telugudanam.com

      telugudanam.com

   

హరిద్వార్‌

హరిద్వార్‌

మన దేశంలో అత్యంత పవిత్రమైన నగరాలు ఏడు ఉండేవని పురాణోక్తి. అందులో ఈ హరిద్వార్‌ కూడా ఒకటి. పురాణకాలంలో ఈ నగరం పేరు మాయాపురి. హరిద్వార్‌కు ఆనుకుని ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో హృషీకేశ్‌ ఉంది. ప్రస్తుతం ఈ రెండు జంట పట్టణాలు. గంగానది హిమాలయ పర్వత కనుమలను దాటుకుని మొట్టమొదటగా నేలమీదకు దిగింది హృషీకేశ్‌లో. అయినా అక్కడ ఇంకా కొన్ని కొండలు ఉన్నాయి. పూర్తిగా మైదానప్రాంతం హరిద్వార్‌తోనే ప్రారంభమవుతుంది. దైవధ్యానం చేసుకుంటూ ఆశ్రమ జీవితం గడుపుదామనుకునే వారికి ఈ రెండు ఊళ్ళూ అనుకూలంగా ఉండేవి. దరిమిలా మనదేశంలో ఉన్న అనేక మతసంస్థలు, ధార్మిక సంస్థలు ఈ రెండు ఊళ్ళలో ఏదో ఒక దానిలో తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు నెలకొల్పుకున్నారు. ప్రతి ఆశ్రమంలోనూ ఆ శాఖకు సంబంధించిన వారు ఇక్కడకు వస్తే వారికి ఉండటానికిగాను గదులు ఉంటాయి. వచ్చే యాత్రికులకు కూడా అద్దెకు ఇస్తారు. హరిద్వార్‌ హృషీకేశ్‌లో కలిపి ఇలాంటి ఆశ్రమాలు బోలెడు ఉన్నాయి. వీటిలో రోజుకు పాతిక, యాభై రూపాయలు నుంచి అయిదు వందల రూపాయలు అద్దె ఉండే గదులు ఉన్న ఆశ్రమాలు కూడా ఉన్నాయి. రకరకాల పరిశ్రమలు నెలకొల్పడంతో హరిద్వార్‌ ఇప్పుడు పెద్ద నగరం అయింది. అందువల్ల అక్కడ హోటళ్ళు, లాడ్జిలకు లోటు లేదు.


గంగానదికి హారతి

హరిద్వార్‌లో ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు గంగానదికి హారతి ఇస్తారు. ఇది చూడటానికి యాత్రికులందరూ ఆ సమయానికి నది ఒడ్డుకు చేరుకుంటారు. హరిద్వార్‌లో ఒక చిన్న కొండమీద మానసాదేవి ఆలయం ఉంది. ఊరి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో మరొక కొండమీద చండీదేవి ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాల వద్ద కొండక్రింద నుంచి పైకి 'రోప్‌వే' ఉంది. గంగానది ఒడ్డును ఆనుకుని సుమారు ఆరు లేక ఏడు కి.మీ పొడవున ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు అటు ఇటూ వరసగా బిల్వ మహాదేవ ఆలయం, మాయాదేవి ఆలయం, భోలగిరి ఆలయం మొదలైనవి ఒక ఇరవై దాకా ఉన్నాయి. ఇక హృషీకేశ్‌లో గంగానదికి అడ్డంగా ఇనపతాళ్లతో నిర్మించిన లక్ష్మణ్‌ ఝాలా, రామ్‌ ఝాలా అనే వంతెనలు, లక్ష్మణుని ఆలయం, భరతుని ఆలయం ప్రధానంగా చూడవలసినవి.


మూలం: 02-Jan-09, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: