telugudanam.com

      telugudanam.com

   

కిడ్నాప్

పాత్రలు :

శ్రీధర్ - 30 సం.

సంధ్య - 25 సం. (శ్రీధర్ భార్య)

రామారావు - 60 సం. (ఎదురింటి బాబాయిగారు)

వీరయ్య - 45 సం. (శ్రీధర్ ఇంటి నౌకరు)

ఇన్‌స్పెక్టర్ - 50 సం.

కానిస్టేబుల్ -40 సం.

పాండు -20 సం. (సంధ్య తమ్ముడు)

నాని -5 సం

చిన్న కుక్కపిల్ల -1 సం.


{తెర తీయగానే విశాలమైన హాల్ ఉంటుంది. హాల్ మధ్యలో 4 కుర్చీలు, వాటి ముందు ఒక టీపాయ్, దాని మీద కొన్ని పత్రికలు, న్యూస్ పేపర్లు ఉంటాయి. రూంకి ఒక మూల స్టూల్ మీద మంచి నీళ్ళ కూజా ఉంటుంది. హాలుకి కుడి, ఎడమ ద్వారాలుంటాయి}


శ్రీనాధ్ : (కుడి వైపు ద్వారం నుండి నీరసంగా ప్రవేశిస్తాడు. అతని మొహం అలసటగా, బాధగా ఉంటుంది. నీరసంగా వచ్చి ఒక చెయిర్‌లో కూర్చుంటాడు. జేబులోనుంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటాడు. సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్ నొక్కుతాడు.) ఏంటీ, కనిపించలేదా? వాళ్ళ ఇంటికి రాలేదా? ఆ..ఆ.. సరే! సరే! (ఫోన్ జేబులో పెట్టుకుని బాధగా తల పట్టుకుంటాడు)

రామారావు : (ప్రవేశించి, శ్రీధర్‌ని చూసి జాలిగా) ఏమయ్యా శ్రీధర్!

శ్రీనాధ్ : (నీరసంగా రామారావును చూసి) రండి!

రామారావు : ఏమన్నా సమాచారం తెలిసిందా?

శ్రీనాధ్ : లేదండీ. నిన్న సాయంత్రం నుండి నా పరిచయస్తులందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను. చిట్టి అసలు వాళ్ళ ఇళ్ళకే రాలేదంటున్నారు.

రామారావు : అయ్యయ్యో! నేనూ, మా ఆవిడ కూడా మాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర చిట్టి గురించి వాకబు చేశామయ్యా. కానీ...నాకైతే రాత్రి పెరిగిన బీపీ ఇంతవరకు తగ్గలేదు.

శ్రీనాధ్ : దాదాపు తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళాను. భగవంతుడా! నువ్వైనా మమ్మల్ని కరుణించు తండ్రీ!

రామారావు : అదిగో...అలా భగవంతుడి మీద భారమేసి కూర్చోకూడదంటున్నాను. పోలిస్ కంప్లెయింట్ ఇచ్చావా?

శ్రీనాధ్ : ఆ! ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పాను.

రామారావు : అదేంటయ్యా, నిన్న సాయంత్రం నుంచి చిట్టితల్లి కనపడకపోతుంటే ఇప్పుడా కంప్లెయింట్ ఇచ్చేది? ఊ! సరేలే! ఇప్పటికైనా వారంటూ ఉన్నారని గుర్తుకొచ్చింది, అదే సంతోషం. ఇంతకీ వాళ్ళ దగ్గర్నుంచి సమాచారమేమన్నా తెలిసిందా?

శ్రీనాధ్ : ఇంకా లేదండీ.

రామారావు : నువ్వేం దిగులుపడకు. నువ్వు ఎవ్వరికీ అన్యాయం చేసినవాడివి కావని నాకు తెలుసు, ఆ భగవంతుడికి కూడా తెలుసు. నీకు మంచే జరుగుతుంది. మా అబ్బాయిని కూడా చిట్టిని వెదికేందుకు పంపించాను. వాడు వాడి స్నేహితుల్ని తీలుకుని మరీ వెళ్ళాడు. కొందరు ఈశాన్యం వెళితే మరికొందరు ఆగ్నేయం వైపు వెదకడానికి వెళ్ళారు. మా బామ్మర్ది సెలవులకి ఈ పూటే వచ్చాడు. వాణ్ణి ఊరికే ఇంట్లో ఉంచి మేపటం ఎందుకని ఉత్తరం వైపు పంపించాను. ఈ దక్షిణం దిక్కంటావా, నేను నా పెళ్ళాం ఇప్పటికే రెండుసార్లు వెదికొచ్చాం. అందరం తలో దిక్కున వెదుకుతున్నాం కాబట్టి చిట్టి ఏదో ఓ దిక్కున దొరికితీరుతుందని నా వాస్తు పాండిత్యం చెబుతుందయ్యా. నువ్వు ధైర్యంగా ఉండు.

శ్రీనాధ్ : ఎలా ఉండమంటారండీ? చిట్టి తల్లంటే మాకెంత ప్రాణమో మీకు తెలీదూ? అభం, శుభం తెలీదు. ఎలా ఉందో? ఏంచేస్తుందో?

రామారావు: నువ్వే ఇలా దిగాలుపడితే ఇంక మీ ఆవిడకి ధైర్యం చెప్పేదెవరు? ఆవిడేదీ? కనపడదే?

శ్రీనాధ్ : చిట్టి మిస్ అయ్యిందన్న దిగులుతో రాత్రి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా పడుకుంది.

రామారావు : అయ్యయ్యో! ఎంత కష్టమొచ్చి పడింది? ఐనా చిట్టి తల్లి దారితప్పి ఎటైనా పోయిందా అనుకుంటే మన చిట్టి తల్లి తెలియనివారు ఈ కాలనీలోనే ఎవ్వరూ లేరాయె. ఎవరో ఒకరు తీసుకొచ్చి నీకు భద్రంగా అప్పగించే వెళ్తారు. (ఆలోచించి) నా అనుమానం నిజమే అయ్యుండొచ్చు.

శ్రీనాధ్ : అనుమానమా? ఏంటది?

రామారావు : చిట్టిని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారని మనమెందుకు అనుకోకూడదు?

శ్రీనాధ్ : (భయంగా) కిడ్నాపా?

రామారావు : అవునయ్యా. మిలమిల మెరిసే కళ్ళతో, అందమైన పూర్ణ చంద్రుడులాంటి ముఖంతో, అందర్నీ ఆకట్టుకునే సౌందర్యంతో ఉండే చిట్టి తల్లంటే మీకు ప్రాణమని ఎవరైనా ఇట్టే గ్రహించొచ్చు కదా! మిమ్మల్ని బెదిరించి, మీ నుంచి డబ్బు గుంజటానికి ఎవరైనా ఈ పని చేసుండొచ్చు కదా? పైగా ఈమధ్య కిడ్నాపులు ఎక్కువయ్యాయికదా? (అంతలో శ్రీనాధ్ధర్ సెల్ మ్రోగుతుంది). సత్యం! చూశావా? ఫోన్ కూడా మోగింది. సందేహం లేదు, ఆ ఫోన్ కిడ్నాపర్లనుండే.

శ్రీనాధ్ : (ఫోన్ తీసి) హలో! ఏంటీ? కనపడలేదా? అదేదో శుభవార్తన్నట్లు ఆ విషయం కూడా ఫోన్ చేసి చెప్పాలా? పెట్టెయ్. (ఫోన్ కట్ చేసి) ఇంతమంది మనుషులున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా చిట్టి గురించి తెలుసుకోలేకపోతున్నారు...

రామారావు : ఇలా వాళ్ళ మీదా, వీళ్ళ మీదా ఆధారపడేకంటే నువ్వే స్వయంగా పోలిస్ స్తేషన్‌కి వెళ్ళొస్తే మంచిదేమో ఆలోచించు.

శ్రీనాధ్ : అదే బెటరనిపిస్తుంది (లేస్తాడు.)

రామారావు : కాస్త ఏదన్న తిని వెళ్ళవయ్యా. తిరగడానికైనా ఓపిక ఉండాలి కదా?

శ్రీనాధ్ : లేదు బాబాయిగారూ! ప్రతి రోజూ నేనూ, చిట్టి కలిసే భోజనం చేస్తాం. నేను ఆఫీసునుంచి రావడం ఎంత లేటైనా చిట్టి నాకోసం అన్నం తినకుండా ఆగుతుంది. అటువంటిది చిట్టికోసం ఆమాత్రం కడుపు మాడ్చుకోలేనా? (అక్కణ్ణుంచి బైటికి కదలబోతాడు).

వీరయ్య : (హడావిడిగా ప్రవేశిస్తూ) అయ్యగారండీ! అయ్యగారండీ!

శ్రీనాధ్ : ఏరా వీరయ్యా! ఇంతసేపూ ఎక్కడికెళ్ళావ్?

వీరయ్య : కోటేశ్వర్రావ్ గారింటికెళ్ళొత్తున్నానండీ. నిన్న మాపిటేల పొద్దుపోయినాక సిట్టి తల్లి, నానిబాబు ఆళ్ళింటికొచ్చినారంటండీ. కూసేపు ఆడుకున్నారంట కూడా. ఆ తర్వాత ఇద్దరూ కలిసే ఇంటికొచ్చీసినారంట.

శ్రీనాధ్ : ఆ.. అంతేనా జరిగింది?

వీరయ్య : అయ్యగారండీ! నాని బాబు ఇస్కూలు నుంచి తిన్నగా ఇంటికి రాకుండా ఆడాడ ఆడి వచ్చినారాయె. దార్లో ఏదైనా...

రామారావు : చ నోర్ముయ్! అసలే దిగులుతో ఉంటే మధ్యలొ నీ అపశకునం మాటొకటి.

వీరయ్య : కానీ అయ్యగారండీ! సిట్టితల్లి శానా తెలివిగల్ది. పొరపాట్న రూటు మర్సిపోయినా ఏదో రకంగా తిన్నగా ఇంటికి వచ్చీగల్దు. మీరు ఏరే ఆలోచనలేమీ పెట్టుకోకుండా కూకోండి. మేం ఎతుకుతూనే వున్నాం కదా!

శ్రీనాధ్ : ఊ సర్లే! నేను పోలీస్ స్తేషన్‌కెళ్ళొస్తానుగానీ, నువ్వీలోగా విష్ణుమూర్తిగారు లేరూ?

వీరయ్య : ఎవరూ? ఆ లూజు పాంటాయనేగా?

శ్రీనాధ్ : ఆ. ఆయనే. వాళ్ళింటికెళ్ళి కనుక్కోనిరా. ఆయన ఫోన్‌కి ఎన్నిసార్లొచ్చినా ఔట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని రెస్పాన్స్ వస్తుంది.(శ్రీధర్ బైటికి నడుస్తాడు, రామారావు అతన్ని అనుసరిస్తాడు, వీరయ్య ఆవెంటనే బైటికెళ్తాడు).

(స్టేజి ఒక్క క్షణం ఖాళీ అవుతుంది.)

ఇన్‌స్పెక్టర్ : (వేగంగా ప్రవేశిస్తాడు. అతని వెనకే కానిస్టేబుల్ ఉంటాడు). ఎవరూ ఇంట్లో? ఎవరూ పలకరేం?

కానిస్టేబుల్ : (ఇంట్లోకి తొంగి చూస్తూ) ఎవరూ ఇంట్లో? ఎవరూ పలకరేం?

సంధ్య : ఎవరూ? (అంటూ ఇంట్లోనుంచి ప్రవేశిస్తుంది).

ఇన్‌స్పెక్టర్ : మీరేనా మీ చిట్టి తప్పిపోయిందని కంప్లెయింట్ ఇచ్చింది?

సంధ్య : అవునండీ.

ఇన్‌స్పెక్టర్ : మీ పేరు?

సంధ్య : సంధ్య.

ఇన్‌స్పెక్టర్ : ఐతే కరెక్ట్ అడ్రస్‌కే వచ్చామన్నమాట.

సంధ్య : మా చిట్టితల్లి గురించి సమాచారమేమన్నా తెలిసిందా సార్?

ఇన్‌స్పెక్టర్ : తెలుస్తుంది. తెలుస్తుంది. తప్పకుండా తెలుస్తుంది. నేను రంగంలోకి దూకానంటే ఎవరి రంగైనా బైటపడాల్సిందే. మీరింక ధైర్యంగా ఉండండి. కాకపోతే నేనడిగే కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పాలి. సరేనా?

సంధ్య : అలాగేనండీ.

ఇన్‌స్పెక్టర్ : My first question .మీ చిట్టితల్లి పేరేమిటన్నారు?

కానిస్టేబుల్ : చిట్టి పేరు చిట్టికాక మరేముంటుంది సార్?

ఇన్‌స్పెక్టర్ : You shut up. ఆమె చెప్పే సమాధానాల్ని రాసుకోడమే నీ డ్యూటీ. ............

కానిస్టేబుల్ : O.K. Sir. (జేబులోనుంచి చిన్న పాస్ బుక్, పెన్ తీస్తాడు)

ఇన్‌స్పెక్టర్ : మీ చిట్టి గురించి వివరాలు చెప్పగలరా?

సంధ్య : మా చిట్టి చాలా అందంగా ఉంటుందండీ.

ఇన్‌స్పెక్టర్ : చిన్న వయసు కదా. Naturally.

సంధ్య : (తన్మయంగా) అందమైన ముక్కు...

ఇన్‌స్పెక్టర్ : Beautiful Nose!

కానిస్టేబుల్ : (రాసుకుంటాడు)

సంధ్య : తేనె రంగులో కళ్ళు...

ఇన్‌స్పెక్టర్ : Honey eyes!

సంధ్య : పట్టుకుచ్చులాంటి మెత్తటి జుట్టు...

ఇన్‌స్పెక్టర్ : O.K. O.K. O.K. My next question...

సంధ్య : కూర్చోండి ఇన్‌స్పెక్టర్‌పెక్టర్ గారూ గారూ, నిలబడే మాట్లాడుతున్నారు?

ఇన్‌స్పెక్టర్ : No. Duty లో ఉండగా ఎక్కడా కూర్చోను.

కానిస్టేబుల్ : అదేంటి సార్ అలా అంటారు? పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కూర్చునేవుంటారుకదా, బల్లపై కాళ్ళు జాపి మరీ.

ఇన్‌స్పెక్టర్ : You shut up.

కానిస్టేబుల్ : Yes sir.

ఇన్‌స్పెక్టర్ : తరువాతి ప్రశ్న. మీ చిట్టి ఎప్పట్నుంచి కనిపించడం లేదన్నారు?

సంధ్య : నిన్న సాయంత్రం నుంచే సార్.

ఇన్‌స్పెక్టర్ : అంటే నిన్న రాత్రి ఇంటికి రాలేదన్నమాట. (ఆలోచిస్తూ) అంటే...నిన్న మధ్యాహ్నం మాత్రం భోజనం చేసింది. By the by నిన్న Lunch లో చిట్టికి ఏమేం పెట్టారు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని చెప్పండి.

సంధ్య : మామూలు భోజనమే. గుత్తివంకాయ కూర.

ఇన్‌స్పెక్టర్ : (వెంటనే నోరు చప్పరించి) ఆహా! గుత్తివంకాయ కూర. వెళ్ళే ముందు ఎంతటి కమ్మటి కూరతో భోంచేసి మరీ వెళ్ళింది. నవనవలాడే వంకాయల్లో మస్తుగా మసాలాని దట్టించి, దోరదోరగా నూనెలో వేయించి, వేడి వేడి అన్నంలో తింటుంటే...ఆహాహా...నాకు నా డ్యూటీనే గుర్తుకు రాదంటే నమ్మండి.

కానిస్టేబుల్ : (తనలో) విడిగా ఎప్పుడు గుర్కుకొచ్చిచచ్చింది కనక.

ఇన్‌స్పెక్టర్ : ఆహా..గుత్తివంకాయ కూర.

సంధ్య : (చిరాగ్గా) మా చిట్టితల్లి కనపడక మేమేడుస్తుంటే మీరు లొట్టలేయడమేంటి సార్?

ఇన్‌స్పెక్టర్ : (ఉలిక్కిపడి) ఓ సారీ! (అంటూ కానిస్టేబుల్‌ని చూస్తాడు. కానిస్టబుల్ రాసుకుంటూపోయి ఇన్‌స్పెక్టర్ వంక చూస్తాడు) రాశావా?

కానిస్టేబుల్ : Yes Sir!

ఇన్‌స్పెక్టర్ : ఏం రాశావ్?

కానిస్టేబుల్ : మా చిట్టితల్లి కనపడక మేమేడుస్తుంటే మీరు లొట్టలేయడమేంటి సార్?

ఇన్‌స్పెక్టర్ : కొట్టెయ్. మొత్తం కొట్టెయ్. Suspend చేసేస్తా.

కానిస్టేబుల్ : (భయంగా) Yes Sir! (మొత్తం కొట్టేస్తాడు)

ఇన్‌స్పెక్టర్ : మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు?

సంధ్య : నేనే.

ఇన్‌స్పెక్టర్ : ఒహో! మీరేనా? అంటే మీరు వండిన గుత్తి వంకాయ కూరకీ, మీ చిట్టి తప్పిపోవడానికీ దగ్గర సంబంధం ఉండివుంటుందని నా మొదటి అనుమానం.

సంధ్య : (అయోమయంగా చూస్తుంది).

ఇన్‌స్పెక్టర్ : My next question!

సంధ్య : ఒక్క క్షణం ఉండండి ఇన్‌స్పెక్టర్ గారూ! కాఫీ కలుపుకొస్తాను.

ఇన్‌స్పెక్టర్ : అలాగే. Thank you! (అని వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు ఉలిక్కిపడి, గబాగబా ఆమెని ఇంట్లోకి వెళ్ళకుండా ఆపి) ఆగండాగండి. డ్యూటీలో ఉండగా నేనస్సలు కాఫీనే తాగను.

కానిస్టేబుల్ : ఆయనట్లాగే అంటారుగానీ మీరు పట్టుకొచ్చెయ్యండమ్మా. రోజుకి కనీసం ఐదారుసార్లన్నా ఎదుటోళ్ళ ఎకౌంటులో కాఫీ తాగందే ఆయనసలు పనే చెయ్యలేరు.

ఇన్‌స్పెక్టర్ : Shut up! అప్పుడప్పుడు డబ్బులిచ్చి కూడా తాగుతాను.

కానిస్టేబుల్ : (తనలో) ఎప్పుడబ్బా? (సంధ్యతో) ఆయనట్లాగే అంటారుగానీ మీరు పట్టుకొచ్చెయ్యండి.

ఇన్‌స్పెక్టర్ : You Shut up! ఇంకోసారు ఆమెని కాఫీ తెమ్మన్నావంటే నీ కాళ్ళిరగ్గొడతా.

కానిస్టేబుల్ : (భయంగా) అమ్మో!

ఇన్‌స్పెక్టర్ : దయచేసి మీరు మాత్రం కాఫీ తీసుకురాకండి.

రామారావు : (ప్రవేశిస్తూ) సంధ్యా!

సంధ్య : రండి బాబాయిగారూ!

రామారావు : అరె! ఇన్‌స్పెక్టర్ గారు వచ్చేశారే! చాలా సంతోషం. నమస్కారమండీ ఇన్‌స్పెక్టర్ గారూ!

ఇన్‌స్పెక్టర్ : (అనుమానంగా) ఊ!

రామారావు : సంధ్యా! ఈ ప్రసాదం తీసుకోమ్మా! (కొబ్బరి చిప్ప, పూలు ఆమె చేతిలో పెడతాడు) చిట్టితల్లి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఇప్పుడే గుళ్ళో పూజ చేయించి వస్తున్నాను.

ఇన్‌స్పెక్టర్ : ఏ గుళ్ళో పూజ చేయించారు?

రామారావు : వెంకటేశ్వర స్వామి గుళ్ళో.

ఇన్‌స్పెక్టర్ : పోలేరమ్మ గుళ్ళో ఎందుకు చేయించలేదు?

రామారావు : ఎందుకంటే? ఎందుకంటే ఏం చెబుతామండీ?

ఇన్‌స్పెక్టర్ : ఎందుకు చెప్పలేరండీ?

రామారావు : (భయంగా) అమ్మా సంధ్యా! నాకు అర్జెంటు పని తగిలింది వెళ్ళొస్తానమ్మా (వెళ్ళబోతాడు).

ఇన్‌స్పెక్టర్ : ఆగండి. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలడగాలి.

రామారావు : నన్నా?

ఇన్‌స్పెక్టర్ : మీ ఫేస్ చూస్తుంటే నాకనుమానంగా ఉంది. నిజం చెప్పు, చిట్టినేంజేశావ్?

రామారావు : (కంగారుగా) ఆ! ఇదేం ప్రశ్న? చిట్టిని నేనేదో చెయ్యడమేంటి? అసలు చిట్టి తప్పిపోయినట్లు మీకు కంప్లెయింట్ ఇవ్వమని శ్రీధర్‌కి చెప్పిందే నేనైతేనూ.

ఇన్‌స్పెక్టర్ : మాకు కంప్లెయింట్ ఇప్పించి, నీ మీద అనుమానం రాకుండా చేసుకోడానికి ఇలా చేశావని నాకు తెలుసు. మమ్మల్ని అంత తేలిగ్గా బోల్తా కొట్టించలేవ్. నిజం చెప్పు.

రామారావు : (కంగారుగా) సంధ్యా!

సంధ్య : అయ్యో! మీరు మరీనూ. ఆయన మా బాబాయిగారులాంటివారు, ఆయనది మా ఎదురిల్లే. ఆయన్ని అనుమానిస్తారేంటి?

ఇన్‌స్పెక్టర్ : నాకు బాబాయిల సైకాలజి బాగా తెలుసు, నేరస్తుడు ఎలా ఉంటాడో, అతను ఏం నేరం చేశాడో ఫేస్ చూడకుండా చెప్పెయగల్ను. ఊ.. బుకాయించక నిజం చెప్పెయ్.

రామారావు. : (ఏడుపుగొంతుతో) సంధ్యా!

సంధ్య : అయ్యయ్యో! చెబితే వినిపించుకోరేమండీ?

కానిస్టేబుల్ : పోన్లెండి సార్. ఎక్కడికిపోతాడు? ఎదురిల్లేగా. ప్రస్తుతానికి వదిలెయ్యండి. (రామారావుతో) మీరు వెళ్ళండి.

రామారావు. : అమ్మాయ్య! (గబుక్కున వెళ్ళిపోతాడు).

కానిస్టేబుల్ : ముందు మన Investigation కానివ్వండి. అతని సంగతి తరువాత చూసుకుందాం.

ఇన్‌స్పెక్టర్ : ఇప్పుడు చేస్తుంది Investigation కాక మరేంటయ్యా నీ బొంద? చేతికందిన మనిషిని వదిలేస్తే ఇంకేం Investigation అంట నా బొంద?

కానిస్టేబుల్ : (నాలుక కరుచుకొని) నిజమే సార్! మరిప్పుడు....

ఇన్‌స్పెక్టర్ : Attention!

కానిస్టేబుల్ : (సెల్యూట్ చేసి) Yes Sir.

ఇన్‌స్పెక్టర్ : (లాఠీ ఇస్తూ) అతన్ని ఫాలో అవ్వు. ఏదో అర్జెంటు పనుందన్నాడు. జాగ్రత్త. ఒక కంట కనిపెట్టుండు.

కానిస్టేబుల్ : (లాఠీని కళ్ళకు అద్దుకుంటూ) రెండు కళ్ళతో కనిపెట్టుకుంటాను సార్.

ఇన్‌స్పెక్టర్ : ఊ. Move!

కానిస్టేబుల్ : Yes Sir. (సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు)

సంధ్య : ఇన్‌స్పెక్టర్ గారూ! మీరు అనవసరంగా మాక్కావలసిన వాళ్ళందర్నీ అనుమానిస్తున్నారు.

ఇన్‌స్పెక్టర్ : ప్రస్తుతం మీవాళ్ళూ మాకావలసినవాళ్ళే. O.K. My Next Question. చిట్టికి శత్రువులెవరైనా ఉన్నారా?

సంధ్య : చిట్టితల్లికి శత్రువులా? ఆ అందాల బొమ్మంటే పడనివారు కూడా ఉంటారా? ఆ అపరంజి బొమ్మకి శత్రువులుంటారని మీ పోలీసు బుర్రకి ఎలా అనిపించిందసలు?

ఇన్‌స్పెక్టర్ : అంటే నా ఉద్దేశం...

సంధ్య : ఖచ్చితంగా సరైంది కాదు. మా బంగారుకొండ మంచితనం గురించి ఎంతని చెప్పను? ఎవరికీ అపకారం చేసి ఎరగదు. అందరూ దాని ఆత్మీయులే. అందరూ దాని అభిమానులే.

ఇన్‌స్పెక్టర్ : ఒక్కటి. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరికిచావడం లేదే. ఇంకెలా ఈ కేస్‌ని డీల్ చేయడం? మీరు చెప్పే వివరాల్నిబట్టి చూస్తుంటే చిట్టిని ఎవరూ తీసుకుపోయుండరని ఒక వంక అనిపిస్తుంది. పోనీ తనకు తానుగా వెళ్ళిపోయిందా అంటే... అవునూ... ఇంట్లో నుంచి బైటికి వెళ్ళేముందు చిట్టి అదో రకంగా ఏమైనా ఉందా? అంటే మనసు బాగోకపోవడం గానీ, దిగులుగా గానీ...

సంధ్య : అదేమీ లేదు ఇన్‌స్పెక్టర్ గారూ. అయినా ఎవరి మనసులో ఏముంటుందో ఎలా చెప్పగలం?

ఇన్‌స్పెక్టర్ : అవును. అదీ నిజమే.

సంధ్య : నాకు తెలిసినంతవరకూ చిట్టితల్లి హుషారుగానే ఉంది. ప్రొద్దున్నే తలారా స్నానం కూడా చేయించాను.

ఇన్‌స్పెక్టర్ : అలాగా? ఏ షాంపూ వాడారు?

సంధ్య : సబ్బు వాడాను.

ఇన్‌స్పెక్టర్ : అయ్యో! ఇక్కడా క్లూ దొరకలేదే! ఆ.. సబ్బు నురగ కళ్ళలో పడి, కళ్ళు మూసుకుపోయి, దారి తెలీక ఇంట్లోకి రాబోయి, బైటికెళ్ళిపోయుంటుంది. ఏమంటారు?

సంధ్య : ఏమీ అనదలుచుకోలేదు.

ఇన్‌స్పెక్టర్ : ఏం?

సంధ్య : కళ్లకి గంతలు కట్టి మరీ స్నానం చేయించాను కాబట్టి.

ఇన్‌స్పెక్టర్ : I See.

శ్రీనాధ్ : నమస్కారమండీ ఇన్‌స్పెక్టర్ గారూ!

ఇన్‌స్పెక్టర్ : మీరెవరు?

శ్రీనాధ్ : నేనేనండీ శ్రీధర్‌ని. మా చిట్టి కనిపించడంలేదని ఫోన్ చేసి కంప్లెయింట్ ఇచ్చింది నేనే. ఇప్పుడే పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళాను. మీరు లేరని తెలిసి తిరిగొచ్చాను. ఈరోజు సాయంత్రంలోపు చిట్టితల్లి కనిపించకపోతే టీవీలో ప్రకటని ఇద్దామనుకుంటున్నాను.

ఇన్‌స్పెక్టర్ : No.No. మీరు మమ్మల్ని నమ్మాలి. మీ చిట్టిని పట్టి తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ క్రెడిట్ మీడియాకు దక్కకూడదు. మేమే కొట్టెయ్యాలి.

కానిస్టేబుల్ : (సెల్యూట్ చేసి) సార్!

ఇన్‌స్పెక్టర్ : Yes. Any clue?

కానిస్టేబుల్ : ఎక్కడ సార్? ఆయన సరాసరి ఇంటికే వెళ్ళాడు. వెళ్ళగానే ధడేల్మని తెలుపేసేసుకున్నాడు. నేను తిరిగొచ్చేశాను. ఇదిగోండి మీ లాఠి.

ఇన్‌స్పెక్టర్ : (లాఠీ తీసుకుంటూ) అయితే అతన్ని అనుమానించడం అనవసరం. Be the by శ్రీధర్ గారూ! నిన్న సాయంత్రంనుంచి మీ ఇంటికి ఎవరెవరొచ్చారో చెప్పగలరా?

శ్రీనాధ్ : అసలు నేను ఇంట్లో ఉన్నదెప్పుడండీ? బైటికెళ్ళేముందు మాత్రం ఒకసారి పక్కింటి పిన్నిగారు వచ్చెళ్ళారు. అంతే. ఆ తరువాత ఎవరు వచ్చారో..ఎవరు వెళ్ళారో...

ఇన్‌స్పెక్టర్ : ఆగండాగండి. పక్కింటి పిన్నిగారంటే? ఏ పక్కింటి?

శ్రీనాధ్ : (చేత్తో చూపిస్తూ) ఈ పక్కిల్లు.

కానిస్టేబుల్ : ఆ లాఠీ ఇటివ్వండి సార్.

ఇన్‌స్పెక్టర్ : ఎందుకు?

కానిస్టేబుల్ : పక్కింటి పిన్నిగారి సంగతి తేల్చుకొని వస్తా.

ఇన్‌స్పెక్టర్ : వీల్లేదు.

కానిస్టేబుల్ : సార్!

ఇన్‌స్పెక్టర్ : నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎవర్నీ అనుమానించడానికి వీల్లేదు.

కానిస్టేబుల్ : ఐతే మీరే పర్మిషన్ ఇవ్వండి సార్.

ఇన్‌స్పెక్టర్ : Attention!

కానిస్టేబుల్ : Yes Sir!

ఇన్‌స్పెక్టర్ : (లాఠీ ఇస్తూ) పక్కింటి పిన్నిగారి విషయం తేల్చుకురమ్మని నీకు అన్ని అధికారాలూ ఇస్తున్నాను.

శ్రీనాధ్ : ఆమె మా పక్కింటి పిన్ని గారు సార్. ఆమెని అనుమానిస్తే ఎలా?

ఇన్‌స్పెక్టర్ : నాకు పక్కింటి పిన్నిగార్ల సైకాలజీ కూడా తెలుసు. ఐనా అందర్నీ అనుమానించడమే మా డ్యూటీలోని ప్రథమ కర్తవ్యం. కానిస్టేబుల్! You can go now.

కానిస్టేబుల్ : Yes Sir! (సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు).

శ్రీనాధ్ : అసలు మా చిట్టి మాకు దొరుకుంతుందంటారా?

ఇన్‌స్పెక్టర్ : తప్పకుండా దొరికి తీరుతుంది. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.

శ్రీనాధ్ : ఎవర్నండీ?

ఇన్‌స్పెక్టర్ : అంటే..అది.. మాట వరసకి అన్నానన్నమాట. ఏమైనా ఈ కేసు చాలా క్లిష్టమైందిలానే ఉంది శ్రీధర్ గారూ! చాలా కాలం తర్వాత అత్యంత సాహసోపేతమైన కేసు ఒకటి తగిలిందని సంబరపడుతుంటే చిట్టి సరైన ఆనవాలు ఒక్కటి కూడా దొరకడం లేదు. పొరపాట్న ఒకవేళ బజార్లో ఎక్కడైనామీ చిట్టి కనపడితే తనని ఎలా పోల్చుకోవడం? ఆ! ఐడియా! మీ చిట్టి ఫోటో ఏదైనా ఉందా?

శ్రీనాధ్ : ఆ ఉందండీ. సంధ్యా! చిట్టి Birh Day నాడు తీసిన ఫొటో ఉండాలి కదా తీసుకురా.

సంధ్య : అలాగే (లోపలకి వెళ్తుంది).

శ్రీనాధ్ : ఆ ఫొటో చూస్తే మీరు తప్పకుండా చిట్టిని ట్రేస్ చెయ్యగలరు. మా నానిగాడు పట్టుబట్టి ఆ ఫొటో తీయించడం ఎంత మంచిదయ్యిందో చూడండి.

ఇన్‌స్పెక్టర్ : నానిగాడా? ఆ పెద్ద మనిషెవరు?

శ్రీనాధ్ : మా అబ్బాయేనండీ.

ఇన్‌స్పెక్టర్ : మీ అబ్బాయా? మరి చెప్పరేమండీ. ముందు పిలవండి మీవాడిని. కేసు చిటికెలో తేల్చేస్తాను. నాక్కొంచెం చిన్న పిల్లల సైకాలజీ కూడా తెలుసులెండి. పిలవండి. పిలవండి.

శ్రీనాధ్ : తప్పకుండా. చిట్టి తప్పిపోయిందన్న దిగులుతో స్కూల్‌కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. పిలుస్తానుండండి. నానీ! నానీ!

శ్రీనాధ్ : నిన్న సాయంత్రం ట్యూషన్‌కి చిట్టితో కలిసి వెళ్ళాడండీ. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు.

ఇన్‌స్పెక్టర్ : అంటే కిడ్నాపర్లు ఎవరో చాలా తెలివిగా మీవాణ్ణి బోల్తా కొట్టించి చిట్టిని ఎత్తుకుపోయుంటారు.

శ్రీనాధ్ : బాబూ! నానీ!

నాని : (లోపలి గది నుంచి ప్రవేశిస్తూ) వస్తున్నాను డాడీ!

ఇన్‌స్పెక్టర్ : ఓ! ఫెంటాస్టిక్! శ్రీధర్ గారూ! మీరు చాలా లక్కీ. కిడ్నాపర్స్ ఎవరో చిట్టిని ఏవిధంగా ఎత్తుకుపోయారో మీ అబ్బాయి నోటినుంచే ఎంత తెలివిగా చెప్పిస్తానో చూడండి. బాబూ! ఇటురా నాన్నా!

నాని : (భయపడతాడు. ఇన్‌స్పెక్టర్ దగ్గరకి వెళ్ళకుండా శ్రీధర్ చాటున దాక్కుంటాడు).

శ్రీనాధ్ : వెళ్ళు నానీ! అంకుల్ పిలిచినప్పుడు వెళ్ళాలి.

ఇన్‌స్పెక్టర్ : భయపడకమ్మా. నేను గజదొంగల్ని పట్టుకునే ఇన్‌పెక్టర్‌ని. చాలా సినిమాల్లో నువ్వు నాలాంటి వాళ్ళని చూసేవటావుగా?

నాని : చూశానుగా.

ఇన్‌స్పెక్టర్ : నేను చెప్పలా?

నాని : హీరో దొంగలందర్నీ చితగ్గొట్టాక లాస్ట్‌లో వచ్చి వాళ్ళని జీపులో ఎక్కించేది మీరేగా!

ఇన్‌స్పెక్టర్ : (ఇబ్బందిగా) ఓహ్! ఈ తెలుగు సినిమాల్లో ఆ సీన్లకి కూడా సెన్సార్ ఉంటే బాగుండు. చూడు నానీ! నేను నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను, నువ్వు వాటికి సమాధానాలు చెప్పావనుకో, మీ చిట్టిని ఎవరెత్తుకుపోయారో నాకు తెలిసిపోతుందన్నమాట. అప్పుడు నేను వెంటనే వెళ్ళి, వాళ్ళందర్నీ చితగ్గొట్టేసి....అదే..జీపు ఎక్కించేసి, మీకు మీ చిట్టిని తెచ్చిస్తానన్నమాట. సరేనా?

నాని : (సంధ్య చాటు నుంచి బైటికి వచ్చి) ఐతే సరే అంకుల్.

ఇన్‌స్పెక్టర్ : ఆ...అది. చిన్నపిల్లలంటే అలా ఉండాలి. ఆ..ఇప్పుడు చెప్పమ్మా, నిన్న ఉదయం నువ్వు, చిట్టి కలిసి ఏమేం చేశారో గబగబ చెప్పెయ్యాలి సరేనా?

నాని : అలాగే అంకల్.

ఇన్‌స్పెక్టర్ : మరి చెప్పెయ్! (మీసాలు తిప్పుతూ శ్రీధర్ వంక గర్వంగా చూస్తాడు, మీ పిల్లాడి చేత ఎల్ల చెప్పిస్తున్నానో చూడు అన్నట్లు).

నాని : పొద్దున్నే నిద్ర లేచానంకుల్. లేవగానే గట్టిగా ఒకసారి ఆవులించాను. ఆ తరువాత, నా బెడ్ మీద నుంచి దిగాను. దిగానా... దుప్పటి మడతపెట్టి, దిండు మీద పెట్టాను. పెట్టాను కదా! ఆ తరువాత బాత్ రూంకె వెళ్ళాను. అక్కడేమో...

ఇన్‌స్పెక్టర్ : (అసహనంగా) బాబూ...

నాని : బాత్ రూంలోనే అంకుల్!

ఇన్‌స్పెక్టర్ : అక్కడేం చేశావో నాకు తెలుసుగానీ బాత్ రూ‌నుంచి వచ్చాక ఏం చేశావ్?

నాని : వచ్చిన తరువాత ఏం చేశానో చెప్పమంటారా? ఐతే సరే. బాత్ రూం నుంచి వచ్చాక నా స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేశాను. మరి హోం వర్క్ చేయాలి కదా అంకుల్? మాత్స్ బుక్ ఓపెన్ చేశాను. చేశానా?

ఇన్‌స్పెక్టర్ : (అసహనంగా) బాబూ! నాని బాబూ! అది కాదు నాన్నా నువ్వు చెప్పాల్సింది, నువ్వు చిట్టీ స్కూల్‌కి కలిసే వెళ్ళారా?

నాని : రోజూ ఇద్దరం కలిసే వెళ్తాం అంకల్. నిన్న కూడా కలిసే వెళ్ళాం.

ఇన్‌స్పెక్టర్ : మరి స్కూల్‌లో ఏంజరిగిందో గుర్తు చేసుకుంటూ చెప్పు.

నాని : స్కూల్‌కి వెళ్ళాక అంకల్? తప్పకుండా చెబుతానంకుల్. మేమిద్దరం చాలా ఎర్లీగా స్కూల్‌కెళ్ళాం అంకుల్. అప్పటికి స్కూల్ గేట్ ఇంకా ఓపెన్ చెయ్యలేదు. అందుకని ఇద్దరం కాసేపు అక్కడే నిలబడ్డాం. కాసేపయ్యాక నా ఫ్రెండ్స్ అనిల్, పింకీ వచ్చారు. అనిల్ వాళ్ళ మమ్మీకి ఒంట్లో బాగోలేదంట అంకుల్. అందుకని అనిలేమో మాత్స్ హోం వర్క్ చెయ్యకుండానె స్కూల్‌కి వచ్చాడంట.

శ్రీనాధ్ : మరి అనిల్ వాళ్ళ డాడీతో చెయించుకోలేకపోయాడా మాత్స్?

నాని : వాళ్ళ డాడీ కూడా మీలాగే మాత్స్‌లో పూర్ అంట డాడీ.

శ్రీనాధ్ : (గతుక్కుమంటాడు).

నాని : అందుకని నేనేమో నా మాత్స్ బుక్ ఓపెన్ చేసి అనిల్‌కిచ్చాను. అప్పుడు అనిలేమో నా బుక్ చూసి...

ఇన్‌స్పెక్టర్ : (బిక్కమొహంతో) వద్దు బాబూ వద్దు. చూడబోతే నువ్వో పిల్ల సుత్తికేసులా ఉన్నావు. ఇంక నావల్లకాదుగానీ, నేనడిగే ఈ ఒకే ఒక్క ప్రశ్నకి జవాబివ్వు చాలు. సాయంత్రం స్కూల్ వదిలాక నువ్వూ, చిట్టీ ఎక్కడికెళ్ళారు?

నాని : (జవాబు చెప్పడానికి నోరు తెరవబోతాడు).

ఇన్‌స్పెక్టర్ : ఆగు. దయచేసి సాధ్యమైనంత క్లుప్తంగా...నా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువ మాటల్తో చెప్పు, నీకు కాడ్‌బరీస్ చాక్లెట్ కొనిస్తాగా.

నాని : అలాగే అంకుల్. స్కూల్ అయిపోగానే నెమ్మదిగా నడుచుకుంటూ స్కూల్ గేట్ దగ్గరకి వచ్చామంకుల్. అక్కడ స్వీటీనేమో మాకోసం ఎదురుచూస్తూ నిలబడుంది. ముగ్గురం కలిసి స్వీటీ వాళ్ళింటికెళ్ళాము. అక్కడ మేము బోలెడన్ని చాక్లెట్లు, బోలెడన్ని బిస్కెట్లు తిని, కాసేపు ఆడుకోని, ఇంటికి తిరిగొచ్చేశాం.

ఇన్‌స్పెక్టర్ : (చిరాగ్గా) మరి చిట్టి ఏమయ్యింది?

నాని : ఎమో అంకుల్. నా వెనకే వచ్చింది. ఇంట్లోకొచ్చి చూస్తే లేదు.

ఇన్‌స్పెక్టర్ : (గట్టిగా నిట్టూర్చి) కాస్త మంచినీళ్ళిస్తారా?

శ్రీనాధ్ : (కూజాలోని నీళ్ళు గ్లాసులోకి తీసి ఇస్తాడు).

ఇన్‌స్పెక్టర్ : (నీళ్ళు గటా గటా త్రాగి) ఐతే చిట్టి ఎక్కడికెళ్ళిందో నీకు తెలీదన్నమాట?

నాని : తెలిస్తే మేమే వెళ్ళి తెచ్చుకుంటాంగా అంకుల్.

ఇన్‌స్పెక్టర్ : భగవంతుడా!

కానిస్టేబుల్ : (ప్రవేశించి, సెల్యూట్ చేసి, లాఠీని ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చేస్తూ) పక్కింటి పిన్నిగార్ని ఫాలో అయివచ్చాను సార్.

ఇన్‌స్పెక్టర్ : (ఆత్రంగా) ఏమన్నా అనుమానించదగ్గ మనిషేనా? నాకు డౌటే!

కానిస్టేబుల్ : ఆమెను అనుమానిస్తే ...కళ్ళు పోతాయి సార్.

ఇన్‌స్పెక్టర్ : ఆ!

కానిస్టేబుల్ : మహా సాధ్వి. రోజుకి మూడు పూట్ల మాత్రమే తింటూ ఒక పూట కఠిన ఉపవాసముండే మహా పతివ్రత. పరపురుషుడే కాదు కదా, పెళ్ళైన రోజు నుంచి ఈరోజు వరకు కనీసం భర్తవైపు కూడా కన్నెత్తి చూడని మహా ఇల్లాలు.

ఇన్‌స్పెక్టర్ : (చెంపలేసుకుంటూ) ఇంకేం చెప్పకు. ఆమెని వదిలెయ్. నువ్వు మాత్రం ఒకసారి స్కూల్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ అనుమానాస్పాదవేమైనా ఉన్నాయేమో గమనించిరా.

కానిస్టేబుల్ : Yes Sir! లాఠీ సార్.

ఇన్‌స్పెక్టర్ : (లాఠీ ఇస్తూ) జాగ్రత్త. విధి నిర్వహణలో దీన్ని అశ్రద్ధ చెయ్యకు.

కానిస్టేబుల్ : చెయ్యను సార్.

ఇన్‌స్పెక్టర్ : ఎక్కడా పారెయ్యకు.

కానిస్టేబుల్ : పారెయ్యను సార్.

ఇన్‌స్పెక్టర్ : మన పోలీస్ స్టేషన్‌కి ఉన్నది ఇదొక్క లాఠీనే. ఎక్కడా మరిచిపోకు.

కానిస్టేబుల్ : మరిచిపోను సార్.

ఇన్‌స్పెక్టర్ : ఇంక నువ్వెళ్ళు.

కానిస్టేబుల్ : వెళ్ళను సార్ (వెంటనే ఉలిక్కిపడి) ఆ.ఆ. వెళ్తాను సార్. వెళ్తాను (కదలబోతాడు).

ఇన్‌స్పెక్టర్ : ఆగు. ఏ స్కూల్‌కెళ్తావ్?

కానిస్టేబుల్ : ఏ స్కూల్‌కి వెళ్ళమంటారు సార్?

ఇన్‌స్పెక్టర్ : నాని వాళ్ళ స్కూల్‌కి వెళ్ళు.

కానిస్టేబుల్ : అలాగే సార్ (కదలబోతాడు).

ఇన్‌స్పెక్టర్ : ఆగు. స్కూల్ పేరు తెలుసా?

కానిస్టేబుల్ : తెలీదు సార్.

ఇన్‌స్పెక్టర్ : (కోపంగా) మరి తెలీకుండా ఏ స్కూల్‌కెళ్తావ్? ఆ? నానీ! మీ స్కూల్ పేరేంటి నాన్నా?

నాని : పబ్లిక్ స్కూల్ అంకుల్.

ఇన్‌స్పెక్టర్ : ఈ రోజుల్లో పేటకో పబ్లిక్ స్కూల్ వెలుస్తోంది. మీ స్కూల్ పూర్తి పేరు చెప్పు బాబూ!

నాని : హై టెక్ పబ్లిక్ స్కూల్ అంకుల్.

ఇన్‌స్పెక్టర్ : కానిస్టేబుల్!

కానిస్టేబుల్ : (సెల్యూట్ చేసి) Yes Sir!

ఇన్‌స్పెక్టర్ : You can go now.

కానిస్టేబుల్ : (సెల్యూట్ చేసి) Yes Sir! (వెళ్ళిపోతాడు).

సంధ్య : (కంగారుగా ఇంట్లోనుంచి ఒక ఫొటో ఆల్బంతో వచ్చి) ఆల్బంలో చిట్టి ఫొటో కనిపించలేదండీ.

శ్రీనాధ్ : (కంగారుగా) కనిపించలేదా? సరిగ్గా చూశావా?

సంధ్య : చూశానండీ.

శ్రీనాధ్ : బీరువాలో ఉందేమో చూశావా?

సంధ్య : అన్నిచోట్లా వెదికాను. ఎక్కడా కనపళ్ళేదు. నేనే ఆ ఫొటోని ఈ ఆల్బంలో పెట్టాను (మరోసారి ఆల్బంలో వెదుకుతుంది).

శ్రీనాధ్ : నానీ! ఇందులో చిట్టి బర్త్ డే ఫొటో ఉండాలి చూశావా నాన్నా?

నాని : చూశాను డాడీ.

శ్రీనాధ్ : ఎక్కడ పెట్టావ్ దాన్ని. వెళ్ళి తీసుకురా. ఇన్‌స్పెక్టర్ అంకుల్ చూస్తారంట.

నాని : అది...ఆ ఫొటో...ఆ ఫొటో..

ఇన్‌స్పెక్టర్ : ఏంచేశావు బాబూ?

నాని : దాన్ని మొన్న జనవరి ఫస్ట్‌కి నా ఫ్రెండ్ పింకీ లేదూ, తనకి గ్రీటింగ్‌గా ఇచ్చేశానంకుల్.

ఇన్‌స్పెక్టర్ : పింకీనా? ఏంటో ఈ పేర్లన్నీ? మీ పేర్లకంటే మా కానిస్టేబుళ్ళ్ నంబర్లే తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చులా ఉంది. చూడు నానీ! నీకు పింకీ వాళ్ళ ఇల్లు తెలుసా?

నాని : దేనికంకుల్?

ఇన్‌స్పెక్టర్ : పింకీనడిగి ఆ ఫొటోని తెచ్చేసుకుందాం.

నాని : పింకీని ఏంచెయ్యొద్దంకుల్. చాలా మంచిది. రోజూ నాకు చాక్లెట్ ఇస్తుంది.

ఇన్‌స్పెక్టర్ : ఏమీ చెయ్యనమ్మా, బ్రతిమిలాడుతాను అంతే.

నాని : ఐతే పింకీ ఇల్లెక్కడో చెబుతా.

ఇన్‌స్పెక్టర్ : ఊ. చెప్పు. చెప్పు.

నాని : మా ఇంటి దగ్గర్నుంచి రోడ్డు చివరికెళ్ళాలంకుల్. అక్కణ్ణుంచి ఎడమవైపు తిరిగితే ఒక బేకరీ వస్తుంది. ఆ బేకరీలో బోల్డన్ని బిస్కెట్లు, బ్రెడ్లు ఉంటాయి. ఆ బేకరీ దాటాక కుడి వైపు ఇంకో రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు చివరేమో డింగీ వాళ్ళిళ్ళు. ఐతే డింగీ వాళ్ళింటి వరకు వెళ్ళనక్కరలేదు....

ఇన్‌స్పెక్టర్ : బాబూ! వాళ్ళ ఇల్లు ఏ లొకాలిటీలో ఉందో దాని పేరు చెప్పగలవా?

నాని : తెలీదంకుల్.

ఇన్‌స్పెక్టర్ : శ్రీధర్ గారూ! చాలా కష్టమండీ మీ పుత్రరత్నంతో.

స్రీ : చిన్న పిల్లాడు కదండీ..

ఇన్‌స్పెక్టర్ : ఆ. అదే నాకు శోష వచ్చేట్లు చేస్తుంది. బాబూ! నానీ! నువ్వు స్కూల్ నుంచి పింకీ వాళ్ళింటికి ఎలా వెళ్తావ్?

నాని : నడిచే అంకుల్.

ఇన్‌స్పెక్టర్ : శ్రీ రామ. అది కాదు బాబూ, ఏ రూట్‌లో వెళ్తావూ అని?

నాని : పింకీ వెళ్ళే రూట్‌లోనే.

ఇన్‌స్పెక్టర్ : (నీరసంగా) పింకీ ఏ రూట్‌లో వెళ్తుంది?

నాని : వాళ్ళ ఇల్లుండే రూట్‌లోనే.

ఇన్‌స్పెక్టర్ : (అసహనంగా) పింకీ వాళ్ళ ఇల్లు మీ స్కూలుకి ఎంత దూరంలో ఉంటుందో చెప్పగలవా?

నాని : దగ్గరే అంకుల్.

ఇన్‌స్పెక్టర్ : ఆ..దగ్గరేనా? రక్షించావ్. ఇప్పుడు చెప్పు, మీ స్కూల్ నుంచి పింకీ వాళ్ళింటికి ఎలా వెళ్ళాలి?

నాని : స్కూల్ గేట్ నుంచి బైటికి రాగానే రోడ్ క్రాస్ చెయ్యాలంకుల్. చేశాక ఒక ఇల్లొస్తుంది. ఆ ఇల్లే పింకీ వాళ్ళ ఇల్లు.

ఇన్‌స్పెక్టర్ : (బిత్తరపోయి) అంటే మీ స్కూల్ ఎదురుగానే పింకీ వాళ్ళిల్లా? ఆ మాట ఇందాకే చెప్పుంటే...పోనీలే ఇప్పటికైనా కరుణించావ్. శ్రీధర్ గారూ! మనమిప్పుడే పింకీ వాళ్ళింటికెళ్ళాలి. నానీ! నువ్వు కూడా మాతో రావాలి.

నాని : ఎందుకంకుల్?

ఇన్‌స్పెక్టర్ : ఎందుకేంటి? ఆ ఫొటో తెచ్చుకోవాలిగా.

నాని : ఆ ఫొటో పింకీ దగ్గరలేదుగా.

ఇన్‌స్పెక్టర్ : (బిత్తరపోయి) ఆ..లేదా? చావు కబుర్లు ఇంత చల్లగా చెబుతున్నవాణ్ణి నా సర్వీసులో నిన్నేనయ్యా మొట్టమొదటిసారిగా చూస్తుంది..పోనీ అది ఎవరి దగ్గరుందో అదైనా చెప్పు.

నాని : ఆ రోజు స్కూల్‌లో దాన్ని పింకీ నుంచి బంటీ లాక్కుందిగా.

ఇన్‌స్పెక్టర్ : బంటీనా?

నాని : అవునంకుల్.

ఇన్‌స్పెక్టర్ : ఐతే ఇప్పుడా ఫొటో బంటీ దగ్గరుందన్నమాట!

నాని : లేదంకుల్.

ఇన్‌స్పెక్టర్ : ఓరినీ ఇల్లు బంగారం గానూ! ఇప్పుడేగా ఉందన్నావ్?

నాని : దాన్ని మళ్ళీ పింకీ లాక్కుందిగా.

ఇన్‌స్పెక్టర్ : ఓర్నాయనోయ్! శ్రీధర్ గారూ మీరన్నా దయచూపాలి.

శ్రీనాధ్ : మరైతే ఆ ఫొటో పింకీ దగ్గరే ఉందా బాబూ?

నాని : లేదు డాడీ. పింకీ నుంచి బంటీ లాక్కుంటే, బంటీ నుంచి పింకీ లాక్కుంది. మళ్లీనేమో పింకీ నుంచి బంటీ లాక్కుంది. బంటీ నుంచేమో పింకీ, పింకీ నుంచేమో బంటీ, బంటీ నుంచి పింకీ, పింకీ నుంచి బంటీ...

ఇన్‌స్పెక్టర్ : (చిరాకు, కోపంతో పెద్దగా) ఫొటో ఏమయ్యింది?

నాని : చినిగిపోయిందిగా.

ఇన్‌స్పెక్టర్ : వా! (అంటూ పెద్దగా ఏడుస్తాడు) నీకంటే ఓ నేరస్తుడినుంచే సమాధానం తేలిగా రాబట్టొచ్చే. వా! (మళ్ళీ ఏడుస్తాడు).

వీరయ్య : (ప్రవేశిస్తూ) అయ్యగారండీ! అయ్యగారండీ!

ఇన్‌స్పెక్టర్ : ఏయ్ ఆగు. ఎవర్నువ్?

శ్రీనాధ్ : వాడు మా నౌకరులెండి. ఏమన్నా తెలిసిందా వీరయ్యా?

వీరయ్య : లేదయ్యగారండీ. మనమింక ఆ బగమంతుడి మీద బారమెయ్యటమే.

ఇన్‌స్పెక్టర్ : ఏయ్ నువ్విట్రా.

వీరయ్య : (భయంగా) ఎందుకండీ?

ఇన్‌స్పెక్టర్ : నీ ఫేస్ చూస్తుంటే నాకనుమానంగా ఉంది. చిట్టిని నువ్వే కిడ్నాప్ చేసి, ఎక్కడో దాచి వుంచి, గొంతు మార్చి ఫోన్ చేసి, వీళ్ళ దగ్గర్నుంచి డబ్బు గుంజుదామనుకున్నావు కదూ?

వీరయ్య : అయ్యబాబోయ్ నాకేటి తెల్దండీ. నాకింట్లో పనుంది (లోపలకి వెళ్ళబోతాడు).

ఇన్‌స్పెక్టర్ : ఆగు. అంత కంగారు పదుతున్నావంటే ఈ కిడ్నాప్ నువ్వే చేసుండాలి. చెప్పు. ఛిట్టినేం చేశావ్?

వీరయ్య : (కంగారుగా) అయ్యగారండీ!

శ్రీనాధ్ : ఇన్‌స్పెక్టర్ గారూ అతను మాకు చాలా నమ్మకస్తుడైన నౌకరండీ.

ఇన్‌స్పెక్టర్ : నాకు నౌకర్ల సైకాలజీ కూడా తెలుసు. చెప్పరా చెప్పు. నిజం చెబుతావా? లేక నా లాఠీతో.. ఏదీ నా లాఠీ?..(అటూ యిటూ చూసి) మీ ఇంట్లో ఓ కట్టె పుల్లుంటే ఇవ్వండి.

వీరయ్య : (ఏడుపు గొంతుతో) ఓరి నాయనో! నా ఒళ్ళు ఇరగొట్టట్టున్నాడు దేవుడోయ్. నాకేటి తెల్దు బాబోయ్.

ఇన్‌స్పెక్టర్ : తప్పించుకోలేవ్ నిజం చెప్పు.

వీరయ్య : సత్తెపెమాణికంగా సెబుతున్నానండీ. సిట్టి తల్లిని నేను తీసుకుపోలేదు. అయ్యగారూ! మీరే నన్ను కాపాడాల (శ్రీధర్ చాటున దాక్కుంటాడు).

ఇన్‌స్పెక్టర్ : (వీరయ్యని బైటికి లాగి) నువ్వెక్కడ దాక్కున్నా ఏం ప్రయోజనం ఉండదు. కిడ్నాపర్‌వి నువ్వేనని తేలిపోయింది. బుకాయించక నిజం చెప్పు. చెప్పరా.

శ్రీనాధ్ : అయ్యో వీడు మా దగ్గర ఐదేళ్ళుగా ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాడండీ. వీడెందుకు చేస్తాడీ పని?

ఇన్‌స్పెక్టర్ : నా బట్టలిస్త్రే చేసే లాండ్రీవాడు కూడా రెండేళ్ళపాటు నమ్మకంగానే చేశాడు. ఆ తర్వాత నా బట్టలెత్తుకుపోలేదూ? పైగా కాకీ బట్టలు.

కానిస్టేబుల్ : (ప్రవేశిస్తూ) సార్!

ఇన్‌స్పెక్టర్ : రా. సమయానికొచ్చావ్. ఇందాకట్నుంచి లాఠీ కోసం చూస్తున్నాను. (లాఠీ తీస్కుని) రేయ్! చాపరా చేతులు.

వీరయ్య : ఓరి దేమొడోయ్! ఇదెక్కడి కరమండీ సామీ?

సంధ్య : (ఆందోళనగా) ఏమండీ!

ఇన్‌స్పెక్టర్ : చాపరా అంటుంటే?

వీరయ్య : (భయంగా) నిజంగా నాకేటీతెల్దండీ..

ఇన్‌స్పెక్టర్ : చెబుతావా? తన్నులు తింటావా (లాఠీతో వీరయ్యని కొట్టబోతాడు).

వీరయ్య : (భయంతో) సెప్పేత్తాను బాబోయ్, సెప్పేతాను. ఉన్నదున్నట్టు, జరిగింది జరిగినట్టు సెప్పేత్తాను.

శ్రీనాధ్ : (ఆశ్చర్యంగా) వీరయ్యా! నువ్వు తప్పు చేశావా?

వీరయ్య : (నమస్కరిస్తూ) అయ్యా! మీరంతా నన్ను సెమించాలి. నేను పాపిని, పాపిస్టోణ్ణి. ఏనాడో, ఇవరికో అన్నాయం సేసుంటాను. అందుకే ఈ పోలీసాయనికి దొరికిపోయాను.

ఇన్‌స్పెక్టర్ : (విజయగర్వంతో మీసాలు తిప్పుతాడు).

శ్రీనాధ్ : (ఆశ్చర్యంగా) వీరయ్యా!

వీరయ్య : అయ్యగారూ! ఎంతో మర్యాదస్తుడిలాగా ఇంతకాలం మీ ఇంట్లో పని చేశాను. మీరు నన్నెంతో బాగా సూసుకున్నారు. అందుకు మీకెంతో ఋణపడుంటాను. ఇనస్పెక్టర్ బాబూ! సేసుకున్న పాపం సెబితే పోతుందంటారు. నేను సేసిన పాపం....

అందరు : (ఎంతో ఉత్కంఠతతో చూస్తుంటారు).

వీరయ్య : నేను సేసిన పాపం ...మీ కంట్లో పడ్డమేననండీ...(ఇన్‌స్పెక్టర్ కాళ్ళ మీద పడి) అంతకంటే నాకేటీ తెల్దు నన్ను నమ్మండి బాబూ, నన్ను నమ్మండి (ఏడుస్తాడు).

ఇన్‌స్పెక్టర్ : (ఉలిక్కిపడి) ఊ...

శ్రీనాధ్ : నేను చెప్పానుకదండీ వీరయ్య అటువంటివాదుకాదని.

సంధ్య : ఊర్కో వీరయ్యా! ఊర్కో. ఇన్‌స్పెక్టర్ గారు నిన్నేం చెయ్యర్లే.

ఇన్‌స్పెక్టర్ : కానిస్టేబుల్!

కానిస్టేబుల్ : (సెల్యూట్ చేసి) Yes Sir !

ఇన్‌స్పెక్టర్ : మనమీ పరిశోధనని ఈరోజుకి ఆపెయ్యడం మంచిది.

కానిస్టేబుల్ : Yes Sir !

ఇన్‌స్పెక్టర్ : ప్రతిదానికీ Yes Sir అనడం నీకు అలవాటై పోయింది.

కానిస్టేబుల్ : Yes Sir ! (ఉలిక్కిపడి) నో సార్!

ఇన్‌స్పెక్టర్ : ఊ..Move ! (బయటకి నడవబోతాడు).

పాండు : (హుషారుగా చేతిలో ఓ ప్రైజుతో ప్రవేశిస్తూ) అక్కా! బావా!

ఇన్‌స్పెక్టర్ : ఆగు. ఎవర్నువ్? ఏంటా హుషారు?

పాండు : ఆ..మనింట్లో పోలీసులా? ఏంజరిగిందక్కా?

ఇన్‌స్పెక్టర్ : ఇంతకీ నువ్వెవరివో చెప్పలేదు?

కానిస్టేబుల్ : ఆవిణ్ణి అక్కా అని పిలుస్తున్నాడంటే ఆవిడగారి తమ్ముడని తెలిసిపోతుంది కదా సార్!

ఇన్‌స్పెక్టర్ : అవును కదూ! చూడు మిస్టర్! ఇంట్లో అందరూ అంత విచారంగా ఉన్నా నువ్వు హుషారుగా ఉన్నావంటే దానర్ధం...?

సంధ్య : (కంగారుగా) అయ్యో వాడు మా తమ్ముడండీ.

ఇన్‌స్పెక్టర్ : నాకు తమ్ముళ్ళ సైకాలజీ కూడా తెలుసు.

శ్రీనాధ్ : వాడు మా బావమరిదండీ.

ఇన్‌స్పెక్టర్ : నాకు బామ్మర్దుల సైకాలజీ అంతకంటే బాగా తెలుసు.

పాండు : అసలేం జరిగిందక్కా? ఏంటీ Confusion ?

సంధ్య : నిన్న సాయంత్రం నుంచి చిట్టి కనిపించడం లేదు పాండూ. అందుకని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం.

పాండు : (పెద్దగా నవ్వి) ఓహ్! అదా విషయం? ఐనా చిట్టి కనిపించడం లేదని పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమేంటక్కా మరీనూ?

ఇన్‌స్పెక్టర్ : అంటే, ఒక ప్రాణం ఖరీదు నీ దృష్టిలో అంత చులకనన్నమాట. కానిస్టేబుల్! ఇతని వాలకం చూస్తుంటే ....

కానిస్టేబుల్ : నాకే మాత్రం అనుమానంగా లేదు సార్.

ఇన్‌స్పెక్టర్ : (ఉలిక్కిపడి) ఆ...!?

పాండు : అనుమానమూ వద్దు, అపోహలూ వద్దు. అసలు విషయం తెలుసుకోండి చాలు.

సంధ్య : అసలు విషయం ఏంట్రా?

పాండు : విజయవాడలో అందాల పోటీలు జరుగుతుంటే చిట్టిని ఆ పోటీలకి తీసుకెళ్ళాను. చిట్టి ఆ పోటీల్లో పాల్గొంది, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఇదిగోండి ఆ బహుమతి (చేతిలోని ప్రైజ్‌ని సంధ్యకి అందిస్తాడు).

సంధ్య : (పట్టలేని సంతోషంతో) ఆ.. ఎంతటి కమ్మటి వార్త చెప్పావురా? నాకు ముందే తెలుసు చిట్టి అందం గురించి. అది ఫస్ట్‌లో నిలుస్తుందనీ నాకు తెలుసు.

శ్రీనాధ్ : అది సరే పాండూ, ఇలా చెప్పాపెట్టకుండా తీసుకెళ్ళడమేంటి? మేమెంత హడలిపోయామో తెలుసా?

పాండు : చెప్పి తీసుకెళ్తే థ్రిల్ ఏముంది బావగారూ? ఒక వేళ చెప్పి తీసుకెళ్ళినా ప్రైజ్ రాలేదనుకోండీ, మీరు హర్ట్ కారూ? అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఈ పోటీలకి తీసుకెళ్ళాను. ఐనా బావగారూ, చిట్టి ర్యాంప్ మీద కాట్ వాక్ చేస్తుంటే చప్పట్లే చప్పట్లనుకోండి. చూసి తీరాల్సిందే.

ఇన్‌స్పెక్టర్ : చాలా గొప్ప ఘనకార్యం చేశావుగానీ, అసలింతకీ చిట్టి ఏది?

పాండు : అందర్నీ Surprise చేద్దామని ముందు ప్రైజ్ తీసుకొచ్చాను.

ఇన్‌స్పెక్టర్ : చేసిన సర్‌ప్రైజులు చాలుగానీ ముందు చిట్టిని చూపించయ్యా, ప్రొద్దుట్నుంచీ సస్పెన్సుతో చచ్చిపోతున్నాను.

పాండు : ఇదిగో, ఇక్కడే ఉంది చూడండి, ప్రక్కింటి పిన్ని గారి చేతుల్లో కిరీటం పెట్టుకోని ఎంత హుందాగా ఉందో చూడండీ (అంటూ ద్వారం ఎంట్రన్స్ వైపు చూపిస్తాడు)

అందరు : (అటు చూస్తారు)

సంధ్య : (ఆనందంగా) ఆ.. నా చిట్టి తల్లీ (అంటూ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.)

నాని : చిట్టీ..చిట్టీ (అంటూ ఆనందంగా బైటికెళ్ళిపోతాడు)

శ్రీనాధ్ : (ఆనందంగా) హమ్మయ్య! (అనుకుంటూ బైటికెళ్ళిపోతాడు).

కానిస్టేబుల్ : (తను కూడా వాళ్ళతోపాటు వెళ్ళబోతాడు).

ఇన్‌స్పెక్టర్ : (అతని చొక్కా పట్టుకోని ఆపి) నువ్వెక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నావ్? వాళ్ళు లోపలకి వస్తారుకదా, అప్పుడు మనం కూడా చిట్టిని అభినందించి, వాళ్ళు పెట్టే స్వీటు, హాటు తినేసి వెళ్దాం.

కానిస్టేబుల్ : యెస్ సార్.

శ్రీనాధ్ : (ముందుగా లోపలకి వచ్చి) చాలా ఆనందంగా ఉంది ఇన్‌స్పెక్టర్ గారూ. ఈ రోజుని మా జీవితంలో మరచిపోలేం.

సంధ్య : (వచ్చి) కూర్చోండి ఇన్‌పెక్టర్ గారూ స్వీటు, హాటు తినేసి వెళ్దురు.

ఇన్‌స్పెక్టర్ : (కానిస్టేబుల్ వైపు "నేను చెప్పలా" అన్నట్లు చూస్తాడు).

(తర్వాత పాండు, వీరయ్య సంతోషంగా లోపలకి ప్రవేశిస్తారు. వీరయ్య ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ లోపలకి ప్రవేశిస్తాడు. వీరయ్య ఎమోషన్‌ని చూసిన కానిస్టేబుల్ తను కూడా కన్నీళ్ళు తుడుచుకుంటాడు. అది చూసి ఇన్‌స్పెక్టర్ ఉలిక్కిపడతాడు. తను చిట్టి రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తాడు. చివరిగా నాని ఒక చిన్న కుక్కపిల్లని ఎత్తుకోని స్టేజి మీదకి తీసుకొస్తాడు. కుక్క తల మీద కిరీటం వుంటుంది).

నాని : (ఇన్‌పెక్టర్ దగ్గరకొచ్చి) అంకుల్! ఇదిగోండి మా చిట్టి.

ఇన్‌స్పెక్టర్ : (ఆ మాటతో బిత్తరపోతాడు).

కానిస్టేబుల్ : (ఉలిక్కిపడతాడు).

శ్రీనాధ్ : చిట్టీ! అంకుల్‌కి నమస్కారం చెయ్యమ్మా!

నాని : కుక్కపిల్ల ముందు కాళ్ళు రెండూ కలిపి పట్టుకుని ఇన్‌స్పెక్టర్‌కి నమస్కారం పెట్టిస్తాడు)

ఇన్‌స్పెక్టర్ : (మరింత షాక్‌కి గురవుతాడు. ఏడుపు మొహంటో) చిట్టి...అహ్హహ్హ...చిట్టి తల్లి. బంగారుకొండ... బ్యూటీ క్వీన్! హు! ఒక కుక్కపిల్ల అని ముందుగానే చెప్పుంటే నాకీ శోష ఉండకపోనే! (కానిస్టేబుల్‌తో) వీళ్ళ సైకాలజీ తెలుసుకోలేకపోతినే! (బావురుమంటూ ఏడుస్తాడు). మళ్ళీ దీని నమస్కారం ఒకటి. దానికి నేను అంకుల్‌నట. అంటే నేనెవర్ని? నేనూ కుక్కనేనా? అయ్యో! ఏమిటీ సృష్టి? ఏమిటీ ప్రేమ? వివరాలు సరిగ్గా తెలుసుకోకుండా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి బోల్తా పడితినే! అయ్యో! అయ్యయ్యో...(ఏడుస్తూ కానిస్టేబుల్ భుజం మీద తల వాలుస్తాడు).

కానిస్టేబుల్ : (ఇన్‌స్పెక్టర్ తల మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నట్లు నిమురుతుండగా...)

(తెర పడిపోతుంది)

రచన : తిమ్మన శ్యాం సుందర్.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: