telugudanam.com

      telugudanam.com

   

రామేశ్వరం

రామేశ్వరం

భారతీయులలో ఆస్తికులైనవారందరికీ కాశీ తరువాత దానితో సమానమైన పవిత్రక్షేత్రం రామేశ్వరమే. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం తూర్పు అంచున ఉన్న బంగాళాఖాతం ఒడ్డున ఉంది. చెన్నై నుంచి సరాసరి రామేశ్వరం వెళ్ళే రైళ్ళు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి తిరువాయూర్‌‌ వెళతాయి. అంతేకాక తమిళనాడులోని కొన్ని ఊళ్ళనుంచి రామేశ్వరం వెళ్ళే రైళ్ళు కూడ ఉన్నాయి. తమిళనాడులోని దాదాపు ప్రతిముఖ్యపట్టణం నుంచి సరాసరి రామేశ్వరం వెళ్ళే బస్సులు చాలానే ఉన్నాయి. ఒక విధంగా రామేశ్వరం చిన్న ఊరు. బస్టాండు నుంచి అయినా రైల్వేస్టేషన్‌ నుంచి అయినా మూడు కిలోమీటర్ల దూరం ఊంటుంది. ఆటో రిక్షాలే కాక గుర్రపు బండ్లుకూడ ఉన్నాయి. రామేశ్వరంలో చెప్పుకోదగిన సత్రాలు లేవనే చెప్పాలి. హోటళ్ళు, లాడ్జీలలో ఉండవలసిందే. రామేశ్వరం ఆలయం సుమారు అర కిలోమీటరు పొడవు ఉంటుంది. ఆలయం గోడలను ఆనుకొని మిగిలిన మూడువైపుల ఉన్న వీధులలో వరుసగా హోటళ్ళూ, లాడ్జీలు ఉంటాయి. ఆలయం ఎదురుగా ఉన్న సముద్రం ఒడ్డు పక్కనే రాష్ట్ర పర్యాటక శాఖవారు కొన్ని కాటేజీలు నిర్మించారు. ఇష్టమైన వారు అక్కడ విచారించుకొని బస చేయవచ్చు. రామేశ్వరం వచ్చే రైళ్ళు బస్సులు అన్నీ ఉదయానికే చేరుకుంటాయి. ఇక్కడ సముద్రస్నానం, ఆలయంలో దర్శనం అన్నీ కలిపి నాలుగు గంటలకు మించి పట్టదు. అందువల్ల దాదాపు ఎక్కువమంది మధ్యాహ్నం లోపు అన్నీ ముగించుకుని భోజనం కాగానే తిరుగు ప్రయాణం అవుతారు. రామేశ్వరం ఒక్కటే చూసి రావడానికి వెళ్ళేవారు తక్కువ. రామేశ్వరం వెళ్ళేదారిలోనే మధురై, శ్రీరంగం, కుంభకోణం మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్నింటినీ చూస్తూ రామేశ్వరం దాకా వెళ్ళేవారే ఎక్కువ.


మూలం : 22-Jun-08, గురువారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: