telugudanam.com

      telugudanam.com

   

కూర్గ్

కూర్గ్

దేశంలో పేరన్నిక గన్న హిల్ స్టేషన్‌లలో కూర్గ్ ఒకటి. కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఇది స్వర్గధామం. కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం మైసూర్‌కు ఇది 100 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తున గల కూర్గ్ కోడగు జిల్లా కేంద్రం. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి నెలాకరు దాకా కూర్గ్‌ను సందర్శించడానికి అనువైన కాలంగా చెబుతారు.

ఒకప్పుడు కోడగు రాజు ముద్దురాజ తన రాజధానిగా ' ముద్దురాజ కేరీ ' ని పాలించినట్టు చరిత్ర ఉంది. 1681లో ఆయన తన రాజధాని పేరును ' మడికేరీ 'గా మార్చగా, అదే కాలక్రమంలో ' కూర్గ్ ' గా స్థిరపడినట్టు తెలుస్తుంది. అనాటి నుండే ఈ ప్రదేశం కాఫీ, నారింజ తోటలకు పేరు పడింది. నాటి రాచరిక వైభవాన్ని చాటిచెప్పే పలు ప్రదేశాలు నేటీకీ కూర్గ్‌కు తలమాలికంగా నిలుస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కావేరీ నది పుట్టిన ' తలకావేరీ ' గల ప్రాంతంగానూ దీనికి ప్రాముఖ్యం ఉంది.


తోటలు

కాఫీ, నారింజ తోటలకు ప్రసిద్ధి:

అపరిమితమైన వరి పొలాలు, కాఫీ, నారింజ తోటలకు కూర్గ్‌లో కొదువ లేదు. ఇక్కడి లోయలు, కొండ ప్రాంతాలను ఉదయ కాలంలో కప్పేసే పొగ మంచు ప్రతి ఒక్క యాత్రికుడినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. అత్యంత సుందరమైన ఆ దృశ్యాలు పర్యాటకులకు మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ ప్రాంతం మిరియాలు, ఏలకులు వంటి మసాలా దినుసులకు కూడా ప్రసిద్ధిగాంచింది. ఒక్క మడికేరీలోని కాఫీ తోటలే కర్ణాటక రాష్ట్రంలోని కాఫీ ఉత్పత్తిలో సగం భాగస్వామ్యాన్ని కలిగిఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికీ దేశంలోనే కాఫీ పండించడంలో కర్ణాటక అతిపెద్ద రాష్ట్రంగా ఉంది.


సుదీర్ఘ చరిత్ర:

కూర్గ్ గతంలో అనేక వివాదాల చరిత్రను కలిగి ఉంది. కూర్గ్ పరిసరాల ప్రాంతమంతా పాలించిన లింగాయత్ రాజులే ఈ ప్రాంతాన్ని కూడా పాలించినట్టు కొందరు స్థానికులు విశ్వసిస్తారు. వారే మడికేరీని తమ రాజధానిగా స్థాపించారు. ప్రసిద్ధ టిప్పుసుల్తాన్ 1785లో కూర్గ్‌ను తన సామ్రాజ్యంలో కలుపుకున్నట్టు తెలుస్తుంది. అయితే బ్రిటిష్ పాలకుల సహకారంతో మహారాజా వీరరాజేంద్ర కూర్గ్‌ను విముక్తం చేయడంలో విజయం సాధించాడు.ఆయనే ఇక్కడి ప్రకృతి ప్రదేశాలతో కూడిన ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్‌గా కూర్గ్‌ను అభివృద్ధి పరిచారు. ఈ ప్రాంతం స్వేచ్చను కొద్దికాలమే అనుభవించింది.1834లోనే కూర్గ్‌ను బ్రిటిషు పాలకులు తమ అధిపత్యంలోకి తీసుకున్నారు. ఇక్కడి చివరి రాజైన చిక్కవీర రాజేంద్రను వారు జైలుపాలు చేశారు.


చూడదగ్గ ప్రాంతాలు:

ఆహ్లాదకరమైన తోటలు: కూర్గ్‌లోని కాఫీ తోటలను సందర్శించడానికి గైడ్ సహాయం తీసుకోవచ్చు. ఇక్కడి విభిన్నమైన కాఫీ గింజల మొక్కలను అతను వివరిస్తాడు. కూర్గ్‌లో ప్రధానంగా రెండు రకాల కాఫీ గింజలు పండుతాయి. అవి ఆరేబికా, రోబస్టా, దట్టమైన కాఫీ తోటల గుండా నడిచి వెళుతుంటే ఒక్కోసారి మన కాళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోతాయి.

ఎలిఫెంట్ క్యాంప్: కూర్గ్‌లోని కావేరీ నది తీరంలో గల డ్యూబారే అడవి సమీపంలో ఉన్నదే 'డ్యూబారే ఎలిఫెంట్ క్యాంప్'. నిజానికి ఇది ఏనుగులకు శిక్షణనిచ్చే ఒక శిబిరం. ఏనుగులను పట్టే అలవాటును ఇప్పుడు అక్కడ నిలుపు చేశారు. అక్కడి క్యాంపులోని ఏనుగులను స్నానం చేయించడానికి, శుభ్రపరచడానికి నది తీరానికి తీసుకువస్తారు.

కోట: మడికేరీ పట్టణం మధ్యభాగంలోనే బృహత్తరమైన కొట దర్శనమిస్తుంది. ఇది 19వ శతాబ్దపు కాలం నాటిది. అక్కడ జరిగిన అనేక యుద్దాలకు ప్రత్యక్షసాక్షిగా ఈ కోట నిలుస్తుంది. కోట నుండి మొత్తం కూర్గ్ పట్టణాన్ని రమణీయంగా దర్శించవచ్చు. కోటలో ప్రస్తుతం ఒక చిన్న మ్యూజియం ఉంది. అందులో కొన్ని చారిత్రాత్మక పెయింటింగులు, ఆయుధాలు, కవచకాలు, నాటి రాజులు ధరించిన దుస్తులు, అప్పటి జైలులోని వస్తువులు వంటివి చూడవచ్చు.


శ్రీ ఓంకారేశ్వర దేవాలయం

శ్రీ ఓంకారేశ్వర దేవాలయం: శివుడికి చెందిన ఈ చారిత్రాత్మకమైన దేవాలయాన్ని 1820 లో కూర్గ్ రాజు నిర్మించాడు. అత్యద్భుతమైన ఇస్లామిక్, గోధిక్ శిల్పకళా రీతులకు ఇది పేరెన్నికగన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఉత్సవాలు జరుగుతాయి. ఈ గుడి గోపురం పైన గల గుండ్రని బంతిలాంటి ' వాతావరణ గడియారం' భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అబ్బీ జలపాతం

అబ్బీ జలపాతం: ఇదివరకైతే ఈ జలపాతాన్ని ' జెస్సీ ఫాల్స్ ' అని పిలిచారు. స్థానిక యాసలో అబ్బీ అంటే కోడగు జలపాతం అని అర్థం. ఎంతో సుందరమైన ఈ జలపాతం కూర్గ్‌కు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉంది. ప్రతి ఏట అక్టోబర్ నుండి మార్చి వరకు ఇక్కడ పుష్కలంగా నీరు ఉంటుందని చెబుతారు.


భాగమండలం: పవిత్ర ఆలయాలకు పేరు గాంచిన భాగమండలం కూర్గ్‌కు 30 కి.మీ. దూరంలోఉంది. జిల్లాలో ఎంతో పేర్గాంచిన ఆలయ పట్టణం ఇది. ఇక్కడే కావేరీ నది సుజ్యోతి, కన్నికలతో సంగమిస్తుంది. కాగా, పవిత్రమైన కావేరీ నది పుట్టిన చోటునే ' తలకావేరీ గా పిలుస్తారు. అక్కడి తటాకం సమీపంలోనే అశ్వంత వృక్షం ఉంది. అగస్త్య మహామునికి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యింది ఇక్కడేనని స్థానికులు చెబుతారు. ఇంత పవిత్రత ఉంది కాబట్టే, భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ప్రతి ' తుల సంక్రమణ ' రోజున అంటే సుమారు అక్టోబర్ 17న ఇక్కడ కావేరి దేవత జలాల ప్రవాహాలను వేలాదిమంది దర్శిస్తారు. ఇరుపు జలపాతం: ఇది నాగర్‌హోల్ వెళ్లేదారిలో వీరాజ్‌పేట్‌కు 48కి.మీ. దూరంలో ఉంది. ఇది ఎంతో మంచి పర్యాటక ప్రదేశమేగాక పిక్నిక్ స్పాట్‌గా కూడా బాగా ప్రసిద్దిగాంచింది. కావేరీనదికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది ఒడ్డున ప్రముఖ శివాలయం ఒకటి ఉంది.


బైలేకెప్పే

బైలేకెప్పే: గూర్గ్ సమీపంలో చూడతగ్గ వాటిలో "టిబెటన్ స్వర్ణ దేవాలయంగా" పిలిచే బైలేకుప్పే ప్రసిద్దిగాంచింది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళకు ప్రతి ఒక్కరూ మగ్దులవుతారు. ఇక్కడ సుమారు 5,000 మంది బౌద్ద బిక్షవులకు విద్యాబుద్దులు చెబుతుంటారు. ఈ ప్రాంతమంతా చూడటానికి ఒక చిన్న టిబెటన్ గ్రామంలా ఉంటుంది. జవహర్‌లాల్ నెహ్రూ బౌద్ద భిక్షువులకు ఇచ్చిన రెండు మఠాలలో ఇది ఒకటి కాగా మరొకటి హిమాచల్‌లోని ధర్మశాలలో ఉంది.


ఎలా వెళ్లాలి? కూర్గ్‌కు వెళ్లడానికి ఎంతో అనుకూలమైన రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. కూర్గ్‌కు సమీప రైల్వేస్టేషన్ మైసూర్. ఇక్కడ్నుంచి కూర్గ్ 114 కి.మీ. దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి మైసూరుకు రైళ్ల సౌకర్యాలు ఉన్నాయి. ఇక రోడ్డుమార్గంలో మైసూర్ నుండి 120 కి. మీ. దూరంలో ఉంటుంది. కాగా, కూర్గ్‌లో యాత్రికులు మజిలీ చేయడానికి పలు రిసార్ట్‌లుకూడా ఉన్నాయి.


మూలం: వార్త

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: