telugudanam.com

      telugudanam.com

   

వద్దంటే పెళ్ళి

పాత్రలు :

1. శానయ్య- ధనికుడైన ముసలి పెళ్ళికొడుకు

2. సరయ్య- శానయ్యకి స్నేహితుడు

3. శిఖామణి- వేదాంతి

4. శాంత- పెళ్ళికూతురు

5. చంద్రుడు- శాంతకి ప్రియుడు

6. రాజాలు- శాంత తండ్రిరంగం - 1

[ శానయ్య ఇంట్లో వీధిహాలు. కొన్ని కుర్చీలు ఉంటాయి శానయ్య కుర్చీమించి లేచి, కుడివైపుకు తిరిగి ]


శానయ్య : తలుపేసుకోండి, ఇక్కడున్నట్టు వస్తాను.ఇల్లు పదిలం. ఇంతలో అపసవ్యాలు ఎమి జరగనియ్యవద్దు. డబ్బుకి చాటు రోజులు. నాదగ్గిర బాకీ వసూలు చేసుగోడానికని చెబుతూ కొదరూ నాకోసం రావచ్చు. వాళ్ళతోటి నేను ఊళ్ళోలేననీ, ఎక్కడ కెళ్ళానో ఎప్పుడొస్తానో తెలియదనీ, చెప్పండి. మరికొందరు నా బాకీలు వసూళ్ళు ఇవ్వడానికొస్తారు. వాళ్ళతోటిమాత్రం నేను సరయ్య ఇంట్లో ఉంటానని చెప్పండి. ( అని, కుడివేపుకి నిష్క్రమించబోయేసరికి, సరయ్య వస్తాడు. )

సరయ్య : డబ్బు విషయం తెలివి తేటలంటే, ఇదిగో ఇలా ఉండాలి!

శానయ్య : ( నిదానించి ) ఒహొహొ ! సరయ్యేనా? నేనూ మీ యింటికి రావాలనే?

సరయ్య : ఏం ఏం ?

శానయ్య : నాబుర్రలో గొప్ప సంగతి ఒకటి ప్రవేశించినది. దాన్ని గురించి నీ సలహా పుచ్చుకోవాలని.

సరయ్య : అందుకు అభ్యంతరంఏమిటి? పరమసంతోషం. రెండోవాడి ప్రేక ్ష్యంలేకుండా కావలసినంత మాట్టాడుకోవచ్చు.

శానయ్య : కూచోమరి, ప్రస్తుత సంగతి చాలా ముఖ్యమైన సంగతి. ఏవిషయంలోనైనాసరే, స్నేహితుల ఆలోచన పుచ్చుకోకుండా ఏమీ చెయ్యకూడదు.

సరయ్య : నీ ఆంతర్య స్నేహితుల్లో ఒకణ్ణిగా నన్ను కట్టినందుకు విధేయుణ్ణి. సంగతి ఏమిటో చెవినివెయి!

శానయ్య : అల్లాయితే, విను, నేను పెళ్ళిచేసుకుంటే బాగుంటుందా, బాగుండదా?

సరయ్య : ఎవరు ? నువ్వా !

శానయ్య : అవునూ! నేనే !

సరయ్య : నీ కెన్నేళ్లుంటాయని నీ ఊహ !

శానయ్య : నాకా !( అని ఆలోచిస్తాడు )

సరయ్య : అవును.

శానయ్య : నాకు తెలియదోయ్ ! కాని, నాశరీరం కేవలం గడియారం లాంటిది.ఎన్నడూ ఇల్లా చిర్రున చీదను.

సరయ్య : అది సరిలే! కొంచెం హెచ్చుతగ్గులో నీ వయస్సు నీకి తెలియదూ ?

శానయ్య : తెలియదు. మనికెన్నేళ్ళని మనం ఆలోచిస్తూ కూచుంటామా ?

సరయ్య : సరె, అల్లాయితే, మా నాన్నకీ, నీకూ మొదటి పరిచయం ఏక్కడో నీకు జ్ఞాపకం ఉందా ?

శానయ్య : ఆ, పుష్కరాల్లో,

సరయ్య : అప్పుడు నీ కెన్నేళ్ళూ ?

శానయ్య : అప్పటి కప్పుడే నాకు అరటిక్కెట్టు ఒప్పుగునేవారు కారు,

సరయ్య : పోనీ, పదేళ్ళనుకో, తరువాత, నీకు ఎన్ని పుష్కరాలు తెలునూ ?

శానయ్య : మొన్నటిదికాక, మూడు పుష్కరాలకెళ్లాను.

సరయ్య : మరి నీకు 58 దాటాయి, అధిక మాసాల్తో అరవై పైమాటలు! పన్నెండేళ్ళ బాలకుమారుడులా మాట్టాడతావేం ?

శానయ్య : నీ మొహం ?

సరయ్య : చీ ఊరుకో ! ఈ లెక్క సిసలు, నీ మాట చొప్పునేగా నేకట్టిందీ ! ఇక నా హృదయం చెప్పమన్నావ్ గా! మన్లో మనమాట - నీకు పెళ్ళేమిటిరా నీ మొహం ! పెళ్ళనేది ఎరిగో ఎరక్కో సాహసించే యువకులికిగాని, ఇన్నేళ్ళొచ్చి, ఎంతో ఆలోచన ఉండవలసిన నీకా ? ఇంతవరకూ స్వేచ్చగా ఉండి, ఇప్పుడు బరువు ఎత్తుగుని భర్తవు కావాలనా అహొరిస్తున్నావ్ ?

శానయ్య : నేను ఒక పిల్లని నిశ్చయం చేసుకున్నాను, ఆ పిల్లని నేను చేసుగుంటే, నన్ను అనేది ఎవడు ?

సరయ్య : అల్లాచెప్పూ ! నువ్వు మొదట్లో అమాట చెప్పందే ?

శానయ్య : ఆ అమ్మాయి నా కంటికి బంగారంలా ఉంది. ( తలవంచుగుని సిగ్గభినయించి ) నేను ఆమెను మోహించాను.

సరయ్య : నిజంగా ?

శానయ్య : నిజంగా, వాళ్ళ నాన్నని గూడా అడిగాను.

సరయ్య : ఇదోటా ?

శానయ్య : అవునా, ఈరాత్రే సుముహూర్తం, నగలు కొనాలి, తాంబూలాలు అయిపోయినాయి.

సరయ్య : ఓ ! భేషుగ్గాఉంది. అవశ్యం పెళ్లాడు.నా సలహా యేమిటి మధ్య ?

శానయ్య : స్నేహాన్నిబట్టి సలహావచ్చాను. ఏమిటి నీ ఊహ ? అక్కడకి నా పెళ్ళిమాట నేనూననేకూడదనా ? నా వయస్సు గుణించడం యెందూకూ ? ( మీసం దువ్వి ) ముప్ఫయి యేళ్ళవాణ్ణి యెవణ్ణయినా సరేరమ్మను నాతోటి ! ఎవడోస్తాడో, ఈ బస్తీలో ! ( అని సకిలించి బస్కీ తీస్తాడు ) నాకో చత్వారమా ? ఓ ఇదా ? నన్ను గంజీకావిడేసి నడిపించాలా ? నాకు దంతాలు లేవా ? ( అని పళ్ళూ చూపిస్తాడు ) ఏమంటావ్ ?

సరయ్య : నాది కేవలం బుద్ధితక్కువ, నువ్వు అవశ్యం పెళ్లాడాలి.

శానయ్య : వెనక నాకు పెళ్ళంటే మంటగా ఉండేది. కాని రెండుమూడు సవబులతో నా ఊహ మారిపోయింది. మొదటిమాట, పెళ్ళివల్ల పెళ్లాం వస్తుంది. వచ్చి, ఆర్చడం, తీర్చడం, అలగడం, ఏడవడంలాంటి తమాషాలు చేస్తుంది. రొండోమాట, నేను పెళ్లాడకపోతే నావంశం అంతరిస్తుంది, మూడోమాట, పెళ్లాడితే, కుర్రకుంకలు బయల్దేరి " నాన్న నాన్న నాకేమన్న తెచ్చిపెట్టవ్ ? " అంటూ కేకలేస్తూ ఏమి తెలియని భాషలో అడుగుతూంటారు. ఎమో ! (అని కళ్ళుమూసుగుని ) నాకు అప్పుడే పెళ్ళీయినట్టూ, నలుగురైదుగురు పిల్లలు చుట్టూ మూగినట్టూ అనిపిస్తోంది ? ఇదుగో! వీడు చొక్కాపట్టుగు లాగుతున్నాడు, ( కోప్పడి ) ఉండరా ! ( నవ్వుతూ ) చొక్కా చిరుగుతుంది, వొదిలిపెట్టమ్మా! మీమ్మదగ్గిరికెళ్ళు! యేయ్ ! వీణ్ణి తీసెయ్ !

సరయ్య : పెళ్ళికూతురు ఎవరూ ? అన్నట్టూ.

శానయ్య : శాంత !

సరయ్య : ఎరువుగా ఉంటూందీ, షోగ్గా డ్రెస్సు వేనుగు వెడుతూంటుందీ !

శానయ్య : అవును.

సరయ్య : రాజాలుగారి కూతురూ ? చాలా బాగుంటూందిలే. తక్షణం పెళ్ళాడు.

శానయ్య : పిల్లని ఎన్నుకోడంలో నా వివేకం ఎంత అమోఘంగా ఉందీ ? వివాహానికి నువ్ లేందే నాకు తోచదు, ఏదో పని తగిలిందనక, తప్పకుండా రావాలి.

సరయ్య : ( లేచి ) వస్తాలే......( అని కుడివైపుకి నడుస్తాడు )

శానయ్య : ( లేచి ) ఉంటాను.

సరయ్య : వెళ్ళొస్తా. అనుకూల దాంపత్యం- ఆవిడికి యిరవై, ఈయనకి అరవై, ముమ్మాటికీ బాగుందనుకోవచ్చు, మూడు ముక్కలు కావచ్చు. (వెళ్ళిపోతాడు)

రంగం - 2

[కాషాయి బట్ట కట్టుగుని, చొక్కా తొడుక్కుని శిఖామణి కూచుంటాడు. పుస్తకా ఉంటాయి.కుడినుంచి శానయ్యవచ్చి, నమస్కరించి, ఒక విభూతిపండు తీసి]


శానయ్య : శిఖామణి వేదాంతిగారూ! తమరు ఈ పండు పుచ్చుగోవాలి.

శిఖామణి : నారాయణ ! ( అని అందుకుని అది పక్కని పెడతాడు)

శానయ్య : తమరు చాలా జ్ఞానులని వింటాను.

శిఖామణి : పేరు ?

శానయ్య : శానయ్య

శిఖామణి : (కూర్చోమని వేలితో అని ) నాతో మికూ ఏంపని ?

శానయ్య : కాస్త సలహా కావాలండి. ఒక విషయం నాకు చాలా స్వంత విషయం ఉంది. దాన్ని గురించి ! అంచేతేనే వచ్చాను.

శిఖామణి : శానయ్యగారూ ! తమ మాట ధోరణి మార్చాలి, ప్రపంచ మిధ్య. అంచేత ' నే వచ్చాను ' అని అనడం తప్పు. ' నేను వచ్చినట్టు నాకు అనిపిస్తోంది ' అనాలి.

శానయ్య : అనిపించడమా ?

శిఖామణి : అవును.

శానయ్య : నే వచ్చాగా! ఇంకా అనిపించడమేమిటి ?

శిఖామణి : అదే అనుమానం అంటే ! మనం ప్రతీదీ అనుమానించాలి.

శానయ్య : అనుమానమేమిటి, తలకాయ్ ! నేను ఇక్కడలేనూ ? మనం మాట్టాడుకోడంలేదూ ?

శిఖామణి : మీరు ఉన్నారని నేను అనుకుంటూన్నాను ! నేను ఉన్నానని మిరు అనుకుంటూన్నారు ! మనం మాట్టాడుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం! ( చిరునవ్వుతోచూస్తాడు )

శానయ్య : మీ మొహంలాఉంది ! వేళాకోళంలోకి దిగారేం ? ఉండడం, ఉన్నాం అనుకోవడం, అంటూ తర్కంలో పడ్డారేం ! ఈ సూక్ష్మాలు అల్లా ఉంచి, వ్యవహారంలోకి వత్తాం. నేను పెళ్ళిఆడ్డం స్థిరం అయినట్టు మితో చెప్పాలనిన్నీ, మీ సలహాకోసమున్నూ, వచ్చాను.

శిఖామణి : ఆ సంగతి నాకు ఎంతమాత్రం తెలియదు.

శానయ్య : నే చెబుతున్నాగా ?

శిఖామణి : అయితే కావచ్చు.

శానయ్య : ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుగోడం తప్పా ఒప్పా ?

శిఖామణి : తప్పకుండా ఏదో ఓటి.

శానయ్య : ( తనలో ) ఓరి వీడి దుంపతెగా ! తేలడేం ? ( పైకి ) నేను ఆపెళ్ళి చేసుగుంటే నాకు శ్రేయస్సీనా అని మిమ్మల్లి అడుగుతున్నాను.

శిఖామణి : ఎమోమరి దానికంతా ఉంది. ( అని థ్యానించడంలో పడతాడు )

శానయ్య : పెళ్ళి చేసుగోడం తప్పా ?

శిఖామణి : బహుశా.

శానయ్య : ( పళ్ళుబిగించి ) స్పష్టంగా!

శిఖామణి : నా ఊహ అదే.

శానయ్య : నాకు ఆ అమ్మాయి అంటే చాలాయిష్టం.

శిఖామణి : కావచ్చు.

శానయ్య : వాళ్ళ నాన్నే ఇచ్చాడు నాకు ఆ అమ్మాయిని.

శిఖామణి : అట్లాకూడా అనుకోవచ్చు.

శానయ్య : ఏమిటంటే, ఒక వేళ తీరా పెళ్ళిచేనుగుంటే, ఆ అమ్మాయి నన్ను మోసపుచ్చదు గదా అని.

శిఖామణి : ఆమాట నిజమే.

శానయ్య : నీ అభిప్రాయం ఏమిటి.

శిఖామణి : ( తల పంకించి ) ఆలాగే.

శానయ్య : అదికాదయ్యా చవటా! నాస్థితిలో నువ్వున్నావ్ అనుకో, ఏంజేస్తావ్ ?

శిఖామణి : ( రూఢిగా ) అవును !

శానయ్య : నీ సలహా ఏమిటి ?

శిఖామణి : నీకి ఏది ఇష్టమో అది!

శానయ్య : నాకు మతి పోయేటట్టుంది.

శిఖామణి : అందుకు నేను కర్తనుగాను !

శానయ్య : హొహొరి నిన్ను తగలెయ్యా !

శిఖామణి : కాదలచినది కావచ్చు !

శానయ్య : చంపేస్తున్నావురా పీనుగా ! ( అని కర్రతో శిఖామణిని కొడతాడు )

శిఖామణి : శిఖామణి- ఓరి పశువా నీ కేమివచ్చిందిరా !

శానయ్య : తెలివితక్కవ పేలాపనకి బహుమతీ.

శిఖామణి : ఏమి నీపొగరూ ? ఇదేనా మర్యాదా ? నా అంత జ్ఞానిని కొడతావురా ?

శానయ్య : ( కూచుని బాసింపట్టు వేసుగుని, చిరునవ్వుతో ) శిఖామణిగారూ ? తమమాట ధోరణి మార్చాలి, మనం ప్రతీదీ అనుమానించాలి." నన్ను కొట్టావు " అని అనకూడదు. " కొట్టినట్టు అనిపిస్తోంది " అనాలి.

శిఖామణి : నేను వెళ్ళి పిర్యాదు చేస్తాను.

శానయ్య : ( నవ్వుతూ ) అందుకు నేను కర్తనుగాను.

శిఖామణి : ఇవిగో దెబ్బలు కనబడుతూంటేనే !

శానయ్య : కావచ్చు !

శిఖామణి : నువ్వే నన్ను ఇల్లా చేసింది.

శనయ్య : అందులో అసంభవం ఏమిలేదు.

శిఖామణి : నీకు వారంటు పెట్టిస్తా !

శానయ్య : నాకు తెలియదు.

శిఖామణి : నీపని పడతా !

శానయ్య : కాదలచినది, కావచ్చు !

శిఖామణి : కాకపోవచ్చు !

( ఎడమవేపుకి వేళ్ళిపోతాడు శానయ్య కుడిప్రక్కకి నిష్క్రమిస్తాడు )

రంగం - 3

[ శాంత ఇంటిముందు వీధి ఎడమనించి శానయ్యవస్తాడు ]


శానయ్య : ( ఇటూ అటూ నడుస్తూ ఆలోచిస్తూ వాకబు చేసినా కొద్దీ అనుమానం జాస్తీ అవుతోంది. అందుకనే శిఖమణిగాణ్ని మా చెడ్డదెబ్బలు కొట్టాను. పొద్దున్నే నేను లేచే సరికి, బుడబుడక్కలవాడొకడొచ్చి నాకు శుభం జరుగుతుందన్నాడు. ' శుభం ' అంటే ఏమిటిరా కుంకా అన్నాను. పెళ్ళి అన్నాడు. ఆ పిల్ల వర్తన ఎల్లాంటిది అవుతుందిరా అన్నాను. అంటే నాకు అధంకాకుండా ఎవో ముక్కలు గబగబ లాడించాడు. పైగా, నిన్నరాత్తిరి నాకు పెద్ద కలొచ్చింది ! సముద్రణం మీద నేను పడవ షికారుట, తుఫానుట, దానికి అర్ధం ఏమితో మరోణ్ణి పట్టుగుని శకునం అడగాలి. మొదట ఈ శాంతని పిలిచి మరోమాటు మాట్టాడాలి పెళ్ళి జరిగిన లగాయతు తిన్నగా ఉంటుందో ఉండదో దాన్నే అడిగితే తీరిపోతుంది.

( అని, ఈలవేసి, చిటిగేసి, " శాంతా! శాంతా!" అని పిలుస్తాడు. సంచీ ఎడంచేతికి వేళ్లాడుతూ, చెప్పులు తొడుక్కుని, గొడుగు వేసుగుని, ప్రయాణభేరీలో శాంత వస్తుంది )

శానయ్య : ( తనలో ) మోహనాకారం ! ఏమి అందం ! ఏమి ఒయ్యారం ! ఏ చవట దీన్ని చూసి పెళ్ళాడకుండా ఉండగలడూ !

(పైకి ) కాగల భర్తనైన నాకు కాగల భార్యా !ఎక్కడికి బయల్దేరుతున్నావు ?

శాంత : షాపు మీద పనుంది.

శానయ్య : మీ నాన్న ఇంటోలేడుకద !

శాంటా : లేడు

శానయ్య : ఓసీ! నా బహిఃప్రాణమా ! మనకి ఇక పెళ్ళి కాబోతుంది, ఇక్కణ్ణించి, నువ్వు నేను చెప్పినట్టల్టా వింటూండాలిగాని పేచీలు పెట్టగూడదు. నేటినుంచి నువ్వు నా సొమ్ము. నాసంబంధం నీకు చాలా సతోషంగా లేదూ ?

శాంత : ఇంకా నిమ్మళంగా అంటారేం ! నా సంతోషానికి మేరలేదు.

శానయ్య : ఎందుచేత చెప్పుగో ! ( అని చిరునవ్వుతో కనుబొమ్మలు పై కెట్టి చూస్తాడు. )

శాంత : ఏంచేతంటే, ఇన్నాళ్ళనించీ నాకు స్వేచ్చ లేకుండాచేసి మానాన్న నన్ను ఖాయిదా ఉంచాడు. ఖాయిదా పద్ధతి నాకు అయిష్టం నాకు స్వాతంత్ర్యం కావాలి. దేవుడు, ఇప్పటికి, మిమ్మల్ని కనపరిచాడు.

శానయ్య : ఇదోటా ! ( అని తెల్లబోతాడు )

శాంత : మిమ్మల్ని పెళ్ళాడ్డంతోటే నాకు కావలసినంత స్వేచ్చ మీరు ఇవ్వకమానరు. " పెళ్ళాలు దివాంధాలులా పడిఉండవలసిన పదార్థాలు " అని వాదించే భర్తల జాతికాదు మీది! మిరు యోగ్యులు, అనుభవశాలురు.

శానయ్య : సరి సరి,

శాంత : ఓంటరిగా ఉంటే, నాకు తోచదు-మీకు మల్లేనే, నేనూ మనిషినే, నాటకాలు, మీటింగులు, పిక్‌నిక్కులు, పార్టీలు అంటే నేనూ చెవి కోనుగుంటాను-మీకు మల్లేనే, నావంటిది మీకు దొరకదు ఉభయతారకం.

శానయ్య : ( మొహం చిట్లించుగుని, తలఊగించి ) అడ్డమా !

శాంత : మనం దెబ్బలాడుకోకూడదు.

శానయ్య : కూడదు.

శాంత : అనగా, నేను ఎవరితోటేనా కాస్త ఇదిగా మాట్లాడుతూంటే మీరు ఒక్కరూ కూచుని మనస్సులో ఇదవకూడదు.

శానయ్య : అల్లాగే, అల్లాగే.

శాంత : మిపన్లల్లో నేను జోక్యం కలగజేసుకోను.

శానయ్య : పాపం!

శాంత : నా పనుల్ని గురించి మిరు యాగీ చెయ్యకూడదు. మనకి అన్యోన్య విశ్వాసం ఉండాలి.

శానయ్య : తెలిసింది, తెలిసింది.

శాంత : మీ మొహం బొత్తిగా మాడిపోయి పొగచూరిపోతూందేం ?

శానయ్య : ( చికిలించి ) నాకు కొంచెం కళ్లు చిఱతలు కమ్ముతున్నాయిలే, తల తిరుగుతూంది.

శాంత : ఈ కాలంలో ఆ జబ్బు మామూలైంది, కాని మన పెళ్ళితో, అల్లాంటి హెచ్చుతగ్గులు ఠంగున సర్దుకుంటాయి. సెలవు, నాకీ డ్రెస్సు బాగుండలేదు. బజార్లోకి వెళ్ళి, కొత్త డ్రెస్సు పురమాయించి, బిల్లు తమకి పంపుతాను. ( అని వేలుతో శానయ్య బుగ్గతాటించి, రివ్వున వెళ్ళి పోతుంది. )

శానయ్య : ( తనబుగ్గ తను తాటుగుంతూ ఇదేమిటి ! ఇహను ఇది నామాట ఏం వింటుందీ ? ఏంత చిక్కొచ్చిందీ ! ఎల్లా ఈపెళ్లి రద్దుచేసుగోడం ? సరయ్య మాట విన్నాను కాను గదా ! శిఖామణి చెప్పినట్లు అనుమానం మంచిదిలా కనబడుతోంది సరయ్య కనబడితే బాగుండును ! ( వెనక్కితిరిగి ) అడుగో ! సరయ్యా !

సరయ్య : ఓయ్ ! నీకోసమే ! నగలు కొంటానన్నవు. షాహుకార్ని రమ్మన్నాను.

శానయ్య : అదికాదు, మాట!

సరయ్య : నీ చురుకు తగ్గినట్టుందేం ?

శానయ్య- కొన్ని చిక్కులు బయల్దేరాయి. ఇంకా ఆలోచించవలిసొచ్చింది. ఇంకా తరిస్తేగాని పెళ్లిచేసుగోను.

సరయ్య : నే వెడతాను. నాకు తీరుబడిలేదు.

శానయ్య : అది కాదోయ్ ! నాకూ ఓ కలొచ్చింది.

సరయ్య : ( వెళ్ళిపోతూ ) అయితే ఏమంటావు ?

శానయ్య : దానికి కాస్త అర్థం చెబుతావేమోఅని.

సరయ్య : ప్రశ్న కనుక్కో, నాకేంతెలుసు ? ( అని ఎడమకి వెళ్ళిపోతాడు )

శానయ్య : స్నేహాలు ఇల్లానే ఉంటాయి. ఇక శాంత తండ్రిని కలుసుకొని, మాట్టాడి ఈ సేతాను పెళ్ళి వొదిలించుగోవాలి, బాబూ ! ( అని ఉసూరుమంటూ కుడిపక్కకి వెళ్ళిపోతాడు )

రంగం - 4

[ శాంత యింట్లో ఒక కుర్చీమిద కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. ఎడమవేపునించి చంద్రుడు వస్తాడు. శాంతలేచి, షేక్ హాండు ఇచ్చి అతణ్ణి కుర్చీమిద కూర్చోమంటుంది. అతడు, దీనంగా, కుర్చీలో కూలబడి మూలుగుతాడు ]


శాంత : ఏమిటండి, విశేషాలు ?

చంద్రుడు : ఏమున్నాయి? నువ్వే పెద్ద విశేషం.

శాంత : అదేమిటి అల్ల అంటున్నారు ?

చంద్రుడు : నాకు ఎన్నిరీముల ప్రేమ జాబులు రాశావ్ ? ఎన్నిమాట్లు మాట ఇచ్చావ్ ?

శాంత : నిజమే, లేదన్నానా ఇప్పుడు మాత్రం ?

చంద్రుడు : ఇప్పుడు శానయ్య సంబంధం మాట నిజమే ?

శాంత : ఆ.

( కుడిప్రక్కకి శానయ్య వచ్చి, మాటలు, ఆలకించి నోరు నొక్కుగుంటాడు. )

చంద్రుడు : పెళ్ళి రూఢే ?

శాంత : ఆ.

చంద్రుడు : ఈ రాత్రే ?

శాంత : అవును.

చంద్రుడు : అవురా ! ( అని ముక్కుమిద వేలుంచుగుని) ఎంత క్రూరురాలవో చూడు ! న ాజీవితం అంతా నీకోసం పాడుచేసుగున్నాను. ధనం కూడా చాలా అయిపోయింది.ఇక విషం వుచ్చుగోవాలి.

శాంత : మీయందు నాప్రేమ యధాప్రకారం గానే ఉంది, ఉంటుంది. మనం పెళ్ళాడేస్తే కాపరం సాగించడం ఎల్ల ? నాదగ్గిరా కానిలేదు, మీ దగ్గిరా లేదు. ధనం లేందే జగత్తులేదు. అందుకని, అతడి ధనాన్ని ప్రేమించి అతణ్ణి పెళ్ళాడతానన్నాను గాని, అతనితో కాపరం చెయ్యను. కూడా ఉంటాను ! అతడూ అట్టే కాలం ఉండదు. ( శానయ్య ఉలిక్కిపడి అగ్రహం చూపించాలి ) మరి ఆరునెల్ల నాటికి ఆతను పైసలు, అప్పుడు నాయిష్టం, అనగా మన పెళ్ళి ! ( శానయ్యని చూసి సిగ్గుతెచ్చి పెట్టుగుని ) రండి ! మిమ్మల్ని గురించే నేను మాట్టాడుతూన్నది. మీ గొప్ప చెప్పగుంటున్నాను.

చంద్రుడు : నువ్వన్న పెద్దమనిషి...

శాంత : అవును. ఈ పెద్దమనిషే నన్ను వరించారు.

చంద్రుడు : అయ్యా ! తమ వివాహ సందర్భంలో తమర్నికడుంగడు అభినంస్తున్నాను. తమ విధేయుణ్ణని నమ్మండి. ఇంతకంటె లక్షణాలుగల భర్త నీకు దొరకడు. అతని ధోరణి చూస్తేనే, గొప్ప భర్తలాగ కనిపిస్తునాడేమిటి ? తమ స్నేహితుణ్ణి ఎప్పుడేనా దర్శన దయచెయ్యండి.

శాంత : సరే, సెలవు.

( చంద్రుడు ఎడమకి వెళ్ళిపోతాడు. )

శానయ్య : మినాన్న ఇంట్లో ఉన్నాడా ?

శాంత : ఇంకా రాలేదు.

( శానయ్య కుడివేపుకి పోతాడు. )

రంగం - 5

( రాజాలుగారి యిల్లు వీధిగది. రాజాలు పత్రిక చదువుతూ ఉంటాడు. శానయ్య కుడివేపునించి ఒక్క అడుగు వచ్చి, నిలబడి, నిట్టూర్పు విడుస్తాడు )


శానయ్య : ( తనలో ) ఈ పెళ్ళిఉరి ఎల్లానేనా తప్పించుగోవాలి. ( పైకి ) ఏమండోయి !

రాజాలు : ఓ హొహొ ! లోపలికి దయచెయ్యండి, అల్లుడుగారు !

శానయ్య : నేను వేరే పనిమిద వచ్చాను.

రాజాలు : నేను అందరికీ అడ్వాన్సులు కట్టేశాను. బాజా భజంత్రీలు, పాటకులు, బూటకులు, భోజనాలు, తాంబూలాలు, అన్నీ రడీ, మా పిల్లకుడా ముస్తాబు అవుతోంది! మీరే తరవాయి.

శానయ్య : నేను... అందు నిమిత్తం రాలేదు.

రాజాలు : ఏమిటది ?

శానయ్య : నేను, తమ కూతుర్ని, నాకిమ్మని మిమ్మల్ని లోగడ అడిగినమాట వాస్తవమే. కాని,

రాజాలు : కాని...

శానయ్య : కాని, నేను కొంచెం ముదురు, ఆ అమ్మాయి లేత, నావంటివాడు ఆమెకి తగడు.

రాజాలు : క్షమించాలి. మిరు మాపిల్లకి పూర్తిగా నచ్చారట. మీతో సుఖంగా జీవిస్తుందిట, మాపిల్ల.

శానయ్య : కాదయ్యా ! నాకు మా చెడ్డతిక్క, అప్పుడప్పుడు నాకు పైత్యిస్తుంది.

రాజాలు : అల్లాంటప్పుడు మా అమ్మాయి జాగ్రత్తపడగల మనిషే ! ఏమి ఫర్వాలేదు.

శానయ్య : సరేలెండి. నేను అవకరపు మనిషినని ఆవిడికి అసహ్యం వెయ్యవచ్చు !

రాజాలు : గుణవంతురాలి యొక్క మొగుడు ఎంత అసహ్యంగా ఉంటే అంత ఎక్కువ పేరు ప్రతిస్ఠలు ఆవిడికి వస్తాయి.

శానయ్య : మీ అమ్మాయిని నాకివ్వద్దని నీకు సలహా యిస్తున్నాను. ఇప్పుడేనా గ్రహించుకో ?

రాజాలు : ఏమిటి ? నువ్వు మా అమ్మాయిని పెళ్లాడవ్ ?

శానయ్య : ఆడను.

రాజాలు : ఏం ? నీకేంవచ్చిందీ ?

శానయ్య : ఏం లేదూ ! నేను పెళ్లికి తగను. పైగా, మానాన్నా, మాతాతా, మరి మాగోత్రంలో ఎవళ్లూ కూడా పెళ్ళిచేసుగోడు ఆనమాయితు లేదుట.

రాజాలు : మాభాగే. ఎవరియిష్టం వారిది. బలవంతం ఎక్కడా పనికిరాదు. కాని మొదట నువ్వు మామ్మాయిని పెళ్లాడతానన్నావు, కాబట్టి, నేను ఏంచెయ్యగల్నో చూస్తాను ఒక్కక్షణం ఉండు.

( అని లోపలికి వెడతాడు )

శానయ్య : ఏమిటో అనుకున్నాను. వీడు కాస్త నయమే. ఇంత త్వరగా ఈ బంధం తెంపుగోవచ్చు అనుకోలేదు. పెందరాలే మేలుకుండబట్టి గండం తప్పింది. కొంచెం అశ్రద్ధాయితే స్థిమితంగా ఏడవలిసొచ్చేదీ. వస్తున్నాడు.

రాజాలు : ( వచ్చి, నవ్వి ) అల్లానే కానియ్యండి.

శానయ్య : నామాట బోటోయినందుకు నాకుమట్టుకు ఎంత విచారంగా ఉందనుకున్నారు ?

రాజాలు : చిత్తం.(ఒక కత్తిని ఇస్తాడు)

శానయ్య : ఎందుకదీ ?

రాజాలు : మీరు మీ మాట తప్పినందుకు మీకు బహుమతీ.

శానయ్య : అంటే ?

రాజాలు : దెబ్బలాటల్లో, కొందరు కేకలేసుగుని, తిట్టుగుని గొడవపడతారు. చడీచప్పుడూ కాకుండా పన్లు చెయ్యాలని మా మతం. తమరి అంగీకారం పుచ్చుగుని, అనుజ్ఞ తీసుగుని, మనం ఒకరిగొంతుకలు ఒకరు నిశ్శబ్దంగా నరురుక్కోవాలని నామనవి.

శానయ్య : ఇదేం బహుమతీ నీనెత్తి బహుమతీ !

రాజాలు : త్వరగా రండి. నాకు వేరే పనుంది. పెళ్ళి ఆడరు కాదూ !

శానయ్య : ఆడను.

రాజాలు : ( కర్రతో శానయ్యని రెండుకొట్టి ) అల్లాయితే మీరు నోరెత్తకూడదు. నేను అన్నీ యధావిధిగా చేసే మనిషిని. మీరు జంకారు. మిమ్మల్ని నేను దంచాను. ఇదంతా లా ప్రకారం రైటు. కాదని మీరు ఏ మొహం పెట్టుకుని అనగల్రో చెప్పండి.

శానయ్య : ( తనలో ) ఓరి శని వెధవా ! చావగొడుతున్నాడేం మరీనూ !

( పైకి ) ఏమిటయ్యా నువ్వనేదీ ? నేను కత్తిసాం చెయ్యలేను, బాకు సాం కూడా నాకు తెలియదు.

రాజాలు : నిజంగా ?

శానయ్య : నిజంగా.

రాజాలు : అల్లాయితే పెళ్ళాడు.

శానయ్య : ఆడను.

రాజాలు : ( కర్రతో మళ్ళీ రొండుకొట్టి ) తమ అనుజ్ఞ తరవాత యిద్దరుగాని లెండి, ప్రస్తుతం మిమ్మల్ని నేను కొట్టవలసి ఉంటుంది.

శానయ్య : కొట్టకురా, నిన్ను చంపెయ్యా !

రాజాలు : నాకూ ఎంత విచారంగా ఉందీ ? కాని గత్తంతరంలేదు. అయితే మీరు సమాధానం చెప్పే వరకూ మిమ్మల్ని వదలడం అశాస్త్రీయం !

( అని మళ్లీ కర్ర ఎత్తుతాడు )

శానయ్య : ఓరి నీమొహం మండా, పెళ్ళే చేసుగుంటానయ్యా !

[ కుడివేపునుంచి గబగబా సరయ్య వస్తాడు ]

సరయ్య : సుముహూర్తం గావునా, శానయ్యా ! నువ్వు నన్ను నీ పెళ్ళికి రమ్మని పిల్చావ్ ! పెళ్ళీంటే, దెబ్బల పెళ్ళి అనా నీఉద్దేశం ?

రాజాలు : యావత్తూ సిద్ధం అయింతరువాత నాకూతుర్ని పెళ్ళాడనని కూచున్నాడు. కాని, పెళ్ళాడే వరకూ నేను వారిని చాపగొట్టవలసిన అవసరం వచ్చింది.

సరయ్య : కాదయ్యా, ఇందాకా మీమ్మాయి చంద్రుడితో గుసగుసలాడుతోంది. నే విన్నాను. నాడబ్బుని పెళ్ళాడుతోందిగాని, నన్ను కాదుట! నా అనంతరం వాళ్లిద్దరూ పెళ్లిచేసుగుంటారట !

సరయ్య : అందుకని, నాసలహా ఇప్పుడేనా వినపడుతుందా !

శానయ్య : ఇంకానా ( అని లెంపలు కొట్టుకుని ) వినపడకపోతుందా ?

సరయ్య : ( ఒక కాగితంముక్క తీసి ) అల్లాయితే ఈ కాగితం మీద సంతకం చెయ్యి !

శానయ్య : ( చేస్తాడు )

సరయ్య : మీ అమ్మాయిని పిలవండి రాజాలుగారు !

రాజాలు : అమ్మాయి ! ( అని పక్కకి చూసి పిలుస్తాడు )

శాంత : ( వస్తుంది )

సరయ్య : శానయ్యని నువ్వు డబ్బుకోసం మాత్రం పెళ్ళాడుతున్నావని నీ ప్రియుడైన చంద్రుడితో చెప్పావుట, నిజమే ?

శాంత : ఆహా, నిజమే !

సరయ్య : అయితే విను, శానయ్య స్థిరాస్తి నలభై ఎకరాలు అల్లాఉండనీ, అతనికి రొఖ్ఖం నాలుగు వేలుంది.ఆసొమ్ము నీకిచ్చేస్తే నువ్వు అతణ్ణి పెళ్ళాడ్డం మానేస్తావా?

శాంత : ఆ, నాకు ఎప్పుడూ కూడా చంద్రుడి మీదే ప్రేమ.

సరయ్య : శానయ్య తన నాలుగువేలూ భద్రంగారనే ఒక లక్షాధికారి దగ్గిర దాచుకున్నాడు రూపాయి వడ్డీకి. అది యిప్పుడు ఆరు వేలయింది. అది యావత్తూ శానయ్య నీకి విలియా వేశాడు. నువ్వు భద్రంగారి దగ్గిర వసూలు చేసుకో, ఇదిగో కాగితం.

రాజాలు : ( లోపలికి వెళ్ళి చంద్రుణ్ణి వెంట పెట్టుగువచ్చి ) అమ్మాయి ! రా !

( అని యిద్దరి చేతూలూ కలిపి ") అమ్మయ్య ! ఇక ఈ పిల్లపూచి నీది. ( వెడుతూ తనలో ) మామ్మాయి ఎవర్ని పెళ్లాడితేంగాని, నాకు బరువు తగ్గింది.

( రాజాలు, శాంతా, చంద్రుడూ ఎడమవేపుకి నిష్క్రమిస్తారు. )

సరయ్య : ( వాళ్ళంతా నిష్క్రమిస్తూండగా ) శానయ్యా మనం మరి వెడదాం రా ! ( అని కుడివేపుకి జరుగుతూండగా శానయ్య వెనకాల నడుస్తాడు. నడుస్తూ)

శానయ్య : నెత్తురూ చీమూ ధారపోసి కూడబెట్టిన డబ్బు గంగపాలు చేశావుకదా, సరయ్యా ! అయినా సరేలే ! నీ మాట నాకు గురి.

సరయ్య : ఏంజేస్తాం ! నువ్వు ఇంకా విన్లేదు కావున, భద్రంగారు లక్షాధికారి అయినా, సంపూర్ణంగా దివాలా తీశాడు. నీ అప్పులో ఒక్క చిల్లిగవ్వైనా వెనక్కిరాదు. ఆ పత్రం నువ్వు ఎల్లానూ నాలిక గీసుగునేదేకదా, పోనీ వాళ్ళ మీదే పారెయ్యమన్నాను !

శానయ్య : అల్లానా! మా మంచిపని చేశావు. డబ్బుపోతే పీడా పోయిందిగాని, నీ ధర్మమా అని తప్పిందే యీ " వద్దంటే పెళ్ళి".

రచన : భమిడిపాటి కామేశ్వర రావు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: