telugudanam.com

      telugudanam.com

   

ముక్తినాధ్‌

ముక్తినాధ్‌

ముక్తినాధ్‌ అనేది నేపాల్‌ దేశంలో వాయువ్య భాగాన, నేపాల్‌-చైనా దేశాల సరిహద్దుకు దగ్గర ఉంది. ముక్తినాధ్‌ యాత్ర విపరీతమైన శ్రమతో కూడినదే కాక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ నుంచి ముక్తినాధ్‌ దాదాపు అయిదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల ముక్తినాధ్‌ వెళ్ళేవారు సాధారణంగా ఖాట్మాండ్‌తో సంబంధం లేకుండా కేవలం ముక్తినాధ్‌ మాత్రమే వెళ్ళివస్తారు.

ముక్తినాధ్‌ వెళ్ళడానికి మనం మొదట ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వరకు రైలులో వెళ్ళవచ్చు. గోరఖ్‌పూర్‌‌ నుంచి నేపాల్‌లో ఉన్న పోఖ్రా అనే ఊరి వరకు బస్సులో వెళ్ళాలి. ఖాట్మండ్‌ నుంచి కూడా ఈ పోఖ్రా వరకు బస్సు, విమాన సర్వీసులు ఉన్నాయి. పోఖ్రా నుంచి ముక్తినాధ్‌ వరకు పూర్తిగా కొండలు. పోఖ్రా నుంచి ముక్తినాధ్‌ చేరడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది పోఖ్రా నుంచి సరాసరి హెలికాప్టర్‌లో వెళ్ళి ముక్తినాధ్‌ చేరడం. దీనికి హెలికాప్టర్‌ చార్జి సుమారు ఎనిమిదివేలు. ఇక రెండవ పద్ధతి ముక్తినాధ్‌కు సుమారు ఇరవై కిలోమీటర్ల ఇవతలగా జామ్‌సమ్‌కు విమానసర్వీసుల్లో వెళ్ళాలి. గంటకు నూరు కిలోమీటర్లకుపైన వేగంగా వీచే గాలిలో కొండమార్గంలో నడిచి వెళ్ళడం సాహసమే. ముక్తినాధ్‌లోని ఆలయంలో ఉన్న మూర్తి 'నారాయణ'. ఆలయం దగ్గరే గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీటిని జాగ్రత్తగా మళ్ళించి గుడి చుట్టూ 108 ఆవు ముఖాలలో నుంచి ప్రవహించేటట్లు ఏర్పాట్లు చేశారు. మనం ఆ 108 చోట్ల స్నానం చేసి తర్వాత గండకీ నదిలో స్నానం చేయాలని స్థలపురాణం.

ముక్తినాధ్‌ ఆలయంలో ఒకచోట భూమిలో నుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా నిరంతరం మండుతూ ఉండే చిన్న జ్వాల ఉంది. గండకీ నదిలో సాలగ్రామశిలలు దొర్లుకుంటూ వస్తాయట. ఆలయం ఆనుకొని సుమారు యాభై, అరవై ఇళ్ళున్న చిన్న గ్రామం ఉంది. అక్కడే ఆలయ నిర్వాహకులు నెలకొల్పిన వసతి గృహాలు ఉన్నాయి. గది అద్దె భారీగా ఉంటుంది. భోజన, ఫలహారాలు కూడా ఖరీదుగా ఉంటాయి. మినరల్‌వాటర్‌ బాటిల్‌ ఒకటి నలభై నుంచి యాభై వరకు ఉంటుందంటే మిగిలిన ఆహార పదార్ధాలు ఎంత ఖరీదు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: