telugudanam.com

      telugudanam.com

   

వేసవి ప్రయాణికులకు పర్యాటక ప్రణాళిక

నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. పిల్లల్ని పరుగు తీయించక తప్పదు. కానీ కాస్త తీరికగా పర్యటించడానికి అనువైన సమయం వేసవి సెలవుల సందర్భం. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లోనూ సమయం వుంటుంది. కానీ పరిక్షలు పూర్తయి ఖాళీగా ఉండేది వేసవి సెలవుల్లోనే. అందుకే వేసవిలో విహారం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు పర్యటించి రావాలి. లేదంటే ఒక్కసారైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళిరావాలి.ఆ ఒక్కసారి వేసవి కాలమైతే మంచిది.

కనుక వేసవిలో పర్యటించి రావాలనుకునేవారు ఇప్పట్నించే ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు?ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు?ఎన్ని రోజులు యాత్ర చేయగలరు? ఎంతమంది వెళతారు? మరీ ముఖ్యంగా ఎంత డబ్బు ఖర్చు చేయగలరనే అంచనా ఉండాలి. వీటికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. కొందరికి ఏప్రియల్ మధ్య లేదా చివరివారంలో పరీక్షలు పూర్తవుతాయి. మరికొందరికి ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షలు మేలో పూర్తవుతాయి. ఏమైనా ఏప్రియల్ మూడో నుంచి జూన్ రెండవ వారం వరకు పర్యటనలకు అనువైన సమయం. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ణయించుకోవాలి.

ఎప్పటికప్పుడు క్రొత్త ప్రదేశాలకు వెళ్ళిరావాలి. వేసవి అనగానే సింలా, కులుమనాలీ, కాశ్మీర్, ఊటీలాంటి ప్రాంతాలకే వెళ్ళాలని అనుకోనక్కరలేదు.ఆ ప్రదేశాలు చూడనివారు వీలును బట్టి అక్కడకు కూడా వెళ్ళిరావచ్చు. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో మనం చూడని ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అరకు, హార్సిలీహిల్స్ లాంటి చల్లటి ప్రదేశాలున్నాయి. పర్యాటక ప్రాంతాలుగా పేరొందని ప్రాంతాలు చాలాచోట్ల ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని ,వాటిలో మీకు, మీ పిల్లలకు ఆసక్తిగా అనిపించి ప్రాంతాలకు వెళ్ళి రావాలి. కొందరు ప్రకృతి సౌందర్యం దోబూచులాడే ప్రాంతాలను ఇష్టపడతారు. మరికొందరికి శిల్పకళా సౌందర్యం తొణికిసలాడే హంపి ,హలేబీడు ,మహాబలిపురం లాంటి ప్రాంతాలంటే మక్కువ. ఇంకొందరికి చారిత్రక వైభవాన్ని చాటే మైసూరు, శ్రీరంగపట్నం ,చంద్రగిరి లాంటి ప్రదేశాలను చూడాలనుంటుంది. ఆధ్యాత్మికంగా పేరొందిన వారణాసి, కేదార్‌నాథ్, అమరావతి మొదలైన ప్రాంతాలని చూడాలన్న ఆసక్తి గలవారు కూడా ఉంటారు.మన రాష్ట్రానికి సంబంధించి వస్తే పెనుగొండ, లేపాక్షి, మహానంది లాంటి ప్రాంతాల్లో అనేక విశిష్టతలు ఉన్నాయి.వీటిని కూడా చూడాలి.

అందువల్లనే మీ బడ్జెట్‌కు తగినట్టుగా,మీరు ఎన్నిరోజులపాటు పర్యటించి రాగలరన్న విషయంలో తగిన అంచనా ఉండాలి. అంతేగాక వరుసగా అనేక ప్రదేశాలు చూడాలని ఎక్కువ ప్రాంతాల్ని ఎంచుకోకూడదు. కొన్ని ప్రదేశాలను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది.

ఉదాహరణకు కన్యాకుమారి. చాలా ప్రశాంతమైన పర్యాటక ప్రదేశం. అక్కడి సముద్రపు అలల హోరుని చూస్తూ ఎన్నిరోజులైనా ఉండిపోవాలనిపిస్తుంటుంది. అలాగే అక్కడి సూర్యోదయాన్ని చూడటం అద్భుతమైన అనుభవం. ఏదో ఒక రోజు చూసి వెళ్ళిపోవాలనుకోకూడదు .అవసరమైతే రెండు మూడు రోజులు ఉండాలి. చూడాలి. ప్రశాంతంగా గడపాలి. అలాగే మధుర మీనాక్షి దేవాలయాన్ని మొక్కుబడిగా చూసి వస్తే కుదరదు.ఆ ఆలయ సోబగుల్ని చూడాలంటే కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు గడపాలి.ఆ ఆలయం కట్టిన రోజుల్లో జీవితం ఎలా ఉంటుందో ఊహించాలి. కొన్ని శతాబ్దాల చరిత్రలోకి ప్రయాణించాలి. నాటి వైభవాన్ని కళ్ళముందు దర్శింపజేసుకోవాల ి.అలాగే అజంతా, ఎల్లోరా శిల్పాల్ని గంట, గంటన్నరలో చూసి తరించగలమా? కాలపు తాకిడికి నిలిచి వెలిగే ఆ శిల్పాల మాటున దాగిన అంత:సౌందర్యం మన మనసున నిలిచి పోవాలంటే అజంతా, ఎల్లోరాలని నాలుగు రోజులైనా చూడాలి. ఒక్కొక్క శిల్పకారుడి కళాత్మక పనితనాన్ని,సౌందర్య దృష్టిని తలచుకోవాలి. నాటి ప్రజల, పాలకుల రసాస్వాదనను గమనించగలగాలి. అణువణువునా దాగిఉన్న నాటి చారిత్రక వైభవాన్ని తలచుకుంటూ పర్యటించాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి స్థలానికి తనదైన విశిష్టతలు అనేకం ఉన్నాయి.

ప్రేమని ఆలంబనగా చేసుకొని బ్రతికేవారు జీవితంలో ఒక్కసారైనా తాజ్‌మహల్ చూడాలి. నాటి షాజహాన్ స్వప్నానికి సాక్షీభూతంగా అజరామరంగా వెలుగొందే తాజ్‌మహల్‌ని చూడటం కన్నా మించిన అనుభవం మన కళ్ళకు ఏముంటుంది? ఈ విధంగా భారత ఉపఖండంలోని అనేకానేక ప్రాంతాల్లో ఎన్నెన్నో చిత్రవిచిత్రాలున్నాయి. అందుకే యాత్రలు చేయాలి.ఇలా క్రొత్త ప్రదేశాలకు వెళ్ళి రావాలన్న తపన అంతరాంతరాల్లో బలీయంగా ఉండాలి. లోకపు వైవిధ్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలన్న ఆరాటం మనిషిని నిలువనియ్యకుండా చేయాలి.ఇలాంటి తపన ఒక్కటే మనిషిని ప్రయాణాలకు పురిగొల్పుతుంది .కొత్త ప్రదేశాలకు నడిపిస్తుంది. ఈ జ్వలించే తపన వున్నవారు వేసవి విహారానికి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. రైలు ప్రయాణాలకు గాను ముందే బుక్ చేసుకోవాలి.వెళ్ళల్సిన ప్రదేశాల్లో వసతి సౌకర్యాలు వివరాలు తెలుసుకొని ఇప్పుడే బుక్ చేయాలి.ఇంటర్‌నెట్ ద్వారా అవసరమైన వివరాలు తెలుసుకోవచ్చు.ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోతే సీజన్‌లో హడావిడిగా బయలుదేరి, అక్కడ వసతి సౌకర్యాలు లభించక ఇబ్బందులు పడాల్సివస్తుంది. కొందరు వారం, పదిరోజులు ముందు రైల్వే టిక్కెట్లు తీసుకోవాలనుకుంటారు. కానీ బెర్తులు దొరికే అవకాశం ఉండదు. విమాన ప్రయాణం చేయాలనుకునేవారు ఇప్పుడు బుక్ చేసుకుంటే కొంత రాయితీ లభిస్తుంది.

విమానం ఎక్కాలన్న కల తీరడమెలా అనుకుంటున్నారా? దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు ఒకసారి విమానంలో వెళ్ళి,వచ్చేటప్పుడు రైలులో వచ్చేవిధంగా ప్లాన్ చేసుకోవాలి.ఎక్కువ దూరాలకు ప్రయాణం చేయడానికి మీ బడ్జెట్ అనుమతించకపోతే మీ జిల్లాలో లేదా పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికైనా ప్రయత్నించాలి. ఉదాహరణకు ఒక్క కర్నూలు జిల్లాలోనే అనేక విలక్షణ ప్రాంతాలున్నాయి. శ్రీశైలం, మహానంది, మంత్రాలయం, అహోబిలం, బెలుంగుహలు వంటి ప్రాంతాల్లోని విశిష్టతలు చాలామంది తెలుగువారికి తెలియదు.కనుక వేసవిలో విహారానికి ఊటీ, సింలాలే కాదు మన రాష్ట్రంలోని ప్రదేశాలకు కూడా వెళ్ళి రావచ్చు.అయితే దేనికైనా మనసు ఉండాలి. అప్పుడే మార్గం దొరుకుతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: