telugudanam.com

      telugudanam.com

   

నాసిక్‌

నాసిక్‌

ముంబై నుంచి తూర్పుగా భూసావల్‌ వైపు వెళ్లే రైలు మార్గంలో నాసిక్‌ ఉంది. మన్మాడ్‌ నుంచి పడమరగా గంటన్నర ప్రయాణం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ నుంచి షిర్డీ వెళ్లివచ్చేవారు, అలాగే అక్కడికి దగ్గరలోనే ఉన్న నాసిక్‌ వెళ్లివచ్చేవారు ఎక్కువుగా ఉన్నారు. నాసిక్‌ రైల్వే స్టేషన్‌ను నాసిక్‌ రోడ్డు అంటారు. అక్కడి నుండి నాసిక్ ఊరు ఒకప్పుడు ఎనిమిది కి.మీ.ల దూరంలో ఉండేది. ఇప్పుడు ఆ మొత్తం దూరం కలిసిపోయింది. రామాయణ కధలో లక్ష్మణుడు శూర్పణఖ నాసిక (ముక్కు) కత్తిరించింది ఇక్కడేనట. అందువల్ల ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు వచ్చింది. నాసిక్ నుంచి 20.కి.మీ.ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్ గోదావరి నది జన్మస్ధానం. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి వెంటవెంటనే బస్సులు ఉన్నాయి. ఒక్కొక్కరిని తీసుకువెళ్లే వ్యానులు కూడా ఉన్నాయి. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరుని ఆలయం ఉంది. ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఆ ఊరి బయట ఒక కొండ మీద గోదావరి నది జన్మించింది. కొండమీద నుంచి భూగర్భం గుండా వచ్చి ఆలయానికి 100మీ.ల దూరంలో ఒక చిన్న స్విమ్మింగ్‌పూల్ అంత కొలనులోకి చేరుతుంది. అక్కడ నుంచి భూగర్భం ద్వారా ముందుకు వచ్చి త్రయంబకేశ్వరం ఊరి బయట చిన్న కాలువలాగా ఊరి నేలమీదకు వస్తుంది. నాసిక్ వచ్చేటప్పటికి రెండు వందల మీటర్ల వెడల్పు ఉన్న నది అవుతుంది.

నాసిక్‌ ఘాట్‌

నాసిక్ నగరానికి అటు పక్కగా ఈ నది పారుతూ ఉంటుంది. నదికి ఇవతల ఒడ్డున 'సుందర నారాయణ' అనే అద్భుతమైన ఆలయం ఉంది. నది మీదున్న వంతెన దాటితే అవతల ఒడ్డున స్నానఘట్టాలున్నాయి. ఆ ఒడ్డున రావణుడు ప్రతిష్టించిన శివాలయం ఒకటి ఉంది. ఆలయం పక్క నుంచి నది ఒడ్డునే ముందుకు వెళితే గోరారాం, కాలారాం అనే రెండు ఆలయాలు ఉన్నాయి. అవి దాటి కొంచెం ముందుకు వెళితే విశాలమైన వీధిలో ఒక డాబా ఇల్లు ఉంది. ఆ ఇంటిలోపల ఒక హాలులో నేలలో పది అడుగుల లోతున సుమారు ఆరు అడుగుల చదరంగా ఉన్న ఒక గుంట వంటి గది ఉంది. సీతాదేవి అందులో ఉండేదంట. అందువల్ల దానిని 'సీతాగుహ' అంటారట. ఆ ఇల్లు ఉన్న వీధిలో అయిదు పెద్ద పెద్ద చెట్లు ఉండేవట...అరణ్యవాస సమయంలో సీతారామలక్ష్మణులు నివసించిన 'పంచవటి' ఈ ప్రదేశమే అని స్ధలపురాణం. ఇప్పుడు ఆ పొడుగునా బోలెడన్ని చెట్లు ఉన్నాయి.


నారాయణ సరోవరం

నారాయణ సరోవరం దర్శించి రావడం అద్భుతమైన అనుభవం. దానితో పాటు కొంత శ్రమ తప్పదు. గుజరాత్ రాష్ట్రం భౌగోళికంగా ఒక మూటలాగ ఉంటుంది. ఆ మూటకి పైభాగాన ఉత్తర దిశగా సుమారు 200కి.మీ. దూరం నేలలు కోసుకుని త్రికోణాకారంగా సముద్రంలో చొచ్చుకొని వచ్చింది. ఈ సముద్రపు పాయకు అవతల అంటే ఇంకా ఉత్తరంగా గుజరాత్ రాష్ట్రానికే చెందిన భూభాగం ఉంది. మధ్యలో ఉన్న సముద్రపుపాయ చాలా దూరం వరకూ ఉండడంతో పాయకు అవతల ఉన్న ఈ భూభాగం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంతోటి సంబంధం లేకుండా విడిగా ఉన్నట్లు ఉంటుంది. దీన్ని 'కచ్' అంటారు. ఇది గుజరాత్ రాష్ట్రంలోని ఓ జిల్లా. దీని ముఖ్యపట్టణం 'భుజ్'. దీనిని భుజ్ జిల్లా అని కూడా అంటారు. ఈ జిల్లా మొత్తం ఇసుక ఎడారితో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం ఉప్పు మాత్రమే పండుతుంది.


అహ్మదాబాద్ నుంచి భుజ్‌కు గల దూరం 356 కి.మీ. భుజ్‌కు రోజుకు రెండు రైళ్లు వెళతాయి. సుమారు 8గం.ల ప్రయాణం. భుజ్ నుంచి పడమరగా సుమారు 140 కి.మీ. దూరంలో సముద్రపు ఒడ్డున నారాయణ సరోవరం ఉంది. భుజ్ నుంచి ఎడారి మార్గంలో సాగే రోడ్డులో బస్సులో ప్రయాణం చేయాలి. ఈ బస్సులు రోజుకు రెండో మూడో ఉంటాయి. నారాయణ సరోవరం మనదేశంలో ఉన్న పవిత్రమైన సరస్సులలో ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సు ఒడ్డున ఇదే పేరు గల చిన్న పట్టణం ఉంది. కొన్ని పాతకాలపు ధర్మశాలలు, చిన్న చిన్న హోటళ్లు ఇక్కడ ఉన్నాయి.


సరస్సు దగ్గర ఆదినారాయణ, లక్ష్మీనారాయణ అనే రెండు ఆలయాలు ఉన్నాయి. ఇవి కాక గోవర్ధననాధ్ మొదలైన ఆలయాలు ఉన్నాయి. ఈ ఊరి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కోటేశ్వరస్వామి మందిరం ఉంది. గుజరాత్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఇది ఒకటి. కార్తీక పూర్ణిమ రోజున ఈ సరస్సులో స్నానం చేసి, స్వామి దర్శనం చేసుకోవడానికి వేలసంఖ్యలో భక్తులు వస్తారు. నారాయణ సరస్సు నుంచి సుమారు నలభై కి.మీ. దూరంలో ఆశాపూర్ణదేవి ఆలయం ఉంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయం. అనుకూలం ఉన్నవారు భుజ్ నుంచి ఏదైనా వాహనం ఏర్పాటు చేసుకొని వెళ్లగలిగితే ఆ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: