూర్తి : రండి సార్! కూర్చోండి.

హిప్నాటిస్ట్ : ఫరవాలేదు. ముందు పేషంట్ ఎవరో చూపిస్తే త్వరగా ట్రీట్‌మెంట్ ఇచ్చి మళ్ళీ నా క్లినిక్‌కి వెళ్ళిపోతాను.

అంజి : అలాగే సార్! తప్పకుండా. మూర్తీ! నేను వెళ్ళి కవిగాణ్ణి పట్టుకొస్తాను. నువ్వీలోగా హిప్నాటిస్టుగారితో మాట్లాడుతూండు. క్షణాల్లో వచ్చేస్తా.

మూర్తి : అలాగే. వెళ్ళిరా.

అంజి : (నిష్క్రమిస్తాడు).

మూర్తి : సార్! హిప్నాటిజం ద్వారా ఎటువంటి రోగాన్నైనా నయం చెయ్యవచ్చా?

హిప్నా : అది మానసికమైనదైతే తప్పకుండా నయం చెయ్యొచ్చు.

మూర్తి : అంటే మా మిత్రుడు ఒకడికి కవితలు వినిపించే అలవాటుంది. దాన్ని కూడా...

హిప్నా : ఆ! అంజి చెప్పాడు. వైద్య శాస్త్ర చరిత్రలో ఇంతవరకు దానికి మందు కనిపెట్టలేదు. అలా కవితల్ని ఎడాపెడా రాసేసి, నలుగురికీ వినిపించి తృప్తిపడే ఒక రకమైన మానసిక వ్యాధితో నీ కవి మిత్రుడు బాధపడుతున్నాడు, నలుగుర్నీ బాధపెడుతున్నాడు. హిప్నాటిజం పరిభాషలో ఆ జబ్బుని పోయెట్రీ న్యూరోసిస్ అనవచ్చు.

మూర్తి : మరి వైద్య శాస్త్ర చరిత్రలోనే మందులేని ఆ రోగాన్ని ఎటువంటి మందులు వాడకుండా కేవల హిప్నాటిజం ద్వారా నయం చెయ్యడం సాధ్యమా?

హిప్నా : తప్పకుండా. ఎలాగంటే పేషంట్‌ని ఒక రకమైన నిద్రలాంటి స్థితిలోకి తీసుకెళ్ళి, అతను అచేతన స్థితిలో ఉన్నప్పుడు అతని మీద మా మాటల ప్రభావాన్ని చూపుతాం. దాంతో ఆ రోగి పూర్తిగా మా వశమై పోతాడు. కొన్ని ప్రత్యేకమైన సజెషన్స్ ద్వారా అతని అలవాటును పూర్తిగా మాంపించగలుగుతాం. అంతెందుకు? సిగరెట్లు త్రాగడం, లిక్కర్ తీసుకోవడం వంటి చెడు అలవాట్లుకూడా హిప్నాటిజం ద్వారా మానిపించగలం.

మూర్తి : ఐతే మా కవి మిత్రుడి జబ్బుని కూడా నయం చెయ్యగలరన్నమాట.

హిప్నా : తప్పకుండా. ఇంతకంటే ప్రమాదకరమైన రోగాల్నే నయం చేసినవాడిని, ఇది నాకొక లెక్క కాదు.

గాంది : మీరు మాకా సహాయం చేస్తే మీకెంతో ఋణపడుంటాం సార్. వాడి దెబ్బకి తట్టుకొలేక చదువు మానేసి మా ఊరు వెళ్ళిపోదామనుకుంటున్నాను.

హిప్నా : నో. నో. అటువంటి ఆలోచనలే రాకూడదు. అది పిరికివాళ్ళ లక్షణం. సమస్యలని ధైర్యంగా ఎదుర్కోవాలి. మరేం ఫరవాలేదు. ఆలస్యంగానైనా నాలాంటి ప్రముఖ హిప్నాటిస్టు సహకారం తీసుకోవాలనే ఆలోచన మీకు కలిగింది. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

మూర్తి : ఆ ఆలోచన నాదే సార్.

హిప్నా : వెరీ గుడ్. నువ్వు చాలా తెలివైన విద్యార్ధిలా ఉన్నావ్.

మూర్తి : అవును సార్.ఐశ్వర్యా రాయ్, మనీషా కొయిరాలా కూడా ఎప్పుడూ ఇదే అంటుంటారు.

హిప్నా : వాళ్ళెవరు? ఈ పేర్లు ఎక్కడో విన్నట్లుందే.

మూర్తి : వాళ్ళు నా ఫ్రెండ్స్ లెండి.

అంజి : (కవితో ప్రవేశిస్తూ) రా! రా! ఇతడే సార్ కవి.

కవి : శుభోదయం. నాతో మాట్లాడాలన్నారట. కవిత్వం గురించేనా?

హిప్నా : అవును కవిగారూ! మీ గురించి చాలా విన్నాను. మీ కవిత్వం కూడా విందామని.

కవి : అలాగా? చాలా సంతోషం. మీలాంటి శ్రోత దొరకడం నా అదృష్టం (సంచెలో చెయ్యి పెట్టబోతాడు)

హిప్నా : ఆ! ఆగండాగండి. ముందుగా నేను మిమ్మల్ని హిప్నటైజ్ చెయ్యాలనుకుంటున్నాను.

కవి : నన్నా? దేనికి?

హిప్నా : మరి నా ప్రతిభ కూడా మీకు తెలియాలిగా? ఎంతైనా ఇద్దరం కళాకారులమే కదా?

కవి : ఔనౌను బాగా చెప్పారు. ఇద్దరు కళాకారుల మధ్య సమన్వయం ఉండడం ఎంతైనా అవసరం. అలాగే కానివ్వండి. ముందు మీ ప్రతిభను చూపించండి. ఆ తర్వాత నేనేంటో మీకు చూపిస్తా.

హిప్నా : ఐతే ఇలా కుర్చీలో కూర్చోండి.

కవి : (కుర్చీలో కూర్చుంటూ) తరువాత నా కవిత్వం మాత్రం వినాలి.

హిప్నా : ఓ! తప్పకుండా! కళ్ళు మూసుకోండి.

కవి : (కళ్ళు మూసుకుంటాడు).

హిప్నా : రిలాక్స్! రిలాక్స్!... (స్తేజి మీద లైట్లు డిం అవుతాయి) మూడుసార్లు శ్వాస గట్టిగా పీల్చి వదలండి. 1.... 2.... 3.... రిలాక్స్! రిలాక్స్! మీరిప్పుడు ఒక విధమైన మానసిక స్థితికి లోనుకాబోతున్నారు. ఆ స్థితిలో మీకు నా మాటలు మాత్రమే వినబడతాయి.

కవి : (కళ్ళు తెరిచి) అంటే... మిగతా వాళ్ళు మాట్లాడరా?

హిప్నా : ష్! కళ్ళు మూసుకోండి. రిలాక్స్!రిలాక్స్!రిలాక్స్! మీ కళ్ళు నెమ్మదిగా బరువెక్కుతున్నాయి.

కవి : (కళ్ళు తెరిచి) అబ్బే! అదేం లేదే?

హిప్నా : అబ్బా! మీరు నేను చెప్పినట్లు చెయ్యకపోతే మీ కవిత్వం వినను.

కవి : అమ్మో! ఐతే చెప్పండి.

హిప్నా : ఐతే కళ్ళు మూసుకోండి.

కవి : మూసేసా! (కళ్ళు మూసుకుంటాడు).

హిప్నా : రిలాక్స్! మీ కళ్ళు నెమ్మదిగా బరువెక్కుతున్నాయ్ ... మీ రెప్పలు మరీ మరీ బరువెక్కుతున్నాయ్...రిలాక్స్! ఇప్పుడు మీ రెండు చేతులూ నెమ్మదిగా బరువెక్కుతున్నాయ్...బాగా బరువెక్కుతున్నాయ్....పూర్తిగా బరువెక్కిపోయాయ్. రిలాక్స్! ఇప్పుడు మీ రెండు కాళ్ళూ నెమ్మదిగా బరువెక్కుతున్నాయ్...బాగా బరువెక్కుతున్నాయ్...పూర్తిగా బరువెక్కిపోయాయ్. రిలాక్స్! ఇప్పుడు మీ శరీరం మొత్తం నెమ్మదిగా బరువెక్కుతుంది...బాగా బరువెక్కుతుంది...పూర్తిగా బరువెక్కిపోయింది. రిలాక్స్! ఇప్పుడు మీ మనసు మొత్తం నా అధీనంలో ఉంది. మీకు నా సూచనలు తప్ప మరేం వినిపించడంలేదు. రిలాక్స్!(హిప్నాతిజం జరుగుతుండగా హిప్నాటిస్ట్ సూచనలను అనుసరించిన కవి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆ సూచనలను విన్న గాంధీ కూడ నిద్రలోకి జారుకుంటాడు). మీరు హాయిగా నిద్రపోతున్నారు...ప్రశాంతంగా నిద్రపోతున్నారు. హాయిగా...ప్రశాంతంగా..రిలాక్స్! రిలాక్స్! రిలాక్స్! ఓకే!

అంజి : సార్! వీడు నిజంగానే నిద్రలోకి జారుకున్నట్లేనా?

హిప్నా : అనుమానమా? ఐతే ఈ సూదితో అతని శరీరం మీద గుచ్చి చూడండి. అతనికేమాత్రం స్పర్శ అనిపించదు.

అంజి : అలాగా? ఏదీ ఇటివ్వండి (హిప్నాటిస్ట్ అందించిన సూదితో కవి చెయ్యి మీద గుచ్చుతాడు. కవి ఏమాత్రం స్పందించడు) ఓ! ఫెంటాస్టిక్!

మూర్తి : సార్! ట్రీట్‌మెంట్ త్వరగా ప్రారంభించండి. వీడు ఒక కవినన్న విషయమే మరచిపోవాలి.

హిప్నా : తప్పకుండా. రిలాక్స్! రిలాక్స్! రిలాక్స్! మీ పేరేంటి? ఒక్కసారి చెప్పండి. మీ పేరు?

కవి : (లోగొంతుకలో నెమ్మదిగా) కవి...

హిప్నా : మీకున్న గొప్ప అలవాటు?

కవి : కవితలు వినిపించడం.

హిప్నా : ఒకే! రిలాక్స్! మీకు నా మాటలు మాత్రమే వినబడుతున్నాయ్. జాగ్రత్తగా వినండి. మీరు నా సూచనలు మాత్రమే పాటిస్తున్నారు. ఈ రోజు నుంచి మీరు కవితలు రాయడం లేదు. మీరు కవితలు రాయడం లేదు. రిలాక్స్! మీరసాలు చదువుకోలేదు. మీకు అక్షరాలే రావు. రిలాక్స్! ఇప్పుడు అ ఆలు చెప్పండి. చెప్పండి. మీకు అ ఆలు రావా?

కవి : రావు.

మూర్తి : హుర్రే!

హిప్నా : ష్! (కవితో) నేను చెప్పినట్లు చెప్పండి. నేను కవిత్వం రాయను. కవి : నేను కవిత్వం రాయను.

హిప్నా : నేను కవిత్వం రాయను.

కవి : నేను కవిత్వం రాయను.

హిప్నా : నేను కవిత్వం చదవను.

కవి : నేను కవిత్వం చదవను.

హిప్నా : నేను కవిత్వం చదవను.

కవి : నేను కవిత్వం చదవను.

హిప్నా : నువ్విప్పుడు కవిత్వం పూర్తిగా మరచిపోయావ్. పూర్తిగా మరచిపోయావ్. పూర్తిగా మరచిపోయావ్. రిలాక్స్! హాయిగా నిద్రపోండి. హాయిగా... ప్రశాంతంగా..రిలాక్స్! రిలాక్స్! రిలాక్స్! ఒకే! ఈరోజుకి కాస్తైనా మార్పు వచ్చి తీరుతుంది. సీ యూ మళ్ళీ కలుద్దాం. (వెళ్ళబోతాడు).

అంజి : అలాగే! సార్! మరి వీడు?

హిప్నా : నిద్రపోనివ్వండి. కాసేపయ్యాక అతనే లేచి వెళ్ళిపోతాడు.

మూర్తి : అమ్మో! వద్దు సార్. నిద్రలోనే హరీమన్నాడంటే మర్డర్ కేసవుతుంది. ముందు వీణ్ణి మామూలు స్థితిలోకి తీసుకురండి.

అంజి : అవును సార్. ఎందుకైనా మంచిది. వాణ్ణి లేపండి.

హిప్నా : ఏమీ కాదయ్యా అంటుంటే...

మూర్తి : ఎందుకు లేనిపోని గొడవ? ముందు వాణ్ణి లేపండి.

హిప్నా : మీరు నా ప్రతిభనే శంకిస్తున్నారు. నేను ఒక్కసారి హిప్నటైజ్ చేశానంటే 100సార్లు చేసినట్లే.

అంజి : నో నో అదేం కాదు సార్. మీ టాలెంట్‌ని మేమేనాడో గుర్తించాం. ఈ రోజునుంచి మేం మీ ఫాన్స్‌మి కూడా. దయచేసి వాణ్ణి లేపండి సార్.

హిప్నా : సరే మీ ఇష్టం. కవిగారూ! మీరు నా సూచనలు మాత్రమే పాటిస్తున్నారు. మీరిప్పుడు నిద్రలోనుంచి బైటికొస్తున్నారు. రిలాక్స్! మీ చేతులు మీ స్వాధానంలోకి వచ్చేస్తున్నాయ్... వచ్చేస్తున్నాయ్...వచ్చేసాయ్. మీ కాళ్ళు మీ స్వాధానంలోకి వచ్చేస్తున్నాయ్... వచ్చేస్తున్నాయ్... వచ్చేశాయ్. ఇప్పుడు మీ శరీరం మొత్తం మీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది...వచేస్తుంది...వచ్చేసింది... రిలాక్స్! నెమ్మదిగా కళ్ళు తెరవండి...నెమ్మదిగా..నెమ్మదిగా...

కవి : (నెమ్మదిగా కళ్ళు తెరిచి, అటు, ఇటు ఒకసారి అయోమయంగా చూసి, కుర్చీలోనుంచి లేచి) నేనెక్కడున్నాను? మీరంతా ఎవరు? ఇది ఏదేశం? మీరు నేపాలీలా లేక నీగ్రోలా?

అంజి : (ఆనందంగా) ఆ! సార్! వీడు మొత్తం మరచిపోయాడు. చివరికి వాణ్ణి వాడే మరిచిపోయాడు.

మూర్తి : తిక్క కుదురింది వెధవకి.

కవి : దయచేసి చెప్పండి. నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? నాదే ఊరు?

అంజి : యాహూ! థాంక్యూ సార్. మీ హిప్నాటిజం ఇంత గొప్ప ఫలితాన్నిసుతందని మేమనుకోలేదు. థాంక్యూ వెరీమచ్.

హిప్నా : (బుర్రగోక్కుంటూ, అయోమయంగా) అది సరేనయ్యా! ఇతను మామూలు స్థితికి వచ్చేశాడుకదా! మరి ఈ ప్రవర్తన ఏంటాని?

మూర్తి : మీరు కాస్త గట్టిగా హిప్నాతిజం చేసుంటారంతే.

హిప్నా : ఎంత గట్టిగా చేసినా....

అంజి : మీరా విషయాన్నిక మరచిపొండి. అంతగా అనుమానమొస్తే వీణ్ణి పిచ్చాసుపత్రిలో పడేస్తాంగా.

మూర్తి : అవును. వాడికదే సరైన చోటు. లేకపోతే వాడి దిక్కుమాలిన కవిత్వంతో మమ్మల్ని విసిగిస్తాడా? కవంట కవి?

కవి : (వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్లు) ఆ! ఔను! కవి...కవిత్వం! కవిత్వమంటే నేనే.నేను కవిని..ఔను నేను కవిని.. నేను కవిని...(కళ్ళు నులుముకుని) ఏం అంజీ మూర్తీ! ఏంటి సంగతి? ఏమండీ హిప్నాటిస్టుగారూ ఎంతసేపయ్యింది మీరొచ్చి?

హిప్నా : (భయంగా) నువ్వు కవిత్వం...

కవి : కవిత్వం. ఓ సారి! అసలు విషయం మరచిపోయాను. మీలాంటి పెద్దవారు కూడా మాలాంటి యువకవుల్ని గుర్తించడం మా అదృష్టమండీ. మీకు మేమెంతో ఋణపడుంటాం. మరి...మొదలుపెడదామా?

హిప్నా : (భయంగా) ఏంటది?

కవి : ఇంకేంటి? కవిత్వం. "నేనో కవిని - సామాజిక స్పృహ ఉన్న జాతి రత్నాన్ని - నాకో అవకాశమిచ్చారా ఆబగా తింటాను మీ అందరినీ"

హిప్నా : (కంగారుగా) నాకు వేరే పనుంది. నే వెళ్ళొస్తా (వెళ్ళబోతాడు).

కవి : (ఆపి) అబ్బా! ఆశ, దోశ, అప్పడం, వడ. మిమ్మల్ని అన తేలిగ్గ వదుల్తానా ఏంటి? మీరు నా కవిత్వాన్ని వినాల్సిందే. విని గెంతులెయ్యాల్సిందే.

హిప్నా : (కంగారుగా) అదీ... అదీ... మరీ...

కవి : ఎన్నండీ? జస్ట్ రెండే రెండు కవితలు. అందులో మొదటిది. ఐస్వర్యా రాయ్ మీద రాశాను. వినండి. "ఆవిడ కన్నులు మిలమిల- మాటలు ఎప్పుడు గలగల - నవ్వును ఎప్పుడు కిలకిల - తోమితే గిన్నెలు తళ తళ" వాహ్వా....వాహ్వా... బ్రహ్మాండంగా ఉంది కదూ? ఇప్పుడు మరొ ఉత్తమమైన కవిత. ఇది ప్రయావరణానికి సంబంధించింది. ఈ స్టైల్‌లో ఇంతవరకు ఎవరూ పర్యావరణం మీద ఇంత అద్భుతమైన కవిత రాయలేదు. వినండి. "చలిగా ఉంటే శీతాకాలం - ఎండగా ఉంటే వేసవి కాలం - వానలు పడితే వర్షాకాలం - ఆపై వచ్చును పోయే కాలం" వాహ్వా.. వాహ్వా.. పర్యావరణానికీ, మానవ జీవితానికీ ఎంతటి దగ్గరి సంబంధం ఉందో ఈ కవిత ద్వారా చెప్పానన్నమాట. ఇప్పుడు గ్రహించించి ఉండాలి నా కవిత్వానికున్న శక్తి. వెళ్ళొస్తా! "నన్ను కవిని కాదన్నవాడు వెధవ - నాకు కవిత్వం రాదన్నవాడు వెధవన్నర వెధవ" కళ్యానమస్తు! (అని నిష్క్రమిస్తాడు)

హిప్నా : (కవితలు వినడంతో బిగుసుకోపోయి శిలలా నిలబడిపోయి ఉంటాడు).

మూర్తి : మై గాడ్! కవిత్వం అన్న పేరు వినబడగానే వాడు మామూలు మనిషై పోయాడేంట్రా? నిజంగా కవిత్వానికి అంత పవర్ ఉందా?

అంజి : ఉండే ఉంటుంది. ఐనా హిప్నాటిస్ట్ గారి ప్రతిభ చూశాక వాణ్ణీ మరోసారి హిప్నతైజ్ చేస్తే వాడు ఖచ్చితంగా మారతాడనే నమ్మకం నాకు ఏర్పడింది.

మూర్తి : ఔను. వాణ్ణి పూర్తిగా మార్చాలంటే హిప్నాటిస్ట్ గారి వల్లే అవుతుంది. (గాంధిని చూసి) వీడేంట్రా ఇలా పడిపోయాడు? (గాంధి దగ్గరకెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తూ) గాంధీ! గాంధీ!

గాంధి : (మంచి నిద్రలో ఉంటాడు).

మూర్తి : అదిరా సంగతి. హిప్నాటిస్టు గారి సజెషన్స్‌ని వీడు ఫాలో అయినట్లున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు.

అంజి : గాంధీ! గాంధీ!

గాంధి : (లేవడు).

అంజి : వీడు ఇలా లేవడేమో? హిప్నాటిస్టు గారూ కాస్త మావాణ్ణి లేపండి సార్.

హిప్నా : (మెంటల్ షాక్ తగిలినట్లుగా, పిచ్చిగా నవూతూ) అసలు మనుసులెందుకు పుడతారో! ఈసారి మాత్రం నేను పుట్టనే పుట్టను. అడవి రాముడనే ఇంగ్లీష్ సినిమాలో అమితాబ్ బచ్చన్ అంత బాహా చేశాడేంటి చెప్మా?!

(అంజి, మూర్తి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు).

అంజి : (హిప్నాటిస్టు దగ్గరకి వెళ్ళి, నెమ్మదిగా) సార్!

హిప్నా : ఆవకాయ పచ్చళ్ళో జాంగ్రీ నంజుకుంటే ఎంత తియ్యగా ఉంటుందో? (ఒక ప్రక్కకెళ్ళి ఫోన్ చేస్తున్నటులు దీల్ చేసి) హలో జార్జి బుస్షేనా మాట్లాడేది? నేన్రా పి.వి.నరసింహా రావుని మాట్లాడుతున్నా. ఏంటీ నీ సైకిల్ పోయిందటగా? బాధపడకు. కష్టాలు మనలాంటి పేదోళ్ళకు రాక డబూన్నోళ్లకొస్తాయా? ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టించి నీకో కొత్త సైకిల్ కొనిస్తాన్లే. ఏడవకు నాన్నా, ఏడవకు.

మూర్తి : (అయోమయంగా) సార్! హిప్నాటిస్టు గారూ!

హిప్నా : లాభం లేదు. ఈసాఋఇ ఎంత కష్టపడైనాసరే బాక్సింగ్‌లో చిత్తుగా ఓడిపోవాలి.

అంజి : సార్!

హిప్నా : (అంజిని పైనుంచి క్రిందికి ఎగాదిగా చూసి, పెద్దగా నవ్వి) చీ! నువ్వేంటి, బట్టలేసుకోలేదు? ఎబ్బే! షేం! షేం! పప్పీ షేం!

అంజి : (కంగారుపడిపోయి) ఆ!..

హిప్నా : పాపం, ఆదిమానవుడనుకుంటా. తప్పు. నవ్వకూడదు. ఎగతాళ్ళి చేస్తే పుణ్యమొస్తుంది.

మూర్తి : (అయోమయంగా) సార్! ఏమయ్యింది మీకు? షాక్ తిన్నట్లు అలా మాట్లాడుతున్నారేంటి? మీరో ప్రముఖ హిప్నాటిస్టు సార్.

హిప్నా : ఔను. నేను హిప్నాటిస్టుని. ప్రముఖ హిప్నాటిస్టుని.

అంజి : అమ్మయ్య. మళ్ళీ మనలోకి వచ్చేశారు. కాస్త మావాణ్ణి నిద్రలేపండి సార్.

హిప్నా : అలాగా? పదండి. (గాంధి దగ్గరకొచ్చి) రిలాక్స్! రిలాక్స్! రిలాక్స్! నువ్వు హాయిగా నిద్రపోతున్నావ్... ప్రశాంతంగా నిద్రపోతున్నావ్... శాస్వతంగా నిద్రపోతున్నావ్.

మూర్తి : (కంగారుగా) ఆ! శాశ్వతంగానా? శాశ్వతంగా నిద్రపోవడమంటే చచ్చాడని అర్ధం సార్.

హిప్నా : ఔను. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇతను తమలపాకు క్రింద పడి నలిగి చచ్చిపోయాడు. ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయించాలి. వెంటనే ఆపరేషన్ ధియేటర్‌కి తీసుకురండి. నర్స్! ఓ రంపం రెడీ చెయ్!

అంజి : ఓర్నాయనోయ్! ఈయనకేమయ్యిందిరా బాబోయ్!

హిప్నా : ఎవరక్కడ? శతృరాజు మాపై దండెత్తి వచ్చుచున్నాడు. మీరు కూడా రెండు దండలు సిద్ధం చెయ్యండి. మేం వెంటనే యుద్ధానికి బయల్దేరవలెను. వెంటనే మా మారుతీ కారును సిద్ధం చేయండి. మహారాణీ వారిని డిక్కీలో కూర్చోబెట్టండి. ఏదీ మా ఏ.కు. 47? డిషుం...డిషుం...డుర్ర్ర్ర్....డుర్ర్ర్ర్.... (అంటూ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లుగా డుర్రుమంటూ వెళ్ళిపోతాడు).

మూర్తి : ఫినిష్. హిప్నాటిస్ట్ క్లీన్ బౌల్డ్.

అంజి : మై గాడ్! కేవలం రెండే రెండు కవితలతో వాడు హిప్నాటిస్టు గారి మతి పోగొట్టాడంటే వాడి కవిత్వం ఎంత ప్రమాదకరమైందో గమనించు.

మూర్తి : వాడితో ఎప్పటికైనా దేంజెరే. వాణ్ణి వదలకూడదు.

అంజి : ఔను. వాడికి మంచి గుణపాఠం చెప్పాలి. ఆ పాఠం వాడికే కాకుండా ఇలా చెత్త కవితల్ని ఎడాపెడా వినిపించే ప్రతి కవికీ గుణపాఠం కావాలి.

మూర్తి : ఔను. కావాలి.

అంజి : ఏంచేద్దాం? (ఇద్దరూ కాసేపు ఆలఓచనలో పడతారు)

మూర్తి : ఆ! నాకో ఐడియా వచ్చింది.

అంజి : నో. ఈసారి ఐడియా నాది.

మూర్తి : శ్రియ చెప్పిందిరా.

అంజి : ఎవరు చెప్పినా సరే నేను విననంటే వినను. (కాసేపు తీవ్రంగా ఆలోచించి) ఆ1 యస్! వెరీ గుడ్ ఐడియా. ఐడియా వచ్చిందిరా మూర్తీ. ఈ దెబ్బతో ఆ కవిగాడు ఫినిష్.

మూర్తి : ఏంట్రా అది?

అంజి : దగ్గరకి రా. చెవిలో చెబుతా.

మూర్తి : ఎందుకురా? నువ్వు అక్కణ్ణుంచి చెప్పినా నాకు వినపడుతుంది.

అంజి : (చిరాగ్గా) అహ రా!

(మూర్తి వెంటనే అంజి దగ్గరకొస్తాడు. అంజి మూర్తి చెవిలో రహస్యంగా ఏదో చెబుతూ ఉండగా ...)

(లైట్లు ఆరిపోతాయి)

{లైట్లు ఆన్ చేయగానే గాంధి గాంధి ఎప్పట్లా ఓ మూల కుర్చీలో కూరుచుని చదువుకుంటూ ఉంటాడు. మూర్తి ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటాడు}.

అంజి : (కవితో ప్రవేశిస్తూ) రా! లోపలకి రా! ప్లీస్ కం ఇన్.

కవి : (లోపలకి ప్రవేశిస్తూ) ఇన్నాళ్ళకైనా నా పాండిత్యాన్ని మీరు గుర్తించినదుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

అంజి : రేయ్ మూర్తీ! వెయ్యరా కుర్చీ.

మూర్తి : ఇదిగో (కుర్చీ తెచ్చి వేస్తాడు).

అంజి : కూర్చో కవీ! (కవి కూర్చోగానే) కాఫీ!

మూర్తి : ఇదిగో. (ఫ్లాస్క్‌లోన్ కాఫీని కప్పులో పోసి కవికి ఇస్తాడు)

కవి : (కాఫీ సిప్ చేసి) ఆహా! అద్భుతంగా ఉంది నా కవిత్వంలాగే. (కాఫీ త్రాగి కప్పు మూర్తి చేతికిచ్చి) అసలు నాకు సన్మానం చెయ్యాలనే ఆలోచనే మీకు రావడం నిజంగా మీ అదృష్టం. సాటివారనే గౌరవంతో నాకు సన్మానం చేసే మూట్టమొదటి అవకాశాన్ని మీకే ఇస్తున్నాన్యు. వేలాది మంది అభిమానులు, సాహిత్య పిపాసులు మధ్య ఎంతో వైభవోపేతంగా జరగాల్సిన సన్మానం ఇలా నాలుగ్గోడల మధ్య జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఐనా ఫరవాలేదు, మొదటి సన్మానమే కాబట్టి అడ్జస్ట్ అయిపోతాను. ఊ..ఇంకా ఆలస్యమెందుకు? మొదలుపెట్టండి.

అంజి : ఏరా మూర్తీ! మొదలుపెడదామా?

మూర్తి : నేను రెడీ.

అంజి : ఓకే! గెట్ రెడీ. 1... 2... 3... (అని ఒక్కసారిగా కవిమీదికి లంఘించి అతన్ని గట్టిగా పట్టుకుంటాడు).

కవి : (కంగారుగా) ఆ! ఇదేంటి? నన్నిలా పట్టుకున్నావేంటి?

మూర్తి : (కవిని గబగబ తాడుతో కుర్చీకి కట్టేస్తూ) ఇందుకు.

కవి : (కంగారుగా) అయ్యో! ఇదేంటి? నన్ను తాడుతో కట్టేస్తున్నారెందుకు? ఏమిటిదంతా?

అంజి : సన్మానం చెయ్యడానికేరా. సన్మానం. ప్రపంచంలో ఏ కవికీ జరగనటువంటి వెరైటీ సన్మానం.

కవి : ఇది వరైటీగాలేదు, విచిత్రంగా ఉంది.

అంజి : ముందు ముందు ఇంకా విచిత్రంగా ఉంటుంది చూడు. ఏరా, గట్టిగా కట్టేశావా?

మూర్తి : ఓ! బ్రహ్మాండంగా.

అంజి : ఇప్పుడు నీకు మరో కవిని పరిచయం చేయబోతున్నాము చూడు.

కవి : మరో కవా? ఆయనెవరు?

అంజి : (ఎంట్రన్స్ దగ్గరకెళ్ళి) స్వాగతం! సుస్వాగతం! కవికాకిగారికి హార్దిక స్వాగతం!

కవి కాకి : (ప్రవేశిస్తూనే పెద్దగా విటాట్టహాసం చేసి) మేరుపర్వత గాంభీర్య, మహా సముద్ర పాండిత్య, సురాసుర ఖండిత జగద్విఖ్యాత, జనప్రవాహ, మహామహా మారణాయుధ, మానవ కంకాళ, అమరగాన, అభ్యుదయ, అనుభూతి కవీశ్వర శ్రీ శ్రీ శ్రీ కవి కావి గారు వేంచేస్తున్నారు...వేంచేస్తున్నారు...అందరూ నమస్కారాలు పెట్టుకోండి ... వేంచేశారు.

అందరు : కవికాకిగారికి వందనం! అభివందనం!

కవి కాకి : (దీవిస్తున్నట్లు) చిరంజీవ! చిరంజీవ! నాగార్జున! నాగార్జున! ఊ! మీరు సన్మానం చెయ్యాలనుకున్న వ్యక్తి ఇతగాడనా?

అంజి : ఇతనే సార్!

కవి : (అయోమయంగా) ఇంతకీ తమరెవరు?

కవి కాకి : ఇందాకే చెప్పాను కదరా! మేరుపర్వత గాంభీర్య, మహాసముద్ర పాండిత్య...

కవి : అదంతా మీ పేరే?

కవి కాకి : అవన్నీ మా బిరుదములురా. అభిమానులు మమ్మల్ని ముద్దుగా కవికాకి అని పిలుస్తుంటారు.

కవి : మిమ్మల్ని నేనెప్పుడూ చూళ్ళేదు, కనీసం మీ పేరైనా విన్లేదు.

కవి కాకి : మూర్ఖుడా! నేనో అజ్ఞాత కవినిరా. అత్యవసర సమయాల్లో మాత్రమే అంబులెన్స్ వచ్చినట్లుగా జనంలోకి వచ్చి నా పాండిత్యాన్ని ప్రదర్శిస్తుంటాను. ఇప్పుడు నీ స్నేహితుల ద్వారా నీకు జరగబోతున్న సన్మాన కార్యక్రమానికి ముందు సన్మాన పత్రాన్ని చదివించడానికి మమ్మల్ని కోరడంతో ఇలా విచ్చేశాం.

కవి : ఒహో! అలాగా? ఐతే కానివ్వండి. కానీ ముందు సన్మానం జరగాలి కదా?

కవి కాకి : దానికంటే ముందు సన్మాన పత్రాన్ని చదవడం మా సంప్రదాయం.

కవి : ఒహో! అలాగా? వెరైటీ సన్మానం.

మూర్తి : ప్రారంభించండి కవికాకిగారూ.

కవి : (హుషారుగా) ఊ! త్వరగా కానివ్వండి మరి.

కవి కాకి : ఇక చూస్కో! (పెద్దగా వికటాట్టహాసం చేసి) ఓం నమో భస్మాసురయే నమ: "అదో చిమ్మచీకటి స్మశానం - ఆ స్మశానంలో జరుగుతుందిరా నీకు సన్మానం" (రెడ్ లైట్ వెలుగుతుంది)

కవి : (భయంగా) అమ్మో! స్మశానంలో సన్మానమా? వద్దు నాకు భయం.

కవి కాకి : (కవి చుట్టూ తిరుగుతూ) "అప్పుడయ్యింది టైము ఒంటిగంట - కాష్మోరా లేచి చూసింది అన్ని దిక్కులవెంట"

కవి : అమ్మో!

కవి కాకి : "అక్కడ వినిపించే కీచురాళ్ళ రొద - మ్రోగిస్తుందిరా నీ గుండెలో సన్నాయి సొద".

కవి : బాబోయ్!

గాంది : (భయంగా కుర్చీలోనుంచి లేచి మూర్తి ప్రక్కన దాక్కుంటాడు).

కవి కాకి : "తోకలతో కరళ నృత్యం చేసే పిశాచాలు - వేస్తాయిరా నీ నెత్తిన నెత్తుటి తలంబ్రాలు"

కవి : (మరింత భయంగా) అయ్యబాబోయ్! నన్ను భయపెట్టొద్దు, నన్నొదిలెయ్యండి.

కవి కాకి : "కాలే శవాలనుంచ్ కారే చమురు - అవుతుందిరా నీ ఒంటికి కమ్మని పన్నీరు"

కవి : (వాంతి వచ్చినట్లుగా) వాక్!

కవి కాకి : "అక్కడ పడివున్న ఎముకల గుట్టలు - అవుతాయిరా మీ మెడలో దండల పుట్టలు"

కవి : (భయంతో) వద్దు. వద్దు. నన్నొదిలిపెట్టండి (గింజుకుంటాడు).

కవి కాకి : "చదువుతానురా నీకు సన్మాన పత్రం వెరైటీగా - శవాల ఆత్మలకు శాంతి కలిగేటట్లుగా"

కవి : (గింజుకుంటూ) వద్దు. వద్దు. నన్ను చంపొద్దు.నాకీ సన్మానమే వద్దు. నన్నొదిలెయ్యండి. నేను పారిపోతా. దయచేసి నన్నొదిలెయ్యండి.

గాంది : కవికాకిగారూ! ఆ కవితనింక ఆపెయ్యండి, నాకు భయంగా ఉంది.

కవి కాకి : (పెద్దగా నవ్వి) హు! పిరికి వెధవ! సరే! ఈసారి అనుభూతి కవిత్వం వినిపిస్తాను. శీర్షిక పేరు పిడికిలిగుద్దులు.

కవి : (కంగారుగా) వామ్మో! ఇదెట్టా ఉండుద్దో?

కవి కాకి : "దొంగ దోచుకుపోతే మా నాన్న గొడుగు - మా తాత వేశాడు నా నెత్తిన ఓ పిడుగు" (కవి తల మీద బలంగా గుద్దుతాడు)

కవి : చచ్చాన్రా దేవుడోయ్! మరీ ఇంత అనుభూతి కవిత్వమా? దీనికి ప్రాక్టికల్స్ కూడానా? నా బుర్ర బద్దలయ్యిందిరో నాయనోయ్! బుద్ధొచ్చింది నాయనోయ్! నన్నొదిలిపెట్టండి బాబోయ్!

కవి కాకి : "పిడుగుకు తత్తరపడి నేనంటే వద్దు - మా బామ్మ ఇచ్చింది నా కడుపులో ఓ గుద్దు" (కవి కడుపులో బలంగా గుద్దుతాడు).

కవి : (బాధతో) వామ్మో! నా కడుపంతా కదిలిపోయిందిరో నాయనోయ్! మూర్తీ! అంజీ! మీ కాళ్ళు పట్టుకుంటా. ఆ రాక్షసుణ్ణి అపండి. నన్నికాడే చంపేసేట్టున్నాడు. బుద్ధొచ్చింది. ఇంక జీవితంలో కవిత్వం రాయను. కవిత్వం చెప్పను. నన్ను నమ్మండి.

మూర్తి : కవికాకిగారూ ఇంక ఆపేద్దామా?

కవి కాకి : కుదరదు. ఈ కవిత క్లైమాక్స్ వరకు చదవాల్సిందే.

మూర్తి : కుదరదంట. కదలకుండా కూర్చో. క్లైమాక్సొచ్చేశాం.

కవి : ఓరి నీ క్లైమాక్స్ తగలడ. ఈరోజు నాకు భూమ్మీద నూకలు చెల్లేట్లున్నాయ్. నాకు నిజంగానే బుద్ధొచ్చింది. ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా కవిత్వం రాయను. నాకు తగిన గుణపాఠమే చెప్పారు. నన్ను క్షమించండి నాయనోయ్.

గాంధి : పాపం వదిలేద్దాం కవికాకిగారూ.

కవి కాకి : "వెంటనే తీసా నేనో కత్తి - బామ్మ చేతిలో వెలసింది పప్పు గుత్తి" (సంచీలోనుంచ్ పెద్ద కత్తి తీస్తాడు).

కవి : (బెంబేలెత్తిపోయి) ఓర్నాయనోయ్! నిజంగానే కత్తి తీశాడ్రా దేవుడోయ్.

కవి కాకి : (కత్తికి సానబెడుతూ) "నా చేతిలో కత్తి - బామ్మ చేతిలో పప్పు గుత్తి"

కవి : (భయంతో) అమ్మో! కత్తికి సానబెడుతున్నాడు.మూర్తీ! అంజీ! మీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలెయ్యండి. లైకపోతే ఆ కత్తితో వాడు నన్ను కైమా చేసేట్లున్నాడు. నేను పారిపోతాను. నన్నొదిలెయ్యండి నాయనోయ్.

కవి కాకి : (సానబెడుతూ) "నా చేతిలో కత్తి - బామా చేతిలో పప్పుగుత్తి".

కవి : గాంధీ! నువ్వైనా కనికరించి. చచ్చి నీ కడుపున పుడతను. ఇంకెప్పుడూ నీ జోలికి రాను. అసలెవరి జోలికీ వెళ్ళను.నన్ను నమ్మండి బాబోయ్!

క.కా. : (లేచి నిలబడి) "ఒక్క పోటుతో నీ పని సరి- నీ కవిత్వమింక హరిలోరంగ హరి". (కవి దగ్గరకొస్తాడు).

కవి : (మరింతగా బెంబేలెత్తిపోయి) ఓర్నాయనోయ్! ఈయన అనుభూతి కవిత్వంతో అన్నంత పనీ చేసేట్లున్నాడు. నన్నొదలండి. నన్నొదలండి (గింజుకుంటాడు).

కవి కాకి : "ఒక్క పోటుతో నీ పని సరి- నీ కవిత్వమింక హరిలోరంగ హరి".

మూర్తి : (అనుమానంగా) మూర్తీ! ఈ కవికాకి వాలకం చూస్తుంటే ఆ కత్తికి పని చెప్పేట్లున్నాడు.

మూర్తి : (కంగారుగా) ఔన్రా! నాకేదో అనుమానంగా ఉంది. ఏంచేద్దాం?

అంజి : ఏంచేద్దామేంట్రా? ముందు వీణ్ణి విడిచిపెట్టు.

కవి కాకి : "ఒక్క పోటుతో నీ పని సరి- నీ కవిత్వమింక హరిలోరంగ హరి" (కత్తితో పొడవబోతాడు).

అంజి : (గబుక్కున కవికాకిని పట్టుకుని) ఆగండి కవికాకిగారూ! రేయ్ మూర్తీ! వాణ్ణి త్వరగా విడిచిపెట్టు.

మూర్తి : (గబగబ కవి కట్లు విప్పుతుంటాడు).

కవి కాకి : (కవిని పొడవడానికి అతని మీదికి దూకుతుంటాడు).

మూర్తి : (కవి కట్లు విప్పుతుండగాంతాడు).

కవి : (కట్లు విప్పడం ఆలస్యం అవుతుండడంతో ఒక్కసారిగా కుర్చీతోసహా లేచి పారిపోతూ) పరుగో! పరుగు! (అని బైటికి పారిపోతాడు).

అంజి : (కవి పారిపోగానే కవికాకిని విడిచిపెడతాడు).

కవి కాకి : ఎంత పని చేశారయ్యా? క్లైమాక్స్‌లో చెడగొట్టేశారు. మళ్ళీ ఈ అవకాశం నాకొస్తుందటయ్యా? చ! చ!

మూర్తి : ఐనా మీరు మరీ ఇంతగా ఇన్వాల్వ్ అయిపోతారనుకోలేదండీ.

కవి కాకి : (కూజాని ఎత్తుకుని నీళ్ళను త్రాగి, కత్తిని సంచీలో పెట్టేస్తాడు. అంజి, మూర్తి కూడా అలసిపోయినట్లుగా నీళ్ళను త్రాగుతారు).

గాంధి : థాంక్సండీ కవికాకిగారూ! మీ మేలును ఈ జన్మలో మరచిపోలేము.

అంజి : ఆ కవిగాడికి బుద్ధి చెప్పడానికి ఎన్నో ప్లాన్లు వేశాం. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. కాని ముల్లుని ములుతోనే తియ్యాలీ, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే సామెతలు అనుకోకుండా గుర్తొచ్చాయి. అందుకే కవికి కవితోనే బుద్ధి చెప్పాలని మీ దగ్గరికొచ్చాం. మీ సహాయానికి మేమెంతో ఋణపడివుంటాం.

మూర్తి : అవును కవికాకిగారూ! లేకపోతే కవంట కవి. పరతివాడూ ఏదో ఒక పిచ్చి కవిత్వం రాయటం, నలుగురికీ వినిపించి పోజులు కొట్టడం ఎక్కువైపోయాయి ఈనాడు.

అంజి : ఈ విషయంలో మా తెలివితేటలు, మీ ప్రతిభ వాణ్ణి పనిష్ చెయ్యడానికి బాగా ఉపయోగపడ్డాయ్. మీరు చేసిన సహాయానికి ఏదో ఉడతా భక్తిగా (డబ్బు ఇవ్వబోతాడు).

కవి కాకి : ఏంటయ్యా అది? డబ్బా? ఇదేనా మీరు నన్ను అర్ధం చేసుకుంది?

మూర్తి : అయ్యో పొరపాటైనట్లుంది. మేమేమన్నా తప్పు చేశామా సార్?

కవి కాకి : తప్పా? ఘోర అపరాధం చేశారు. కవంటే ఎవరు? సాక్షాత్తూ ఆ సరస్వతీ మాత సుపుత్రుడు. అటువంటి ఉన్నతుడి హృదయాన్ని డబ్బుతో కొలుస్తారా? ఎంత అవమానం? ఈ అవమానం నాకు కాదయ్యా. సాక్షాత్తూ ఆ సరస్వతీ మాతకి.

అంజి : పొరపాటైపోయింది కవికాకిగారూ క్షమించండి. ఏదో చిన్నపిల్లలం...

మూర్తి : పోనీ ఏదన్నా మంచి పుస్తకాన్ని ప్రెజెంట్ చేస్తే బాగుంటుందేమోరా అంజీ! ఏమంటారు కవిగారూ?

కవి కాకి : మీ మంచితనానికి నా జోహార్లు.చిన్నవారైనా మీకు ఇంత మంచి మనసు ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ ఒక్క విషయం తెలుసుకోండి. ప్రాస కోసం ప్రాకులాడడం కవిత్వం కాదు. అలాగని దద్దరిల్లే పదాలతో ఉద్ధరించాలనుకోవడమూ కవిత్వం కాదు. పిచ్చి కవిత్వంతో నలుగుర్నీ బాధపెట్టేవాళ్ళు నేడు ఎక్కువవ్వబట్టే నిజమైన కవిత్వానికి విలువ లేకుండా పోతుంది. నిజమైన కవులు నిస్వార్ధ జీవులు. వారిని ఎప్పుడూ ఇలా బహుమతులతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నైంచకండి.

అంజి : తప్పకుండా కవికాకిగారూ!

కవి కాకి : అలాగని నాకు మాటివ్వండి. (చెయ్యి చాపుతాడు)

(ముగ్గురూ కవి కాకి చేతిలో చెయ్యి వేస్తారు ప్రమాణం చేస్తున్నట్లుగా).

గాంది : మరి నిజమైన కవిని ఆదరించి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఏంచెయ్యాలంటారు కవికాకిగారూ?

కవి కాకి : ఏం చెయ్యాలంటే? (పెద్దగా వికటాట్టహాసం చేసి) ఓం నరకాసురయేనమ: "దొరికారులే నాకీరోజు ముగ్గురు అభిమానులు - నా కవితా వాగ్ధాటిని ఆలకించాలనుకునే అర్భకులు" (అని తన కవిత్వం చెప్పబోతాడు).

ముగ్గురు : బాబోయ్ కవీ (అంటూ అతని కాళ్ళ మీద పడిపోతారు).

(తెర పడిపోతుంది)


రచన : తిమ్మన శ్యాం సుందర్

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: