telugudanam.com

      telugudanam.com

   

‌మాతృగయ

గుజరాత్‌ రాష్ట్ర ఉత్తరపు అంచున మాతృగయ ఉంది. అహ్మదాబాద్‌ నుంచి ఆబూరోడ్‌ వైపు వెళ్ళే రైలుమార్గంలో మొహసానా అనే రైల్వేస్టేషన్‌ ఉంది. ఈ స్టేషన్‌ తర్వాత 35 కిలోమీటర్ల దూరంలో సిద్దాపూర్‌ అనే ఊరు ఉంది. ఈ సిద్దాపూర్‌నే మాతృగయ అని అంటారు. ఇది చాలా పురాతన కాలంనాటి క్షేత్రం. ఊరి బయటగా సుమారు అర కిలోమీటర్‌ దూరంలో బిందు సరోవరం అని ఉంది. అక్కడ చనిపోయిన తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు. అందువల్ల ఈ ఊరికి మాతృగయ అనే పేరు వచ్చింది.

పురాతన కాలంనాటి సరస్వతి నది ఈ ఊరిలో నుంచి ప్రవహిస్తూ ఉండేదట. అందువల్ల ఈ ఊరు అసలు పేరు శ్రీస్థలం. కర్దముడు అనే మహాముని విష్ణుదేవుడిని ప్రార్ధిస్తూ ఈ శ్రీస్థలంలో కూర్చొని తపస్సు చేశాడట. విష్ణుదేవుడిని కన్నుల నుంచి ఆనందబాష్పాలు రాలాయట. ఆ కన్నీటి బిందువులు ఒకచోట చేరి బిందు సరోవరంగా రూపుదిద్దుకున్నదని పురాణ కథ.

కర్దమహాముని కుమారుడే సాంఖ్యదర్శనం ప్రవచించిన కపిలుడు. అనంతరకాలంలో పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకాదేవి తల నరికి వేశాడు. దానికి పశ్చాత్తాపపడుతూ ఈ బిందు సరోవరం దగ్గర గొప్ప తపస్సు చేసి ఈ సరస్సులోని నీటితో తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించి ఆమెకు ఉత్తమ గతులు కలిగేటట్లు చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మాతృగయ అని పేరు ఏర్పడింది. బిందు సరోవరం దగ్గర మన చేత శ్రార్ధకర్మలు నిర్వర్తింపచేసే పురోహితులే ఏవో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే రుద్రమహాలయ అనే పురాతన కాలంనాటి శివాలయపు అవశేషాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని సిద్ధరాజ జయసింహ అనే ఆయన బాగు చేయించి పునర్నిర్మించాడు. ఆయన గుర్తుగా ఈ ఊరికి సిద్ధాపూర్‌ అనే పేరు ఏర్పడింది. ఇదిగాక ఈ ఊర్లో గోవింద మాధవ ఆలయం, భూతనాధ, బ్రహ్మాండేశ్వర ఆలయాలు ఉన్నాయి.


మూలం : 19-Jun-08, గురువారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: