telugudanam.com

      telugudanam.com

   

"కుక్కపిల్ల దొరికింది"

[పరిశుభ్రంగా అలంకరించబడిన ఒకగది, ఒకమూల టెలిఫోను ఉన్నది. గోడకు ఎదురుగా పటాలూ, కాలెండర్లూ వున్నై. కాలెండరుకు దిగువగా "కుక్క ఉన్నది జాగ్రత్త!" అనే బోర్డు వ్రేలాడుతున్నది. తెర లేచేసరికి స్టేజిమీద మనుషులెవరూ లేరు. కాసేపటికి టెలిఫోన్ మ్రోగింది. ఇంట్లోంచి నౌకరు "సీను" అనే కుర్రాడు వచ్చాడు. వచ్చి ఫోనుతీసి]


సీను : ఎవరండీ ఆఁ...అయ్యా, లేరండి...అవునండి...అయ్యగారు లేరు...తెలీదండి...తెలీదండి ఏదీ తెలీదండి... (కాసేపు విని కుక్కపిల్లకు అన్నంపెట్టే ఒకగిన్నె ఒకమూలవుంటే వెళ్ళి దానికేసి దీనంగా చూస్తూన్నాడు. ఫోను మళ్ళీ మ్రోగింది. వెళ్ళి తీసి) ఎవరండీ? ... నేనేనండి... అయ్యా--అయ్యగారూ తమరా ఎక్కడినుంచీ మాట్లాడుతున్నారు? ఈ ప్రక్కనుంచే! చిత్తం దొరకలేదండి... లేదండి తమరండి తమరురావాలంటాను. మాటిమాటికీ తమరట్లా "దొరికిందా దొరికిందా" అంటే ఎట్లా?.. ఐదునిమిషాలు కిందటేగా అడిగారు అవును అడిగారు లేదన్నాను అవునండీ లేదన్నాను. చిత్తం (విసిగిపోయినట్టు ఠపీమని పెట్టాడు, అటూ ఇటూ చూసి గదంతా సర్ధుతున్నాడు. బయటనుంచి కాస్సేపటిలో యింటి యజమాని చిదంబరం హడావుడిగా వచ్చాడు. 50 సంవత్సరాల ప్రాయం. సూటు వేసుకున్నాడు. వస్తూనే నెత్తిమీద టోపీ తీసి బల్లమీది విసిరాడు)

చిదం : అబ్బబ్బబ్బ... రామచంద్రా... శ్రీరామచంద్రా..(ఆగి, గోడకు తగిలించివున్న బోర్డుకేసి చూసి) ఈ బోర్డు ఇక్కడ తగిలించడంలో నీ ఉద్దేశం? (ఆగి, చూస్తూ) ఈ బోర్డు ఇక్కడ తగలించడంలో ఏమిటి నీ ఉద్దేశమూ అని అడుగుతున్నాను చెప్పు సమాధానం చెప్పూ?

సీను : ఉద్దేశం ఏముంటుందండీ?

చిదం : ఈ బోర్డు 'ఇక్కడ ' ఎందుకు తగిలించావురా వెర్రిపీనుగా?

సీను : ఉండిపోయిందిగదా అని

చిదం : అంతేనా?

సీను : అంతేనండి!

చిదం : అంతేగద. ఇంతకూ దాని అర్ధం ఏమిటో నీకు తెలుసా? అదే ఆబోర్డుమీద ఉన్న ఇంగ్లీషు అక్షరాలలోని గూఢార్ధం? సీను తెలియదని తల వూపబోగా 'తెలీదని ' తల వూపక్కరలేదులే నాకు తెలిసిందిలే నీకు తెలీదని! 'ఇక్కడో కుక్క ఉన్నది జగర్త!' అని దాని అర్ధం. అర్ధం నీకు తెలీదు కాబట్టి ఆ బోర్డు ఇక్కడ కట్టినందుకు వూరుకుంటున్నాను. వెధవాయా 'ఇక్కడోకుక్కవుందీ జాగర్త ' అనే బోర్డు తెచ్చి ఈగదిలో పెడితే మనిద్దరిలోనూ ఆ కుక్క ఎవరం అని నీ అభిప్రాయమా? మాట్లాడకు. మాట్లాడకుండా దాన్ని అక్కడనుంచి తీసెయ్యి. అసలెందుకు తెచ్చిపెట్టావు దాన్నిక్కడ?

సీను : అర్ధం తెలీకనేనండి తెలిస్తే లోపల మీ గదిలోనే ఉంచేసేవాడిని కదండీ!

చిదం : నాగదిలో ఉంచేవాడివా లేక గోడకు వ్రేలాడగట్టేవాడివా?

సీను : రామ రామ! అర్ధం తెలిసిన తర్వాత ఇప్పుడెందుకు చేస్తానండీ ఆ పని?

చిదం : ఇంతకు పూర్వం ఐతే అదికూడా చేసే వాడివేనన్నమాట!

సీను : అనుకున్నానండీ, మీగదిలోనే పెట్టేస్తే జాగర్తగా ఉంటుందిగదా అని

చిదం : ఏడిశావ్ గాని దాన్నితీసి బల్లక్రిందపెట్టు. పెద్దమనుషులెవరన్నా వస్తారు (సీను తియ్యటానికి పోబోతున్నాడు) ఆ బోర్డును అసలు అక్కడనుంచి ఎందుకు కదిలించావ్?

సీను : కుక్కపిల్ల లేదుకదా దాని బోర్డుమాత్రం ఎందుకని?

చిదం : అటువంటప్పుడు తెచ్చి పడెయ్యక గోడకు ఎందుకు తగిలించావ్?

సీను : పోనీ ఏదో పటాలమాదిరి అదీ ఉంటుంది కదా అని దానికి వేలాడ తియ్యటానికి తాడొకటి ఉంది మరి.

చిదం : సరే, తీసేయ్. (సీను తీసి బల్లమీద పెట్టాడు) బోర్లించు (బోర్లించాడు) దానిమీద ఏదన్నా కప్పు (అటూ ఇటూ చూసి సీను కొత్త వార్తా పత్రిక తెచ్చి కప్పబోయాడు) ఉండుండు అట్లా కప్పితేనే అనుమానం. ఒకటి చెయ్యి టేబిల్ క్లాత్ క్రిందపెట్టు సరిపోతుంది. (సీను టేబిల్ క్లాత్ క్రింద పెట్టాడు) ఏదో ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తోందిరా. నా మాటవిను. ఇక్కడనుంచి లోపలకు తీసుకుపోయి, నా గదిలో... నా గదిలో వొద్దు అవతలగదిలో పడేయ్ జాగర్త. దానవసరం ఐపోలేదు (సీను వెళ్ళాడు. చిదంబరం కోటు తీసేసి చిరాగ్గా కూలబడ్డాడు. సీను వచ్చాడు) ఏమయిపోయిందిరా మన కుక్కపిల్ల? దొరకనట్టే? ఇల్లంతా చిన్నబోయిందిరా ఎంతముద్దు! నన్నుచూస్తే ఒక నిమిషం వదిలేదికాదు, ఎంతదూరంలో వున్నా ఇట్టే ఆనవాలుపట్టి, తోకవూపేది. నేను బిస్కట్లు తీసుకు రాకపోతే వెధవకెంత కోపం పాపం ఎక్కడుందో ఏమయిందో!

సీను : విచారించకండిసార్!మనకుక్కపిల్ల మనకు దొరుకుతుంది. కాని అదిలేకపోతే నాకేం తోచటంలేదుసార్! (అమాయకంగా) ఎంత మంచి కుక్కపిల్లసార్ అది! ఎవ్వర్నీ ఏమీ అనేదికాదు. దొంగల్ని చూసినా ఎంతసేపూ అరిచేదేకాని కరవటానికి నోరే వచ్చేదికాదు సార్. అరిచేకుక్క కరవదంటారని అరుపు తగ్గిద్దామని ప్రయత్నించాను. అరుపు తగ్గించేది! ఐతే 'ఒకర్ని కరిచి బాధిస్తానా ' అన్నట్టు నోట్లో చెయ్యిపెట్టినా విదిలించుకొని పారిపోయేది.

చిదం : సీనూ! ఆ కుక్కపిల్ల మనకు ఎట్లావచ్చిందో తెలుసురా నీకు?

సీను : తెలీదుసార్!

చిదం : చెబుతా విను. బెంగుళూరునుంచి వస్తూంటే ఆ మధ్య ఒక స్నేహితుడు నాకు బహూకరించాడు. అంతకుపూర్వం కుక్కపిల్లకోసం తెగ ప్రయత్నించాను. చిన్నప్పట్నుంచీ కుక్క పాఠాలు తెగ చదవటంవల్ల, కుక్కలమీద బాగా మక్కువకలిగింది, ఏంచేస్తాం? మా నాన్నగారికి కుక్కలంటే కోపం భయం! ఎంచాతంటే ఆయన తండ్రిగారు కుక్క కాటువల్ల చచ్చి పోయాట్ట. ఆ భయంవల్ల మా నాన్నగారు ఇంట్లో కుక్కబొమ్మకూడా ఉంచేవాడుకాడు. గ్రామఫోను పాటలకోసం రికార్డులుకొంటే వెధవా, హిజ్ మాస్టర్స్ వాయిస్ రికార్డులు కొనవద్దని చెప్పానా లేదా? అంటూ అవన్నీ తీసికెళ్ళి బయటపారేశేవాడు. నీళ్ళు పోసి ఆ బొమ్మను వూడదీసి ఇంట్లోకి తెచ్చుకొనే వాడిని వీధిలో కుక్క అరుస్తే నౌకర్ను పంపి ఆ కుక్కను వూరవతలిదాకా తరుముకు పోయొచ్చి ఇంట్లో కాలుపెట్టమనేవాడు! అంత చాదస్తపుమనిషి! నాకాచాదస్తమూ లేదు, భయమూలేదు సరికదా అదేమిటో ఆయన వద్దు అంటున్నకొద్దీ నా మనస్సు కుక్కల మీదికేపోయేది! కుక్క విశ్వాసముగల జంతువు అనేమాట నా మెదడులో ఎప్పుడూ పనిచేస్తూవుండేది. అంచాత బెంగుళూరునుంచి వస్తున్నప్పుడు నా స్నేహితుడిని ఆ కుక్క పిల్లను నాకు బహూకరించమన్నాను. ఆ బహూకరణతో పాటు ఓ కాయితంకూడా యిచ్చాడు. 'ఆకలివేస్తున్న కుక్కకు అన్నం పెడితే అది నిన్ను కరవదు కుక్కకూ, మనిషికీ ఉండే పెద్ద భేదమల్లా ఇదొక్కటే!' అని 'మార్క్ ట్వేన్ ' అనే మహానుభావుడి కొటేషన్ ఆ కాయితమ్మీద రాశాడు. ఎంత మంచివాక్యం అనుకున్నావు. ఆ కాయితం మాత్రం పెట్లో మిగిలిపోయింది.

సీను : మ్ ఏ చేస్తామండీ ఖర్మ!

చిదం : ఖర్మేమిట్రా నీ మొహం! అసలు నువ్వే కారణం అది పోవటానికి.

సీను : నేనాండీ?

చిదం : అవును నువ్వే. ఆ కుక్కకోసం, దాని పోషణ కోసం నిన్ను ఏర్పాటు చేశాను దానికి తల్లీ తండ్రీ అన్నీ నువ్వే అనుకోమని చెప్పాను. వూఁ, వూఁ అని దాన్ని వొదిలేశావ్!

సీను : నాకు తెలీదు సార్! తెలిసి తెలిసి ఎందుకొదిలేస్తావండీ?

చిదం : వెధవా-ఇరవై నాలుగ్గంటలూ దాన్ని నువ్వు కనిపెట్టుకుని కూచోనఖ్కర్లా?

సీనూ : అది మనయిల్లు కాయాలని వీధిలోవుంచారు. దాన్ని కాస్తూ నేను అక్కడే కూచోనా?

చిదం : ఏం, నువ్వు వెధవ పనులు చెయ్యకుండానూ, పారిపోకుండానూ నేను నిన్ను కాస్తున్నాను కానూ? ఐనా నిన్ను అనేంలాభం? నీవంటి తెలివి తక్కువ దద్ధమ్మను నౌఖరుగా ఉంచుకున్నందుకు నాబుధ్ధి ననాలి! అసలు ఎట్లా పోయిందిరా కుక్కపిల్ల?

సీను : నేను చూడలేదుసార్! మొన్నరాత్రి మామూలుగానే అన్నం తిన్నది.

చిదం : సరిగ్గానే తినేసిందా?

సీను : మరి కాస్త ఎక్కువపట్టే పట్టింది ఎట్లాగూ పోతాను కదా అని అన్నంతిన్నాక గొలుసుతో స్తంభానిక్కట్టేను మామూలుగా నేను నిద్రపోయాను. సగం రాత్రికేలేదు! గొలుసుమాత్రం ఉండిపోయింది.

చిదం : ఆ గొలుసు ఓసారి తీసుకురా. (సీను లోపలికి వెళ్ళి గొలుసు తెచ్చాడు. చిదంబరం పరీక్షగా చూసి) గొలుసు కొరుక్కొని పారిపోలేదు విప్పేసివుంది. అంటే ఎవరో విప్పేశారన్న మాట! నువ్వసలు మెడకు గట్టిగా కట్టావా?

సీను : గట్టిగానే కట్టానండీ ఇంకాస్త బిగిస్తే గుటుక్కుమనేటంత గట్టిగా కట్టాను.

చిదం : ఐనా పారిపోయింది ఏదొంగ వెధవో ఎత్తుకు పోయాడు! దాని మానాన అదిపోయి ఉంటుందని నేను అనుకోను. నిన్న పత్రికలవాళ్ళకు ప్రకటన యిచ్చాను. పోలీసు స్టేషన్లో గంటసేపు కూచున్నాను. ఊరంతా వెతికాను. కనిపించిన స్నేహితులందర్నీ అడిగాను. మాకు తెలీదంటే మాకు తెలీదనేవాళ్ళేగాని 'చూచాం ' అని ఓఖ్కడనలేదు ఇంకెందుకూ వెధవ స్నేహితులు?

సీను : పోలీసులు ఏమన్నారండీ?

చిదం : నీమొహం అన్నారు. 'మీకుర్రాడిచాత వెదికించండి ' అన్నారు. నువ్వు వెతికి దాన్ని వాళ్ళకు వప్పజెప్తే అప్పుడు నాచేతికిచ్చి 'మేమే పట్టుకున్నాం ' అని గొప్పగా చెప్పుకోటానికి కాబోలు! 'మీకుక్క ఏదన్నా దొంగతనం చేసిందా?' అని వోపోలీసు అడిగాడు. 'లేదు ' అన్నాను. 'ఐతే మాకేం సంబంధం లేదు దొంగతనం చేస్తే పట్టుకునే బాధ్యత మాది ' అంటాడు. ఇంకోడు 'ఎవర్నన్నా చంపి పారిపోయిందా?' అంటాడు. నా మొహం! అది కరవనే కరవదంటున్నావు నువ్వు! అది దొంగతనం చేసి పారిపోయుంటేనూ, ఎవర్నన్నా హత్యచేసి పారిపోయుంటేనూ, వాళ్ళు నిమిషాల మీద వెళ్ళి పట్టుకుని ఉందురట! 'మోసగాళ్లను కూడా పట్టుకుంటారుకదా మీరు? అని అడిగాను. 'ఓ ' అన్నారు. ఐతే నాదగ్గర నమ్మకంగా ఉంటూ, నన్ను మోసంచేసి ఓ కుక్కపిల్ల పారిపోయింది. పట్టుకోమన్నాను. నన్నుచూసి వాళ్ళంతా ఒకటే నవ్వూ! 'కుక్కపిల్లల్ని కూడా మేమెక్కడ వెతగ్గలం? అంటాడు ఒకడు. నాకు వళ్ళుమండి 'కుక్కపిల్లను వెతికి పట్టుకోడంకూడా మీకు చాతకాదు-పోండి ' అని వాళ్ళ మొహంమీద అనేసి పారిపోయొచ్చాను.

సీను : మీ వెనకాల పరుగెత్తి రాలేదు సార్ పోలీసులు?

చిదం : ఏమో! గభాలున ఆపక్కనే ఓ సందుంటే అందులో దూరిపోయాను.

సీను : మంచిపని చేశారుసార్! లేకపోతే ఏమయి పోయారోనని మిమ్మల్నికూడా వెతుక్కునే స్థితికి వచ్చేవాడిని!

చిదం : నిన్న రాత్రంతా ఒకటే కల! దాన్ని ఎవరో ఎత్తుకుపోయినట్టూ! కొడుతున్నట్టూ! పెద్ద పెద్ద కుక్కలన్నీ దాన్ని కరుస్తున్నట్టూ! అబ్బ భయంవేసిందిరా! పాపం ఇప్పుడెక్కడుందో, ఏంచేస్తోందో చిన్న వెధవ ఎవడన్నా తిండి పెడుతున్నాడో లేదో కుంయ్ కుంయ్ మని మూలుగుతుందిగాని మాటాడ లేదుకదా నోరులేని జీవం!

సీను : సార్! ఆమధ్య మీస్నేహితుడొకాయన అడిగారు కదండీ?

చిదం : అవును అడిగాడు లక్షమంది అడిగారు ఏం?

సీను : ఆయనగాని

చిదం : అబ్బే! కుక్కను ఎవడు ఎత్తుకుపోతాడ్రా? ఈ యింట్లో దానికి స్వతంత్రం లేదనో, ఇక్కడ సుఖం లేదనో అర్ధరాత్రివేళ పారిపోయుంటుంది. ఎవరికన్నా దొరకదా? అన్నట్టు పత్రికలో ప్రకటన వేశారా?

సీను : వేశారుసార్ మీరురాగానే చూపిద్దామనుకున్నాను. మరిచేపోయాను. (పత్రికతెచ్చి యివ్వబోయాడు)

చిదం : నువ్వే చదువు.

సీను : (చదువుతూ) 'కుక్కపిల్ల కనబడుటలేదు. తెల్లని రంగూ, కోలముఖమూ, కుచ్చువంటి పొట్టి తోకా గల కుక్కపిల్ల కనబడుటలేదు. మెడలో తోలు పటకా యున్నది. వెతికి తీసుకువచ్చిన వారికి నూటపదహారు రూపాయలు బహుమానమిచ్చెదను. జి.డి.యస్.చిదంబరం..."

చిదం : (ఆపుతూ, ఏమిటేమిటేమిటి...మళ్ళీ చదువు. సీను మళ్ళీ చదివాడు. చిదంబరం జాగ్రత్తగా విన్నాడు) 'కుక్కపిల్ల కనబడుటలేదు ' మళ్ళీ చదువు సీను గడగడా చదివి, చిదంబరంకేసి చూసి మళ్ళీ మొదలెట్టబోయాడు. చాలుచాలు మరి చదవఖ్కర్లేదు ఆ ప్రకటన చాలు. నూటపదహారు రూపాయిల బహుమతికోసం ఎవడన్నా వెతుకుతాడు!

సీను : కుక్కపిల్ల ఖరీదు అందులో నాలుగోవంతు ఉంటుందాసార్?

చిదం : పోరా వెర్రిమొహం నూటపదహారు కాదు రెండు నూటపదహార్లిస్తే మాత్రం అటువంటి కుక్కపిల్ల మనకు మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? మన అడ్రసంతా 'క్లియర్ 'గా వుందా పేపర్లో?

సీను : వుందిసార్

చిదం : చూద్దాం నాలుగురోజులు ఓపికపడదాం కాస్త కాఫీ తీసుకొచ్చి యిస్తావూ?

సీను : నిన్నట్నుంచీ కాఫీమాటే మరిచిపోయారుసార్ మీరు.

చిదం : నిన్నట్నుంచీ ఆ కాఫీ అందులోనే అట్లావుందా యేమిటి?

సీను : అబ్బే నిన్నటిది అప్పుడే ఐపోయిందిసార్. ఆహాఁ చెబుతున్నాను మీకు ఎంత మనస్తిమితం లేకుండా పోయిందోనని!

చిదం : కాదురామరీ కుక్కపిల్ల ఐతేమాత్రం మనింట్లో ఓ పిల్లగావుంటూ మనచెంత తిరుగుతూ మనం అంటే ప్రాణం పెట్టే పిల్ల కనిపించకపోతే మనస్తిమితం వుండకపోవటం యేమిటి-పిచ్చేఎత్తాలి! (కాఫీ తాగుతున్నాడు.)

సీను : (సంశయిస్తూ) సార్

చిదం : ఏమిట్రా?

సీను : ఏంలేదుసార్ చిన్న కోరిక

చిదం : కోరికా! కోరికలడిగితే తీర్చేదేవుణ్ని అనుకుంటున్నావేమిట్రా తీరా ఎదుట ప్రత్యక్షమయితే దేవుడే తీర్చడు! అడుగు.

సీను : ఏంలేదుసార్ మా నాన్న రెండోపెళ్ళి చేసుకుంటాడట వో వందరూపాయలిప్పించాలి సార్

చిదం : ఏమిటీ! మీ నాన్న రెండో పెళ్ళి చేసుకుంటే నేను వందరూపాయలివ్వాలా? మీ నాన్నకు రెండో పెళ్ళేం అఖ్కర్లేదు వూరుకోమను!

సీను : అదికాదుసార్ నా జీతంలో విరక్కోసుకుంటానండి!

చిదం : నాన్‌సెన్సు మీ నాన్నకు రెండోపెళ్ళి నువ్వు డబ్బెట్టి చేయిస్తావా మతి లేదురానీకు? డబుపోసి సవతితల్లిని కొనుక్కుంటావురా వెధవా?

సీను : పోనీండిసార్ మా అన్నయ్య చేసుకుంటాడు యివ్వండిసార్!

చిదం : పోరా ఇడియట్ తమాషాలు! ఐనా కుక్కపిల్లపోయి నేనేడుస్తూ ఉంటే, నీవళ్ళో వందరూపాయలు గుమ్మరించటానికి నేనేమన్నా 'బ్యాంకీ ' అనుకున్నావా వెళ్ళు అవతలకు వెళ్ళు!

సీను : పోనీండి, కుక్కపిల్ల దొరికిన తర్వాతన్నా

చిదం : ఆలోచిస్తాలే [ సీను నెమ్మదిగా బయటకు వెళ్ళాడు. పత్రికతీసి చిదంబరం ప్రకటన చూశాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. సీను బయటనుంచి వచ్చి]

సీను : ఎవరో ఒక అబ్బాయి వచ్చాడుసార్!

చిదం : మనింటికా?

సీను : అవునుసార్

చిదం : మనింటో కుర్రాళ్ళెవరూ లేరు పొమ్మను.

సీను : కుర్రాళ్లకోసం కాదుసార్ తమకోసం!

చిదం : [ఆలోచిస్తూ] నాకోసం? కుర్రాడు? రమ్మను!

అబ్బా: [సీనుతో] పిలవ్వోయ్ పిలువ్

సీను : ఎవర్నండీ?

అబ్బా : చిదంబరంగార్ని.

చిదం : నేనే - నేనే చిదంబరాన్ని. ఏం కావాలి?

అబ్బా : మీరేనా చిదంబరంగారు!

చిదం : నేనేనమ్మా ఎప్పుడూ నా ఫోటో అన్నా పేపర్లో చూడలేదా నువ్వు?

అబ్బా : మీ ఫోటోనా చూడలేదే. మీరు బ్రతికే ఉన్నారుగా ఎవరి ఫోటోలన్నా చచ్చిపోయిన తర్వాతే పేపర్లో పడతాయట. మా నాన్న గారంటారు.

చిదం : మీ నాన్నగారి పేరు?

అబ్బా : అదెందుకుగాని నేను మీతో పనుండి వచ్చాను.

చిదం : [అయోమయంగా అబ్బాయికేసి చూసి] చదువుకుంటున్నావా?

అబ్బా : స్కూల్ ఫైనల్.

చిదం : అబ్బో సరే ఐతే పాస్ అయిన తర్వాత వస్తే కాలేజిలో చేరటానికి ఒకటో రెండో సాయం చేస్తాలే. పో (తిరిగి పత్రిక చూడటంలో పడబోయాడు!)

అబ్బా : (బల్లమీద చేత్తో చరిచి) నాన్ సెన్స్! ఒకటో రెండో సాయంచేస్తారా? ముష్టెత్తుకోవడానికి రాలేదు. నాసొమ్ము నాకివతల పారెయ్యండి.

చిదం : నీడబ్బేమిటి నా దగ్గర ఉండటమేమిటి? నువ్వేమో చూస్తే వేలెడులేవు 'డబ్బు ' 'డబ్బు ' అని ఒకటే పోరేస్తున్నావు. నాకే అర్ధం కావటంలేదు.

అబ్బా : నేను వేలెడు లేకపోయినంతమాత్రాన నా డబ్బు నాకివ్వరటండీ? నేను ఎవర్ననుకున్నారు? అన్యాయంగా నన్ను మోసగిస్తున్నారని పోలీసులకు ఫోనుచేస్తాను:

చిదం : అబ్బాయ్ అబ్బాయ్ ఉండుండ్... ఆ ఫోను పనిచెయ్యదు.

అబ్బా : పనిచెయ్యదా? పని చెయ్యనప్పుడు మీకెందుకండీ అంత ఆదుర్దా?

చిదం : సీనూ, సీనూ.. నీ డబ్బిస్తాను. రా-కూచో.

అబ్బా : (కూచున్నాడు)

చిదం : చూడు, నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పావా నీ డబ్బు నీకిచ్చేస్తాను.

అబ్బా : లేకపోతే ఇవ్వరా?

చిదం : ఇస్తాలే చెప్పు. మీ యిల్లెక్కడ? కోప్పడకు, చెప్పు ఫరవాలేదు. మీ యిల్లు ఆసుపత్రిలా ఉంటుందికదూ అక్కడ కొందరు మనుషులు కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు కదూ?

అబ్బా : అర్ధమయింది. పిచ్చాసుపత్రి మాయిల్లా? అంటే పిచ్చాసుపత్రినుంచి నేను వచ్చేనని మీరు అనుకుంటున్నారా నేను పిచ్చివాణ్ణా?

చిదం : అవును, మా కుక్కపిల్లను వెతికి తీసుకొచ్చిన వారికి నూటపదహారు రూపాయలు బహుమానరూపంగా ఇస్తానని ప్రకటించాను గాని వూరికినే కాదు.

అబ్బా : వూరికినే ఇమ్మనటానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు. నానాశ్రమలూ పడ్డాను మీ కుక్క పిల్లను వెతికాను తీసుకొచ్చాను.

చిదం : తెచ్చావా ఏదీ ఆమాట మొట్టమొదటే చెప్పలేదేం? ఏదీ ఏదీ నా కుక్కపిల్ల?

అబ్బా : తెస్తాను ముందు నాకు మాటివ్వండి.

చిదం : ఏమని?

అబ్బా : నా డబ్బు నాకు అనా పైసలతో సహా వెంటనే ఇస్తానని!

చిదం : ఎందుకివ్వను బాబూ! తప్పకుండా ఇచ్చేస్తాను. కుక్కపిల్లను తీసుకురా.

అబ్బా : ఇదిగో ఇదిగో మీ కుక్కపిల్ల!

చిదం : ఇదా! ఇది నా కుక్కపిల్ల కాదు!

అబ్బా : కాదూ ఆ మాట అనొద్దని మొదటే చెప్పాను. తప్పించుకోటానికి ఎత్తులు వెయ్యకండి. నన్ను కుర్రాడిని చేసి నాటకం ఆడారంటే జాగర్త! ఎంత కష్టపడ్డాను దీన్ని వెతకటంకోసం? తిండి, నిద్ర, చదువూ అన్నీ మానేశాను. మా నాన్నగారు తిడుతూ ఉన్నాసరే, యెండలో బయల్దేరి వూరంతా తిరిగి పట్టుకున్నాను. ఇది మీది కాకుండా యెట్లావుంటుంది? తీసుకుని డబ్బివ్వండి. నేను త్వరగా వెళ్ళాలి.

చిదం : అబ్బాయ్ కుక్కపిల్ల ఏదో ఒకటి తీసుకొస్తే డబ్బిస్తానని నేనేం రాయలేదు. నా కుక్కపిల్ల రంగువేరు, జాతివేరు. ఎబ్బే అది ఇట్లా ఇంత అసహ్యంగా ఉండదు!

అబ్బా : మరి తిండీ తిప్పలూ లేక ఎండలో మాడితే అసహ్యంగాకాక ఎట్లా ఉంటుంది! నేను ఎండలో తిరిగి ఇంటికిపోగానే మా నాన్నగారూ ఆమాటే అన్నారు, కొట్టబోయారుకూడా!

చిదం : బాబూ! నువ్వుచూస్తే భూమికి జానెడు లేవు. నీ మాటలూ, నీ చేష్టలూ చూస్తుంటే నాకు మతి పోతోంది. నువ్వు వెళ్ళు. కుక్కపిల్లను కూడా తీసుకువెళ్ళు. ఎక్కడ తెచ్చావో అక్కడే వొదిలెయ్యి.

అబ్బా : సరేనండి. ఐతే! ఈ మాత్రందానికి ప్రకటనలు వేసి మోసంకూడా ఎందుకు చేశారు? వెళుతున్నాను. ఈ కుక్కపిల్లను దాని తల్లిదగ్గర ఒదిలి పెట్టాలంటే నేను నానా శ్రమా పడాలి. మంచి బాగానే చేశారు థాంక్స్ పోనీండి కాలేజిలో చేరాక వస్తే ఒకటో రెండో సహాయం చేస్తానన్నారు అప్పుడోస్తే అదన్నా యిస్తారా ఇట్లాగే పొమ్మంటారా?

చిదం : లేదు లేదు తప్పకుండా యిస్తాను, ఇప్పుడు వెళ్లు,

చిదం : ఒరే సీనూ సీనూ వెధవ ఎక్కడ చస్తున్నాడో సీనూ!

వ్యక్తి : ఈ యింటికి యజమాని మీరేనా

చిదం : ఆహా సాక్షాత్తూ ఈ యింటికియజమానిని నేనే, ఏం సెలవు.

వ్యక్తి : ఎబ్బే ఓ చిన్న పనిమీద వచ్చాను.

చిదం : చెబుదురుగాని ఉండండి. ఏం పనిమీద వచ్చానంటారు?

వ్యక్తి : ఈ యిల్లు ఏ సంవత్సరంలో కట్టారండి బయట చాలా హొప్లెస్‌గా ఉంది. అరె, సీలింగ్ అంతా పూర్తిగా పాడయిపోయింది!

చిదం : పాడయితే పాడవనివ్వండి. ఈ యింటిని మీకు నేనేం ధారదత్తం చేసెయ్యటంలేదు!

వ్యక్తి : అందుక్కాదండి ఇంట్లో కాలుపెట్టిన తర్వాత ఇల్లు కలల్లాడకపోతే ఎందుకు చెప్పండి! ఈ వూళ్ళో చాలా ఇళ్లు చూశాను. వట్టి మురికి కూపాలు. మళ్ళీ మహా మహా ఇంజినీర్లు కట్టిన యిళ్ళూ, వేలూ లక్షలూపోసి కట్టించిన ఇళ్ళూ! ఇల్లు కట్టించిన మర్నాటికే ఇంటికి పూసిన రంగంతా వెలవెలా పోటం ప్రారంభిస్తుంది. ఇంట్లో ఎక్కడచూసినా సున్నం రాలి పోతూఉంటుంది అడుగున అంతా బీటలు వారిపొతూవుంటుంది. అదంతా కట్టేవాళ్ళల్లో ఉంటుందండీ ఇంజినీర్లు ఏంచేస్తారు పాపం! వాళ్ళంతా జాగ్రత్తగానే ప్లాన్ వేసి కట్టిస్తారు ఏంలాభం! కట్టిన తాపీపని వాళ్ళు సరిగ్గా పని చెయ్యరు. వీళ్లు సరిగ్గా కట్టాలిగాని ఇంజినీరు ఏంచేస్తాడు? "ఇల్లు కట్టిన ఇంజనీరు కాడోయ్ దానికి ఇటికలు పేర్చి, తాపీచేసిన పనివాడెవ్వడు? అని మా స్నేహితుడొకరు గేయాలు రాశారు. అంచాత చెప్పూద్దూ పనివాడిలో పస ఉండాలి. లేకపోతే మీ యిల్లులాగానే తయారవుతుంది.

చిదం : ఇంతకూ మీరెవరో, ఏం పనిమీద వచ్చారో చెప్పారుకాదు.

వ్యక్తి : నేను ఇళ్ళకు మైనర్ రిపేర్స్ చేయించే కాంట్రాక్టర్నండి. నా కింద అమోఘమయిన పని చెయ్యగలిగినవాళ్లు నలభై మంది ఉన్నారు. ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడేం కట్టించాడండీ వారధి? ఐదునిమిషాల్లో మావాళ్ళు అటువంటివి తొంభై తొమ్మిది కడతారు, చూస్తారా!

చిదం : ఐతే ఏమంటారు మీరు?

కంట్రా : అనటానికేముందండి! మీ యింటికి అవతల వీధిలోఉన్న రేణుకమ్మగారి యింటిని మరమ్మత్తు చేశాం, వాళ్ళింటి ప్రక్కౌన్న రాజారావుగారి యిలూ చేశాం. తర్వాత చైర్ మన్‌గారు వళ్లూ ఆర్డర్లుచ్చారు.

చిదం : అఖ్కర్లేదులెండి ఆఁ మీరు కేవలం ఇళ్ళే మరమ్మత్తు చేస్తారా ఇంకేమన్నాకూడా మరమ్మత్తు చేస్తారా?

కంట్రా ఇళ్లూ, భవనాలూ, వంతెనలూ, రోడ్లూ, సైడు కాలువలూ...

చిదం : ప్రస్తుతం నా మెదడు చాలా ఒడిదుడుకుల్లో ఉంది. దాన్నేమన్నా మరమ్మత్తు చేయగలరా?

కంట్రా : చంపేశారు మీరట్లా అడిగితే నేనేం చెప్పేది? దాన్ని రిపేర్ చెయ్యటానికి ప్రత్యేకం హాస్పిటలూ, డాక్టర్లూ ఉంటారుగాని...

చిదం : ఐతే ఓ గొడ్డలి తీసుకుని ముందు నా యిల్లంతా ఇవాళ పగలగొడతాను. మీరు రేపురండి గోడలన్నీ ఎంత పాలిపోయివున్నాయో! ఎంతో అవదు. చాలా చిన్నమొత్తం! రోజుకు మీకయే కాఫీఖర్చు.

చిదం : నాకు రోజుకయే కాఫీఖర్చు రెండణాలు. ఇదిగో తీసుకుని చెయ్యవలసిన మరమత్తేదో చేసుకోండి!

కంట్రా : చాలా విచిత్రంగా చూశాడు.

చిదం : మీకు పత్రికలు చదివే అలవాటులేదా?

కంట్రా : చంపారు! న్యూస్ పేపర్ చదవటం నాకో వ్యసనం లాంటిది. ఏ రోజు పేపర్ లేకపోయినా మరి నాకు నిద్రపట్టదు.

చిదం : చూడండి పేపర్ చదివితే కేవలం మీ రాజకీయాలేకాదు ఇతర ప్రకటనలు కూడా చూడాలి. ఈరోజు పేపర్లో ఓ ప్రకటన ఇచ్చాను. మా యింట్లో ఓ పిల్లలాగ తిరుగుతూ నా ప్రేమకు పాత్రురాలయిన నా కుక్కపిల్ల 'రోజా' కనిపించకుండా పోయింది. నాకు మతికూడా పోయింది. అది దొరికేదాకా నాకు తోచదు. వెతికి తీసుకువచ్చినవారికి నూటపదహారు రూపాయల బహుమానం యిస్తానని ప్రకటన వేశాను.

కంట్రా : బహుమానంకోసం కాదు కానీండి నేనూ ప్రయత్నిస్తానండి. ఎక్కడ కనిపించినా తీసుకొచ్చి మీకొ వప్పజెబుతాను. గుర్తులన్నీ తెలిశాయి కదా ఆ మధ్య యిట్లాగే మా అబ్బాయి తప్పిపోయాడు. పేపర్లో ప్రకటన వెయ్యలేదుగాని దొరిగాడు. దొరుకుతుందండీ మనసొమ్ము ఐనతర్వాత మనకు దక్కకుండా పోతుందా!

చిదం : సొమ్ము అంటారేమిటి? అది నా ప్రాణంతో సమానం. మీకు కనిపిస్తే మాత్రం తీసుకొచ్చి వప్పజెప్పండి మీ మేలు మరిచిపోను.

కంట్రా : ఎంతమాటన్నారండి ఇందులో పెద్దమేలు ఏముంది? పనికట్టుకునికూడా వెతుకుతాను నన్ను వెళ్ళమంటారా?

చిదం : చిత్తం మీరు వెళ్ళండి. కుక్కపిల్ల దొరికిందనగానే ఎట్లాగూ పండగచేస్తాను. ఇంటి రిపేర్ చేయించక తప్పదు. అంతవరకూ మాత్రం నన్ను

బాధపెట్టకండి. ఇన్నాళ్ళూ లేనిది ఈ రెండురోజుల్లోనూ ఈ కొంప కూలిపోతుందనే భయం నాకేం లేదు!

కంట్రా : సరే, వస్తానండి. కాని రిపేర్స్ చేయించడం వల్ల లాభం మీరే తెలుసుకుంటారు.ఎంతో అవదు మీకు! ఒకవేళ కర్మంచాలక మీ కుక్కపిల్ల దొరక్కపోయినా ఇల్లు మరమ్మత్తు చేయించటం మాత్రం మరిచిపోకండి. అది కాకపోతే వెధవది మరోకుక్కను కొనుక్కుంటాంగాని కలకాలం నిలబడాల్సింది 'ఇల్లు!'

చిదం : చేయిస్తానని చెప్పానుగదండీ! మీరు మరీ ఇన్సూరెస్నువాళ్ళల్లాగ నా ప్రాణాలు తీసేస్తే నాశక్యమా? చేయిస్తాను. ఈ ఒక్కయిల్లేనా మరో నాలుగయిదిళ్లు చేయిద్దాం!

కంట్రా : సెలవు. (వెళ్ళి, మళ్ళీవచ్చి) మీ రోజా డీటైల్స్ చెప్పండీ కొద్దిగా! (చిదంబరం పత్రిక యిచ్చాడు. కంట్రాక్టరు చూసుకొని "రైట్" అని వెళ్ళాడు.)

చిదం : (అటూ యిటూ చూసి ఫోన్ తీసి) హలో...ఆఁ...నేను చిదంబరాన్ని మాటాడుతున్నాను. ప్రయత్నించమని చెప్పు ప్రయత్నించమనీ చెప్పూ దాని ఫోటో లేదయ్యా నేనూ అదీ కలిసి తీయించుకున్నది ఒకటుందిగాని నా మొహం కనిపిస్తున్నంత బాగా అది కనిపించటం లేదు. అది పనికిరాదులే ఐనా ఫోటో ప్రకటించాలిసిన అవసరంలేదులే. వివరాలన్ని పూర్తిగా ఇచ్చాంగా-ఆఁ...అందుకే పిల్చాను ఏం భోజనం నా మొహం! వుంటాను మరి! (రిసీవర్ పెట్టాడు. సీను వచ్చాడు.) దొరికిందా సీనూ?

సీను : వీధిలో పోతున్న కుక్కపిల్లలన్నిటినీ పట్టి పట్టి మరీ చూశాను సార్ దేనికీ మన రోజా పోలికలన్నా లేవు!

చిదం : ఏం అదెందుకు?

సీను : అందాకా దాంతోనన్నా కాలక్షేపం చెయ్యొచ్చుగదా అని.అదీగాక, కుక్కపిల్ల లేక పోతే నాకీ యింట్లో పనివుండదు. అది లేదని ఉద్యోగం లాగేసి పొమ్మంటారని నా భయం!

చిదం : నీకాభయం ఏమీ అఖ్కర్లేదు. ఏం, ఇవాళ కాకపోతే రేపటికన్నా దొరకదా?

చిదం : దొరక్కపోతే మాత్రం నాకోసమన్నా ఓపిల్లను కొనాలి సార్!

చిదం : నోరుముయ్యరా. మన పిల్ల మనకు దొరక్క ఏమవుతుంది?

సీను : దొరుకుతుందండీ దొరికినదాకా నాకు మరి మతి బాగుపడదు. ఏదో వాగేస్తూంటాను ఆ మతిమరుపువల్ల. కోప్పడకండి సార్!

చిదం : అవునురా ఆ ప్రేమ అట్లా అనిపిస్తుంది. అన్నట్టు యిందాక ఓ కుర్రాడొచ్చాడు చూశావా వాడో నల్లటిపిల్లను లాక్కొచ్చి, నా యెదాన్నికొట్టి "ఇదే నీ కుక్కపిల్ల తీసుకో తీసుకొని నా డబ్బు నాకివ్వు" అని ఒకటే గోల పెట్టాడు.

సీను : పోనీ అందాకా దాన్నన్నా తీసుకున్నారు కారు!

చిదం : నీ మొహం! దాన్ని చూస్తే డోకొచ్చింది. అసహ్యంగా ఉంది. వాడెవడో దేవాంతకుడులాగ ఉన్నాడు. చూట్టానికి పదిహేనేళ్ళన్నా లేవు. కబుర్లు మాత్రం ఆకాశానికంటేటట్టు చెప్పాడు. తను చాలా శ్రమపడి వెతికి తీసుకొచ్చాట్ట పో పొమ్మన్నాను.

సీను : మంచిపనిచేశారు. నాతో చెప్పారు కారు ఒకటిచ్చుగుని బయటకు తోసేద్దును.

చిదం : పోనీ, పోయాడులే. నేను మరొక్కసారి అట్లా బయటకుపోయి చూసి వస్తాను. నువ్వు జాగ్రత్తగా కుక్క కాసినంత జాగర్తగా యిల్లు చూస్తూవుండు. ఎవరన్నా నాకోసంవస్తే ఉండమని చెప్పు.

వచ్చిన మనిషి : మీరేనండీ చిదంబరంగారు?

చిదం : నేనే.

ఆయన : నమస్కారం, నాపేరు కోదండ. నేను తమతో పనిఉండి వచ్చాను.

చిదం : తమరు యిళ్ళకు మేజర్ రిపేర్స్ చేయించే కంట్రాక్టరా లేక ఏ కంపెనీకన్నా ఏజెంటా?

ఆయన : క్షమించండి, నేను ఒకాసుపత్రిలో కాంపౌడరు ఉద్యోగం చేస్తున్నాను.

చిదం : ఏ ఆసుపత్రిలో?

కోదం : ప్రయివేట్ హాస్పిటల్ లెండి. డాక్టరు రమేష్ గారికి కుడిభుజం వంటివాడిని.

చిదం : నేను మీ డాక్టరుదగ్గిర ఎప్పుడూ మందు తీసుకోలేదు. మీ బిల్లులు నేనేం ఇవ్వఖ్కర్లేదు. నాకు పనుంది, వస్తా

కోదం : బావుందండీ. కాపౌండర్లెంతసేపూ బిల్లులు వసూలు చెయ్యటానికే వస్తారనుకుంటున్నారేమిటి? ఐనా, నారాక వేరు. నేను వేరే పని మీద వచ్చాను. వూరికే మీకు తెలియాలని నా ఉద్యోగం చెప్పాను.

చిదం : ఆపనేమిటో త్వరగా తెల్పండి. అవతల నాకో అర్జంటు పనివుంది.

కోదం : ఇటువంటి పరిస్థితుల్లో అర్జంటు పనేమిటండీ? ఓ మూల కుక్కపిల్ల పోయిందని ప్రకటన ఇచ్చారు గదా ఇంకోమూల విచారంతో క్రుంగిపోవలసిన సమయంలో మీకు అర్జంటుపనా?

చిదం : నా ప్రకటన చూశారా యేమిటి? నిజమే విచారంతో బాధపడుతున్నాను. ఏంచెయ్యను? ఇప్పుడు అర్జంటుపనంటే అదే. ఆపనిమీదే వెళ్తున్నాను.

కోదం : శునకాన్వేషణే అన్నమాట! అక్కర్లేదు. మీరింక బయటకు పోనక్కర్లేదు. మీ కుక్కపిల్ల మీకు లభిస్తోంది.

చిదం : యేమిటీ మీకు జ్యోతిషం కూడా తెలిసినట్లుంది. దయచెయ్యండి కూచోండి.

కోదం : జ్యోతిషం కాదండి యదార్ధమే! మీ కుక్కపిల్లను అతి శ్రమపడి వెతికి, విసికి వేసారి తిరిగి వెతికి వెతికి పట్టుకుని తీసుకొచ్చాను.

చిదం : ఏదీ?

కోదం : కుక్కపిల్ల ఇంట్లో ఎందుకుంటుందీ బయట దాని చోటులో అది కట్టబడువుంది.

చిదం : నిజంగా! సీనూ, వెళ్ళి తీసుకురా, చాలా థాంక్స్. మీ ఋణం తీర్చుకోలేను.

చిదం : (చెక్కు పుస్తకం తీసి) మీ పేరు!

కోదం : యం.కోదండం.

చిదం : యం.కోదండం (రాయబోయాడు.)

సీను : సార్ సార్, మన రోజా కాదుసార్ యిది!

చిదం : ఆఁ!

సీను : చూడండి. ఇదేదో చవటకుక్క. వీధిలో తిరిగే వట్టి చెత్తరకం.

చిదం : ఎంతపని! ఇది నాది కాదండి!

కోదం : ఏమన్నారు మీరు పేపర్లో తెల్లనిరంగూ, కుచ్చువంటి పొట్టి తోకాగల కుక్కపిల్ల అన్నారు. ముఖం కోలగా ఉంటుందన్నారు. దీని మొహం ఏమన్నా గుండ్రంగా ఉందా? తెల్లనిరంగు అన్నారు, కుక్కపిల్ల తప్పిపోయిన సమయానికి అది తెల్లగానే ఉండేది. ఈ ఎండల్లో తిరిగితిరిగి నల్లబడిపోయింది. కుచ్చువంటి పొట్టి తోక అన్నారు. పొట్టీతోక కాక ఇదేమన్నా పొడుగు తోకా? కుచ్చు అంటారా అది నాతప్పేలెండి ఏమిటో నాకు నచ్చక కత్తెరతో కత్తిరించిపారేశాను కావాలంటే ఆ... (జేబులు తడుముకున్నాడు)

సీను : మారోజా మెళ్లో బెల్టు ఉండాలి.

కోదం : బెల్టు ఉంటుందటయ్యా వీధిలోకొచ్చిన కుక్క మెడలో? అదెవడు కొట్టేశాడో! పోనీండి బెల్టుధర ఆరణాలు, ఆ ఆరణలౌ కొట్టేసుకొని, నూటపదేను రూపాయల పదీణాలూ ఇప్పించండి ఏం చేస్తం! దానిగురించి నేను పెట్టిన ఖర్చు ఎట్లాగూ ఆడగలేదు!

చిదం : చూడండి కోదండంగారూ నా కుక్కపిల్ల కోసం నేను నానాశ్రమ పడుతున్నాను. అది దొరికిందంటే నాక్ పరమానందమవుతుంది. నేను ప్రమాణంచేసి చెబుతున్నాను, ఇది నా కుక్కపిల్లకాదు. మీరు లక్ష చెప్పండి. కోటి చెప్పండి దాన్ని పెంచి పెద్దచేసిన మా సీను గాడు వీడే సాక్ష్యం.

కోదం : అయ్యా మీరు 'కాదు ' అని కొట్టిపారేస్తే నేనేం చేసేది? మీరు పత్రికలో ప్రకటన వెయ్యగానే చూశాను. ఆసుపత్రీ, డాక్టరుగారు, పేషెంట్లూ అందర్నీ వొదిలి వూరిమీద పడ్డాను. ప్రతి చోటా చూశాను. తోటలూ, వీధులూ, పార్కులూ, రోడ్లూ అవీ ఇవీ ఒకటేమిటి! ఇంటింటికీ తిరిగాను. ఆ తిరగటంలో ఎంత శ్రమపడ్డానో మీకు నోటితో చెబుతే తెలీదు అంత శ్రపడ్డాను. అవతల డాక్టరుగారు తిడుతున్నా, పేషెంట్సు ఏడుస్తున్నా, నా ఇంట్లో నాభార్యా పిల్లలు నాకోసం కలవరిస్తున్నా అవన్నీ లక్ష్యపెట్టక పరోపకారబుధ్ధితో కేవలం పరోపకారబుద్ధితోనే ఎండనక వాననక తిరిగాను. మీరే ఆలోచించండి. దారిలో ఓ లక్షపిల్లలు కనిపించినై, అవేవీ మీవికావు. ఆమాత్రం పోలిక పట్టలేనా ఎంత కాంపౌండర్నయితే మాత్రం! ఆఖరుకు పట్టుకున్నాను.

చిదం : బాగా పోలిక పట్టారు! నా కుక్కపిల్ల కోసం మీరు పడిన శ్రమను నేను మరచిపోను. ఈ కుక్కపిల్లను తీసుకువెళ్ళండి ఇది మాత్రం నాదికాదు! నా కుక్కపిల్లను తీసుకురండి నిమిషాలుమీద సొమ్మిచ్చేస్తాను.

కోదం : ఏమండోయ్! ఇదేం మర్యాదగా లేదు. మిమ్మల్ని మోసగించి మీ దగ్గర డబ్బెత్తుకు పోవాలనే చచ్చు ఉద్దేశంతో వచ్చాననుకుంటున్నారా? కావలిస్తే మీకు కావలసినంత డబ్బు గుమ్మరిస్తాను. పోనీగదా అని పనీ పాటూ మాని, ప్రాణంపోతున్నా లక్ష్యపెట్టక కుక్కను వెతికి తీసుకొస్తే కాదు పొమ్మని కొట్టి పారేస్తారా? ఇదేనా పెద్దమనిషితరహా?

చిదం : ఇది నాకుక్కపిల్లకాదు మహప్రభో నీకు శతసహస్ర నమస్కారాలు వెళ్ళు. కుకపిల్ల దొరక్క నానాబాధా పడిపోతున్నాను. నా రోజా ఐతే తీసుకోటానికి నాకేం తెగులా? నిక్షేపంగా తీసుకుంటాను. వెళ్ళు వీలయితే నా రోజాను తీసుకురా?

కోదాం : ఏమండోయ్ ఇక లాభంలేదు. అంతా దగా. మోసం! మీ మీద పోలీసు రిపోర్టు ఇస్తాను.

చిదం : ఏమని ఇస్తారు రిపోర్టు?

కోదం : ఏమని యిస్తాను? ఫలానా చిదంబరం అనే ఆసామీ కుక్కపిల్లను వెతికి తీసుకొస్తే నూట పదహార్లు యిస్తామని ఆశపెట్టి తీరా తీసుకొచ్చాక డబ్బివ్వక అల్లరి పెట్టాడని. తెలిసిందా?

చిదం : ఇవ్వవయ్యా ఇవ్వు రిపోర్టు ఇచ్చుకో. అదిగో ఫోన్ వూఁ చెయ్యి ఫోన్ చెయ్?

కోదం : క్షమించండి బీదవాణ్ణీ. దీన్ని వెతకటంకోసం నాకింత డబ్బు ఖర్చయింది. శ్రమమాటకేం తమరాఖర్చులు యిప్పించారంటే...

చిదం : బావుందయ్యా ఒక వేళ అది నా కుక్కపిల్ల ఐనప్పటికి నేనా ఖర్చు ఇవ్వను గదా కాకుండా ఖర్చు కుడా ఇవ్వాలా! వెళ్ళువెళ్ళు నన్ను మరి విసిగించకు!

కోదం : మీకో నమస్కారం పెడతాను! పిల్లలుగలవాణ్ణి. ఎదిగిన పిల్లకు పెళ్ళి చెయ్యాలి రెండో వాడు చదువుకుంటున్నాడు మూడోపిల్ల...

చిదం : ఉద్ధరిస్తోంది! నా దగిర 'పంచ ' ప్రాణాలున్నాయ్. నీక్కావలంటే ఒకటో రెండో పట్టుకుపో గాని నన్ను వేధించకు!

కోదం : అమ్మమ్మమ్మ ఎంత మాట ఎంత మాట! వెధవ డబ్బుకోసం ఈ ప్రాణం తీస్తానా?

చిదం : ఇంకా ఏం తియ్యాలయ్య రామచంద్రప్రభో! ప్రాణం పట్టుకు పోయేముందు యమకింకరులన్నా 'ఇంత ' బాధ పెట్టర్రా బాబూ! ముక్కకు ముక్క చొప్పున కొరుక్కు తినేస్తున్నావ్.

కోదం : మీకు ఇంత బాధ కలిగిస్తున్నానని నేను అనుకోలేదు. ఆఖరుసారిగా మనవి చేస్తున్నాను. ఒక్క పాతిక రూపాయలిప్పించారంటే..

చిదం : అబ్బబ్బబ్బ సీనూ... సీనూ...! వెళ్ళ వయ్యా వెళ్ళు. పాతికరూపాయలు కావాలా, ఎక్కడన్నా ఎత్తుకొచ్చి యిస్తాను. వెళ్లు. నమ్మకం చాలకపోతే ఈ రాత్రి నాతో కూడారా.

కోదం : పోనీ ఇరవై రూపాయలన్నా ఇప్పించండి.

చిదం : ఇదేం కర్మం వచ్చిందిరా ఇవాళ భగవంతుడా? వెళ్తావా పోలీసుకు ఫోన్ చెయ్యమన్నావా? చెప్పు.

కోదం : నన్ను చంపెయ్యకండి. మీ సహాయం మరిచిపోను. పిల్లలుగలవాడిని. మీకేం తోస్తే అదిప్పించండి. మీకు జన్మ జన్మాలు బానిసనై పడివుంటాను. అనవసరంగా నాకు ఖర్చుపోయింది. ఎట్లా చెప్పండి. అది నేను మళ్లీ సంపాదించాలంటే నాతరం కాదు. కటాక్షించండి. మీకేం తోస్తే అదిప్పించండి. వెంటనే వెళ్ళిపోతాను.

చిదం : వెంటనే పోతావుగదా!

కోదం : ఒక్క నిమిషంకూడా మరి నిలబడను!

చిదం : [పర్సుతీసి ఐదురూపాయలనోటు యిస్తూ] మాట్లాడకుండా ఇది తీసుకుపో మరింకేమీ వేధించకు వెళ్ళు, మరేం బేరం సారంచెయ్యకు వెళ్ళు వెళ్లు..

కోదం : కానీండి ఏం చేస్తాం.. సెలవు

చిదం : నీ కుక్కపిల్లనుకూడా తీసుకుపో. మరచేపోయి ఇక్కడ వదలి పెట్టేవు గనక!

కోదం : అదెక్కడ దొరికిందో అక్కడే వొదిలిపెట్టాలంటే నాకు మళ్లీ పదిరూపాయల ఖర్చు ఈ ప్రక్క వీధిలో పారేస్తాను.

చిదం : ఏదో ఏడువ్ ష్ రామ రామ ఒరే సీనూ సీనూ వాడు పోయాడా?

సీను : పోయాడుసార్, కుక్కపిల్లను తీసుకునే పోయాడు సార్.

చిదం : ఇంతసేపూ నువ్వెక్కడ చస్తున్నావ్?

సీను : చావటం ఖర్మం ఏమిటండీ అవతల కూచుని కుక్కపిల్లను ఆడిస్తున్నాను.

చిదం : ఆ వెధవ కుక్కనే!

సీను : ఏదోఒకటి అలవాటయిపోయింది సార్ కుక్కతో ఆడుకోవటం!

చిదం : చూశావా! వూరిమీద తిరిగి తిరిగి, ఆ దిక్కు మాలిన కుక్కపిల్లను తీసుకొచ్చి మనదేనంటాడు ఆ వెధవ! కాదురా పోరా యమధర్మరాజా అంటే ప్రాణాలు పీక్కుని తిని ఐదురూపాయాలు పట్టుకుపోయాడు!

సీను : మీరు మరీనండి! ఆ మాత్రందానికి ఐదు రూపాయలిచ్చేశారా! పెళ్ళికోసం అడిగితే లేదన్నారు!

చిదం : ఇస్తానన్నాను కాదురా ఇస్తానులే (తలుపుతోసుకుని భీకరంగావున్న మనిషి ఒకడు వచ్చాడు. అతనిపేరు చతుర్భుజం. చేతిలో కుక్కపిల్ల ఉంది. దానితోకకు గుడ్డ ముక్క చుట్టబడూంది. రక్తం కారిన మరకలు ఆ గుడ్డమీద కనిపిస్తున్నై.)

చతు : (కుక్కపిల్లను బల్లమీద పారేసి, సీరియస్‌గా) ఇదిగో మీ కుక్కపిల్ల ఇవ్వండి. నా నూట పదహార్రూపాయలూ వెంటనే ఇవ్వండి. (రుమాలుతో మొహం వొత్తుకున్నాడు.)

చిదం : (తెల్లబోయి చూశాడు.)

చతు : అట్లా చూస్తారేం తీసుకోండి మీ పిల్లను.

సీను : ఇది మన రోజా కాదుసార్!

చతు : నువ్వూరుకోవయ్యా నీ కెందుకూ ఇది మీ రోజా కాదు? రోజా కాకపోతే దాని 'బాబు ' త్వరగా యివ్వండి వెళ్ళాలి!

సీను : ఈ తోకకు రక్తం యేమిటి?

చతు : ఏమిటో ఎవడి నడుగుతావ్ ఏమండీ చిదంబరంగారూ ఇవ్వండి పోవాలి!

చిదం : ఎక్కడికి పోతారు?

చతు : మా యింటికి చతుర్భుజంగారిల్లు అంటే అందరికీ తెలిసిందే! కష్టపడి మీ కుక్కను వెతికి తీసుకొస్తే మర్యాదా మంచీ లేకుండా మాటాడతారేం కమాన్ నా డబ్బు!

చిదం : మీ కుక్కపిల్లను తీసుకెళ్ళండి. ఇది నాది కాదు.

చతు : ఏమిటి కాదు! మీ గుర్తులప్రకారం పొట్టితోకా. ఇదిగో పొట్టితోక!

సీను : పొడుగు తోకుంటే కత్తితో తెగేసి పొట్టి చేశాడు సార్!

చతు : నోరుముయ్యి! మనకా గతిపట్టలేదు. తిండిలేక ఆకలితో మాడిపోతూ, ఏమి దొరక్కపోతే, అదే దాని తోకలో చిన్న ముక్క కొరుక్కు తినేసి ఉంటుంది! ఇంకా నయం. నేను గనక కట్టుకట్టాను. ఆ తర్వాత తెల్లరంగు అన్నారు. మొదట్లో ఇది తెల్లగానే ఉండొచ్చు బురదలో మట్టికొట్టుకుని ఇట్లా తయారయింది.

చిదం : అసలది నా కుక్కపిల్లకాదు. తీసుకెళ్ళండి!

చతు : వాహ్వారె ఎత్తూ! మాంచి ఎత్తు ఎత్తారు! ఏదీ ఆ ఎత్తులేం మనదగ్గిర పనిచెయ్యవు. మర్యాదగా కుక్కను తెచ్చి యిస్తున్నాను. మర్యాదగా నా డబ్బివ్వండి.

చిదం : ఇవ్వకపోతే ఏం చెస్తావయ్యా తంతావా కొడతావా నరుకుతావా?

చతు : ఎందుకవన్నీ! గోటితోపోయే వ్యవహారం! మీ కుక్కపిల్లను జాగర్తగా వుంచాలి. ఎక్కడ దానిచోటు? గొలుసుతో కట్టేసి రావయ్యా అట్లా చూస్తావేం దొంగవెధవను చూసినట్లు పో ఏమండీ మాట్లాడరేం?

చిదం : కుక్కపిల్ల పోయినమాట వాస్తవమే దానికోసం నేను బెంగపెట్టుకున్న మాటా వాస్తవమే. అది దొరికేదాకా నేను భోజనం ముట్టుకోనన్నదీ వాస్తవమే! ఐతే ఇది నా కుక్కపిల్లకాదు. ఇంతకు పూర్వం ఇట్లాగే ఇద్దరొచ్చారు. అవి నా కుక్కపిల్లలు కావంటే వెళ్ళిపోయారు!

చతు : నేనట్లా పోవల్సినవాడిని కాదండి! ఈ కుక్కపిల్ల మీది కానప్పుడు నాకు ఒక్క దమ్మిడీ ఇవ్వద్దు. మీదే అని నిదర్శనాలు చూపించాను. అన్నీ సరిపొయినై మీరు నా శ్రమ వుంచుకుంటే అనుభవిస్తారు!

చిదం : ఇంకా ఎప్పుడో అనుభవించటందాకా ఎందుకు అనుభవిస్తూనే ఉన్నాను. (ఫోన్ మోగింది. చిదంబరం తీసి) ఎవరు? ఆఁ ఏఁవయ్యా లేదయ్యా! ఇద్దరు ముగ్గురొచ్చి చూపారు గాని, వాటిల్లో మనది లేదు నీకూ దొరకలేదా చేస్తానులే, భోజనమ్మాటకేం ఎట్లాగన్నా వెతికి పట్టుకో! కొద్దిగా శ్రమపడు అది లేకపోతే నాకు నిమిషం తోచదు దొరికిన వెంటనే పిలిచి చెప్పు! ఆఁ

కంట్రా : చిదంబరంగారు లేరా?

చతు : లేనట్టే

కంట్రా : అంటే?

చతు : ఉన్నా ఆయన ఎవరితోనూ ఇప్పుడు మాటాడరు. చాలా నిరుత్సాహంగా ఉన్నారు!

కంట్రా : కుక్కపిల్ల దొరకేనా?

చతు : దొరక్కేం దొరికింది!

కంట్రా : దొరికిందా?

చతు : దొరికింది!

కంట్రా : ఎట్లా దొరుకుతుంది? అదేదో ఇంకో పిల్ల ఐ ఉంటుంది. అసలు కుక్కమాత్రం అదికాదు.

చతు : ఎవరయ్యా మీరు వూరికే అట్లా మాట్లాడుతారు! అసలు కుక్క అది కాదంతే మీరేమన్నా చూశారా! అసలు యింతకూ మీరేం పనిమీద వచ్చారు?

కంట్రా : వారితో వ్యక్తిగతంగా పనుండి వచ్చాను మీరెవరో తెలుసుకోవచ్చా?

చతు : నేనా! నేనూ ఓ పనిమీద వచ్చాను. నా పని ఐన తర్వాత మీరొస్తే బావుంటుంది. అందాకా అవతల బెంచీ ఉంది చూశారా దానిమీద కూచోవచ్చు. ఏమీ అనరు!

చిదం : ఎవరిది? ఏమిటయ్యా నువ్వూ వో కుక్కపిల్లను తీసుకొచ్చావా వెళ్లు నాకేం చూపించకు!

చతు : అతను కుక్కపిల్లను తీసుకురాలేదండి!

కంట్రా : తీసుకురాలేదు ఇంకానయం!

చిదం : తెచ్చావూ వద్ధులే పో కుక్కపిల్లను నాకు చూపించకుండానే వెళ్లు.

కంట్రా : మీ కుక్కే సార్ ఇది!

చిదం : సంచిలోకూడా పెట్టావూ? తియ్యకు, నీ పుణ్యం ఉంటుంది. నా మాట వినండి. మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను వెళ్ళండి.

కంట్రా : కుక్కపిల్లను చూడనన్నా చూడకుండా వెళ్ళమంటారేమిటండీ! ఇది మీ కుక్కపిల్లేనండీ!

చిదం : అవును. నా కుక్కపిల్లే కాలవ ప్రక్కన పొర్లుతూ వుండే ప్రతీ వెధవ కుక్కా నా రోజాయే! నా రోజా కాదంటే మీకు కోపం వస్తుంది. అదంతా ఎందుకు మీరు ముందు దయచెయ్యండి? వెళ్ళండి!

కంట్రా : చూడండి సార్, ఇది మీదేనండి. మీ కుక్కే పొట్టి తోకా తెల్లనిరంగూ...

చిదం : కోలముఖమూ, కుచ్చు తోకా అవును ఏఅ! అదే నాకఖ్కర్లేదు వెళ్ళండి!

కంట్రా : వినిపించుకోండి చూడండి!

చతు : వెళ్ళవయ్యా వద్దో అంటూవుంటే వినిపించదూ? అదికాదు వారి కుకపిల్ల అవతల గుమ్మంలో ఉంది చూసుకో!

కంట్రా : (బయటకు వెళ్ళాడు)

చిదం : (కుర్చీలో కూలబడ్డాడు)

చతు : చెబుతూవుంటే వినిపించుకోకుండా ఒకటే గోల. కుక్కపిల్ల దొరికినా కూడా 'మీదే మీదే ' అట! ఎక్కడ వూడిపడ్డాడో దయ్యంలాగా పాపం? చాలా బాధపెట్టాడు మిమ్మల్ని?

కంట్రా : బయటనుంచి వచ్చాడు. చేతిలో అతను తెచ్చిన కుక్కపిల్ల ఉంది. తలపాగా జారిపోయి ఉంది. వెనకనుంచి సీనుకూడా వచ్చాడు) అది మీ కుక్కపిల్ల కాదుసార్ ఇదిగో ఇదే మీది!

చిదం : ఇదేమిటి మిమ్మల్ని చూసినట్టుంది. ఇళ్ళకు రిపేర్స్ చేసే వ్యక్తి ఎవరన్నా మీకు అన్నదమ్ముడా?

కంట్రా : కాదండి నేనే ఆ వ్యక్తిని!

చిదం : ఇదొకటి. ఇదో మోసం!

కంట్రా : కాదండి. నేనేనండి ఆ కంట్రాక్టరును. ఇంతకు ముందే మీ దగ్గిరకొచ్చానుగా మరచిపోయారా! ఇదిగో ఆర్డర్ బుక్

చిదం : మిమ్మల్ని కంట్రాక్టరు కాదని నేనేం అనలేదు. మీరు కంట్రాక్టరే కాని మీరు మరో వేషంలో వచ్చినందుకు మోసం అంటున్నాను.

కంట్రా : అది వూళ్ళోవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని గాని! సరే ఇదిగో మీ కుక్కపిల్ల!

చిదం : ఇందాకే చెప్పాను వెళ్ళమని! ఇది నాదికాదు నన్ను మరి వేధించకండి!

కంట్రా : మీదేసార్, జాగ్రత్తగా చూడండి! ఇదిగో తెల్లని రంగూ ఇదిగో కోలముఖమూ నువ్వు చూడబ్బాయ్!

సీను : (తీసుకుని వ్రేలితో తాకి) ఇది తెల్లనికుక్క కాదుసార్ నల్లకుక్క మీదే సున్నం పూశారు.

కంట్రా : సున్నం పూశారా నువ్వు వళ్ళు దగ్గిర పెట్టుకునే మాటాడుతున్నావా సున్నం పూశారట సున్నం. ఇది మీదేనండి! ఇందాకా మీ దగ్గిర గుర్తులన్నీ తీసుకున్నాను. నా సాయశక్తులా వెతికి తీసుకొస్తానని చెప్పాను. తీసుకొచ్చాను. మీకుక్కపిల్లను మీరు తీసుకుని నా డబ్బు నాకివ్వండి?

చతు : ఇంక ఏం కుక్కపిల్లయ్యా! ఎక్కడ ఎత్తుకొచ్చావ్ దాన్ని ఒరే అబ్బాయి, దాన్ని తీసుకెళ్ళి బయటపారేయ్. వూఁ చూస్తావేఁ పో

కంట్రా : ఒరే అబ్బాయ్! పారేశావంటే ఉద్యోగం వూడిందనే లెక్కవేసుకో. అది మీదే సార్. నేను అబద్ధం చెప్పటంలేదు.

చిదం : మీరు నిజమే చెబుతున్నారు. నేనే అబద్ధం ఆడుతున్నాను. నేను వట్టి మోసగాడిని. దొంగను సరా ఇహ దయచెయ్యండి.

చతు : అవునయ్యా నీకేం మతీ సుతీ లేదూ, ఊరి మీద తిరిగే ఆ చెత్త కుక్కపిల్లను తీసుకొచ్చి ఆయనదేనంటూ యివ్వజూపుతావా? మాంచి వాడివేనయ్యా!

కంట్రా : అవతల కట్టివున్న కుక్కను నువ్వు తెచ్చావల్లే వుంది!

చతు : కాక?

కంట్రా : ఐతేమరి, నువ్వు మోసంచేసి ఏదో కుక్కపిల్లను తెచ్చి ఆయనదేఅని అంట్గడుతున్నావ్. నిజంగా చెప్పు అది ఆయన కుక్కా?

చతు : నువ్వు నిజంగా చెప్పు. నువ్వు తెచ్చింది మాత్రం ఆయన కుక్కా?

కంట్రా : నిజంగా నేను తెచ్చింది ఆయన కుక్కే. పోలికలు చూసుకో.

చతు : నాదయ్యా అసలు కుక్క. నామాటవిని దాన్ని నువ్వు తీసుకువెళ్ళు! నామాట వినవా!

కంట్రా : బావుంది. నీతో నాకేమిటి మధ్య! ఏమండీ చిదంబరంగారూ! మీ కుక్కపిల్లను తీసుకుని బాబ్బాబూ! నా డబ్బిచ్చి పంపేద్దురూ!

చతు : అయ్యా చిదంబరంగారూ! నేను వెళ్ళాలి. త్వరగా నా డబ్బివ్వండి!

కంట్రా : అవతల అర్జంటు పనులున్నాయండీ, అవన్నీ వదలిపెట్టి వచ్చాను. ప్రస్తుతం ఎనిమిది తొమ్మిదిళ్ళు మరమ్మత్తు చేయించాలి. చిదంబరంగారూ కుక్కను తీసుకుంటే ఈయిల్లు కూడా చెయ్యాలి. నా డబ్బిచ్చేసి ఎంతకూ పంపరు.

చతు : నోట్లు లెక్కపెడుతున్నారేమో. కాస్సేపాగూ! లేకపొతేనూ నాడబ్బట 'నా డబ్బు!'

కంట్రా : నాది డబ్బుకాదు, నీదే డబ్బు! నువ్వే తెచ్చావు కుక్కపిల్లను. చిదంబరంగారూ!

చతు : చిదంబరంగారూ!

చిదం : (ఆత్రుతగా లోపల్నుంచి వచ్చి కూర్చున్నాడు)

చతు : ఏమండిసార్! ఏమిటిది!

కంట్రా : మీరు జాగ్రత్తగా పరీక్షించి మీ కుక్కను నిర్ణయించుకోండి సార్!

చతు : నిర్ణయిస్తారుండవయ్యా, ఏమండీ..

చిదం : ఏమిటి, ఏమిటి మీ వుద్దేశం. పోలీస్‌కు ఫోన్ చేస్తాను.

చతు : ఆఁ, ఎందుకండీ అంతపని. ఈ మాత్రం దానికి వాళ్ళదాకా ఎందుకు!

చిదం : ఎందుకేమిటి, లేకపోతే ఏమిటి అల్లరి! ఇంకాస్సేపుపోతే పిల్లిపిల్లల్ని కూడా తెచ్చి 'మీ కుక్కేనండి ' అంటారు. పోతారా! పోలీసును పిలవమంటారా?

కంట్రా : కూచోండిసార్!

చతు : అయ్యా క్షమించండి. ఇది మీకుక్కపిల్లకాదని మీ రొక్కమాటతో కొట్టిపారేస్తే మేమెట్లా బతగ్గలం? మేం దొంగలంకాము, దోచుకోము. చాలా కష్టపడి వెతికి తెచ్చాను.

కంట్రా : నేను చాలా కష్టపడ్డాను. మీరు కనిపెట్టండి. ఎవరిదెంత కష్టమో!

చిదం : మీ కష్టాలమాట దేవుడెరుగు. నన్ను నానా కష్టాలు పెట్టి, ఇంతా అంతా బాధ పెడుతున్నారా మీరు! ష్...ఏం గోలవచ్చిందిరా భగవంతుడా! వెధవకుక్క నేరకతప్పింది. సీనూ, సీనూ. పోతేపొయింది కుక్కపిల్ల. నాకు మరి అక్కర్లేదు. మీరిద్దరూ వెళ్తారా వెళ్ళరా?

చతు : తమరు ఒక కంట చూడాలి! లేకపోతే చచ్చిపోతాను.

చిదం : ఏమంటావైతే?

కంట్రా : అనటానికేముందండీ, ఏదో మా శ్రమకుతగ్గ ప్రతిఫలం...

చిదం : (సీరియస్‌గా, విసుగ్గాచూసి పర్సుతీసి ఐదు రూపాయలనోటు యిస్తూ) వెళ్ళండి, మాట్లాడకండి. (ఇద్దరూ సంశయిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. చిదంబరం ఈ పాటికే పూర్తిగా విసిగిపోయి ఉన్నాడు. ఆయాసపడుతున్నాడు. విసుగూ, కోపం హెచ్చిపోయినై) చాలదూ! తీసుకోండి పర్సులో ఉన్నది ఇదే! గుల్లచెయ్యండి, పోండి. (రెండయిదులూ ఒకడి కిచ్చి, 10 రూపాయలనోటు ఇంకోడికిచ్చి పర్సుదులిపాడు.) పొండి, మీ కుక్కలూవద్దు, నక్కలూవద్ధు. వెళ్ళరేం! (ఇద్దరూ నడుస్తున్నారు. కంట్రాక్టరు ఆగి, వెనక్కు తిరిగి యింటి కప్పుకేసి చూస్తూ జాలిగా చిదంబరాన్ని చూశాడు చిదంబరంకూడా చూసి, నుదుటి మీద కొట్టుకుని కూలబడ్డాడు. ఇద్దరూ పోయారు.)

చిదం : (తెరుకుని) సీనూ, సీనూ, దిక్కుమాలిన వెధవ, దిక్కుమాలిన వెధవా అని!

సీను : అదెవడోసార్ అవతల నించున్నాడు. కాదంటే వినడు. పెద్ధ కుక్కను తీసుకొచ్చి మనదేనంటాడు. ఎంతపొమ్మన్నా పోడు!

చిదం : (చటుక్కున లేచి, ఆత్రుగగా) చంపావ్‌రా, ఏడీ! వస్తున్నాడా కొంపతీసి! నువ్వు త్వరగా ఆ తలుపు వెయ్... గడియవేసెయ్! (నమస్కరిస్తూ) అఖ్కర్లేదు, కుక్కపిల్ల అఖ్కర్లేదు. ప్రాణాలతో మరి ఉండనిచ్చేట్టు లేరు. (సీను తలుపువేసి వచ్చాడు.)చూడూ కాస్సేపు పోయినతర్వాత వెళ్ళి 'కుక్కపిల్ల దొరికింది ' అని రాసి బోర్డు గుమ్మానికి కట్టు!

సీను : దొర్కిందా సార్

చిదం : కట్టరా వెర్రిపీనుగ, బాగా దొరికావ్!

సీను : (ఇంట్లోకి పోయాడు.)

చిదం : (ఫోన్‌తీసి విసుగ్గానే) హలో ఆఁ...ఎడిటర్‌గారున్నారా మీరేనా సరే చూడండి... 'కుక్కపిల్ల కనబడుటలేదు ' అని ఈ రోజు మీ పత్రికలో ప్రకటన వేశారు. ఆఁ, ఆఁ..ఆ ప్రకటన నేనే యిచ్చాను. అవును చిదంబరాన్నే ఈ రోజు పేపర్లో ఆ 'కనబడుటలేదు ' అన్న కుక్కపిల్ల 'దొరికింది ' అని వెయ్యండి! అవును దొరికింది.. ఎవరో తెచ్చియిచ్చారు ధర్మాత్ములు బాబ్బాబూ వెంటనే వేసి పెట్టండి! కుక్కపిల్ల దొరికింది అని పెద్దక్షరాలలో వేసి ఫలానా చిదంబరంగారి పోయిన కుక్కపిల్ల దొరికింది అని వెయ్యండి దొరికిందని వెయ్యటం ఎందుకంటారా? వెయ్యండి, నా స్నేహితులు చాలామంది ఆతురతపడుతున్నారు దొరికిందంటే సంతోషిస్తారు. ఎంత డబ్బయినాసరే పంపిస్తున్నాను. దొరికిందని మాత్రం వెంటనే వెయ్యండి థాంక్స్.

[ఫోన్ క్రిందపెట్టి, నిస్సారంగా కుర్చీలో కూలబడ్డాడు. సీను లోపల్నుంచి ఒక బల్లమీద పెద్ద అక్షరాలలో 'కుక్కపిల్ల దొరికింది ' అని రాసి ఆ బల్ల పట్టుకుని, వీధివేపు పోతూవుండగా ... తెర]

రచన : రావికొండలరావు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: