telugudanam.com

      telugudanam.com

   

సముద్ర తీర అద్భుతం మహాబలిపురం

మహాబలిపురం

భారతీయ ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని, నాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక సంపదను తరతరాలుగా పర్యాటక లోకానికి పంచిపెడుతున్న గొప్ప గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. బంగాళాఖాతపు నీలి అలల సవ్వడుల నుండి రాతి కట్టడపు విశేషాల దాకా ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మహాబలిపురం డాన్స్ ఫెస్టివల్‌గా పిలిచే వార్షిక వేడుకకు అంతర్జాతీయంగా ఖ్యాతి ఉంది. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన ప్రారంభమై కొత్త సంవత్సరంలోని మొదటి నెల జనవరి పొడుగునా అన్ని శనివారాలలోనూ సాగుతుంది. ఈ వేడుకలు తమిళనాడు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారం వరకూ జరుగుతాయి. డిసెంబర్ వచ్చిందంటే చాలు మహాబలిపురం కొత్త అందాలను పులుముకుంటుంది.

చెన్నయి నుండి మహాబలిపురానికి రోడ్డుమార్గంలో వెళ్లేవారికి సముద్ర దృశ్యాలు కన్నులపండుగ చేస్తాయి. పర్యాటకులు సాధ్యమైనంత వరకు సాయంత్రాలే ఈ ప్రయాణాన్ని ఎంచుకోవలసిందిగా అనుభవజ్ఞులు సలహా ఇస్తారు. సంధ్యావేళల్లో జాలువారే సున్నితపు సూర్యకిరణాలు సృష్టించే అద్భుతాలను నీలాల అఖాతపు సోయగాలతో కలిపి చూసే అదృష్టం వారికి లభిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 20 నిముషాలు విలక్షణమైన సముద్రతీరం గుండా సాగుతుంది. సముద్ర తీరం పొడుగునా వీచే చల్లగాలులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. దక్షిణ భారతావనికి చెందిన 'మామల్ల ' అనే పల్లవ రాజు ఏలుబడిలోని ఈ సముద్రతీర పట్టణం అదే రాజు పేరుమీద 'మామల్లాపురం 'గా స్థిరపడింది. కాలక్రమంలో అదే 'మహాబలిపురం'గా మారింది. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి, స్వదేశీ కళాకారుల అండదండలతో సాగరతీరంలోని ఈ ఊళ్లో అద్బుత రాతి కట్టడాలను సృష్టించారు. ఆనాటి రాజుల ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడి ప్రసిద్ద ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి ఎందరో శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు.


సముద్రతీర ఆలయం

మహాబలిపురం

మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలసిన దేవాలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం నుంచే యాత్రికుల సందర్శన మొదలవుతుంది. ఎంతటి వారి దృష్టి అయినా ముంది రెండు పెద్ద గోపురాలపై పడుతుంది.భారతీయ పురాణ గాధలు, పాత్రలను తలపించే శిల్పాలను ఎన్నింటినో వాటిపైన చూస్తాం. అనేకమంది దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు, పెద్ద అంగలు వేసే ఏనుగుల భారీ శిల్పాలు వంటివి అన్నీ సందర్శకులను నిల్చున్నచోటే కట్టి పడేస్తాయి. ఆ తర్వాత అక్కడి చిన్న గోపురాలపైకి యాత్రికుల దృష్టి మళ్లుతుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవతలుగా శివకేశవులు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయం చుట్టూ అనేక నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా ఏర్పడ్డాయి. గుడివెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఒక సైనికుడు స్వారీ చేస్తుండటం చూస్తాం. ఇది ఆనాటి సైనికుల స్థయిర్యాన్ని, ధైర్యాన్ని చాటిచెబుతుంది.


మంత్రముగ్ధులను చేసే శిల్పకళ

మహాబలిపురం

ఇక్కడ రాతితో నిర్మితమైన పలు దేవాలయాలలో కృష్ణ మండపం చెప్పుకోదగింది. శ్రీకృష్ణుని లీలా విన్యాసాలను గుర్తుకు తెచ్చేసన్నివేశాలు శిల్పాలలో దర్శనమిస్తాయి. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం వాటిలో ఒకటి. అలాగే కృష్ణునికి ఇష్టమైన వెన్నముద్దకు చిహ్నంలా భావించే ఒక పెద్ద బండను చూస్తాం. ఆనాటి శిల్పకళాకారుల పనితనాన్ని గొప్పగా చాటి చెప్పే రెండు అతిపెద్ద ధ్వజస్తంభాలు ఉన్నాయి. ప్రపంచంలోని చెప్పుకోదగ్గ అతిపెద్ద రాతి ఖండాలలో ఒకటిగా వీటిలో ఒకదానికి విశేష గుర్తింపు ఉంది. దాని పొడవు 31 మీటర్లు, ఎత్తు 9 మీటర్లు. ఈ రాతి కట్టడాల ఉపరితలం విభిన్న కళాత్మకతను సంతరించుకుంది. వీటిపైన సుమారు వందకు పైగా దేవతల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. వాటిలో నాలుగు చేతుల దేవుళ్లు, నాగదేవతలు, పక్షులు, మృగాలు, ఋషులువంటి విగ్రహాలెన్నో ఉన్నాయి. రెండు రాళ్లతో చెక్కిన ఏనుగుల విగ్రహాలనైతే ప్రత్యేకించి చెప్పాలి. సజీవ ఏనుగులను తలపించే అసాధారణ పనితనం అడుగడుగునా సందర్శకులను మంత్రముగ్ధుల్నిచేస్తుంది.


అయిదు రధాలు, గుహాలయాలు

మహాబలిపురం పట్టణానికి ఉత్తరంవైపు చిరస్మరణీయమైన అద్భుత రాతి రధాలు అయిదు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ఒక్కో భారీ శిలతో ఏకశిలా ఖండంగా సృష్టింపబడటం విశేషం. మహాభారతంలోని పంచపాండవుల అయిదుగురి పేర్లు వీటికి పెట్టారు. ఇక సముద్రతీరానికి 400 మీటర్ల దూరంలో ఒక గ్రానైట్ కొండపైన గల గుహాలయాలు కూడా విధిగా చూడతగ్గవి. వీటిలో మరింత చెప్పుకోదగ్గది 'వరాహమండపం ', ఈ చిన్న గుహను చెక్కిన తీరు అనన్య సామాన్యం. దీని ధ్వజస్తంభాల వద్ద ఎంతో సుందరమైన సింహాల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ్నించి ఉత్తరానికి సుమారు 5కి.మీ. దూరంలో 'టైగర్ గుహలు ' ఉన్నాయి. వీటిని దుర్గామాతకు నిలయంగా చెబుతారు.


సముద్రయానానికి అవకాశం

మహాబలిపురంవెళ్లిన యాత్రికులకు సముద్రయానం చేసే అపురూప అవకాశం కూడా లభిస్తుంది. ఇక్కడి తీరప్రాంతంలో కొలువుండే అందమైన పడవలను అద్దెకు తీసుకుని బంగాళాఖాతంలోకి షికారుకు వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సముద్రయాన సమయంలో యాత్రికులు విధిగా లైఫ్ జాకెట్ ధరించడం మరిచిపోవద్దని నిపుణులు సూచిస్తారు. ఇక్కడి పరిసరాలలో చూడతగ్గ మరిన్ని యాత్రా స్థలాలలో ఎంజిఎం డిజ్జీ వరల్డ్ విజిపి గోల్డెన్ బీచ్, మాయాజల్ ఎంటర్ టైన్‌మెంట్ కాంప్లెక్స్, చోళమండలం కళాకారుల గ్రామాలున్నాయి.


ఎలా వెళ్లాలి? వసతి ఎక్కడ?

మహాబలిపురం చెన్నైకి సమీపంలో ఉంది. వాయు మార్గంలో వచ్చే వారికి చెన్నైనే అత్యంత సమీప విమానాశ్రయం. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఇది మంచి కూడలి. అతి సమీప రైల్వేస్టేషన్ చెంగల్పట్టు. ఇక్కడ్నించి 29 కి.మీ.దూరం కాగా, చెన్నై నుండి నేరుగా రైలులో అయితే 58 కి.మీ.దూరంలో ఉంది. మహాబలిపురానికి రోడ్డుమార్గంలో చెన్నై, పాండిచ్చేరి, కంచి, చెంగల్పట్టుల నుండి బస్సు సౌకర్యాలు నిరంతరాయంగా ఉన్నాయి టూరిస్టులు చెన్నైనుండి టాక్సీలు అద్దెకు తీసుకుని వెళ్లవచ్చు కూడా. చెన్నైలోనే కాకుండా నేరుగా మహాబలిపురంలోనూ యాత్రికులు బసచేయడానికి కావలసిన కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పలు ప్రైవేట్ హొటళ్లు, రిసార్ట్స్, లాడ్జిలకు కొదువలేదు. పర్యాటకులు ఇక్కడ సముద్ర గవ్వల నుండి పర్సులు, పెయింటింగులు తదితర కళాత్మక, అలంకరణ వస్తువులను ఖరీదు చేసుకోవచ్చు. కాకపోతే విదేశీ యాత్రికులు కూడా వస్తుంటారు, కాబట్టి వ్యాపారులు అధిక ధరలు డిమాండ్ చేయవచ్చు. కనుక షాపింగ్స్ విషయంలో తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది.


వార్త సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: