telugudanam.com

      telugudanam.com

   

మధుర

శ్రీకృష్ణ

మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించిన నేల మధుర. మువ్వగోపాలుని మృదుపద మంజీరాలు ఘల్లు ఘల్లున నడయాడిన "బృందావనమే" అది. అక్కడ అణువణువునా వినిపించే కృష్ణనామ స్మరణ భక్తుల హృదయాలను పులకింపజేస్తుంది. పరమ పవిత్రమైన ఆ పట్టణంలోని ప్రతి వీథిలోనూ కృష్ణుడు కొలువుదీరి ఉన్నాడనడానికి అక్కడి అనేక ఆలయాలే నిదర్శనం. ఆ పట్టణం ఆధ్యాత్మికంగా ఎంత ఔన్నత్యాన్ని సంతరించుకుందో అంతే ప్రాధాన్యాన్ని ఆలయ శిల్పకళ ద్వారా చారిత్రకంగా కలిగి ఉంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో (మార్చి-ఏప్రియల్) పదిరోజులపాటు అక్కడి రంగాజీ ఆలయంలో వార్షిక రధ యాత్ర జరుగుతుంది. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ సంబరాలకు ప్రజలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మరీ ముఖ్యంగా కృష్ణుడు జన్మించిన "కృష్ణాష్టమి" రోజు మధుర వైభవం చెప్పనలవి కాదు. యమునా నదికి అక్కడ రోజూ దీప హారతులే. సూర్యాస్తమయంతో ఉదయించే ఆ అద్భుతమైన దృశ్యాలను వీక్షించిన వారి జన్మ ధన్యమైనట్టే అనుకుంటారు. దేశంలోని అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన మధుర ఈ కారణాలవల్లే ప్రతి రోజూ దేశ, విదేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.


ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?:

యమునా నది ఒడ్డునగల ఒకప్పటి చిన్న పట్టణం "బృందావనమే" కాలక్రమంలో మధురగా ప్రసిద్దిగాంచింది. ఇది దేశ రాజధాని ఢిల్లీకి 145కి.మీ.,ఆగ్రాకు 58కి.మీ. దూరంలో ఉంది.అక్కడికి వెళ్ళడానికి ఎంతో అనువైన రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు నగరాల నడుమ గల ప్రధాన పట్టణమైన మధురకు అనేక బస్సులు, రైళ్ళు తిరుగుతుంటాయి.


ఘనమైన చరిత్ర:

పౌరాణికంగా ఘనమైన చరిత్ర కలిగి ఉన్న మధుర చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్దిగాంచింది. హైందవ పురాణగాథ ప్రకారం కృష్ణుడు జన్మించిన ప్రాంతం ఇదే. జంట రాజధానులుగా చరిత్రకెక్కిన ఢిల్లీ-ఆగ్రాల మార్గమధ్యలో ఉన్న ఈ పట్టణం అప్పట్లో ప్రముఖ విదేశీ వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉండింది. కాలగమనంలో అనేక బైభవాలను, వినాశాలను ఇది చవి చూసినట్లు స్థానికులు చెబుతారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ మధురప్రాంత మహత్తుకు కొంత ప్రాధాన్యమిచ్చినట్లు చెబుతారు. కానీ ఔరంగజేబు మాత్రం ఈ పట్టణంలోని అనేక ఆలయాలను కుప్పకూల్చినట్లు తెలుస్తుంది.


శ్రీకృష్ణ

ప్రతి వీధిలోనూ కృష్ణుడే:

బృందావనం ఆలయాలతో నిండిన పట్టణం. ఇక్కడి ప్రతి వీధిలోనూ మురళీకృష్ణుని ఆలయం ఉంటుంది. మొత్తం దేవాలయాలను ఒకటి, రెండు రోజుల్లో సంధర్శించడం సాధ్యమయ్యే పనికాదు. అయితే ప్రతి యాత్రికుడూ విధిగా చూడదగ్గ ప్రదేశాలలో కొన్ని ఆలయాలతో పాటు కృష్ణుని జన్మ భూమి, కృష్ణుడు కంసుని వధించిన ప్రదేశం విశ్రంఘాట్ ఉన్నాయి. బృందావనం పేద వితంతు భక్తురాళ్ళకు ప్రసిద్ది. రంగాజీ ఆలయ సమీపంలోని భజన ఆశ్రమంలో అలాంటి వారు కనిపిస్తారు. ఇక్కడ యమునా నదిపై మొత్తం 24 కొండలు ఉండగా, వాటిలో కాశీఘాట్, విశ్రంఘాట్ వంటివి పేరెన్నికగన్నవి. ప్రతి ఉదయాస్తమాయాలలోనూ కొండలన్నీ కృత్రిమ కాంతులను చిమ్ముతుంటాయి. నదీజలాలలో తేలియాడే దీప హారతులు భక్తుల హృదయాలను పరవశింపజేస్తాయి. యాత్రికులకు మధురలో దర్శించడానికి "కృష్ణ జన్మ భూమి" నుండి మొదలుకుని అనేక దేవాలయాలు ఉన్నాయి. పట్టణం నిండా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిపక్వత కనిపిస్తుంది. వీధులు చాలావరకు ఇరుకుగా ఉంటాయి. ఆయా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో జనం నడవడానికే చోటుండదు. మధురలోని ప్రసిద్ధమైన దేవాలయాలలో బాంకే బిహారీ, మదనమోహన, రంగాజీ, గోవింద్‌డియో, ఇస్కాన్, షాహజీ వంటివి ఉన్నవి.


శ్రీకృష్ణ

ఎన్నో ప్రత్యేకతలు:

బాంకే బిహారీ దేవాలయాన్ని 1864లో నిర్మించారు. దీని శిల్పకళా నైపుణ్యం అనన్య సామాన్యం.ఇక్కడి అపురూపమైన కృష్ణ విగ్రహాన్ని గంటకు ఒకసారి పదిహేను నిమిషాలపాటు తెర తీసి భక్తుల దర్శనానికి అవకాశం ఇస్తారు. చాలా ప్రాచీనమైన మదనమోహన ఆలయం కాళీఘాట్‌పై ఉంది. నాటి బృందావనంలో నిర్మితమైన మొట్టమొదటి దేవాలయంగా దీనిని చెబుతారు. ఔరంగజేబు తన పాలనను మొదలు పెట్టి, అనేక హైందవ దేవాలయాలను నేలమట్టం చేస్తున్న సమయంలో ఇక్కడి మదన గోపాలుని విగ్రహాన్ని రాజస్థాన్‌లోని కరౌలిలో సురక్షితంగా భద్రపరచినట్లు చెబుతారు. బృందావనంలోని అత్యంత సుందరమైన దేవాలయాలలో ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్సియస్‌నెస్) వారిది ఒకటి. ఇక రంగాజీ ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలిని కూడి ఉంది. మధురలోని సేథ్ అనే ఒక సంపన్న కుటుంబం 1851లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఉంది. ఇక్కడ ప్రధాన దైవం రంగనాథ స్వామి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఇక్కడ రథయాత్ర పదిరోజులపాటు వైభవంగా జరుపుతారు. షాహజీ గుడిని 1876లో లక్నోకు చెందిన షాకుందన్ లాల్ అనే ఆభరణాల వ్యాపారి నిర్మించారు. ఇక్కడి అధ్బుతమైన శిల్పకళ, అందమైన నిర్మాణశైలిని ప్రతి ఒక్కరు చూడవలసిందే. గోవింద్‌డియో ఆలయ నిర్మాణానికి గాను ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాణానికి వినియోగించిన ఎర్రమట్టి రాతిలోని కొంతభాగాన్ని అక్బర్ విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు. జనరల్ మాన్‌సింగ్ 1950లో నిర్మించిన ఈ ఆలయం నాటి పాశ్చత్య, హైందవ, ముస్లిం శిల్పుల నిర్మాణ రీతులను కలిగి ఉంది. ఇన్ని విశేషాలతో కూడిన మధురను సందర్శించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన సిద్దిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: