telugudanam.com

      telugudanam.com

   

నవద్వీప్‌ ధామ్‌

మయాపూర్‌

నవద్వీప్‌ అనే ఊరు కలకత్తా నుంచి 106 కి.మీ. దూరంలో ఉత్తరంగా మాల్డా వైపు వెళ్ళే రైల్వే మార్గంలో ఉంది. రైల్వేస్టేషన్‌ పేరు 'నవద్వీప్‌ ధామ్‌' అని ఉంటుంది. నవద్వీప్‌ ఊరును ఆనుకుని గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. నదికి అవతల వైపున మయాపూర్‌ అనే చిన్న గ్రామం ఉంది. శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని సామాన్య జనులలో పాదుకొల్పిన చైతన్య మహాప్రభు నవద్వీప్‌ ధామ్‌ అనే ఊరిలో జన్మించాడని చరిత్ర చెబుతుంది. కాని చైతన్యుని అనుయాయులు మాత్రం గంగానది అవతల ఒడ్డున ఉన్న మయాపూర్‌లో జన్మించాడని అంటారు. రెండు ఊళ్లలోనూ ఆయనకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి గాని, ప్రస్తుతం మాత్రం మయాపూర్‌ అనే ఊరే ఆయన జన్మస్థలంగా చలామణిలో ఉంది. చైతన్యుని అసలు పేరు గౌరొంగుడు. ఆయన క్రీ.శ. 1485వ సం.లో ఫాల్గుణ పౌర్ణమినాడు జన్మించి, తన 48వ ఏట క్రీ.శ. 1533సం.లో సిద్ధి పొందాడు.


చైతన్య

ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి వారం రోజులపాటు మయాపూర్‌లో గొప్ప ఉత్సవం జరుగుతుంది. నవద్వీప్‌ పెద్ద పట్టణం. ఇక్కడ చైతన్య ప్రభు నిత్యం ఆరాధించిన పోడామా అనే అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం ఆ ఆలయం లోపల అమ్మవారి మూర్తికి బదులు ఒక శూలం మాత్రం ఉంది. ప్రక్కనే ఆయన కాలం నాటి ఒక రావిచెట్టు ఉంది. దానికి ఆనుకుని పెద్ద సైజులో ఉండే ఒక శివలింగం ఉన్న ఆలయం ఉంది. మరోచోట చైతన్యుని కంటే ముందు కాలం నుంచే ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఇరవైనాలుగు గంటలూ అఖండంగా భజన జరుగుతూ ఉండే ఆశ్రమం కూడ ఉంది. అక్కడే మరో వీధిలో రేగుచెట్టు ఉంది. చైతన్యుడు ఒక రోజున ఒక రేగు పుల్లతో పళ్ళు తోముకుని, ఆ పుల్ల అక్కడ పడేశాడట. అది పెద్దచెట్టుగా ఎదిగిందట. నవద్వీపం ఊరి బయట ప్రవహిస్తున్న గంగానదిలో, సరస్వతినది వచ్చి కలుస్తుంది. అందువల్ల దీనిని త్రివేణీ సంగమం అని ఇక్కడవారు వ్యవహరిస్తారు. నదిపై వెళ్ళేందుకు బోట్లు ఉన్నాయి. మయాపూర్‌లో ఇప్పటికీ చైతన్యుని ఇల్లు పరిరక్షింపబడుతుంది. చైతన్యుని పేర వెలసిన ఇస్కాన్‌ సంస్థవారి ప్రపంచ కేంద్ర కార్యాలయం ఈ మయాపూర్‌లోనే ఉంది. ఈ ఊరిలో ప్రతి ఆలయంలోనూ యాత్రికులకు వసతి, భోజన సౌకర్యాలు లభిస్తాయి. దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళే యాత్రికులకు బస అనుకూలంగా ఉంటుంది.


మూలం: 03-Apr-09, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: