telugudanam.com

      telugudanam.com

   

బహమాస్‌

బహమాస్‌

భూమి మీద స్వర్గాన్నే తలదన్నే సుందర ప్రదేశాలలో బహమాస్‌ ఒకటి. బహామాస్‌ని అధికారికంగా 'కామన్‌ వెల్త్ ఆఫ్ బహమాస్' అని అంటుంటారు. 700 పెద్ద దీవులు, 2000 చిన్న దీవుల సముదాయమే బహమాస్. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఉంది. దీనికి ఆగ్నేయంలో అమెరికా, ఈశాన్యంలో క్యూబా ఉన్నాయి. ఈ అందమైన దీవులు ఫ్లోరిడా దక్షిణ తీరానికి 50 మైళ్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవుల రాజధాని నస్సావ్. ఇది ఒకప్పుడు సముద్రపు దొంగల స్ధావరంగా ఉండేది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రాంతాలు... ప్యారడైజ్ ఐస్లాండ్స్, గ్రాండ్ బహమా ఐస్లాండ్, ఔట్ ఐస్లాండ్స్. ఈ దీవులు అందమైన బీచ్‌లకే కాక ఎన్నో రకాల ఆకర్షణలకు నెలవు. అలాగే స్వాదిష్టమైన వంటలు, ఆహారపదార్ధాలకు పెట్టింది పేరు.


బహామాస్‌ తీరం...

పింక్‌ బీచ్‌

మనుషులచే ఛిద్రం కాకుండా పరిశుభ్రంగా ఉన్న బీచ్‌లు ప్రపంచంలో ఎక్కడున్నా ఉన్నాయంటే అవి బహమాస్‌లోనే. కేవలం నస్సావ్, ప్యారడైజ్ రెండు దీవుల్లో కలిపే 26 బీచ్‌లున్నాయి. హార్బర్ ఐస్లాండ్‌లోని ఒక బీచ్‌లో ఇసుకంతా గులాబీ రంగులోనే ఉంటుంది. అందుకే దీనిని 'పింక్ బీచ్' అంటారు. దీవులను చుట్టి ఉన్న నీటి వర్ణాల శోభ వర్ణనాతీతం. 200 అడుగుల లోతు వరకు ఉన్న ప్రతి పదార్ధం, ప్రాణి, రాళ్లు అన్నీ కంటికి కనిపిస్తాయి. భూమి మీద మరే సముద్రంలోనూ నీరు ఇంత తేటగా లేదనేది వాస్తవం. సముద్రపు నీళ్లలో జరిగే 'గల్ఫ్ స్ట్రీం' అనే సముద్ర ప్రవాహం బహామాస్‌లోనే మొదలవుతుంది. అంతర్గత జలాల్లో ఉన్న ఐదుశాతం పర్వతాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అంతరిక్షం నుంచి భూమి మీదకు చూస్తే కనిపించే అత్యంత తేటయిన నీరు కూడా ఈ ప్రాంతంలోదే. నీటిలో రంగు రంగుల చేపలు గుంపులు గుంపులుగా ఈదడాన్ని, పగడాల కోటలను, మునిగిపోయిన ఓడలను, డాల్ఫిన్ చేష్టలను చూడవచ్చు. వీటితోపాటు ప్రపంచంలో సహజ సిద్ధంగా ఏర్పడిన అతి పొడవైన సున్నపు రాయి గుహలను గ్రాండ్ ఒహమా ఐస్లాండ్‌లో నీటి అడుగున చూసే వీలుంది. హార్బర్ ఐస్లాండ్ బీచ్‌ని ప్రపంచ ప్రసిద్ధ పది బీచ్‌లలో ఒకటిగా ట్రావెల్ చానెల్‌వారు ఇటీవలే ప్రకటించారు. ఇక ఇక్కడి బీచ్‌లలో... బోటింగ్, సెయిలింగ్, డ్రైవింగ్, స్నార్కిలింగ్, ఫిషింగ్, కయాకింగ్ నీటికి సంబంధించిన ఏ క్రీడనైనా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.


దీవులలోకి అడుగిడితే


ఫౌంటెన్‌ ఆఫ్‌ యూత్‌

బహమాస్‌కి బీచ్‌లు మొదటి ఆకర్షణగా నిలిచినా, ఇక్కడి దీవులలో చూడటానికి, ఆనందించటానికి ఎన్నో ఉన్నాయి. దీవులలో ఉన్న కోటలు, తోటలు, చిన్న గ్రామాలను దర్శించవచ్చు. అక్కడున్న గుహాలలో విశ్రాంతి తీసుకొని, ఫాంటెయిన్ ఆఫ్ యూత్ ముందు నిల్చుని, అంతరించిపోతున్న బహమా జాతి చిలుకలను వీక్షించవచ్చు. అరుదైన జాతి రకాల పూలను, చారిత్రాత్మక వీధులలో షాపింగ్, ప్రభుత్వ కార్యాలయాల ముందు కాపలాదారులు మారే సమయంలో నిర్వహించే ఉత్సవాన్ని కూడా చూడవచ్చు. డ్రం బీట్స్ అక్కడి సాంప్రదాయంలో భాగం. అక్కడి ప్రతి రోడ్డు మీద కళాకారులు ఇలా డ్రమ్ములు వాయిస్తూ మనల్ని ఎంటర్‌టెయిన్ చేస్తుంటారు. ప్యారడైజ్ ఐస్లాండ్, గ్రాండ్ బహామ ఐస్లాండ్ కాక మిగిలిన దీవుల సముదాయాన్ని 'ఔట్ ఐస్లాండ్స్' అంటారు. ఇక్కడ ఎటు చూసినా ప్రకృతి అందాల ఆరబోతే. ఔట్ ఐస్లాండ్స్‌లో తప్పకుండా చూడవలసింది 'క్యాట్ ఐస్లాండ్'. చిన్న కొండలు, చిక్కటి అడవి అద్వితీయమైన బీచ్‌లతో నిండి ఉండే ఈ ఐస్లాండ్ బహామాస్‌లో అన్నింటికంటే ఎత్తైనదీవి. దీంట్లో ఉన్న ఒక కొండ మౌంట్ అల్వర్నియా సముద్ర తలానికి 206 అడుగుల ఎత్తున ఉంది. దీనిపైకి ఎక్కితే 360 డిగ్రీల కోణంలో బహమాస్ కనిపిస్తుంది.

బహమాస్‌

ఎంతో మంది పర్యాటకులు తమ బిజీషెడ్యూల్ నుంచి విశ్రాంతి పొందేందుకు ఈ దీవులనే విడిదిగా ఎంచుకుంటారు. ఇక్కడి సౌందర్యానికి ముగ్ధులైన చాలా మంది ప్రేమికులు తమ పెళ్లిళ్లను బహమాస్‌లో చేసుకుంటారు. ఈ దీవులకు మరోపేరు హనీమూన్ దీవులు. ఈసారి మీరు విదేశీయానం చేయాలనుకుంటే బహమాస్ టికెట్లు బుక్ చెయ్యమని మీ ట్రావెల్ ఏజెంట్‌కు చెప్పండి.


బహమానియన్ ఫుడ్ :

అంత విస్తారమైన సముద్ర తీరం ఉంటే అక్కడ ప్రసిద్ధ వంటకాలు ఏవో చెప్పనవసరం లేదు. బహమానీయులు తాజా చేప వంటకాలు వండటంలో సిద్ధహస్తులు. అయితే పీతలు, అన్నం, ఆలూసలాడ్, మ్యాకరోని అండ్ చీజ్ రోజువారి వంటలు కాగా, కోకోనట్, పైనాపిల్‌తో చేసిన స్వీట్స్ ఇక్కడి స్పెషల్. చేపలు, కూరగాయలు, మసాలా కలిపి చేసే బహమానియన్ స్ట్యూ ఫిష్ ఇక్కడి ఫేమస్ డిష్.


షాపింగ్:

ఔట్‌ ఐస్లాండ్‌

పీచుతో రకరకాల వస్తువులు చెయ్యడం ఇక్కడి వారి హస్తకళా నైపుణ్యానికి నిదర్శనం. అలాగే పింగాణీ, మసాలా దినుసులు, జామకాయతో చేసిన జా , లోకల్‌గా తయారుచేసిన నగలు ఇక్కడికి వచ్చినవారు తప్పకుండ షాపింగ్ చేసుకొని వెళ్తారు. అక్కడి స్త్రీలు జుట్టును బాగా పాయలు తీసి అల్లుకుంటారు. ఇక్కడికి వచ్చిన స్త్రీలు అలాంటి హెయిర్‌స్టైలు వారితో చేయించుకుని వెళ్తుంటారు. ఇక్కడ కొన్న వాటిపై సేల్స్ ట్యాక్స్ ఉండదు. కాని ప్రతి ఒక్క టూరిస్టు 15 డాలర్లు డిపార్చర్‌ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. బహమాస్‌కు వెళ్లాలంటే... ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం వారం రోజులు బహమాస్ ట్రిప్ రానుపోను చార్జీలు, బోర్డింగు, ఫుడ్‌తో కలిపి సుమారు ఐదులక్షలు వరకు ఖర్చు అవుతుంది.

రోజువారీ చికాకుల నుంచి దూరంగా ఏకాంతంగా గడపాలనుకుంటే మీ ఇంటి నుంచి 'ఔట్' అయి ఔట్ ఐస్లాండ్‌కి 'ఇన్' అయిపోండి. ఇలా ఎన్నో సహజ ఆకర్షణలతో పాటు మానవనిర్మిత అద్భుతాలు నిండిన ఈ బహమాస్ దీవులను సందర్శించుకోవడం జీవితంలో చక్కటి అనుభూతిగా మిగిలిపోతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: