telugudanam.com

      telugudanam.com

   

మున్నార్‌

వసంతంలో శిశిరం అంటే అందమైన కలలా ఉంటుంది. ఆ కలే నిజమైతే అచ్చం మున్నార్‌లా వుంటుంది. మున్నార్ అంటే, మూడు నదులు ముచ్చట్లాడే ముచ్చటైన ప్రాంతం మాత్రమే కాదు. ఆకుపచ్చలోయ ఆప్యాయంగా పలకరించడం, గంధపు గాలి చిలిపిగా సడిచేసే సమయం, పన్నెండు సంవత్సరాలకొకసారి పూచే కురింజి పువ్వు అందంగా వికశించే సందర్భం.


ఎలా వెళ్ళాలి?

ఒక్క రోజులో అన్నీ చుట్టేయాలని మాత్రం వెళ్ళకూడదు మున్నార్‌కి. కనీసం మూడు రోజులుంటేనే ఏదీ మిస్సవకుండా చూడగలుగుతాం. ఇక అక్కడి హోటల్‌ వాళ్ళే మూడు రోజుల ట్రిప్‌కి ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చిన్‌కి ఫ్లైట్‌లో గంట ప్రయాణం. ట్రైనయితే 24 గంటల ప్రయాణం ఉంటుంది. కొచ్చిన్‌ నుంచి మున్నార్‌ 130కిలోమీటర్లు. కార్లు, క్యాబ్‌లు, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో వుంటాయి. మూడు మూడున్నర గంటల ప్రయాణం. కారు ప్రయాణానికయితే ఆరేడు వందల రూపాయలు తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ ప్రయాణానికి మొత్తం కలిపి పది నుంచి పన్నెండు వేల వరకు ఖర్చవుతుంది.


టీ ప్లాంటేషన్‌

మున్నార్‌ అంటే మళయాళంలో మూడు నదులు అని అర్ధం. ముద్రపూజ, నల్లతాని, కుందల నదుల మధ్యలో ఈ అద్భుతమైన ప్రదేశం ఉంటుంది. నిజంగా మున్నార్‌లో చూసే ప్రదేశాలు ఒక ఎత్తైతే కొచ్చిన్‌ నుంచి మున్నార్‌ చేరుకోవడానికి మధ్యలో సాగే ప్రయాణం అత్యద్భుతం. కొద్దిదూరం మామూలుగా వెళ్ళాక ఘాట్‌ రోడ్డు రింగులు రింగులుగా ఉంటుంది. దారంతా మొత్తం అడవే. రోడ్డు పక్కన అటూ ఇటూ పెద్ద పెద్ద ఓక్‌ వృక్షాలు. ఎవరో తోటమాలి చేతిలో అత్యంత క్రమశిక్షణలో రూపుదిద్దుకున్నట్లుంటాయి. కొన్ని గంటల ప్రయాణం తరువాత ప్రారంభమవుతుంది, ఒక పక్క ఎత్తైన పర్వతశ్రేణులు, మరోపక్క పాతాళంలో ఉన్నట్లుండే పెద్దపెద్ద లోయలు. ప్రకృతి పారవశ్యం నుంచి తేరుకునే లోపే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. వసంత ఋతువులోంచి జారిపోయి ఒక్కసారిగా శిశిర ఋతువు సాంగత్యం చేరుకున్నట్టుంటుంది. మళ్ళీ అంతలోనే శరదృతువు స్వాగతిస్తుంది. సంవత్సరమంతా చూసే ఆరు ఋతువుల్నీ మూడుగంటల్లో చూస్తామక్కడ.


మరయూర్‌  అడవి

మూడు రోజుల ట్రిప్‌లో మొదటిరోజు టీ ప్లాంటేషన్‌కి వెళ్ళొచ్చు. ఎత్తైన పర్వతాలమీది నుంచి కిందకి ఏటవాలుగా పచ్చని తివాచీ పరిచినట్లుగా అనిపించే తేయాకు తోటలు, ఒత్తుగా ఒదిగినట్లుంటాయి. అక్కడి టీ చాలా టేస్టీగా వుంటుంది. రెండో రోజు వెళ్ళాల్సింది వైల్డ్‌ లైఫ్‌ సాంక్చువరీకి. ఆ జూలో ఏనుగులు చాలా పెద్దవిగా వుంటాయి. చుట్టూ చెట్లు, మధ్యలో లోయ, లోయలో గుంపులు గుంపులుగా ఏనుగులు తిరుగుతుంటాయి. దూరం నుంచి చూస్తే పెయింటింగ్‌లా కనిపిస్తుంది. అక్కడికి కొద్ది దూరంలోనే మరయూర అనే గంధపు చెట్ల అడవి ఉంది. ఆ ప్రదేశానికి చేరుకోవటానికి ముందే చల్లటి గాలి తెమ్మెరలు గంధపువాసనని మోసుకొస్తుంటాయి. సుగంధ ద్రవ్యాల వనంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది. మున్నార్‌లో టాప్‌ స్టేషన్‌కి వెళ్ళే రూట్‌లో ఎకోపాయింట్‌ ఉంటుంది. ఇక్కడ మన మాట ప్రతిధ్వనిస్తుంది. కొండమీద నిలబడి పిలిస్తే తిరిగి కొండలు ప్రతిధ్వనిస్తాయి. మూడోరోజు విజిటింగ్‌ స్పాట్‌ మట్టుపెట్టి డ్యాం. ఇది మున్నార్‌కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డ్యాంలో బోట్‌రైడింగ్‌ చాలా బాగుంటుంది.

మట్టుపెట్టి డ్యాం
కురింజి పువ్వు

మున్నార్‌లోనే అనైముడి పర్వతం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన ప్రదేశం ఇది. దీని ఎత్తు 2,695 మీటర్లు. అచ్చంగా ఆకాశాన్ని అంటుకున్నట్టుంటుందీ పర్వతం. అక్కడి నుంచి లక్కం వాటర్‌ఫాల్స్‌ దగ్గరే. పెద్ద శబ్దంతో అంతెత్తులోనుంచి అగాధంలోకి పడే అన్ని నీళ్ళు చూస్తుంటే ఆకాశానికి చిల్లుపడిందా అనిపిస్తుంది. చివరగా ఎరవికులం నేషనల్‌ పార్క్‌. ఆ ప్రాంతంలోని ఒక అద్భుతం. అక్కడ ఓ కొండ ప్రాంతంలో ఒకరకమైన నీలిరంగు పూలు చాలా అరుదుగా పూస్తాయి. వాటి పేరు కురింజి. పన్నెండేళ్ళకి ఒకసారి సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో మాత్రమే పూస్తాయి ఈ కురింజిపూలు. ఒకసారి పూస్తే సంవత్సరమంతా అలాగే నిలిచిపోయే అందాలు ఒక్క కురింజి పూలకే సొంతం. ఈ కురింజిపూలు పూచినప్పుడు కొండంతా నీలంరంగులో ఉండి ఆకాశానికి పూలగుత్తులు వేళ్ళాడుతున్నట్టుంటుంది. ఇది చూడగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. ఇక్కడే ఒక ఎత్తైయిన ప్రదేశం ఉంటుంది. దీన్ని టాప్‌ స్టేషన్‌ అంటారు. అక్కడికి వెళ్ళి నిలబడితే మేఘాలు మనకన్నా తక్కువ ఎత్తులో ఉంటాయి. అంబరం అంచుల్నిదాటి చిటారుకొమ్మల్ని ముద్దాడి, మన చేతివేళ్ళలోంచి చన్నీళ్ళై జారిపోయే మేఘపు మంచు ముద్దల అందాల్ని ఆస్వాదించాలంటే మున్నార్‌ పయనం తప్పనిసరి.


మూలం: 26-Jun-09, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: