telugudanam.com

      telugudanam.com

   

జైసల్మేర్

జైసల్మేర్

"తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు"-అన్న సూక్తిని తలపించేలా, ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ దేశంలోని ప్రధాన పర్యాటక కేంధ్రాలలో ఒకటైంది. అక్కడి "సోనార్ ఖిల్లా"నే జైసల్మేర్ కోట"గా పిలుస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక "సజీవ కోట"ఇదే. ప్రసిద్ధ థార్ ఎడారిలోని మరుభూమిలో నిర్మితమైన సుందర పట్టణమే జైసల్మేర్. రాజపుత్రుల రాచరిక వైభవాన్ని, నాటి సంపన్నుల కళాత్మకతను చాటి చెబుతున్న అరుదైన ఇసుకరాయి భవనాలు అక్కడ ఎన్నో. భట్టి రాజపుత్రులు 12వ శతాబ్ధంలో జైసల్మేర్ పట్టణాన్ని స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది. ఆనాటి వ్యాపారులు సంచరించే ప్రధాన మార్గంలో ఒక ప్యూహాత్మకంగానే ఇది ఏర్పడింది. సంపన్న వ్యాపారులు ఆనాటి రాజాస్థానాలలో మంత్రులుగానూ ఉన్నట్టు చెబుతారు. జైసల్మేర్‌లోని హవేలీలు వారి కళాత్మక హృదయానికి సాక్షీభూతాలు. పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో ఇవి బారులు తీరి యాత్రికులకు రాజ స్వాగతం పలుకుతాయి. హైదరాబాద్‌తోపాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల నుండి జైసల్మేర్‌కు రవాణా సౌకర్యాలు ఇప్పుడు బాగా మెరుగైనాయి. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల అభివృద్దిలో భాగంగా జైసల్మేర్‌లోనూ యాత్రికులకు వసతి సౌకర్యాలు విస్తృతంగా ఏర్పడడంతో వారి రాకపోకలూ ఎక్కువయ్యాయి. జైసల్మేర్ పట్టణంలోని ఇసుక కోటతో పాటు మొత్తం పట్టణం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. "రజ్వాడ కోట" వంటి హోటళ్ళలో బసచేస్తే సోనార్‌ఖిల్లాను చక్కగా చూడవచ్చు.సోనార్ ఖిల్లాతో పాటు పట్టణంలోని ప్రతి ప్రాచీన భవనం పసుపు పచ్చని ఇసుక రాయితో ఆకర్షణీయంగా నిర్మితమైంది.

"తీలన్ కీ పూల్"తో మొదలు

జైసల్మేర్ పట్టణ సందర్శన "తీలన్ కీ పూల్"తో మొదలవుతుంది.ఇదొక వర్షనీటి సరస్సు.ఇందులోని నీలి జలాలు,వాటి మీదుగా సింధూరకాంతులు విరజిమ్మే సూర్యుడు,ప్రకృతి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.దీని ప్రధాన ద్వారం మరింత సౌందర్యవంతంగా ఉంటుంది. రాచరిక కాలానికి చెందిన "తీలన్"అనే ఒక వేశ్య దీనిని నిర్మించడం వలన ఆమె పేరే స్థిర పడింది.ఈ సరస్సు ప్రాంతం ఒక చూడచక్కని పిక్నిక్ స్పాట్‌గా అభివృద్ది చెందింది. ఇక్కడ పలు దేవాలయాలు, ప్రాచీన రాజభవనాలు ఉన్నాయి.ఇక్కడ్నించి "బడాబాగ్" వెళ్ళవచ్చు. అది ఆనాటి పాలకుల స్మశాన వాటిక. అక్కడ సుందరమైన రాచరిక స్మారక కట్టడాలు (ఛత్రీలు)ఉన్నాయి.

మహాద్భుతం సోనార్ ఖిల్లా

జైసల్మేర్ పట్టణంలోని ఒక కొండపై గల "సోనార్‌ఖిల్లా"ఎత్తు సుమారు 250 అడుగులు. రాజస్థాన్ మరుభుమిలోని ఒక మహాద్భుతంగా దీనిని అభివర్ణిస్తారు. ఈ కోట గోడలు ఇసుకలో నిర్మితమైన తీరు విస్మయపరుస్తుంది.ఒక ఇసుక నేలలలో ఇంత మహా కట్టడం నిర్మాణం ఎలా సాధ్యమో"అర్థంకాదు. గణేష్ పూల్, సూరజ్ పూల్ (సన్‌గేట్)ల మీదుగా కోటలోకి దారితీస్తాం. సన్‌గేట్‌కు రెండు వైపులా వ్యాపారులు బారులు తీరి ఉంటారు. ప్రపంచంలోని ఏకైక సజీవ కోటగా దీనిని చెబుతున్నారు. దుర్గంలోని అనేక భవనాలను రాజులు అప్పట్లోనే తమ పరివారానికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఈ కోటలోని పరిసరాలు, భవనాలు, హవేలీలు స్థానికులకు నివాసయోగ్యంగా ఉన్నాయి.అక్కడ సుమారు 1000కి పైగా కుటుంబాలు నివశిస్తునట్లు అంచనా. అక్కడి వ్యాపారుల, ప్రజల జీవనశైలి ఎంతో విలక్షణమైంది. ఆడపిల్లలు గాజులు అమ్ముతూ కనిపిస్తారు."భూటా లేదా భోయింటా పూల్"నే "టర్న్‌గేట్"గా పిలుస్తారు.దీని తర్వాత చిట్టచివరన "హవాపూల్"ఉంది. అన్ని ప్రాసాదాలకు, భవనాలకు ఉన్న ఎత్తైన ద్వారాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షితాయి. కోటలోని ప్రజాదర్భారుకు ఆవరణగా "హవాపూల్"ఉంది. ఇదే కోటలో భాగంగా పలుపురాతన జైనదేవాలయాలు ఉన్నాయి. 12 నుండి 15వ శతాబ్ధాలకు చెందిన ఈ ఆలయాల నిర్మాణ రీతులు అద్భుతం. అడుగడుగునా శిల్ప నైపుణ్యం కొట్టొస్తుంది. అక్కడ్నించి స్థానికుల ప్రధాన కేంద్రం "మనేక్‌చౌక్‌కు చేరుకోవచ్చు.


అడుగడుగునా హవేలీలు

జైసల్మేర్

మనేక్‌చౌక్‌నుండి చిన్నవీధులు, గల్లీలు దాటి వెళితే పురాతన భవనాలైన హవేలీల్ దర్శనమిస్తాయి. ఒకనాటి పుర ప్రముఖుల నివాస కేంద్రాలే ఇవి. అసాధారణ నిర్మాణ నైపుణ్యంతో కూడిన ఈ భవనాలలో ఎక్కడ చూసినా అపురూప కళాత్మకతే. రాజ భవనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాటి హవేలీలు వెలిశాయి. జైసల్మేర్‌లోని ప్రధాన హవేలీలలో "సలీం కీ హవేలి" "నథ్‌మల్ హవేలీ" "పట్వాన్ కీ హవేలీ"వంటివి ఉన్నాయి.


మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు

జైసల్మేర్

జైసల్మేర్ పరిసరాలలోని మరిన్ని చూడదగ్గ ప్రదేశాలలో లోర్‌డ్వా, సాంలు ఉన్నాయి.లోర్‌డ్వా ఒక ప్రాచీన రాజధాని.అమర్‌సాగర్ మీదుగా 10కి.మీ.దూరంలో ఇది ఉంది. అమర్‌సాగర్‌లో ఒయాసిస్సుల వంటి సరస్సులు,రాజభవనాలు,రాళ్ళతో నిర్మితమైన ఒక డ్యాం,పలు జైన దేవాలయాలు ఉన్నాయి.లోర్‌డ్వా ప్రాంతమంతా శుష్కనేల. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుకే. లోర్‌డ్వా ప్రాంతంలో వేసవిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.ఇక "సాం"నిజమైన ఎడారి ప్రదేశంగా ప్రసిద్దిగాంచింది. సువిశాలమైన ఎడారిని అక్కడ చూస్తాం.అక్కడి అద్భుతమైన ఎడారి ఇసుక దిబ్బల ప్రాకృతిక సౌందర్యానికి ముగ్దులమవుతాం. సాంలోని కాటేజ్‌లలో తాత్కాలికంగా నివాస సౌకర్యాలు ఉంటాయి. అక్కడ ఒంటెలపై ఎడారిలో "ఓడ ప్రయాణం" చేయవచ్చు.


ఏది మంచి సమయం?

అక్టోబర్ నుండి మార్చి నెల వరకు సంవత్సరంలో దాదాపు ఆరునెలలు జైసల్మేర్ వెళ్ళడానికి మంచి సీజన్‌గా చెబుతారు.మరీ ముఖ్యంగా "ఎడారి ఉత్సవం" జరిగే సమయంలో అయితే అక్కడి ప్రాంతాలన్నీ కన్నుల పండువగా ఉంటాయి. ఢిల్లీ,జోథ్‌పూర్ వంటి ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. పట్టణంలో యత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు అక్కడ లభ్యమౌతాయి. పలు ప్రైవేట్ రిసార్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.


వార్త సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: