telugudanam.com

      telugudanam.com

   

రాజస్థాన్‌

రాజస్థాన్‌

రాజస్థాన్‌లో ప్రసిద్ధ క్షేత్రం పుష్కర్‌. అజ్మీర్‌ నగరానికి 11 కి.మీ. దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు. అజ్మీర్‌ నుంచి సిటీబస్‌లో వెళ్ళి చూడొచ్చు. దక్షిణ భారతదేశం వారికి అంతగా తెలియని మరొక క్షేత్రం 'నాథ్‌ద్వారా'. ఇది ఉదయ్‌పూర్‌ నుండి ఉత్తరంగా 44 కి.మీ దూరంలో ఉంది. గుజరాత్‌ వారికి, రాజస్థాన్‌ వారికి 'పంచద్వారక'లలో ఒకటిగా చెప్పబడే నాథ్‌ద్వారా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక పేరుకు రాజస్థాన్‌లోనే వున్నా, గుజరాత్‌ రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉన్న "మౌంట్‌అబు"లో రెండు ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే మౌంట్అబూ ఎంత ప్రముఖమైన వేసవి విడిది కేంద్రమో.


ఉదయ్‌పూర్‌ కోట

ఇక రాజస్థాన్‌ మొత్తం ఇంతకుముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. అలా రాష్ట్రం మొత్తం ముప్ఫైఆరు రాజవంశాల వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరంతా మొదట ఒకే కుదురు వారు. కాలక్రమంలో అన్నదమ్ములు విడిపోతూ ఎవరికివారు తమ వంతుకు వచ్చిన భాగంలో విడిగా ఒక రాజధాని నగరం నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న ప్రతీనగరంలోనూ ఒక కోట ఒక రాజభవనం(రాజుగారి నివాసం) రెండూ ఉంటాయి. ఎవరికివారు ముందువారికంటే గొప్పగా ఉండే కోటలు, రాజభవనాలు నిర్మించారు. ఉదయ్‌పూర్‌లోని లేక్‌ప్యాలెస్‌, జైపూర్‌లోని 'హవామహల్‌' చూడదగ్గవి. ఈ కోటలు, రాజభవనాలు అన్నీ ఆయా రాజవంశాల వారి స్వంత ఆస్తి. ప్రతీ ఊరిలోనూ ఆ రాజ కుటుంబం వారు ఒక ట్రస్టు స్థాపించి, ఈ కోటలు రాజభవనాలను ఆ ట్రస్టు పేరున మ్యూజియంగా చేశారు.


మౌంట్‌ అబూ

రాజస్థాన్‌ రాష్ట్రంలో ఆగ్నేయమూలగా ఉన్న 'కోట' అనే ఊరితో యాత్ర ప్రారంభించి, అపసవ్యంగా తిరుగుతూ ముందుకు సాగి, చివరకు 'అబూ'తో ముగిస్తే అనుకూలంగా ఉంటుంది. అప్పుడే ఒకే వరుస ప్రయాణంలో కోట, బుండి, చిత్తోర్‌గడ్‌, ఉదయపూర్‌ నాథ్‌, అజ్మీర్‌, పుష్కర్‌, జైపూర్‌, బికనీర్‌ జైసల్మీర్‌, జోధ్‌పూర్‌, మౌంట్‌ అబూ చూడవచ్చు. ఇలా ఒకే వరుసగా ఉన్న ఊళ్ళు కాక, భరత్‌పూర్‌, ఆల్వార్‌, బార్‌మేర్‌, రానక్‌పూర్‌, కుంభాల్‌ ఘర్‌ ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి. రాజస్థాన్‌లో జైసల్మేర్‌లోని కోట, మౌంట్‌ అబూలోని దిల్వారా ఆలయం ప్రముఖమైనవి.


మూలం: 26-Jun-09, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: