telugudanam.com

      telugudanam.com

   

మహానంది

కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల పట్టణానికి 15 కి.మీ దూరంలో మహానంది ఉంది. మనరాష్ట్రంలో ఉన్న అత్యంత పురాతనమైన క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఇక్కడ ఉన్న ఆలయం ఎప్పుడు? ఎవరు కట్టించారో? కూడా నికరంగా చెప్పే ఆధారాలు లేవు. ఒక ఆవు వచ్చి ప్రతిరోజు ఒక పుట్టలో పాలు జారవిడుస్తూ ఉండేది. ఈ దృశ్యాన్ని ఒకరోజు ఆ ఆవు యజమాని చూశాడట. అప్పుడు ఆ పుట్టలో వున్న ఒక దైవ విగ్రహ మూర్తి బయట పడిందట. అలా ఆ పుట్టలో నుంచి బయట పడిన ఒక శివలింగం మూర్తికి నందీశ్వరుడు అనిపేరు ఏర్పడ్డది. ఈ ఆలయాన్ని నందుడు అనే ఆయన కట్టించాడని, అందువల్ల ఆలయంలోని స్వామికి నందీశ్వరుడు అనే పేరు వచ్చిందని మరొక పురాణకధ ప్రచారంలో ఉంది. ఆలయం చిన్నదైనా, అంతటా అద్భుతమైన శిల్పాలతో నిండివుంది. ఆలయానికి ఎదురుగా ఒక రామాలయము, దక్షిణం వైపున అమ్మవారి ఆలయమూ, వినాయకుని ఆలయమూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి పేరు 'ఇష్టకామేశ్వరిదేవి'. అయితే మహానంది క్షేత్రం ప్రత్యేకత మరొక రకమైంది. ఈ ఆలయం ఆనుకుని వెనుకవైపున నల్లమల కొండలు ఉన్నాయి. ఆ కొండల వరుసలో ఎక్కడినుంచో ఒక నీటి ప్రవాహం కిందకు వచ్చింది. అయితే ఆ ప్రవాహం మనకు కనిపించదు. ఆ ప్రవాహం మీదనో లేక దానిని ఆనుకోనో ఈ గుడి నిర్మించారు. గుడి ముందుఒ క ఆవు విగ్రహం నిర్మించారు. భూమి లోపలి నుంచి వచ్చిన ఆ నీటి ప్రవాహం ఆ ఆవు విగ్రహం పొట్టలోకి చేరి తిరిగి ఆ ఆవునోటి ద్వారా బయటకు వస్తుంది. అలా వచ్చిన నీటిధార, కింద ఒక చిన్న నీటిధార, కింద ఒక చిన్న ఈతకోలను వలె ఉన్న కుండంలో పడుతుంది. సంవత్సరంలో అన్ని రోజులూ ఆవునోటిలోనుంచి వచ్చే ఆ ధార ఒకే వేగంతో, ఒకే పరిమాణంలో ఉంటుంది. కుండంలో నీరు ఎప్పుడూ ఒకే లోతులో ఉంటుంది. ఆవు నోటిలోనుంచి వచ్చే ధారతో సమానమైన తూము, కుండంలో నుంచి బయటకు పోయే మార్గంగా ఏర్పాటు చేశారు. కుండంలోని నీటి అడుగున నేలమీద గుండు్సూది పడినా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కుండంలోని నీరు ఆలయానికి బయటవైపున ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్న రెండు కుండాలలోనికి చేరుకుని, అక్కడ నుంచి ఒక కాలువ ద్వారా ముందుకు వెళ్లిపోతుంది. ఈ నీటితో ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల ఎకరాలు సాగు అవుతున్నాయి. ఆలయ సమీపంలో మహానంది ఆలయం వారిది ఒక సత్రం, తిరుమల తిరుపతి దేవస్ధానం వారిది మరొక సత్రం. కొన్ని కులాల వారి సత్రాలు ఉన్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: