telugudanam.com

      telugudanam.com

   

భద్రాచలం

భద్రాచలం

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ఉన్న రైలుమార్గంలో డోర్నకల్‌ అనే రైల్వేస్టేషన్‌ ఉంది. డోర్నకల్‌ నుంచి మరొక బ్రాంచి రైలు మార్గం కొత్తగూడెం వరకు ఉంది. కొత్తగూడెం నుంచి సుమారు యాభైకిలోమీటర్ల దూరం భద్రాచలానికి బస్సులో వెళ్ళాలి. అందువల్ల కొత్తగూడెంలో ఉన్న రైల్వేస్టేషన్‌ను 'భద్రాచలం రోడ్‌' రైల్వేస్టేషన్ అంటారు. హైదరాబాద్‌ వైపు నుంచి, విజయవాడ నుంచి ఒకటి రెండు రైళ్ళు సరాసరి భద్రాచలంరోడ్‌(కొత్తగూడెం) వరకు వెళతాయి. లేదంటే డోర్నకల్‌లో దిగి మరొక రైలులో భద్రాచలం రోడ్‌ వెళ్ళాలి. మన రాష్ట్రంలోని దాదాపు ప్రతి పట్టణంనుంచి సరాసరి భద్రాచలం ఊరికి వెళ్ళే బస్సులు అనేకం ఉన్నాయి.

రామ భద్రాచలంలోని ఆలయం గోదావరి నది ఒడ్డునే ఉంది. ఆలయానికి దగ్గరలో అనేక సత్రాలు ఉన్నాయి. భద్రాచలం ఆలయ దేవస్థానం వారి సత్రాలు రెండు ఉన్నాయి. ఇవికాక తిరుపతి దేవస్థానం వారి సత్రం, అన్నవరం దేవస్థానం వారి సత్రం, కంభంమెట్టు వారి సత్రం, అన్నపూర్ణ సత్రం, గుంటూరు వారి కన్యకాపరమేశ్వరి సత్రం మొదలైనవి ఉన్నాయి.ఈ సత్రాలలో కొన్నిటిలోఉచితంగా భోజనం కూడా పెడతారు. గది అద్దె యాభై నుంచి వంద వరకు ఉంటుంది. భద్రాచలంలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి పర్వదినాలలో భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మిగతా రోజులలో అంతగా రద్దీగా ఉండదు. గోదావరి నదిమీద నుంచి ఊరిలోకి వచ్చే రోడ్డును బ్రిడ్జి రోడ్‌ అంటారు. ఈ రోడ్డుపక్కనే బస్‌స్టాండ్‌ ఉంది. దీనికి ఎదురుగా మంచి హోటళ్ళు ఉన్నాయి. బస్‌స్టాండ్‌ నుంచి ఆలయం సుమారు అరకిలోమీటరు దూరం ఉంటుంది. ప్రధాన ఆలయం ఉదయం నాలుగున్నర నుంచి అయిదున్నర వరకు, మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ధర్మ దర్శనం ఉంటుంది. మిగిలిన సమయాలలో స్వామికి వివిధ రకాల సేవలు జరుగుతాయి. ఆలయంలో విచారించి ఆయా సేవకు తగిన టికెట్‌ డబ్బు చెల్లించి దర్శనం చేసుకోవచ్చు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: